అక్షర హితోక్తులు
- Gadwala Somanna

- 16 hours ago
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AksharaHithokthulu, #అక్షరహితోక్తులు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 148
Akshara Hithokthulu - Somanna Gari Kavithalu Part 148 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 07/12/2025
అక్షర హితోక్తులు - సోమన్న గారి కవితలు పార్ట్ 148 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అక్షర హితోక్తులు
---------------------------
తడబడడం మానుకో
నిలబడడం నేర్చుకో
సునామీలు వచ్చినా
సమస్యలే తెచ్చినా
పొరపాట్లే దిద్దుకో
అలవాట్లే మార్చుకో
మహాత్ముల బాటలోన
గమ్యాన్నే చేరుకో
బద్ధకమే దులుపుకో
చురుకుదనం నింపుకో
ఆశయాల సాధనలో
ఏకాగ్రత నిలుపుకో
ధైర్యాన్నే నమ్ముకో
బ్రతుకులోన ఎదిగిపో
సాహస పనులే చేసి
చరిత్రలో నిలిచిపో

చిలుకమ్మ సూక్తులు
------------------------------
పెద్దలను గౌరవించు
నీతిగా జీవించు
పదిమందికి సాయం
మనసారగ అందించు
మంచి దారి చూపించు
ప్రేమతో నడిపించు
అభివృద్ధి పథంలో
అలయక ఇల పయనించు
బ్రతుకులో సాధించు
అన్యాయం ఎదురించు
పేదోళ్ల పక్షాన
గిరిలా అవతరించు
కన్నోళ్లను ప్రేమించు
దేవుని ఆశ్రయించు
పొరపాట్లను క్షమించి
మిత్రులుగా భావించు

వెన్నెల నవ్వితే
--------------------------------------
వెన్నెలమ్మ చల్లదనము
వెన్న వోలె మెత్తదనము
పున్నమి నాటి వేళలో
ఉండునోయి! నిండుదనము
రూపేమో తెల్లదనము
గుణమేమో ఘనము ఘనము
వెన్నెలమ్మ చక్కదనము
ఆకాశము జన్మ స్థలము
వెన్నెలమ్మ నవ్వితే
పౌర్ణమి అరుదెంచితే
జగమంతా వెలుగుమయము
కలుగును నేత్రానందము
వెన్నెల రాత్రుల్లో
మదికెంతో హాయి హాయి
పక్షపాతమే లేనిది
ఉపకారమే చేయునది
ఎటుచూసినా వెన్నెల
దాని మోమెంతో కళకళ
ఉట్టిపడును శాంతిగుణము
అందరికీ బహు ఇష్టము
వెన్నెల్లా ఉందామా!
వన్నె వసుధకు తెద్దామా!
జాబిలితో జతకట్టి
సరదాగా ఆడుదామా!

కోయిల సందేశం
------------------------
మనసుల్లో కత్తులు
మాటల్లో సూదులు
దాచుకున్న వ్యక్తులు
చూడగా కోకొల్లలు
నోటిలో తేలు విషము
కళ్ళల్లో కామము
నింపుకున్న నీచులు
కాటేసే త్రాచులు
గుండెల్లో ద్వేషము
ఒళ్ళంతా గర్వము
ఉన్నవారు ఎక్కువ
మహనీయులు తక్కువ
పెద్దవారి సూక్తులు
వారు చేయు బోధలు
నేర్పునోయ్! పాఠాలు
దిద్దునోయ్! జీవితాలు

చరిత్రలో స్థానము
----------------------------------------
ఓటమి చూడకుండా
కష్టం చేయకుండా
విజయాన్ని పొందలేము
ఫలితాలు చూడలేము
సమస్యలు లేకుండా
తప్పులు జరుగకుండా
ఉండవోయ్! జీవితాలు
నడవవోయ్! కుటుంబాలు
జీవిత సాగరంలో
అన్నీ కుటుంబాల్లో
ఆటుపోట్లు సహజమే
అక్షరాల నిజమే
వాటిని అధిగమిస్తే
ఆదర్శం చూపిస్తే
మనిషి జన్మ సార్ధకము
చరిత్ర పుటలలో స్థానము

గద్వాల సోమన్న




Comments