top of page
Original.png

అనురాగ బంధం - పార్ట్ 1

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #AnuragaBandham, #అనురాగబంధం, #TeluguStories, #తెలుగుకథలు

పెద్దకథ ప్రారంభం

Anuraga Bandham - Part 1/2 - New Telugu Story Written By - Yasoda Gottiparthi Published In manatelugukathalu.com On 18/02/2026

అనురాగ బంధం -పార్ట్ 1/2 - తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


"మామయ్య హాల్లోకి వచ్చినట్టున్నారు. కాఫీ ఇచ్చి వస్తాను అత్తయ్యా!"


"అలాగేనమ్మ! ఆయన పడక గది నుండి బయటకు వచ్చారంటే కాఫీ పట్టుకుని ఎదురుగా వెళ్ళాలి. కాస్త వెనుక ముందైతే ముక్కు మీదే కోపం. 'వెళ్ళమ్మా! ఆలస్యం చేయకు'!"


స్టవ్ మీద గిన్నెలోని వేడి పాలు కప్పులో పోసి, కాఫీ పొడి, షుగర్ కలిపి ట్రేలో మంచినీళ్ల గ్లాసు, కాఫీ కప్పుతో 'వెళ్ళమ్మా' అంటూ పంపించింది అత్తగారు అనురాధ.


కోడలు కావ్యకు మామయ్య గారికి ఎదురుగా వెళ్లాలంటే కాస్త భయమే. అత్తయ్య గారి దగ్గర ఉన్నంత చనువు మామయ్య దగ్గర లేదు.


ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు అల్లుళ్ళు వచ్చినా ఇంకా అత్తయ్య గారు కూడా ధైర్యంగా మామయ్యకు ఎదురుగా నిలబడలేరు.


ఇల్లంతా సద్దుమణిగిన తర్వాతనే భార్య అనురాధ భర్త గదిలోకి చేరడం తప్ప, ఒంటరిగా ఎదురు పడడం అనేది తెలియదు.


ఆలోచనలతో కాఫీ కప్పు ట్రేలో మెల్లగా తన భయానికి వణుకుతుంది.


"గట్టిగా పట్టుకో అమ్మ!" అనగానే "సరే అత్తయ్య!" అంటూ


ముందు కదిలింది కావ్య.


తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు, అయినా మామగారి ముందర తాను చిగురుటాకులా వణికింది.


హాల్లోకి వచ్చారు అనుకుని, "మామయ్య గారు! కాఫీ" అంటూ అనాలనుకుంది. అక్కడ లేకపోయేసరికి అన్ని వైపులా చూస్తుంటే, "టీపాయ్ మీద పెట్టి వెళ్ళమ్మా!" అంటూ...


బెడ్ రూమ్ డోర్ గట్టిగా వేసుకున్నారు. లోపలికి అడుగుపెడుతుందేమోనని.


"కాఫీ టీపాయ్ మీద పెట్టాను" అని చెప్పి, గండం తప్పింది అన్నట్టు... 'రహస్యం ఆ గదిలో ఏముందో ఏమో?'అని మనసులో అనుకుంటూ.. వంటగదిలోకి వెళ్ళింది కావ్య.


"తీసుకున్నాడా మామయ్యా!" అని అత్తయ్య అనే లోపలే...


లోపల నుండి "అనురాధా! ఇది కాఫీ నా? కషాయమా? చేదుగా చక్కెర లేదు. పట్టుకొని రా!" అన్న పిలుపుతో,


"వస్తున్నానండి! తెస్తున్నాను..." అని అరక్షణం లో పట్టుకుని వెళ్ళింది.


"భార్య తప్ప ఎవరూ తీసుకురాకూడదా మీకు? ఏంటండీ? మీరు ఎందుకు పిలిచారో అర్థం చేసుకున్నాను. vనేను మీలాంటి మనిషినే (ఎంతో ధైర్యం కూడదీసుకుని). వంట గది నుండి రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ముందే అనుభవంలోకి వచ్చేలా కోడళ్ళ చేత చేయిస్తున్నాను. 'మీ పనులు మేము చేస్తాము అత్తయ్య గారు! రెస్ట్ తీసుకోండి' అంటున్నారు."


"వింతగా వింటున్నాను రాధా!" ప్రేమతో అన్నప్పుడు "రాధా" అంటాడు గోపాలకిషన్. "ప్రతి చిన్న విషయానికి నీ మీదే ఆధార పడుతున్నాను రాధా ఇన్నాళ్లు. ఈ వయసులో ఒకరికొకరం తోడుగా ఉండవలసిన సమయంలో అవసరాలు పెరుగుతాయి. ఇంకా దగ్గర అవ్వాలని వంటశాల పదవికి విరమణ ఇచ్చి పతి సేవకు పరిమితం అవుతావు అనుకుంటున్నావా?" అంటూ ప్రేమగా దగ్గర తీసుకోబోతుంటే,


"ఏంటండీ? చిన్నపిల్లాడిలా చేస్తున్నారు. చేతికర్ర సాయం కోరే సమయం వచ్చింది.

మన ఇద్దరికీ షష్టిపూర్తికి బహుమతిగా మన అబ్బాయిలు ఇచ్చారుగా!"


"ఏమిటి వేళాకోళమా? చేతి కర్ర చేయూత అని గుర్తు చేస్తూ, ముసలితనంపై జాలి చూపిస్తున్నావా?"


"నాన్నగారూ! చేతి కర్ర తెమ్మంటున్నారా?"


"అమ్మా! నేను తెస్తాను" అని అప్పుడే అక్కడికి వచ్చిన పెద్ద కొడుకు, "నాన్న! ఉండండి" అని గదిలోకి వెళ్లబోతుంటే.....


"కర్ర వద్దు, కాకరకాయ వద్దు నాకు..." అంటూ మీసాలు మెలివేస్తూ గర్వంగా చూస్తున్న,

తండ్రి కళ్ళలోకి చూశాడు పెద్ద కొడుకు.


"ఒరేయ్ పెద్దోడా! చిన్నోడు రాజు ఇంకా లేవలేదా?"


"నాన్న! పెరట్లో పశువులు, పాడి ఆవులు, గేదెలు వాడి నేస్తాలు. వాటిని పొలానికి పంపి కానీ లోపలికి రాడు."


ఇల్లు రెండంతస్తుల భవనం ఉన్నా, చుట్టూ పెద్ద ప్రాంగణం, పెద్ద గేటు, ప్రహరీతో విశాలంగా ఉండి,


పది జెర్సీ ఆవులు, పొలం దున్నే ఎద్దులు పది జతలు, కోడె లేగలు, ఆవు లేగలు ఇలా అన్ని కొట్టాల కింద కట్టి వేయబడి, పొలం వెళ్లేంతవరకు వాటిని వదిలిపెట్టక, పనులు అన్నీ పూర్తి చేసుకుని, పశువుల కాపరులిద్దరూ వాటిని తరలిస్తున్నారు.


వీరయ్య పితికిన పాలన్నీ కొలిచి, డబ్బాల్లో నింపి వ్యాన్లకి ఎక్కించి టౌన్ కు పంపుతూ... "అట్లనే పొలం కాడికి పోతాను దొర" అంటూ జవాబులు ఇస్తూ వెళ్లిపోగానే,


ఇంట్లోకి వస్తున్న రాజుకు మాటలు వినిపించాయి.


"నాన్న! నా బిడ్డలు పెద్ద చదువుల కోసం విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్నారు. పెద్ద దాన్ని పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నాను. మంచి సంబంధం చూస్తున్నాను. అనుకున్నట్టుగా కుదిరేటట్లు ఉంది. పెళ్లి ఖర్చులకు డబ్బులు అవసరం ఉంది."


"నారాయణ! మన సీత కొడుకు సత్యం మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికిచ్చి పెళ్లి చేద్దాం. కళ్ళముందు ఉంటారు. కొత్త సంబంధాలు కట్నాలు, పెళ్లి ఘనంగా చేయాలంటారు."


"మేనరికం పెళ్లిళ్లు చేయడం వల్ల పుట్టబోయే సంతానానికి శారీరక, మానసిక సమస్యలు వస్తాయి నాన్న. మా అత్తగారు వాళ్ళు సంబంధం చూశారు. మన అమ్మాయి నచ్చిందన్నారు.

నా వాటా భూమి అమ్మి పెళ్లి చేయాలనుకుంటున్నాను."


"భూములు అమ్మితే మళ్ళీ కొనుక్కోగలమా? నా ప్రాణం ఉన్నంతవరకు భూములను అమ్మడం ఇష్టం లేదు."


"కూతుళ్ళ పెళ్లిళ్ల కంటే నాకు ఏది ముఖ్యం కాదు నాన్న. మన పంటలు పండని పొలాలను ప్లాట్లు చేసే అమ్మినట్లయితే ఇంకా బాగా ధర పలుకుతాయి."


బయట నుండి అప్పుడే వచ్చిన చిన్న కొడుకు రాజేంద్ర ప్రసాద్ వినయంగా "నాన్నగారు! మీరు ఎక్కువగా ఆలోచించకండి. అన్నయ్య కోరిక ప్రకారం భూమి అమ్మేసి కూతుళ్ళ పెళ్లి చేద్దాము."


తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకోవడంతో, అన్న చాలా సంతోషంతో,


"తమ్ముడు! మనం పంచుకున్న వాటాల్లో చివర భాగంగా ఉన్న భూమి నీ పేరు మీద ఉన్నది. మధ్య భాగంలో కొత్తవాళ్ళు వచ్చి చేరడం కన్నా, ముందు నీ భాగమంతా అమ్మేద్దాం." అనగానే


"సరే అన్నయ్య!" అనగానే,


రాజేంద్ర ప్రసాద్ పేరు మీద ఉన్న భూమంతయు అమ్మేసి, నారాయణ తన కూతుళ్ళ పెళ్లిళ్లు ఘనంగా జరిపాడు.


తన పేరు మీద ఉన్న భూమి అయినా అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తానని, లేక భూమి అయినా ఇస్తానని తమ్ముడిని ఒప్పించడంతో రాజు వాటా భూమంతయు అమ్మకం జరిగి, నారాయణ తన కూతుళ్ళ పెళ్లిళ్ల కోసం, తమ్ముడు చేసిన సహాయానికి మెచ్చుకున్నాడు.


తండ్రికి ఒకవైపు ముగ్గురు మనమరాళ్లు పెళ్లిళ్లు కావడం, ఒక వైపు సంతోషంగా ఉన్నా, కన్నతల్లి లాంటి భూములు దూరమయ్యాయి అనే దిగులు ప్రారంభమైంది.


తన ప్రాణం ఉన్నంతవరకు వ్యవసాయం "మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని" ఆశపడ్డాడు.


పెద్ద కొడుకు ముగ్గురు ఆడపిల్లలు చదువులు, పెళ్లిళ్లు జరిగి విదేశాలకు వెళ్లడంతో తన కొడుకు కూడా సంతోషంగా ఉన్నాడని సంతృప్తి పడ్డాడు.


కొద్ది కాలంలోనే పెద్ద కోడలు తమ బాధ్యతలు తీరాయని ఆస్తి అంతా చేయిజిక్కించుకొని అవసరాలు తీర్చుకున్నామని, తన తల్లి, అన్న అండతో అత్తమామను పట్టించుకోకుండా ఎడ ముఖం, పెడ ముఖంగా ఉండడంతో, తల్లిదండ్రులు బాధ పడసాగారు.


పెద్ద కొడుకు సంరక్షణలో తమ జీవితం సంతోషంగా సాగుతుందని ఆశపడితే అంతా తలకిందులైందని వాపోయారు ఇద్దరూ.


ఆ సమయంలోనే వచ్చిన పెద్దకొడుకు "నాన్న! మా పిల్లలు ముగ్గురు అమెరికాలో మంచి ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. కొన్ని ఏళ్లుగా మేము వెళ్లి వస్తున్నాము. వాళ్లు ఇండియాకు తిరిగి వస్తారు అనే ఆశ కనబడటం లేదు. కాకపోగా మమ్మల్ని కూడా అక్కడికి వచ్చి ఉండమంటున్నారు. మాకు సిటిజన్షిప్ కోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి."


ఆ మాటలు విన్న గోపాలకృష్ణకు "మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు" ఒక్కసారిగా కుంగిపోయాడు.


చెట్టంత కొడుకు నీడలో ప్రశాంతంగా జీవితం గడుపుదామని అనుకున్నాడు.


ఇద్దరు కొడుకులు రామ లక్ష్మణులుగా కలిసిమెలిసి ఉంటారు అనుకుంటే, విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతాను అన్న పెద్దకొడుకు నారాయణ మాటలు విని ఏమీ అనలేకపోయాడు.


వెంటనే తన రెండు కాళ్ళలో నిస్సత్తువ ఆవరించి, తన బెడ్ రూమ్ లోకి వెళ్లి మూలన ఉన్న నగిషీ చెక్కిన చెక్క చేతి కర్ర "నీకు నేను మూడవ కాలుగా ఉంటాను" అన్నట్టు ధైర్యం చెబుతున్నట్టు అనిపించింది.


******


మరునాడు చిన్న కొడుకుతో, "ఆడపిల్లల తండ్రి అన్న అంటూ అవతలి వాళ్ళని సంతోష పెట్టడం కోసం అని, చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేస్తూ, సంస్కారము, ప్రలోభము తెలియని ఉచ్చులో నీవు చిక్కుకుపోతున్నావురా రాజా!


పెద్ద కొడుకు ముందుగా ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడని జ్యేష్ఠ పాలు ఇస్తే, అది కూడా చెల్లెళ్ల పేరు మీద వ్రాసి తానే దయ గల వాడిగా పేరు తెచ్చుకున్నాడు.


అన్నయ్య 'రాజా!' అంటూ వచ్చి అతి చనువుగా ప్రవర్తించి, తమకు కూడా ఆస్తి హక్కు ఉంది, అని అన్న నారాయణతో చేతులు కలిపి, 'నాయనా! నీకు అన్యాయం చేయాలనుకుంటున్నారు నాన్న'" అన్న తండ్రితో,


"నాన్నా! నేను ముందుగానే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆలోచించి, అక్కచెల్లెళ్లకు ఆస్తి భూములు మీ అనుమతితోనే వారికి కొంత భూమిని వ్రాయించడానికి లాయర్ ను కూడా తీసుకు వచ్చాను"


"ఈ చర్య వలన నీ వాళ్లంతా సంతోష పడవచ్చు. కానీ నీవు గ్రహించవలసిన పరమ సత్యం ఒకటి ఉంది. కారణం ఏదైనా ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఒకలా ఉండదు నాన్న. కొద్ది మందితో ఇది సాధ్యం. నీ జీవితం మధ్యలో విరుచుకు పడిన మార్పుల వల్ల ఇలాంటి ఇబ్బందులు తప్పవు.


వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షాలు పడక చెరువులు, బావులు ఎండిపోయాయి. పంటలు పండక డబ్బులు లేక ఆర్థిక మాంద్యం ఏర్పడితే, నీకు సహాయంగా నీ కుటుంబ సభ్యులు సహకరించాలి, సంయమనం పాటించాలి, సరి పెట్టుకోవడం నేర్చుకోవాలి... నీకు అండగా ఉండవలసిన వాళ్ళు నిన్ను ఒంటరిని చేసి తమాషా చూస్తున్నారు...." అని అంటూ ఉండగానే...


అక్కడికి వచ్చిన అక్కలు "తమ్ముడు! నాన్న ఆస్తి పంపకాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆడబిడ్డలకు కూడా ఆస్తి హక్కు ఉంది."


"నాన్న మాకు కూడా పంచాలి" అంటూ విరుచుకు పడ్డారు.


"మీ గురించి ముందు నిర్ణయం తీసుకున్నాను అక్క" అంటూ నిదానంగా చెబుతుంటే అక్కలు సంతోషంతో పొంగిపోయారు.


ఇంతలో తండ్రి "నా గురించి, నీ గురించి ఎవరు ఆలోచిస్తారురా?


ఎవరైనా, ఏమన్నా అనుకుంటారు అని బంధాలకు దూరం అవుతానని అనుకుంటే పొరపాటే... ఆస్తులకు విలువనిచ్చే వాళ్ళు ప్రేమానురాగాలతో పొంగి పోరు.


నువ్వు దానధర్మాలు చేస్తున్నావని 'ఆహా! ఓహో!' అని పొగిడిన ఒరిగిందేమీ లేదు.


'ఆహా!' అనే పొగడ్తల వెనుక వ్యంగ్యం, అసూయ విషయాలుంటాయి నాన్నా గుర్తుంచుకో...


రాజా! నువ్వు సాదాసీదా స్థితిలో ఉన్నప్పుడు వీటి గురించి పట్టించుకోనవసరం లేదు. అనేక రంగాల్లో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు ఇలాంటి అనుభవాలు పొందినవారు గుర్తుంచుకో.."


తండ్రి మాటలు ఒక్కొక్కటి తన అనుభవాల దారులు వెతుక్కుంటూ అడుగుల్లో కదలిక మొదలయ్యింది. ఆ కదలిక సమయస్ఫూర్తితో కూడినదై... తనను తాను పరిశీలించుకునేదిగా కనిపించింది. ఆలోచన పెంచే కదలిక..


దాన్ని తెలిసిన మాధవన్ అనునతుడు రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేస్తున్నాడు. అభివృద్ధిలో వ్యాపారం కొనసాగిస్తున్నాడు. "ఎలాగూ నా భార్య బిడ్డలను పోషించుకోవాలంటే ఏదో ఒక వృత్తి ఎంచుకోవాలి."


"పంట భూములపై ఆశ లేకుండా అన్ని అవసరాలకు అమ్మేయవలసి వచ్చింది. అనావృష్టి వల్ల ఆదాయం అంతంత మాత్రమే.. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు."


"నేను భవనాల కాంట్రాక్ట్ తీసుకొని రియల్ ఎస్టేట్ చేద్దామనుకుంటున్నాను నాన్నా!"


"సరే నాన్నా! నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాను? నీ భవిష్యత్తు నీకు ముఖ్యం".. అంటూ తాను గదిలోకి వెళ్ళిపోయాడు.

===============================================

ఇంకా ఉంది..

అనురాగ బంధం -పార్ట్ 2/2 త్వరలో 

===============================================

 యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page