top of page

అలంభూష్ణువు


'Alambhushnuvu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'అలంభూష్ణువు' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


శతానంద్, గోమిని ల సంతానము నలుగురు. మొదట కూతురు రాగిణి. తరువాత కొడుకులు వరుసగా ఇందుమౌళి, విలాసిమౌళి, సహస్ర మౌళి. అందరిలో దేనికైనా సమర్థుడు సహస్రమౌళి.


శతానంద్ వ్యాపారస్తుడు. గోమిని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.


కూతురు పెళ్ళి నిధినాథ్ తో చేసి అత్తవారింటికి పంపుతారు. కొడుకులు ముగ్గురు ఇంక చదువు లు నేర్చుటలోనే ఉన్నారు.


నిధినాథ్ పేరుకు దగ్గట్టు ధవంతుడైనా గుణవంతుడుకాక పెళ్ళయిన కొద్ది కాలానికే భార్య రాగిణిని తల్లిగారింటినుండి డబ్బులు తెమ్మని వేధించ సాగాడు. అతని దగ్గర లేక కాదు అత్తవారు సరిగా వరదక్షిణ ఈయక కాదు. అదొక చిత్త చాంచల్యము. రాగిణి ఇటు తలిదండ్రుల అడుగలేక అటు మగనికి సర్ది చెప్పలేక సతమత మౌతుంటది. నిధినాథ్ ఒక నాడు రాగిణి పై చేయి చేసుకోవడము కూడా జరిగింది.


శతానంద్ గోమినిలకు ఈ విషయము తెలిసి చాలా బాధపడుచుంటారు. అల్లుడు నిధినాథ్ ఎంత సొమ్ము కోరుచున్నడో ఇవ్వడానికి సిద్ధపడుతాడు శతానంద్.


పెద్ద కొడుకులిద్దరు ఇందుమౌళి, విలాసిమౌళి- “సరె, మీ ఇష్టము” అంటారు.


చిన్నవాడు సహస్రమౌళి మాత్రము తండ్రిని వారించుచు “రుచిమరిగిన పులిలా సదా అక్కను ఇలాగే వేధించుచుంటాడు. ఇప్పుడే అతని నోరు మూయించే ప్రయత్నము చేయాలి” అంటాడు.


“నాయనా అదేదో నీవే చూడు. చిన్నప్పటినుండి నీవు సమర్థుడవే” అంటాడు శతానంద్.


“ఏమీ లేదు. ఈ విషయము తెలియనట్టులే నేను అక్క ఇంటికి పోయి వస్తాను. అక్కడ బావగారి ఆలోచన ఏవిధంగా ఉన్నదో కనుక్కుంటాను” అని, తల్లికి చెబుతాడు- అక్కకు బావగారికి ఇష్టమైన పిండి వంటలు చేసి పెట్టమని.


“ఆయన ఇప్పుడే గుర్రుగా ఉన్నడు. మనము చేసినవి తింటాడా” అంటుంది తల్లి గోమిని.


“నువ్వైతె చేసి పెట్టవమ్మా! వాళ్ళకు తినిపించే వస్తాను” అంటాడు సహస్రమౌళి.


“సరె.. నీ ఇష్టము నాయనా. బావను మాత్రము ఇంకా రెచ్చగొ ట్టే ప్రయత్నము చేయకు. అక్క ఆగమౌతుంది” అంటుంది తల్లి గోమిని.


“నాకు తెలుసమ్మా! నేనేమి చిన్నపిల్లవాణ్ణికాను” అని పిండివంటలు తీసుకొని అక్క ఇంటికి పయనమౌతాడు సహస్రమౌళి.


“జాగ్రత్తరో..” అంటారు అన్నలిద్దరు ఇందుమౌళి, విలాసిమౌళి.


అక్క ఇంటికి చేరిన సహస్రమౌళి బావ నిధినాథ్ కు నమస్కరించి, “పిండివంటలు మీకని అమ్మ చేసింది” అని అక్కకు ఇస్తాడు సహస్రమౌళి.


“ఏమోయ్! మీవాళ్ళంతా బాగున్నారా?” అని సహస్రమౌళిని అడుగుతాడు నిధినాథ్.


“మీవాళ్ళు అంటవేమిటి బావా.. ఇప్పుడు నీవు మనవాళ్ళు అనాలెగాని” అంటాడు సహస్రమౌళి.


తాను రాగిణిపై చేయి చేసుకున్నది తెలువనట్టున్నదని అనుకుంటాడు నిధినాథ్. బావమర్ది సహస్రమౌళితో సవ్యంగానే ఉంటాడు నిధినాథ్.


రెండు రోజులు అక్కింటిలోనే ఉంటాడు సహస్రమౌళి.


“మా ఇంటిదగ్గర ఒక సంఘటన జరిగింది బావా” అంటుంటె “ఏమిటది” అని అడుగుతాడు నిధినాథ్.


“కాంతారావు అని ఒక పేదవాడు ఉన్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు..”


వంటింట్లోనుంచే అది వినుకుంటు “ఎవరు కాంతయగారా” అంటుంది రాగిణి తమ్ముడు సహస్రమౌళితొ.


“అదేనక్కా.. ఆయన పెద్దకూతురు పుష్పమాల ఉనంది గదా. మీ పెళ్ళైన వారానికే ఆమె పెళ్ళిగూడా అయింది. కాని దొరికిన అల్లుడు ఒక దౌర్భాగ్యుడు. పెళ్ళయిన మరునాటినుండే ‘వరదక్షిణ సరిపోలేదు, ఇంకా కావాలి, మీ నాన్నను అడుక్కర’మ్మంటూ కొట్టడమూ తిట్టడమూ చేస్తుంటె ‘ఇప్పటికే ఉన్న ఆస్తంతా అమ్మి మా నాన్న నీకే ఇచ్చాడు. ఇంకా తెమ్మంటె వట్టిపోయిన బర్రె దగ్గర పాలు పిండుడే’ అన్నదట పాపము.


దానికి భర్త వీరావేశముతో పుష్పమాలను ఒళ్ళంతా వాచెటట్టు కొట్టాడట, అయినా తల్లిగారింట చెప్పుకోలేదు. అది చూసిన వాళ్ళ ఇంటి పక్కవాళ్ళు, పుష్పమాల భర్తను గొడ్డును బాదినట్టు దేహశుద్ధి చేసి, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామంటె ఈ అమాయకురాలే ఆపిందట. పుష్పమాల భర్తకు మాత్రం జ్వరము పుట్టుక వచ్చి మూడు రోజులు పక్కమించి లేవలేదట.


కొట్టిన వాళ్ళు ఎవ్వరు చెప్పకున్న ఒక అబ్బాయి పోయి జరిగిన సంఘటన పోలీస్ స్టేషన్ లో చెప్పాడట. పోలీస్ వాళ్ళు వచ్చి పుష్పమాల భర్తను స్టేషన్ కు తీసుక పోయి నాలుగు తన్ని కేస్ పెడుతాము అంటే ఇకనుండి జాగ్రత్తగా ఉంటాను అని పదివేలు కట్ణము సమర్పించుకొని వచ్చాడట. ఇప్పటికైతే ఏ లొల్లీ లేదు” అంటాడు సహస్రమౌళి.


ఈ కథ అంతా విని, “నీవు ఇంక రెండు రోజులు ఉండిపోవోయ్ బామ్మర్ది” అంటాడు నిధినాథ్.


“ఒక షర్తు మీదైతె ఉంట బావా” అంటాడు సహస్రమౌళి.


“ఏమిటది?” అంటాడు నిధినాథ్.


“మీరిద్దరు నాతో మా ఇంటికి రావాలె” అంటాడు సహస్రమౌళి.


“రాగిణీ! మీ అమ్మవాళ్ళింటికట పోదామా” అంటడు నిధినాథ్.

సరె అంటుంది రాగిణి.


అనుకున్నట్టే సహస్రమౌళి తోపాటు రాగిణి నిధినాథ్ కూడా వస్తారు. కూతురు అల్లుడు రావడము చూసి శతానంద్ గోమిని చాలా సంతోష పడుతారు.


కూతురు అల్లుడు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు వాళ్ళింటికి. భర్తతో జరిగిన సంఘటన ఏమీ చెప్పలేదు తలిదండ్రులకు. వాళ్ళు అడుగనూ లేదు.


మా అలంభూష్ణువు ఏమి మంత్రమేసి వచ్చిండో ఏమోకాని కొంచెములోనే అక్క ఇబ్బందులు తొలగించి వచ్చినాడు అని సహస్రమౌళిని గూర్చి అనుకుంటారు తలిదండ్రులు శతానంద్, గోమిని.

ఆరు నెలల తరువాత ఇందుమౌళి పెళ్ళి వరూధినితో జరుగుతుంది.


పెళ్ళైన కొద్దిరోజులకే వరూధిని ఏ కారణము చెప్పక తల్లిగారింటికి వెళ్ళి పోతుంది. ఇందుమౌళి కారణము తెలుపని అలక ఎందుకో అని కుమిలి పోతుంటాడు. తల్లి దండ్రీ బాధపడుతుంటారు. అది గ్రహించిన సహస్రమౌళి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సరాసరి వరూధిని తల్లిగారింటికి పోతాడు.


వరూధిని అయిష్టంగానే “ఒక్కడివే వచ్చినవా” అని అడుగుతుంది సహస్ర మౌళిని.


“అవును వదినా! నీకు మన ఇంట్లో ఏమి ఇబ్బంది కలిగినదో తెలుసుకుందాము అని వచ్చినాను. అసలు నీకు ఏర్పడిన అయిష్టతకు కారణమేమి. ఏవైన పొరపాట్లు మన ఇంట్లో ఏ ఒక్కరి వల్ల జరిగినా సరిదిద్దుకోలేనంత కాక పోవచ్చు. దయచేసి మా పట్ల ఏవగింపుకు కారణ మేమిటో నిర్మొహమాటంగా చెప్పు వదినా” అంటాడు సహస్రమౌళి.


“నాకు మీరు కలిగించిన ఇబ్బంది ఏమీ లేదు. కాక పోతె నేను మీ అన్నయ్యతో చెప్పిన వేరే ఇల్లు తీసుకొని మా తల్లిగారి ఇంటి దగ్గర ఉందామని. ఎందుకంటె వయసు మీద పడుతున్న మా అమ్మా నాన్నలకు తోడు ఎవరూ లేరు అంటె మీ అన్నయ్య ససేమిరా అన్నాడు. ఇక చెప్పి లాభము లేదని వచ్చేసిన పెద్ద గొడవ చేయడానికి ఇష్టము లేక” అంటుంది వరూధిని.


“ఓస్.. ఇంతేనా! ఇంత దానికి మనసు నొచ్చుకొని నువ్వు బాధపడడము మమ్ముల బాధ పెట్టడము ఎందుకు. ఈ వారము రోజులలోనే నువ్వు, నేను తిరిగి మీకు అనుకూలమైన ఇల్లు అద్దెకు తీసుకుందాము. నేను అన్న్య్యను ఒప్పిస్త. ఇప్పుడు నువ్వు నా వెంట రా వదినా” అని వరూధినిని ఇంటికి తీసుక వస్తాడు సహస్రమౌళి.


ఇంటికి రాగానే అత్త గోమినికి దండం బెట్టి “నన్ను క్షమించు అత్తయ్య” అంటుంది వరూధిని.


“ఇంత మాత్రానికే క్షమించుడేమిటి వరూధినీ! ఇంకా నీవు చిన్న పిల్లవు. ఈ చాయ తీసుకపోయి మీ అర్రలో ఉన్న ఇందుమౌళికి ఇవ్వు. వాడు నిన్ను ఏమి అనడు. అది నా పెంపకము” అంటుంది గోమిని.


“వాడేమన్నా నాకు జెప్పు. ఈ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది కలుగదు. నీకు వేరే ఉండాలని మనసులో ఉన్నా నిస్సంకోచంగా ఉండవచ్చు. మాకు మీరు సుఖంగ సంతోషంగ ఉండుడే కావాలి” అంటుంది గోమిని.


“నా కోరిక మా మరిది సహస్రమౌళికి తెలియజేశానత్తయ్యా. మీరు కోపగించుకోకండి” అంటుంది వరూధిని.


“అదేమీ లేదమ్మా! మీరు సంతోషంగ ఉంటే చాలు” అంటుంది గోమిని.


మొత్తము మీద వరూధిని తల్లిగారి ఇంటిదగ్గర అద్దె ఇల్లు తీసుకొని వెళ్ళిపోతారు ఇందుమౌళి వరూధిని.


“మా అలంభూష్ణువు {సమర్థుడు} రెండు కాపురాలు చక్క బరిచాడు. భేష్ రా సహస్రమౌళి” అని భుజము తట్టుతాడు తండ్రి శతానంద్.


సమాప్తం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


34 views0 comments
bottom of page