అజరామర శిల్పాలు
- Malla Karunya Kumar
- Aug 2
- 6 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #AjaramaraSilpalu, #అజరామరశిల్పాలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ajaramara Silpalu - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 02/08/2025
అజరామర శిల్పాలు - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
“రోజు రోజుకి బ్రతుకు భారమౌతుంది. ఈ బాధల్ని తట్టుకు నిలబడే ఓపిక మాకు లేదు. మమ్మల్ని నీలో ఐక్యం చేసుకో. ” కన్నీటి జడితో రోజూ వాళ్ళు పరమశివుడిని కోరుకునేది ఆ వరమే..
వాళ్ళందరూ రోజుల్ని లెక్కపెట్టుకుంటూ మృత్యువు కోసం ఎదురు చూస్తున్న వయస్సైపోయిన వాళ్ళు. అనాథాశ్రమం లో ఉంటారు. అనాథాశ్రమానికి పదడుగుల దూరంలో నెలకున్న శివాలయానికి వచ్చి ఆ శివునితో తమ గోడు విన్నవించుకుంటుంటారు. చాలా మంది హడావుడి చేస్తూ దైవ దర్శనానికి వచ్చి వెళ్తుంటారు. ఎవరికీ కూడా వీళ్ళ వైపు చూసే సమయం, తీరిక ఉండవు.
కానీ రోజూ ఆలయానికి వచ్చి పరమేశ్వరుని దర్శనానికి వస్తున్న వాసుదేవ రావు పలకరించడం వాళ్లకు హాయిని ఇచ్చింది. పరిచయం కూడా పెరిగింది. ఒక్కొక్కరు తమ, తమ గోడుల్ని వాసుదేవ రావు కు రోజూ వినిపించడం పరిపాటి. వాళ్ల ఆవేదనలను ఓపిక తో వింటూ వాళ్ళను ఓదార్చే వాడు.
"తల్లితండ్రుల గురించి పిల్లలు తెలుసుకునే వరకు ఈ బాధలు తప్పవు. అంతా మన ప్రారబ్దం. " నిట్టూర్చుతూ అన్నాడు అతను.
"నిజంగా ఇదంతా మా ప్రారబ్దమే అయితే దాన్ని రూపుమాపి మమ్మల్ని తీసుకు వెళ్లిపొమ్మని ఆ దేవుడిని రోజూ వేడుకుంటున్నాం. అతను ఎప్పటికి కనికరిస్తాడో?"
వాళ్ల కంఠంలో జీవితం పై విరక్తి సుస్పష్టంగా ధ్వనిస్తుంది.
"తీసుకు వెళ్ళమని అతన్ని అడగాల్సిన అవసరం లేదు కదా. ఆ సమయం వస్తే మనం వెళ్తున్న సంగతి మనకు కూడా తెలియదు. ఉన్నన్ని రోజులు ఏమి చేయగలమో అది చేస్తే చాలు. "
"ఏమి చేయగలం ఈ వయసులో, ప్రేగు బంధానికి దూరమై, లోలోపల దుఃఖం తో ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాం. "
"అయితే మనం ఏమీ చేయలేం అంటారు?. "
"అంతేగా మరి!. "
"సరే పదండి, నేను మీతో పాటు మీ ఆశ్రమానికి వస్తాను. కాస్త నేనూ చూసినట్టు వుంటుంది. "
"సరే, మీకు కొత్త కదా, మాతో రండి. మీకు మొత్తం చూపిస్తాం” అని అక్కడ నుండి లేచి నడిచారు.
వాసుదేవ రావు వాళ్ళని అనుసరిస్తూ, “అది సరే మీ తర్వాత తరానికి ఏమి ఇచ్చారు?"
"మొత్తం సంపాదించింది వాళ్ళకే. డబ్బులు, పొలాలు. " సమాధానం ఇచ్చారు వాళ్ళు.
"తర్వాత తరానికి ఇవ్వాల్సింది ఇంతేనా!. "
"మరి ఇంకేమిటి ఇస్తాం?. మీరేదో చెప్తూ ఆపేశారు. ఇంకో తరానికి ఇవ్వాల్సింది ఏమిటి?. " అడిగారు కుతూహలంతో.
"తరగని ఆస్తి!"
ఒక్కసారిగా నవ్వుతూ, "మీరు భలే ఉన్నారు. అసలు ఆస్తి అన్నది తరగకుండా వుంటుందా. అలా ఉండాలి అంటే చాలా కష్టం. " అన్నారు.
"మానవత్వ విలువలు పెంచుకోవడం, ప్రకృతి పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ, ఇంకా ఎన్నో ఉన్నాయి తరగని ఆస్తులు. వాటి గురించి ఎప్పుడైనా చెప్పారా?. "
వాసుదేవ రావు ప్రశ్నలకు వాళ్లలో ఆశ్చర్యం, నిశబ్దం ఒకేసారి కలిగాయి.
"ఇలాంటివి మాటలు వరకే. ఆచరించడం చాలా కష్టం. ఇవన్నీ మమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఇవన్నీ ఇచ్చారా?. ఒకవేళ ఇచ్చుంటే రోజూ దేవుడి దగ్గరకు ఎందుకు వస్తారు. ” ఫక్కున నవ్వారు అందరూ.
"నిజమే. ” అని వాసుదేవ రావు కూడా నవ్వాడు.
కాస్త భిన్నంగా మాట్లాడినా, వాసుదేవ రావు తో మాట్లాడుతుంటే వాళ్లకు కాస్త ఊరటగా వుంది. వాసుదేవ రావు వాళ్ళతో ఎన్నో విషయాలు మాట్లాడాడు. వాళ్లకు తెలియని విషయాలు వాసుదేవ రావు చెప్తుంటే ఆశ్చర్యంతో వింటున్నారు. ఆరోజు తెలియకుండానే ఒక పూట గడిచిపోయింది.
మధ్యాహ్న సమయం అవడం తో, “సరే నేను బయలుదేరుతాను" అని అన్నాడు వాసుదేవ రావు.
"అయ్యో, వెళ్లిపోతాను అంటారు ఏమిటి?. మీరు వెళ్లిపోతాను అంటే మాకు ఏదో వెలితిగా ఉంది. "
"మీలాంటి మిత్రులు నాకోసం ఎదురుచూస్తూ వుంటారు. రేపు వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. ” నవ్వుతూ అన్నాడు.
"అంటే మీరు?"
"నేను మీలాంటి వాడినే, అయితే నాకు స్నేహితులు ఎక్కువ. నేను వెళ్ళి మాట్లాడకపోతే వాళ్ళు నొచ్చుకుంటారు. నాకు మూడు ఆశ్రమాల్లో మిత్రులున్నారు. వాళ్లను రోజు విడిచి రోజు కలుస్తుంటాను. " అని చెప్పాడు వాసుదేవ రావు.
"సరే, అయితే మళ్ళీ మీరు ఎల్లుండి వస్తారు కదా. మీరు మాకు చాలా దగ్గర అయిపోయారు. "
"వస్తాను. అయితే నాకొక అలవాటు వుంది. నేను కొన్ని టాస్క్ లు ఇస్తుంటాను వాటిని పూర్తి చేసిన వాళ్ల దగ్గరికే మళ్ళీ వస్తాను.. "
ఆశ్చర్యంగా చూస్తూ వుండి పోయారు.
"కంగారు పడకండి. మీకు ఈ టాస్కులు కొత్త కదా. నేను ఎల్లుండి వచ్చి దగ్గర వుండి చెప్తాను.. "అని చెప్పి వెళ్ళిపోయాడు వాసుదేవ రావు.
ఎల్లుండి రానే వచ్చింది, వాసుదేవ రాకకోసం ఎదురు చూస్తూ వున్నారు ఆశ్రమ వాసులు. వాళ్ల నిరీక్షణ కు ఫలితంగా అక్కడకు రానే వచ్చాడు వాసుదేవ రావు. అతనితో పాటు కొంత మంది యువకులు కూడా వున్నారు. వాసుదేవ రావు దగ్గరకు వేగంగా వెళ్ళి, "మీకోసమే ఎదురుచూస్తున్నాం. వచ్చేశారా?. " నవ్వుతూ అడిగారు.
"వచ్చేసాను. మీకు ఆ రోజు చెప్పాను కదా, మీకు టాస్క్ ఇస్తాను అని. "
"అవును కానీ ఏమిటా టాస్క్, మా వలన అవుతుందా?. "
"భయపడాల్సిన అవసరం లేదు. మీ శక్తి మేరకు పని చేయండి. ఇక్కడ ఒక పూల వనం తయారు చేద్దాం." అని అంటూ తనతో వచ్చిన వాళ్ళతో పని ప్రారంభించాడు. వాళ్ళు కూడా తమకున్న కాళ్ళు నొప్పులు, మిగతా సమస్యలు పక్కన పెట్టి రంగంలోకి దిగారు. అందరితో కలిసి పని చేస్తుంటే వాళ్లకు ఏదో తెలియని హాయి కలిగింది.
అంతా చదును చేసిన తర్వాత వాసుదేవ రావు తనతో తెచ్చిన ముక్కులను ఒక్కోటి ఒక్కొక్కరికి ఇస్తూ వాళ్ల చేత అక్కడ నటించాడు. తర్వాత నీటి కుంటలు తవ్వి వర్షపు నీరు కిందకు ఇంకెలా చర్యలు తీసుకున్నాడు.
"మన టాస్క్ కంప్లీట్ అయ్యింది. ఈ మొక్కలు బాధ్యత ఈ రోజు నుండి మీ అందరిది. మీరు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. " అని వాళ్ళతో చెప్పాడు వాసుదేవ రావు.
వాసుదేవ రావు మాటలు వాళ్లకు ఎంతో నచ్చాయి.
'మా వలన ఏమి లాభం అని ఇన్నాళ్ళు దిగులుతో వుండి పోయాము. మేము ఏమి చేయగలమని ఆలోచించలేదు. వాసుదేవ రావు మనల్ని కలవడం చాలా సంతోషం. ' అని అనుకున్నారు.
రోజులు గడుస్తున్నాయి వాసుదేవ రావు వాళ్లకు చాలా దగ్గర అయ్యాడు. ఎప్పుడూ వాళ్ళను ఉత్తేజ పరుస్తుండేవాడు.
"ప్రతి మనిషి కు ఒక శక్తి వుంటుంది. ఆ శక్తిని ఉపయోగించి నలుగురికి ఉపయోగ పడే పనులు చేయాలి. అప్పుడే మనం అజరామర శిల్పాలు అవుతాం. " అని వాసుదేవ రావు అన్నాడు.
"ఈ అజరామర శిల్పాలు ఏమిటి?." విస్తుపోతూ అడిగారు.
"ప్రాణమున్న వరకే మనం మనుషులం. తర్వాత చలనం వుండదు. అందుకనే శిల్పాలు అన్నాను. అయితే అజరామర శిల్పం అంటే ప్రాణంతో లేకపోయినా ఎవరైనా మనల్ని గుర్తు పెట్టుకుంటే చాలు అజరామర శిల్పాలు అవుతాం." అని అన్నాడు వాసుదేవ రావు.
ఈమాట వాళ్లలో ఏదో తెలియని శక్తిని నింపింది. ఆ క్షణం నుండి వాసుదేవ రావు ఏ టాస్క్ ఇస్తాడా, దాన్ని ఏ విధంగా పూర్తి చేయగలమని కుతూహలం తో చూసే వాళ్ళు.
ఒక్కోసారి వాళ్లలో ఉత్సాహం కలిగించేలా లేఖలు పోటీ పెట్టేవాడు. వాళ్లలో వాళ్ళే లేఖలు రాసుకునే వాళ్ళు. వాటిలో మెరుగైన లేఖకు బహుమతులు కూడా ఇచ్చే వాడు. ఇలాంటి పోటీలు వాళ్లలో ఆనందం కలుగజేశాయి. వాళ్లకు మరి ఏ దిగులు వుండేది కాదు.
మరో రోజు
మరో టాస్క్ పెట్టాడు వాసుదేవ రావు. వాళ్లందరినీ ఒక పాఠశాలకు తీసుకు వెళ్లి ఒక గంట పిల్లలకు కథలు చెప్పే పోటీ పెట్టాడు. అయితే ఆ కథలు ఎలా వున్నాయన్నది పిల్లలే మార్కులు వేసి చెప్తారు. అని నియమం పెట్టాడు వాసుదేవ రావు.
ఇలాంటి టాస్క్ వాళ్లలో మరింత ఉత్సాహం పెంచింది. మరింత ఆనందంతో వాళ్ళు కథలు చెప్పారు. గెలుపొందిన వాళ్లకు వాసుదేవ రావు బహుమతి ఇచ్చాడు. అయితే ఆ గెలుపొందిన వ్యక్తి ఆ బహుమతిని ఆ క్లాస్ లో బాగా చదివిన వ్యక్తికి అందించాడు. అక్కడకు రావడం పిల్లల్తో మాట్లాడటం, వాళ్ళకు కథలు చెప్పడం వాళ్ళకు ఎంతో హాయిని ఇచ్చింది వాళ్లకు.
"ప్రిన్సిపాల్ గారు!, మీరు నేను చెప్పగానే ఒప్పుకోవడం చాలా సంతోషం కలిగింది.” అని ప్రిన్సిపాల్ కు ధన్యవాదాలు తెలుపుతూ అన్నాడు వాసుదేవ రావు.
"సార్, మీరు చెప్పడం నేను కాదనడమా, ఇలాంటి ప్రోగ్రాం కారణంగా పిల్లలు కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటారు. పైగా నైతిక విలువలు తెలుస్తాయి. " అని ప్రిన్సిపాల్ అన్నాడు.
****
వాసుదేవ రావు కారణంగా ఆ ఆశ్రమం లో ఒక ఉద్యాన వనం కూడా నెలకొంది. తాము పెంచిన మొక్కల్ని చూస్తూ మురిసిపోతూ ఉండేవాళ్ళు ఆ ఆశ్రమ వాసులు.
ఇరవై రోజులు గడిచాయి కానీ వాసుదేవ రావు ఆశ్రమానికి రావడం మానేశాడు. అతని కోసం ఎదురుచూసి చూసి, అతను రాక పోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ అతని పేరు తప్పించి అతని చిరునామా వాళ్ళకు తెలియదు. చివరికి వాసుదేవ రావు ఎక్కువగా శివాలయం పూజారి తో మాట్లాడుతుండే వారని గుర్తుకు వచ్చి పూజారిని కలవడానికి వెళ్ళారు.
"పూజారి గారు!, వాసుదేవ రావు గారు రావడం లేదు. ఆయన ఫోన్ నెంబర్, అడ్రెస్ కానీ వుంటే ఇస్తారా?. " అడిగారు వాళ్లు.
వాళ్లందరినీ చూసి మౌనం వహించాడు పూజారి.
"ఏంటి పూజారి గారు. ఎందుకు మౌనంగా ఉండిపోయారు. " అడిగారు వాళ్లు.
కొంత సమయానికి మౌనం విడిచి, "వాసుదేవ రావు గారు ఇరవై రోజుల క్రిందట శివైక్యం చెందారు." పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు పూజారి.
ఈ మాట విని వాళ్ల గుండె ఆగినంత పనైంది. కాసేపు మౌనం అంతటా ఆవరించింది.
"ఏమైంది అతనికి?” వణుకుతున్న స్వరం తో అడిగారు.
"మీతో సంతోషంగా గడిపిన అతను. ఒక అగ్ని పర్వతాన్ని లోపల మోసే వారు. అతనికి క్యాన్సర్. కానీ అతను ఎప్పుడూ మీలాంటి వాళ్ల కోసమే ఆలోచించే వాళ్ళు. ఎవరైనా కష్టం లో వుంటే తట్టుకోలేక పోయేవారు. అందుకే తనకు బాధైనా నలుగురు సంతోషంగా ఉండాలని. నాలుగు మంచి మాటలు చెప్పి సమాజం ను సరైన మార్గంలో పెట్టాలని తపన పడుతుండే వారు. మీరు అనుకున్నట్లు అతను అనాథ కాదు. కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు వున్నారు.” గద్గద స్వరంతో చెప్పి అక్కడ నుండి కదిలాడు పూజారి.
వాళ్ల మనస్సును దుఃఖం ఆవరించింది. బరువెక్కిన హృదయంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. అప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాళ్లలో కలిగిన బాధ కారణంగా కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఒక్కసారిగా మేఘం గర్జించింది. మెల్లగా వర్షం నేలకు దిగింది, మళ్ళీ చాలా రోజులకు.
వాళ్ల కన్నీటి ని తనలో ఐక్యం చేసుకుంటూ ఆ వర్షం నేలపై పరుగులు పెడుతుంది. బాధతో నిలబడి తన చేతుల్ని చాచుతూ, దోసిట్లో ఆ వర్షపు చుక్కల్ని పట్టుకొని, "మిత్రమా! నీ రాక మాకు జీవితం అంటే ఏమిటో తెలియజేసింది!. నువ్వు మాకు నేర్పిన బ్రతుకు పాఠం ఇంకో తరానికి చేర్చాల్సిన బాధ్యత మాపై వుంది. తప్పకుండా చేర్చుతాం. పరమేశ్వర! వాసుదేవ రావు గారిని నీలో ఐక్యం చేసుకో. " దోసిట్లో నీరు వదులుతూ బాధాతప్తమైన హృదయంతో అన్నారు.
***సమాప్తం***
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.
Commentaires