top of page

అలల చాటు ఉప్పెన - పార్ట్ 1 



'Alala Chatu Uppena - Part 1/3' - New Telugu Story Written By Namani Sujana Devi

Published In manatelugukathalu.com On 28/08/2024

'అలల చాటు ఉప్పెన - పార్ట్ 1/3' తెలుగు కథ

రచన: నామని సుజనాదేవి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



సముద్రపు అలలను చూస్తూ కూర్చున్న నా మనసంతా, బడబానలాన్ని దాచిన సముద్ర గర్భంలా గందరగోళంగా, అల్లకల్లోలంగా, అలజడిగా ఉంది. ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్న కళ్ళు రాబోయే ఉప్పెనను సూచిస్తున్నట్లున్నాయి. అలుపెరగక ఉవ్వెత్తున ఉరికే తరంగాల్లా మదిలోని ఆలోచనలు ఎగసెగసి పడుతున్నాయి. 


 ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళక మౌనంతో సహవాసం చేసే నాకు జరిగిన అవమానం వద్దనుకున్నా పదే పదే గుర్తొచ్చి వేదనతో, ఆవేదనతో మనసు రలిగిపోతుంది. 


 మూడేళ్ళుగా మౌనంగా ఆరాధిస్తున్న, నా ప్రాణం అనుకున్న శ్రీజ, పరీక్షలు అయిపోయినందున తెల్లవారి నుండి ఇక కనబడదు అనే ఆలోచన తట్టుకోలేక ప్రేమ వ్యక్త పరిచే ధైర్యం చేసాడు. ఇలా జరుగుతుందని ఏ మాత్రం ఊహించినా జీవితాంతం నా మూగ ప్రేమను ఇలాగే గుండెల్లో సమాధి చేసుకునేవాడే గానీ, ఇలా వ్యక్తపరిచి అవమానం పాలయ్యేవాడు కాదు. నా కళ్ళ ముందు, ఆ సంఘటన మరోసారి సినిమా రీలులా తిరిగింది. 

*****

 ఫేర్ వెల్ పార్టీ కోసం ముస్తాబైన ఆ హాలంతా విద్యార్థులతో నిండిపోయింది. ఇన్నేళ్ళు కల్సి ఉన్న తాము తెల్లవారి నుండి ఇక కలవలేమని తెల్సి బాధతో కొందరు, బీ టెక్ అయిపోయిన ఆనందంలో కొందరు, రకరకాల హావభావాలతో భావోద్వేగాలతో, ఇక తర్వాత తమ భావాలు వ్యక్తపరచలేమేమో అన్నట్లు గలగలా మాట్లాడుతూ కొందరు, బాధతో పూడుకుపోయిన గొంతుతో మాటలు మరిచి కొందరు, ఆనందం పంచుకుంటూ ఆహ్లాదంగా నవ్వుకుంటూ కొందరు, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ కొందరు ఉన్నారు. 


 ఇక ప్రిన్స్ పాల్, ఇతర లెక్చరర్లు వారితో మాట్లాడుతూ, విద్యార్థులతో, ఆనాటి కార్యక్రమ ఏర్పాట్లను చూస్తూ వారికి ఆటోగ్రాఫ్ లిస్తూ ఉన్నారు. విద్యార్థులంతా అబ్బాయిలు తెల్లని చొక్కాలు, అమ్మాయిలు తెల్లని టాప్ లు వేసుకుని దానిపై తమ ప్రియమైనవారి ఆటోగ్రాఫ్ లు తీసుకుంటూ శాశ్వత జ్ఞాపకాలుగా పదిల పరుచుకుంటూ ఆనందోద్వేగాల డోలాయమాన స్థితిలో ఉన్నారు. 

 “హలో! శ్రీజ!” నా ప్రాణాన్ని పలకరించాను. 


“హాయ్! సాయి.. . చెప్పు”


 “మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి. ఒక్క క్షణం అలా పక్కకొస్తారా?”


“ఏంటి ఆటోగ్రాఫా? నాకలా షర్ట్ పై రాయడం ఇష్టముండదు. బుక్ లో రాస్తాను” 


“అది కాదు.. . ”


“మరేంటి? చెప్పు”


“ఈ గొడవలో వద్దు.. . అలా పక్కకొస్తే.. . ”


“ఫర్లేదు చెప్పు”


“నిన్ను.. . మిమ్మల్ని ఎన్నో రోజులనుండి గమనిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మనం పెళ్ళి చేసుకుందాం, మీకు నచ్చితే! అనంతమైన నా ప్రేమ ఎలా తెలపాలో అర్థం కావడం లేదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఐ లవ్ యు మోర్ థాన్ ఎస్టర్ డే అండ్ లెస్ థాన్ టుమారో ” ఆ సమయం గడిస్తే ఇక మళ్ళీ చెప్పే అవకాశం రాదన్నట్లు ఇన్ని రోజుల ఆరాధనను, గడగడ పాఠం వల్లెవేసినట్లు అప్పజెప్పాడు. 


“నీ కెంత ధైర్యం? హౌ డేర్ యు ఆర్?” గట్టిగా అరిచిన ఆమె అరుపుకు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఆ హాల్ లో ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. ఒక్కసారి ఆ హాల్లో ఆవహించిన నిశ్శబ్ధం అందులోనుండి శ్రీజ గొంతు స్పష్టంగా నిందిస్తూ.. . 

 అందరూ మా వైపు చూసారు. భయంతో తలవంచుకుని దోషిలా నిలబడ్డ నేను, గుడ్లెర్రజేసి ఉరిమి చూస్తున్న శ్రీజ కనిపించారు. 


“ఉద్యోగం లేదు. కనీసం ఒక్క ఇంటర్వ్యు కూడా అటెండ్ కాలేదు. అలాగని పెద్ద ఆస్తిపరుడివి కాదు. పెళ్ళి చేసుకుని ఏం చేద్దామని? ఎవర్ని ఉద్దరించుదామని? కనీసం మూరెడు మల్లెపూలయినా కొనివ్వగలవా? ఏం చూసుకుని నీకింత ధైర్యం? యూ రాస్కెల్!” చెడా మడా తిడుతున్న ఆమెను చూసి మ్రాన్పడి పోయాడు. కొందరు వినోదంలా చూస్తున్నారు. 


“ఇంకా చదివే పూర్తి కాలేదు. అప్పుడే పెళ్లి కావాల్సి వచ్చిందా? కాంపస్ సెలెక్షన్స్ లో కనీసం ఒక్క ఇంటర్వ్యు కూడా అటెండ్ కాలేదు. ఉద్యోగం సాధించాలనే ఒక సీరియస్ నెస్ లేదు, గతి లేదు, గమ్యం లేదు. లక్ష్యం లేని జీవితం దారంలేని గాలిపటం లాంటిది. అదెటు వెళుతుందో దానికే తెలియదు. మరి నీకైనా తెలుసా?” వెటకారం అణువణువునా ప్రతిద్వనిస్తుంటే అంది శ్రీజ. 

నాకర్థమయ్యింది, ప్రతి ఒక్కరి చూపు నా వైపే గురిపెట్టబడి ఉన్నదని. అంతే కాదు ఆ చూపులు శూలాల్లా, బాణాల్లా అణువణువుగా పొడుస్తున్నాయి. తల నేరం చేసినట్లు నేలకు వంచినా, అక్కడే ఉన్న ప్రిన్స్ పాల్, లెక్చరర్ల కళ్ళల్లోని భావాలు నాకు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. 

 

అప్పుడే భూమాత, సీతమ్మ తల్లిని తీసుకుని వెళ్ళినట్లు, నన్ను కూడా అక్కడి నుండి మాయం చేసి తీసుకెళితే బావుండుననిపించింది. 


“నేను.. . ఎందుకు.. . ” ప్రేమించానో చెప్పబోతున్న నా మాటలు బయటకు పెగలనే లేదు. 

“పుట్టామా? తిన్నామా? పడుకున్నామా? పోయామా? కాదు. పుట్టినందుకు భూమికి, పుట్టించినందుకు అమ్మకి, బ్రతుకుతున్నందుకు సమాజానికి ఏమీ చేయని బతుకెందుకు? మట్టిలో రేణువులా కాదు, మట్టిలో మాణిక్యంలా, రాళ్ళల్లో రత్నంలా, ముత్యపు చిప్పలో ముత్యంలా మెరవడానికి ప్రయత్నించు. అందరిలో ఒకరిగా కాకుండా, లక్షల్లో ఒకడిగా గుర్తించేలా కష్టించు. ”

ఆమె వాగ్ధార సాగుతూనే ఉంది. 


మొగుడి కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకన్నట్లు, ఆమె తిరస్కరించిందన్న బాధ కన్నా, చుట్టుపక్కల వారి ముందు జరుగుతున్న అవమానానికి తల ఇంకా భూమిలోకి చొచ్చుకుపోయింది. ప్రిన్సిపల్, ఇతర లెక్చరర్లందరికి కూడా నేను మంచి విద్యార్థిగా మాత్రమే తెలుసు. అంతే కాదు అంతవరకు కాలేజీలో తెచ్చుకున్న ‘సాయి కృష్ణ మంచి బాలుడు’ అనే నా పేరు సమూలంగా తుడిచిపెట్టుకునిపోయింది. 

 

“నీకు సత్తా ఉంటే, జీవితంలో ఏ గమ్యం నిర్ణయించుకున్నావో తెలుసుకో. ఆ గమ్యం సమాజానికి ఎంతో కొంత మేలు చేసేదై ఉండాలని గుర్తుపెట్టుకో! కుక్క, నక్క, కోడి, పిల్లి అన్నీ పుడతాయి. కాని వాటికన్నా మిన్నగా ఉన్న మనవల్ల సమాజానికేం ఉపయోగమో ఆలోచించు. 


అప్పుడు నేను ఇది చేశానని వస్తే, అప్పుడు ఆలోచిస్తాను” అంటూ తీవ్రంగా అని వెళ్ళిపోయింది. అందరూ చూస్తున్న చూపులు శూలాల్లా పొడుస్తుంటే, నేనెంత నెమ్మదిగా మాట్లాడినా, ఆమె అంత గట్టిగా అరవడంతో నిశ్చేష్టుడనయ్యాను. నా తల ఇంకా పాతాళంలోకి వంగిపోయింది. 


 ఇక తర్వాత అక్కడి నుండి ఎలా బయటపడ్డానో నాకే తెలియదు. 

 అదేదో సినిమాలో యమధర్మరాజు కాలచక్రాన్ని వెనక్కి తిప్పినట్లు ఒక్కసారి తిప్పితే బావుండనిపించింది. 

 

 ఆ బాధ ఇంకా మదిలో సుళ్ళు తిరిగి సుడిగాలిలా చుట్టేసి, సునామీలా ముంచేస్తూనే ఉంది. దాని ఫలితమే నాకు తెలియకుండానే ఆగకుండా వరదలా మొదలై, ఉప్పెనై దూకుతున్న కన్నీరు. 

ఇప్పటి వరకు నాకు గుర్తెరిగి ఏడ్చిన సందర్భాలు రెండే రెండు. ఒకటి నాన్న అమ్మను, వదిలి వెళ్ళిపోయాడని తెలిసి, అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చినప్పుడు, రెండోది ధైర్యంగా బయటకు వెళ్ళి పనిచేసే అమ్మ జ్వరతీవ్రతతో లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా ఆకలి కన్నా, అమ్మను ఎలా కాపాడుకోవాలోనని ఏడుస్తూ డాక్టర్ ని తీసుకొచ్చిన సందర్భంలో. 

 

 ఆ తర్వాత అమ్మ కష్టం తగ్గడానికి అమ్మ పనిచేస్తుంటే నేను ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. అమ్మతో పాటు ఇదే బీచ్ లో కేవలం పల్లీలు, బఠానీలు అమ్మే అమ్మతో పాటు వచ్చి, ప్రస్తుతం చిన్నగా టిఫిన్ దుకాణం పెట్టి, ఇద్దరు అబ్బాయిలతో రెండు స్టాళ్లు నడిపే స్థాయికి వచ్చారు అంటే కేవలం తమ నిరంతర శ్రమ మాత్రమే! 


 ఎప్పటికీ వచ్చేవాళ్ళే కాకుండా, వచ్చే పోయే పర్యాటకులతో ఎప్పుడూ కళకళ లాడుతూ ఉంటుంది బీచ్. వచ్చిన వాళ్ళు చాలా మంది ప్రేమికులు, స్నేహితులు, పర్యాటకులు. చాలామంది అక్కడ ఎంజాయ్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. దానితో దేవుని కృప వలన త్వరలోనే చిన్న ఇల్లు ఏర్పరచుకుని కష్టాలు గట్టెక్కగలిగాము. 


అదేంటో, అమ్మను సుఖపెట్టాలని నాకెంత ఉన్నా, మొదటి నుండి ఉద్యోగం చేయాలనే దృష్టి లేదు. అంతకుమించి ఏదో చేయాలని తపన మాత్రమే. అందుకే ఆ వైపుగా ఏ ప్రయత్నాలు చేయలేదు. కానీ ఏది చేయాలి అనే ఆలోచన, స్పష్టమైన అవగాహన ఇప్పటివరకు రాలేదు. ఏం చేయాలనుకుంటున్నానో నాకే అర్థం కావడం లేదు. కానీ ఏదో చేయాలి! అది సమాజం కోసమా, రోజువారి భోజనం కోసమా? అనేది తేలక రెండింటి మధ్య ఇదమిత్ధంగా తెలియని అస్పష్టమైన గీత ఉంది. అలాంటి నేను ప్రేమించడం నమ్మశక్యంగా లేకపోయినా అది వాస్తవం. 


 వయసు వేడి వలనో లేదా వ్యామోహం వల్లనో కాదు, కానీ శ్రీజలో అమ్మ లోని గుణాలు అపరిమితంగా కనిపించి ఆమెపై ఇష్టం పెంచుకున్నాను. 


 నా జీవిత గమ్యం, పెద్ద ఉద్యోగం సంపాదించడం, ఆస్తులను పోగేసుకోవడం, సంపదను ఆర్జించడం అనుకోలేదు. కేవలం నా జీవిత భాగస్వామిగా ఆమెను పొందుతే చాలు అని మాత్రమే అనుకున్నాడు. అలా అని అందని ఆకాశం కోసం పాకులాడలేదు కూడా. నా లాంటి మధ్యతరగతి కుటుంబమే వారిది కాబట్టి ఇక నా కోరిక తీరకపోవడానికి అవకాశం లేదనుకున్నాడు. 


ఆమె నన్ను అంతగా ఆకర్షించడానికి ఆమె అంత అందమైనది కాదు. అలాగని ఆస్తిపరురాలు కాదు. కానీ మరి ఇవన్నీ ఏమీ లేకుండా ఎందుకు ఆమె అంతగా ఆకర్షించిందీ, అంటే ఉన్నతమైన ఆమె వ్యక్తిత్వం. అందరిలా వయసు వేడిలోనో, వ్యామోహంతోనో ప్రేమించలేదు. ఆమె చేసిన పనులన్నీ మనసుకు నచ్చి, మెచ్చి, అమ్మను ఆమె అయితేనే బాగా జీవితాంతం చూసుకోగలదనే ఆశతో ప్రేమించాడు. కానీ అవన్నీ చెప్పే అవకాశం ఆమె తనకు ఇవ్వలేదు. 

 మొట్టమొదట ఆమెను చూసిన సందర్భం గుర్తొచ్చింది నాకు. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================

నామని సుజనాదేవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.        

రచయిత్రి పరిచయం :

తెలంగాణా లో రచయిత్రి , కవయిత్రి నామని సుజనాదేవి పరిచయం క్లుప్తంగా.

   పూర్తి పేరు : నామని సుజనాదేవి

   విద్యార్హతలు : B.Sc.,B.Ed.,M.A.(English),LL.B.,PGDCA., FIII(Fellow of Insurance Institute of India) M.Sc.(Psychology),M.A.(Telugu) English&Telugu Type Writing lower.

 వృత్తి :భారతీయ జీవితబీమా సంస్థలో పరిపాలనాధికారి

   ప్రవృత్తి : కధలు,కవితలు వ్రాయడం,చెస్,క్యారమ్స్,టి‌టి ,అథ్లెటిక్స్ మొదలగు ఆటలు ఆడటం,వ్యాసరచన,వక్తృత్వం లాంటి అన్నిపోటీల్లోపాల్గొనటం మూడు కధా సంపుటాలు రెండు కవితా సంపుటాలు వెలువరించడం. ‘మనో స్పందన’ కధా సంపుటికి రాష్ట్ర స్థాయి తృతీయ పురస్కారం రావడం.

1.భారత మహిళా శిరోమణి అవార్డ్ ౩. సంపూర్ణ మహిళా అవార్డ్ 4 . అలిశెట్టి ప్రభాకర్ స్మారక కవితా పురస్కారం 5. శ్రీ శ్రీ సాహితీ పురస్కారం 6. గ్లోబల్ పీస్ (ప్రపంచ శాంతి) అవార్డ్ 7. ఉగాది పురస్కారం , రుద్రమదేవి మహిళా పురస్కారం 8. శ్రీ అయితా చంద్రయ్య సంప్రదాయ కధా పురస్కారం 9. బెస్ట్ సిటిజెన్ అవార్డ్ 10. ‘విశ్వ శాంతి సేవా పురస్కారం ‘ 11. శాతవాహన విశ్వ విద్యాలయ కధా పురస్కారము 12. సోమరాదాక్రిష్ణ స్మారక వ్యాస పురస్కారం 13. ‘గురజాడ సాహిత్య పురస్కారం ‘ 14. సైదా సాహెబ్ స్మారక మినీ కవిత లో ప్రధమ బహుమతి 15. ఆంద్ర ప్రదేశ్ మాసపత్రిక హాస్య కధల పోటీలో ప్రధమ బహుమతి 16. రెండు సార్లు నెలవంక నెమలీక కధా పురస్కారం 17. ప్రతిలిపి ద్వారా ‘కధా కిరీటి ‘, ‘ కవి సుధ ‘ బిరుదులు, సహస్ర కవిమిత్ర బిరుదు 18. ‘సాహితీ రత్న’ అవార్డ్ 19. కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్ సాహితీ అవార్డ్ 20. ఇప్పటివరకు దాదాపు 70 వరకు ఆర్టికల్స్ వరంగల్ ఆకాశవాణి లో ,6 విశాఖ ఆకాశవాణి లో,3 హైదరాబాద్ ఆకాశవాణి లో ప్రసారం చేయబడినాయి. 21. 225 కధలు,175 కవితలు,25 ఆర్టికల్స్ ఈనాడు,తెలుగువెలుగు ,విపుల ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రజ్యోతి,కధాకేళి, ముంబైవన్,ఉషోదయ వెలుగు ,వైఖానసప్రభ మొదలగు పత్రికల్లో ప్రతిలిపి, మై టేల్స్, కహానియా, తెలుగు వన్, వసుధ ,మామ్స్ ప్రేస్సో వంటి వెబ్ మాగజీన్ లలో ప్రచురించబడ్డాయి. 22. LIC డివిజన్ లెవల్ చెస్ లో 10 సార్లు, అధ్లేటిక్స్ 3 సార్లు,టి.టి.లో 5 సార్లు ప్రధమ స్థానం పొంది జోనల్ లెవెల్ లో పార్టీసీపేట్ చేయడం. 23. రాష్ట్రస్థాయి జాతీయ వెటరన్ అధ్లేటిక్ మీట్లలో 2000 నుండి 2003 వరకు దాదాపు 15 నుండి 20 వరకు గోల్డ్,సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ పొందడం. జోనల్ లెవల్ అధ్లేటిక్ మీట్లో 400మీటర్ల పరుగుపందెంలోబ్రాంజ్ మెడల్ 24. 11 వ్యాసాలకు, దాదాపు 27 కధలకు , 12 కవితలకు కొన్ని ఆర్టికల్స్ కు బహుమతులు పొందడం. 25. దూరదర్శన్ హైదరాబాద్ , వరంగల్ సప్తగిరి చానల్స్ ద్వారా ఇంటర్వ్యులు, మనమాట- మన పాట కార్యక్రమం, ఉగాది కవిసమ్మేలనాలలో పాల్గొనడం 26. మహాత్మా జ్యోతీరావ్ ఫూలే సాహిత్య అవార్డ్ 27. క్రియేటివ్ ప్లానెట్ జాతీయ కవితా పురస్కారం 28. .శ్రీరామదాసి సాహిత్యపురస్కారం , ఎడపల్లి, నిజామాబాద్ 29. 405 కధలు వచ్చిన ప్రతిష్టాత్మక నవ్య ఉగాది పోటీలో ‘అనుబంధం’ కధ కు బహుమతి 30.అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ అమెరికా వారు జూన్ 2019 లో నిర్వహించిన కధల పోటీలో ‘తేడా’ కధకు బహుమతి రావడం. 31. గో తెలుగు వెబ్ సైట్ వారు వారు నిర్వహించిన పోటీ లో ‘ప్రేమ నేర్పిన పాఠం ‘ కి జూన్ 2019 లో బహుమతి 32. కెనడా డే 2019లో నిర్వహించిన పోటీలో ‘వాగార్దావివ సంత్రుప్తౌ’ కధ కు బహుమతి 33. తెలుగు కళా సమితి అమెరికా వారు నిర్వహించిన కధల కవితల పోటీలో , ‘చేయనితప్పు’ కధకు, ‘అలుపెరుగని పోరాటం’ కవితకు ప్రధమ బహుమతులు. 34. నిడదల నీహారికా ఫౌండేషన్ నిర్వహించిన పోటీలో 2020 ‘కుజ దోషం’ సంక్రాంతి కదల పోటీలో 20౦౦ నగదు బహుమతి. 35. ప్రతిష్ట్మాత్మక ఈనాడు కధావిజయం పోటీలో వెయ్యి కధల్లో నాకధ ప్రచురణకు సెలక్ట్ కావడం. 36. పుప్పాల ఫౌండేషన్ కధా పురస్కారం ‘వ్యత్యాసం' కధకు 18-1-20లో 37.హాస్యానందం చక్కరకేలీ పోటీలో ‘ఆనందం –ఆరోగ్య రహస్యం’ కధకు 5-1-20 లో బహుమతి ప్రధానం. 38. అంపశయ్య నవీన్ గారి ప్రధమ నవలల పోటీలో నా నవల ‘ఐ లవ్ మై ఇండియా’ కు పదివేల బహుమతి 24-12-19న స్వీకరించడం. 39. ‘తెలుగు పునర్వైభవం ‘ అంశం పై సాహితీ కిరణం నిర్వహించిన కవితల పోటీలో నా కవితకు ఫిబ్రవరి 2020లో బహుమతి రావడం. 40. ‘పొడుస్తున్న పొద్దు’ కధకు మామ్స్ ప్రేస్సో వెబ్ సైట్ లో ఏప్రిల్ 2020లో బహుమతి రావడం 41. రెండు తెలుగు రాష్టాల వారికి పెట్టిన పోటీలో నా కధా సంపుటి ‘స్పందించే హృదయం’ కు ‘సుందరాచారి స్మారక పురస్కారం’ 42. మామ్స్ ప్రేస్సో లో ‘ఇంటింటి రామాయణం’ బ్లాగ్ కి బహుమతి 43. తెలుగు సాహితీ వనం నిర్వహించిన పోటీలో నా కధ ‘తేడా’ కి జూన్ 20 లో బహుమతి 114. ప్రియమైన కధకుల గ్రూప్ లో ‘అనుబంధం’ కధకి జూలై 20 లో తృతీయ బహుమతి


29 views0 comments

Comments


bottom of page