ఆఖరి కోరిక
- Vemparala Durga Prasad

- Nov 25, 2025
- 6 min read
#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #AkhariKorika, #ఆఖరికోరిక, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Akhari Korika - New Telugu Story Written By Vemparala Durga Prasad
Published In manatelugukathalu.com On 25/11/2025
ఆఖరి కోరిక - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
అది రాజమండ్రి లలితానగర్ లో ఒక ఇండివిడ్యువల్ ఇల్లు. సుధాకర్ ఆ ఇంట్లో ముందువైపు పోర్షన్ లో గత 4 సంవత్సరాలుగా అద్దెకి ఉంటున్నాడు. సుధాకర్ రిటైర్ అయ్యి 6 నెలలు అయింది. ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ వుంటున్నాడేమో.. ఓనర్ వెంకటరావు గారి విషయాలు ఎక్కువ తెలుస్తున్నాయి. వెంకట్రావు గారికి 70 ఏళ్ళు ఉంటాయి. భార్య పోయి రెండు సంవత్స రాలయింది. కొడుకు సాయిరాం దగ్గర వుంటారు ఆయన. సాయిరాం గారికి తాలూకా ఆఫీసు లో వుద్యోగం. ఓ 42 ఏళ్ళు ఉంటాయి. అతను, భార్య సురేఖ మాట జవదాటలేడు. తండ్రి అంటే ప్రేమే, కానీ భార్య ఆజ్ఞలు దాటి రాలేని పరిస్థితి. వెంకట్రావు గారికి ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు, అల్లుడు దానవాయి పేట లో వుంటారు. అల్లుడు ఆయుర్వేద డాక్టర్. కూతురు స్వాతి కి తండ్రి అంటే వల్లమాలిన అభిమానం.
గత ఆరు నెలలు గా వెంకట్రావు గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయనకి పెద్ద పేగు కాన్సర్ వచ్చిందని సుధాకర్ కి తెలుసు. ఆ విషయం తెలిసేక, ఆయన సౌకర్యం కోసం సాయిరాం గారు అడిగేరని, సుధాకర్ తన పోర్షన్ లో విడిగా వున్న ఒక గది ఖాళీ చేసి ఆయన మంచం వేసుకోవడానికి ఇచ్చేడు. సాయిరాం ఆలా విడిగా ఎందుకు ఏర్పాటు చేసేడో వూహించుకోగలడు సుధాకర్. ఇవ్వలేను అంటే, ఇల్లు ఖాళీ చేయమంటారు. తనకి వున్న 4 గదుల్లో ఒక గది, అదీ విడిగా వరండా వైపు వున్న గది ఇస్తే పోయేదేముంది అనిపించింది సుధాకర్ కి. సాయిరామ్ గారు కూడా ఓ 500 రూపాయలు అద్దె తగ్గించాడు, ఈ ఏర్పాటుకి.
సుధాకర్ కి వెంకట్రావు గారి దగ్గర కూర్చుని, ఉదయం 11 గంటలకి, సాయంత్రం 4 గంటలకి ఓ రెండు గంటలు గడపడం రివాజు గా మారింది.
ఆ సమయం లో ఆయన కోడలు పనుల్లో బిజీ గా ఉంటుంది. సాయిరాం గారు ఆఫీసుకి వెళ్లి పోతారు. వెంకట్రావు గారికి మంచి, చెడ్డ సుధాకర్ తో పంచుకోవడం ఇష్టం. వాళ్ళ స్నేహం అలా కొనసాగుతోంది.
ఆయన ఈ మధ్య గట్టిగా మాట్లాడలేక పోతున్నారు. ఆరోగ్యం క్షీణీస్తోంది. మధ్య మధ్య లో సాయిరాం గారు చెప్పిన దాన్ని బట్టి సుధాకర్ కి కూడా అర్ధం అవుతోంది పెద్దాయన ఇంక ఎంత కాలమో బ్రతకరు అని.
ఆరోజు ఆదివారం. ఎప్పట్లాగే, కోడలు, కొడుకు పెద్దాయన్ని ఏదో విషయానికి సతాయిస్తున్నారు. ఆయన ఏదో గొణుక్కుంటున్నారు. ఇంకో అరగంటకి హడావిడి సద్దుమణిగింది. సాయిరాం గారు బయటకి పని మీద వెళ్ళేరు.
ఇక్కడ వెంకట్రావు గారి కుటుంబం గురించి చెప్పాలి.
వెంకటరావు గారు ప్రైవేట్ కంపెనీ లో పని చేసి రిటైర్ అయ్యేరు. సంపాదించింది పెద్దగా లేదు. ఆయనకి, వాళ్ళు ఉంటున్న 2 పోర్షన్ల ఆ ఇల్లు తప్ప, ఇతర ఆస్తులు ఏమీ లేవు.
స్వాతి కి అన్నయ్య అంటే అభిమానం, సాయిరాం గారికి చెల్లి అంటే ప్రేమ. అయితే, అది 10 ఏళ్ళక్రితం అతని పెళ్లి అవక ముందు. స్వాతి కి కూడా పెళ్లి అయ్యి 11 ఏళ్ళు అయింది. స్వాతి కి ఒక కొడుకు. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నాడు. సాయిరాం గారికి ఒక కొడుకు. వాడు 4 వ తరగతి చదువుతున్నాడు. సురేఖ కాపురానికి వచ్చేక ఆ ఇంట్లో ప్రేమాభిమానాలు తగ్గు ముఖం పట్టేయి. ఆ అమ్మాయి కి మాట జోరు ఎక్కువ.
రెండు సంవత్సరాల క్రితం వరకు, ఆడపడుచుతో ఆవిడ బంధుత్వం బాగానే ఉండేది. ఎప్పుడయితే అత్తగారు శాంతమ్మ గారు మంచాన పడ్డారో, ఇంట్లో రుసరుసలు, ఈసడింపులు, మొదలు పెట్టింది. తరచూ ఆవిడ అనారోగ్యానికి చాలా ఖర్చు అయిపోతోందని, తన భర్త మీద భారం ఎక్కువయిపోతోందని సణుగుతూ ఉండేది. దాంతో వదిన కి ఆడపడుచు కి ఏదో ఒక కీచు లాటలు అవుతూ ఉండేవి.
ఒకసారి ఉత్తరాది ట్రిప్ కి వెళ్ళేరు సాయిరాం గారు, సురేఖ, కొడుకు. సరిగ్గా అప్పుడే శాంతమ్మ గారికి హార్ట్ అట్టాక్ వచ్చింది. ఊళ్ళోనే ఉంటున్న కూతురు స్వాతి, ఆవిడని కంటికి రెప్ప లా చూసుకుంది. అల్లుడు చాలా మంచివాడు అవడం తో, ఆవిడకి వున్నపళం గా ఆపరేషన్ చేయవలసివస్తే, 8 లక్షలు దాకా అతనే ఖర్చు పెట్టేడు. వెంకట్రావు గారికి మెడికల్ ఇన్స్యూరెన్స్ కూడా లేదు.
ఎక్కడో యాత్ర లో వున్నారని, వీళ్ళు వచ్చే దాకా చెప్పలేదు. వచ్చేక, కూతురు తనని ఎలా చూసుకుందో ఏకరవు పెట్టింది పెద్దావిడ. అంతే స్వాతి మీద పెద్ద గొడవ చేసింది సురేఖ.
“ మేము కావాలని వెళ్ళేమా? అసలు ఎప్పుడయినా ఇల్లు కదులుతున్నామా? ఇల్లు మాకు పుస్తయిపోయింది “ అంటూ సాగ దీసింది, ముక్కు చీదింది.
వెంకట్రావు గారు కలగ జేసుకుని, సర్ది చెప్పక పొతే, ఆ రోజు ఇంట్లో వంట చేసే ఉద్దేశ్యం కనపడలేదు సురేఖ వాలకం చూస్తే.
శాంతమ్మ గారు లెంపలేసుకుంది. అల్లుడు పెట్టిన ఖర్చు తిరిగి ఇచ్చెయ్యమంటే, కొడుకు, కోడలు ఆ విషయం దాట వేస్తుండడం ఆవిడకి అసలు నచ్చలేదు.
కూతురు చూస్తే, పెద్ద అభిమానవంతురాలు. డబ్బుకి ఆశ పడే రకం కాదు. మాట పట్టింపు ఎక్కువ. అల్లుడు కూడా అంతే.
అప్పటి దాక, ఆవిడ ఒంటి మీద వున్న 16 తులాల బంగారం తన తదనంతరం కూతురికి కోడలికి సమానంగా ఇవ్వాలని అనుకునేది ఆవిడ. కానీ ఇప్పుడు నిశ్చయించుకుంది 16 తులాలూ కూతురికి ఇచ్చేయాలని. ఆ మాటే భర్త తో అంది. అనడమే కాదు, అది జరిగేలా చూసే బాధ్యత ఆయనదే అంది. ఆవిడ సంతృప్తి కోసం " అలాగే నేను చూసుకుంటాను లే" అన్నారు అయన.
సరిగ్గా 5 నెలలు తిరగకుండా, ఆవిడ చనిపోయింది. ఆవిడ కర్మ కాండలు అయిన తర్వాత, నెమ్మదిగా కొడుకు దగ్గర ఆవిడ కోరిక.. “ఆవిడ బంగారం కూతురికి ఇద్దామని అనుకుంటున్నట్లు “ చెప్పేడు. ఎక్కడ్నించి విందో గానీ, వచ్చేసి పెద్ద గొడవ చేసింది సురేఖ. ఇద్దరికీ చెరి సగం అనే వరకు, ఇల్లు దద్దరిల్లి పోయింది.
ఇంట్లో గొడవ తెలిసింది స్వాతికి. ఆమె కి పట్టుదల వచ్చేసింది. అసలు మా అమ్మ నగల లో ఆవిడ దుద్దులు గుర్తుగా ఉంచుకుంటాను. మిగిలిన నగలు నువ్వే ఉంచేసుకో అని వదిన కి ఇచ్చేసింది.
సురేఖ మొహం వెలిగి పోయింది. ఓ 5 నెలలు ఆడపడుచు కి రాజ లాంఛనాలు చేసింది. రోజూ వస్తూ పోతూ ఉండమని పోరు పెట్టింది. స్వాతి కి కూడా తెలుసు, వదిన గారి ప్రేమ డబ్బు తో ముడి పడి ఉంటుందని. రోజూ రాలేనని, వారానికి ఒక సారి వస్తానని చెప్పింది. ఏదయినా, తండ్రి దగ్గర కాసేపు గడపడానికి ఆమె వస్తుంది.
ఈ మధ్య వెంకట్రావు గారి ఆరోగ్యం బాగా పాడయ్యింది కనుక 3 నెలలుగా, వారానికి 2, 3 సార్లు వస్తోంది. అదీ వాళ్ళ కుటుంబ నేపథ్యం.
***
ఏమీ తోచక తిరుగుతున్న సుధాకర్ కి పెద్దాయన్ని ఒక సారి చూడాలని అనిపించింది.
పొద్దున్నించీ, కోడలు ఏదో సతాయించి పోయడం సుధాకర్ చెవిన పడుతూనే వుంది. ” కాటికి కాళ్ళు జాపిన పెద్దాయన్ని అలాగే చూస్తారా?” అని ఆమె మీద, సాయిరాం మీద చాలా కోపం వచ్చింది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం.
ఒకసారి ఆయన్ని కలిసి కాస్త ఊరడింపుగా మాట్లాడాలని అనిపించి, వాళ్ళ వరండాలోకి వెళ్ళేడు సుధాకర్.
ఎదురు పడింది సురేఖ. నవ్వేడు సుధాకర్. “మావయ్య గారు పడుకున్నారా అమ్మా? “ అన్నాడు పలకరింపు గా.
“లేదు అంకుల్, మెలకువ గానే వున్నారు. వెళ్లి కూర్చోండి, కాఫీ తెస్తాను " అంది.
సుధాకర్ ని చూస్తూనే, వెంకట్రావు గారి ముఖం వెలిగి పోయింది. అటూ.. ఇటూ చూసేరు. సుధాకర్ కి అర్ధం అయింది. కోడలు దగ్గిర లో లేదని, నిర్ధారించుకున్నాక, మంచం మీద నుండే, పక్కనున్న చెక్క బీరువా తెరిచారు.
అందులోంచి ఒక కవర్ తీసేరు. అది ఇస్తూ ఇలా అన్నారు:
" సుధాకర్ గారు.. మీరు నాకు తమ్ముడి లాంటి వారు. ఈ కవర్ పట్టుకెళ్లి మీ ఇంట్లో జాగ్రత్త పెట్టి రండి" అని ఆయాస పడుతున్నారు.
సుధాకర్ కి కంగారు వేసింది. ఆయన చెప్పినట్లే, వెంటనే తీసుకెళ్లి ఇంట్లో బీరువాలో పెట్టి వచ్చేడు.
వెంకట్రావు గారు ఉద్వేగం గా వున్నారు. టేబుల్ మీద మంచి నీళ్లు అందించాడు సుధాకర్.
అప్పుడు ఆయన ఇలా అన్నారు:
" మీకు నేను ఇచ్చిన కవర్ నా మరణం తర్వాత 12 వ రోజు దాటాక, తెరిచి, మా అమ్మాయికి అప్పచెప్పండి".
అదేం మాటలు సార్. మీకేమీ కాదు. మీరు కోలుకుంటారు అంటున్నాడు సుధాకర్.
బదులుగా నవ్వేసి, మీకు ఒక విషయం చెప్పాలి.. అని మళ్ళీ నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టేరు:
“3 నెలల నుండీ, ఆ కవర్, ఈ పక్కన వున్న చెక్క బీరువా లో జాగ్రత్త గా దాచేను. నేను మరో నెల కంటే బతకనని, డాక్టర్ మా అబ్బాయి తో అంటూ ఉంటే తెలిసింది. నా తదనంతరం మా కోడలు ఈ ఇల్లు అమ్మేస్తుందని తెలిసింది. ఇంకా ఏదో చెప్ప బోతున్నారు.
ఇంతలో అలికిడి కి ఆగిపోయారు.
వారి కోడలు వచ్చింది. సుధాకర్ కి కాఫీ తెచ్చింది.
థాంక్స్ అమ్మ, అని కాఫీ తాగి, ఇంటికి వచ్చేసాడు సుధాకర్.
మరునాడు ఇంటికి చుట్టాలు రావడం తో మరో 4 రోజులు వెంకట్రావు గారి ఇంటి వైపు వెళ్ళలేదు. 5వ రోజు పొద్దున్నే హడావిడికి మెలకువ వచ్చింది సుధాకర్ కి. అంబులెన్సు వచ్చింది. వెంకట్రావు గారిని హాస్పిటల్ కి తీసుకెళ్ళేరు.
ఓ వారం రోజులు హాస్పిటల్ లో మృత్యువు తో పోరాడి ఓడిపోయారు వెంకట్రావు గారు.
ఆయన మరణం వలన ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. వెంకట్రావు గారి కూతురు, అల్లుడు వచ్చేరు. కర్మ కాండలు సాంప్రదాయ పద్దతి లో జరిపించారు సాయిరామ్ గారు.
12 రోజుల కార్య క్రమాలు అయిపోయాక, బీరువా లోంచి వెంకట్రావు గారు ఇచ్చిన కవర్ తెరిచాడు సుధాకర్. అందులో వెంకట్రావుగారి వుత్తరం లో ఇలా వుంది:
సుధాకర్ గారు! నాకు వచ్చిన అనారోగ్యం నన్ను యెంత కాలమో బతకనివ్వదు. అది తెలిసి, కోడలు అంతరంగం బయట పెట్టింది. నా చేత ఈ ఇంటిని వాళ్లకి విల్లు రాయించింది. నేను పోయాక, మా కోడలు ఈ ఇల్లు అమ్మేసి, వాళ్ళ పుట్టింటి వారు వుండే ఇన్నీసుపేట కి మకాం మార్చేస్తుందిట. ఇదివరకు నేను మా ఆవిడ నగలు మా అమ్మాయికి ఇమ్మంది అని చెప్పి నప్పుడు, పెద్ద గొడవ జరిగింది. నా కూతురు అభిమానవంతురాలు నగలు పట్టుకెళ్ళలేదు.
ఇప్పుడు ఇల్లు అమ్మేసినా, ఆమెకి వీళ్ళు ఏమీఇవ్వరు. అందుకే, 3 నెలల క్రితం నేను కాస్త బయటకి వెళ్లగలిగినప్పుడు నా మిత్రుడి సహాయం తో నా వీలునామా మార్చి, ఇద్దరికీ సమాన హక్కు రాసేను. కానీ ఆ విషయం బయటకి తెలిస్తే, నాకు దహన సంస్కారాలు కూడా చేస్తారో లేదో. ఈ మహాతల్లి నా కొడుకు చేత కర్మ కాండ కూడా చేయనీయదు. అందుకే, ఈ విషయం నా మరణానంతరం వరకు ఎవరికీ చెప్పద్దని చెప్పేను. ఈ బాధ్యత మీదే. నా కొడుకు కోడలు నన్ను అసహ్యించుకున్నా, ఇంక నాకేమీ పర్వాలేదు. నా కూతురిని మాత్రం ఈ నా ఆఖరి కోరిక మన్నించి ఈ కొత్త వీలునామా ని ఉపయోగించుకోమనండి”.
ఇట్లు
వెంకట రావు
అని రాసి వుంది ఆ వుత్తరం లో. సుధాకర్ కి కళ్ళు వర్షించేయి. దాంతో బాటు, స్వాతి కి చిన్న వుత్తరం, వీలునామా వున్నాయి ఆ కవర్ లో. అవి తీసుకెళ్లి స్వాతి ఇంట్లో ఇచ్చి వచ్చేడు సుధాకర్.
సరిగ్గా మరో 4 రోజుల్లో, అనుకున్నంతా అయింది.
సురేఖ వచ్చింది. “అంకుల్, ఈ ఇల్లు అమ్మేస్తున్నాము. మీరు ఎక్కడయినా ఇల్లు చూసుకోండి, ఒక నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది “ అంది.
మరో 15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు సుధాకర్. మళ్ళీ నెలలో ఆ ఇంటి రిజిస్ట్రేషన్ అయింది. కొనుక్కున్న పరంధామయ్య గారు సుధాకర్ కి మిత్రుడే.
ఒక రోజు మార్కెట్ లో కనపడితే, ఆయన ద్వారా తెలిసింది సుధాకర్ కి. వెంకట్రావు గారి కొత్త వీలునామా వలన, ఇంటి రిజిస్ట్రేషన్ సమయం లో ఘర్షణ జరిగిందిట.
పరంధామయ్య గారు 36 లక్షలకి ఇల్లు కొనుక్కున్నారుట. 18 లక్షలు, కొడుక్కి, 18 లక్షలు కూతురికి ఇచ్చి ఇద్దరి చేత, సంతకాలు చేయించుకుని, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించు కున్నామని ఆయన చెప్పేరు.
స్వాతి కి న్యాయం జరిగింది అని సుధాకర్ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. పెద్దాయన కి మనసులోనే నమస్కరించుకున్నాడు.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.




Comments