top of page

ఆషాఢం - పార్ట్ 2



'Ashadam - Part 2/4' - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 27/08/2024

'ఆషాఢం - పార్ట్ 2/4'  పెద్ద కథ

రచన: అల్లు సాయిరాం 

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



జరిగిన కథ:

కొత్తగా పెళ్ళైన గాయత్రి ఆషాడం రావడంతో పుట్టింటికి వస్తుంది.

కొద్ది రోజులకే ఆమె భర్త వినయ్ ఏదో నెపంతో అత్తగారింటికి వస్తాడు.



ఇక ఆషాఢం - పెద్ద కథ రెండవ  భాగం వినండి.


 వినయ్ దగ్గరికి నీలిమ వస్తూ "ఏంటి బావగారు! బుల్లెట్ మీద వచ్చారా? లేక మీ మీద బుల్లెట్ మోసుకొచ్చారా? పైనుంచి ఒక ప్యాన్, పక్కనుంచి టేబుల్ ప్యాన్ తిరుగుతున్నా కుడా ఆవిర్లు వచ్చేస్తున్నాయ్ మీకు!" అని అడిగింది. 


"మొదలెట్టింది బాబోయ్!" అని మనసులో అనుకుంటూ, చేతిలో ఉన్న టీ గ్లాసు టేబుల్ పైన పెడుతూ "హఁ పూజలమ్మా! పూజలు. మా పెళ్లికి ముందు, మంచి భర్త రావాలని, పెళ్లి శుభంగా జరిగితే, భర్తతో కలిసి పూజలు చేస్తానని మీ అక్క మొక్కుకుందంట! ఇప్పుడు మీ అక్క అ మొక్కులు తీర్చుకుంటుందంట! మీ అక్క పూజలు పూర్తి చేసి, ఫోన్ చేసినంతవరకు నాకు అక్కడ ఉపవాసమే!" అని అన్నాడు వినయ్. 


"అన్ని పూజలు చేస్తే, మరి మీరు వచ్చారే..! అక్క పూజలు బాగా ఫలించలేదేమో!" అని నీలిమ ఏదో చెప్తుంటే, వినయ్ ఎర్రగా చూస్తే "అదే బావగారు! మా అక్క చేసిన పూజలు ఫలించి, మీలాంటి మంచి భర్త వచ్చారు!" అని సముదాయించింది. 


“నువ్వు అటువంటి పూజలు గురించి మొక్కులు లాంటివి కోరుకోవా!” అని అడిగాడు వినయ్. 


“మనకి అటువంటివి ఏం ఉండవు బావగారు! నన్ను చేసుకోవాలంటే, ఎవరికో గట్టిగా రాసిపెట్టి ఉండాలి!” అని భుజాలు ఎగరేస్తూ అంది నీలిమ. 


“ఆ గట్టిగా రాసిపెట్టి ఉన్నోడు, ఎన్ని మొక్కులు మొక్కుకుంటున్నాడో పాపం!” అని నవ్వుతూ అన్నాడు వినయ్. 


నీలిమ ఎర్రగా చూస్తూ “ఏంటి బావగారు..!” అని అడిగితే “అదేనమ్మ! నీ కోసం రాబోయే కాలంలో కాబోయే మా తమ్ముడు ఎన్ని మొక్కులు మొక్కుకుంటున్నాడో అని అంటున్నాను!” అని నవ్వుతూ అన్నాడు వినయ్.


 "అమ్మా! నీలిమ మా ఆయన బుర్ర తినేస్తుంది!" అని గది తలుపు తీసి వినయ్ ముందుకి గాయత్రి వెళ్తుంటే, రమణమ్మ వెనుక వస్తుంది. 


సంసార సరసాల్ని పూర్తిగా ఆస్వాదించకముందే, ఆషాఢ మాస వియోగం తెచ్చిన విరహ తాపాలు అలుముకున్న యిద్దరి కళ్లలో ఒకరి కోసం ఒకరి ఎదురుచూపులు ఫలించిన క్షణాలవి! బయటికి చూడటానికి వినయ్ ప్రశాంతంగా కనిపిస్తున్నా, లోపల రగులుతున్న విరహాగ్ని జ్వాలల ఆవిర్లతో కూడిన వినయ్ చూపుల ధాటికి, అప్పుడే స్నానం చేసి వచ్చిన గాయత్రికి పట్టిన చెమటలు మటుమాయమైపోయాయి. 


పాలల్లో నుంచి బయటికి వచ్చిందా అన్నంతగా ఉన్న గాయత్రి ముగ్ధరూప సౌందర్యం, ఓర చూపులు వినయ్ ఆవిర్లని శాంతింపచేశాయి. యిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ, మాటలకి మించిన భావాల్ని, మౌనంలో పంచుకుంటున్నారు! 


వారిద్దరిని గమనిస్తున్న రమణమ్మ "గాయత్రి! అక్కడినుంచే నిల్చుని చూస్తున్నావేంటమ్మా! బాబు దగ్గరికి వచ్చి మాట్లాడమ్మా! అల్లుడుగారు ఏదో పని మీద వచ్చారంట! అదేదో ఆఫీసుకి కావాల్సిన వస్తువు నువ్వు బ్యాగులో తెచ్చేశావంట! బ్యాగు సర్దుకునే ముందు చూసుకోవచ్చు కదా! యిప్పుడు చూడు, అదెంత ముఖ్యమైన వస్తువు కాకపోతే, పట్టణం నుంచి మన వూరికి అల్లుడుగారు వస్తారు చెప్పు! తొందరగా ఆ వస్తువు ఏదో వెతికి యిచ్చేయమ్మా! నీ పూజకి కుడా టైం అవుతుంది కదా!" అని వినయ్ తాగిన టీ గ్లాసు తీసుకుని వంటింట్లోకి వెళ్తూ అంది. 


"ఒకవేళ నిజంగానే బ్యాగులో పెన్-డ్రైవ్ మర్చిపోయి, దాని కోసమే వచ్చారా!" అని అన్నట్టుగా గాయత్రి తన గదిలోకి గాభరాగా వచ్చి బ్యాగు తీసింది. 


బ్యాగులో ఉన్న చీరలు, యితర వస్తువులన్ని బయటికి తీసేసి చూసినా, వినయ్ చెప్పిన పెన్-డ్రైవ్ దొరకలేదు. "అసలు ఉంటే కదా దొరకడానికి! ఈ కారణం పెట్టుకుని చక్కగా చూడటానికి వచ్చేశారు!" అని గదిలో నుంచి గాయత్రి బయటికి వచ్చి వినయ్ వైపు చూస్తే, తడబడుతూ ఫోన్ తీసి చూస్తున్నాడు. 

"ఏంటమ్మా! దొరికిందా?" అని వంటింట్లో నుంచి అడిగింది రమణమ్మ. 


వినయ్ వైపు గాయత్రి చిరుకోపంగా చూస్తూ “ఆఁ దొరికారు! దొంగ!” అని మెల్లగా అంది. 


“గాయత్రి! నిన్నే అడుగుతుంది!” అని వంటింట్లో నుంచి రమణమ్మ గట్టిగా అరుస్తూ అడిగితే "ఆఁ దొరకలేదమ్మా!" అని అంది గాయత్రి. 


"సరిపోయింది. ఎక్కడ పారేశావు? యిప్పుడు ఆ వస్తువు లేకుండా అల్లుడుగారికి.." అని రమణమ్మ ఏదో చెప్తుంటే, గాయత్రి మనసులో “అమ్మ ఎందుకు యింత కంగారు అయిపోతుందబ్బా!” అని అనుకుంటూ రమణమ్మ దగ్గరికి వచ్చి "అమ్మ! ఆ విలువైన వస్తువు గురించి మేం మాట్లాడతాం గాని, నువ్వు అనవసరంగా గాభరా పడి బిపి తెచ్చుకోకు! బ్యాగులో నాకు దొరకలేదు. 


యిప్పుడు ఆయన కుడా వచ్చి వెతికితే దొరుకుతుందిలే! అల్లుడుగారి కోసం మినపగారెలు చెయ్యడానికి పప్పు రుబ్బుతున్నావు కదా! వెళ్లి ఆ పని చూడు ముందు! నీలిమని కూడా నీతో తీసుకెళ్లు, లేకపోతే దానికి ఏదోక పని చెప్పు! అది ఖాళీగా ఉంటే, లోడలోడ వాగుతూనే ఉంటుంది!" అని చేతిలో మినపపప్పు గిన్నెతో వచ్చిన రమణమ్మని వంటింట్లోకి పంపిస్తూ, వినయ్ కి రమ్మని సైగ చేసింది గాయత్రి. 


"మేం యిక్కడ ఉంటే, మీకు యిబ్బంది అని చెప్పొచ్చు కదా! మా యిద్దర్ని మినపపప్పు రుబ్బడానికి పంపించేస్తున్నావు!" అని నీలిమ నవ్వుతూ అంది. 


గాయత్రి కోపం వచ్చినట్లుగా రమణమ్మ వైపు ఎర్రగా చూస్తే "నువ్వు యిటు రా నీలిమ! మనం పప్పు రుబ్బుదాం! వాళ్లకి ఆ వస్తువు దొరికితే, ఆఫీసుకి బావ బయలుదేరాలి కదా!" అని నీలిమని తనతో తీసుకెళ్లింది.


 గదిలోకి గాయత్రి వెనుక వినయ్ వచ్చాడు. ప్యాన్ దగ్గర కూర్చుని, తలస్నానం చేసిన జుట్టు ఆరబెట్టుకుంటూ "ఏమండోయ్ శ్రీవారు! ఏదో మర్చిపోయారంట కదా! అదిగో బ్యాగ్! వెతకండి మరి! ఏంటో అంత అవసరమైన వస్తువో నేను చూస్తాను!" అని చిలిపి నవ్వు నవ్వుతూ అంది గాయత్రి.


 కావాలనే గాయత్రి బెట్టుచేస్తుందని చిరుకోపంగా నిల్చుని చూస్తున్నాడు వినయ్. ప్యాన్ గాలికి తనని చూడమన్నట్టుగా ఎగురుతున్న చీర కొంగు చాటు అందాలు, గాయత్రి జుట్టుకురుల నుంచి జాలువారిన నీటి చుక్కలు తన ముఖానికి తగిలి వినయ్ ని నిలబడనివ్వలేదు. అమాంతం వచ్చి గాయత్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు వినయ్. 


ఊహించినదే అయినా ఊహించని విధంగా వినయ్ కౌగిలించుకునేసరికి గాయత్రి మొదట కొంచెం కంగారుపడడంతో, ప్యాన్ పక్కనున్న పళ్లెంలో ఉన్న రకరకాల పళ్లు కిందపడి పెద్ద శబ్దం వచ్చింది. "ఏమైందమ్మా గాయత్రి?" అని బయట మినపపప్పు రుబ్బుతూ అడిగింది రమణమ్మ. 


"మా అమ్మకి అన్నింటికి కంగారే!” అని మెల్లగా అంటూ “ఏంలేదమ్మా! పళ్లెం కిందపడింది!" అని రమణమ్మకి గట్టిగా చెప్పింది. 


“చెప్పానా! నీకు చెప్పానా! అంతా ఆషాఢం వలనే! వీళ్ళు పగలే పళ్ళెంలు పడేస్తున్నారు. మరి రాత్రులు అయితే..!” అని నీలిమ నవ్వుతూ ఏదో చెప్పబోతుండగా “నీకు అర్జంటుగా పెళ్లి చేసేయాలమ్మ! అప్పుడు నీకు అన్ని అర్థమవుతాయి!” అని అంది రమణమ్మ. 


నీలిమ చిన్న వెటకారంగా నవ్వుతూ “నాకు అర్థమవ్వడం పక్కన పెట్టు! నెల రోజుల ముందు పెద్దకూతురికి పెళ్లి చేశారు. ఒక ఎకరాన్నర భూమి ఆర్పేశారు. ఇంతలోనే, నాకు పెళ్లి చేసేస్తునంటున్నావు. ఇంకా ఆర్పేయడానికి ఏం మిగిలాయి! నీ పెళ్లికి మీ పుట్టింటివారు యిచ్చిన పసుపు కుంకుమ భూమి కదా మిగిలింది మనకి. అది కూడా ఆర్పేద్దామని చుస్తున్నావా?” అని సూటిగా అడిగింది. 


గదిలో ఉన్న వినయ్, తన కౌగిలిలో బందీ అయిపోయిన గాయత్రి మౌనంగా దూరం నుంచి రమణమ్మ, నీలిమ లు మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నారు. 


రమణమ్మకి ఒళ్ళు మండి “ఆర్పేస్తామే! పిల్లలకి పెళ్లిళ్లు చేసి, పిల్లాపాపలతో సుఖంగా ఉంటే చూడటానికి, అవసరమైతే మేము ఆరిపోతాం. మేమే కాదు, ప్రతి తల్లిదండ్రులు యిలాగే ఆలోచిస్తారు. మీ భవిష్యత్తు బాగుంటుందంటే, అంత కన్నా కావాల్సింది ఏముంది? కట్నాలు అంత యిచ్చేశాం, ఖర్చులు పెట్టేశాం, అప్పులు అయిపోయాం అనే ఆలోచనలు బుర్రలో నుంచి ఎప్పుడు పోతాయో తెలుసా! 


నా బిడ్డకి చేసిన పెళ్లి సంబంధం సరైనది, దేవుడి దయ వల్ల నా కూతురుకి మంచి భర్త దొరికాడు అని మనసుకి అనిపించినప్పుడు, హమ్మయ్య అని గుండెల మీద చేతులు వేసి ప్రశాంతంగా పడుకున్నప్పుడు అన్ని ఆలోచనలు పోతాయి! మా అల్లుడిని చుశాక మాకు ప్రశాంతంగా అనిపించింది! మీ అక్కకి ఎన్నో సంబంధాలు వచ్చాయి. ఎటువంటి భర్త వస్తాడో, ఎలా చూసుకుంటాడో అని రోజూ దేవుడికి మొక్కుకునేదాన్ని. 


కానీ, మీ అక్క అదృష్టం, తను దేవుడికి చేసిన పూజలు, మొక్కులు ఫలించి మంచి భర్త వచ్చాడు!” అని ముఖంలో ఒక రకమైన తనివి తీరిన నవ్వు నవ్వుతూ చెప్పింది. తన గురించి పొగుడుతూ రమణమ్మ చెప్పిన మాటలు గదిలో నుంచి వింటున్న వినయ్ గాయత్రి ముందు కాలర్ ఎగరేస్తూ నవ్వాడు. 


“సాధించారులే గొప్ప!!” అన్నట్టుగా ముఖం పెట్టి గాయత్రి నవ్వితే, వినయ్ మరింత గట్టిగా గాయత్రిని హత్తుకున్నాడు. నీలిమ సందేహంగా “అక్కకి పెళ్ళయి నెల రోజులు అవుతుంది. అందులో, నువ్వు మీ అల్లుడిని ఎన్నిసార్లు చూసుంటావు? ఇంతలోనే, మా అల్లుడు మంచోడు అని పెద్ద సర్టిఫికెట్ ఎలా యిచ్చేస్తున్నావు నువ్వు?” అని అడిగింది. 


గాయత్రి వినయ్ ని చూసి నవ్వుతూ “మా చెల్లెలు నీలిమ అక్కడ! అది అంత తేలికగా దేనికి ఒప్పుకోదు. నాలాగా..!” అని అంది. 


“మనిషి తాలుకా ఆలోచన, పెద్దవారికి యిచ్చే గౌరవ, మర్యాదలు, యివే చెప్పేస్తాయి మనిషి ఎటువంటివాడో అని..! నాకు నమ్మకం ఉంది. మా అల్లుడు బంగారం! నీకు అటువంటి భర్త రావాలంటే, నువ్వు యిప్పుడు నుంచే పూజలు చెయ్యడం మొదలుపెట్టు!” అని గర్వంగా చెప్పింది. 


వినయ్ గాయత్రిని చూసి నవ్వుతూ “మా అత్తయ్య అక్కడ! పిల్లలు.. మీకే యింత ఉంటే, మిమ్ముల్ని కన్నతల్లి, ఆవిడకి ఎంత ఉంటుంది!” అని అన్నాడు. 


“ఎంటో యి అత్త, అల్లుడు అభిమానాలు, నమ్మకాలు! నాకు కూడా అంత నమ్మకం లేదు!” అని నవ్వుతూ అంది గాయత్రి. 


వినయ్ చిరుకోపం నటిస్తూ “నీకు నా మీద నమ్మకం లేదా?” అని గట్టిగా పట్టుకుని దగ్గరగా లాగాడు. 


"అయ్యో రామా! వదలండీ! పూజలు చేయాలి! ఉండండి బాబు! అబ్బా! వదలరే!" అని మెల్లగా అంటూ వినయ్ కౌగిలిలో నుంచి తప్పించుకోవడానికి గాయత్రి ప్రయత్నిస్తుంటే, వినయ్ మరింత గట్టిగా గాయత్రిని హత్తుకునేసరికి, గాయత్రికి కుడా మైమరిచిపోయి వినయ్ కౌగిలిలో బందీగా ఉండిపోవాలనిపించింది. 


కానీ, మనసు కోరికలని అదుపు చేసుకుని “ఏమండీ! వదలండి! మీరు యిప్పుడు నన్ను వదలకపోతే, నేను మళ్లీ స్నానం చేయాల్సి ఉంటుంది! అలా ఉంది నా పరిస్ధితి! టైం ఒకసారి చూడండి! ఎనిమిదిన్నర అవుతుంది. ఈపాటికి అన్ని పూజలు అయిపోయేవి! మీరు వచ్చారు. మొత్తం పనులు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి!” అని వినయ్ ని చూస్తుంటే, యిప్పట్లో వదిలేలా లేడని, బలవంతంగా వినయ్ నుంచి తప్పించుకుని పూజ చెయ్యడానికి దేవుడుగది వైపు గాయత్రి పరుగెత్తుతుంటే, నవ్వుతూ చూస్తున్నాడు వినయ్.


=================================================================================

                                                       ఇంకా వుంది..


     ఆషాఢం - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. =================================================================================


 అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


74 views0 comments

Comments


bottom of page