top of page
Original.png

ఆలస్యమౌతున్న వివాహాలు - విపరీత ధోరణులు


ఆలస్యమవుతున్న వివాహాలు, కెరీర్ మరియు వ్యక్తిగత అభిరుచుల మధ్య యువత నిర్ణయాలను ప్రతిబింబించే దృశ్యం

Aalasyamavutunna Vivahalu Vipareetha Dhoranulu - Telugu Social Article | Chilakamarri Satyanarayana

ఆలస్యమౌతున్న వివాహాలు-విపరీత ధోరణులు -  తెలుగు సామాజిక వ్యాసం | చిలకమర్రి సత్యనారాయణ

Published In manatelugukathalu.com On 20/08/2026


నేటి సమాజంలో యువత వివాహాలు ఆలస్యమవడం ఒక ముఖ్యమైన సామాజిక పరిణామంగా మారింది. ఉన్నత విద్య, కెరీర్‌లో స్థిరపడాలనే ఆకాంక్ష, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత అభిరుచులు, కుటుంబ అంచనాలు, జీవిత భాగస్వామి విషయంలో పెరుగుతున్న ప్రమాణాలు వంటి అనేక అంశాలు వివాహ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు పెద్దలు నిర్ణయించే వివాహాలకు ప్రాధాన్యత ఉండగా, ఇప్పుడు యువత తమ జీవిత భాగస్వామిని తామే ఎంచుకోవాలనే ఆలోచన పెరిగింది. ఈ మార్పులతో పాటు సంబంధాల ఎంపికలో కొత్త సవాళ్లు, విపరీతమైన అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. ఆలస్యమవుతున్న వివాహాల కారణాలు, దాని వెనుక ఉన్న సామాజిక ధోరణులు, తల్లిదండ్రులు మరియు యువత బాధ్యతలు, విజయవంతమైన దాంపత్యానికి అవసరమైన పరస్పర అవగాహన వంటి అంశాలను చిలకమర్రి సత్యనారాయణ ఈ వ్యాసంలో విశ్లేషించారు.


స్త్రీ పురుషులకు యుక్తవయసులో వివాహాలు ఎందుకు జరగడం లేదు? ఈ ప్రశ్న మరెన్నో ప్రశ్నలకు దారి తీస్తోంది. చాలామంది అంగీకరించే విషయం ఏమిటంటే 1990 వరకు పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకోవడానికే పిల్లలు ఇష్టపడేవారు. అప్పట్లో ప్రేమవివాహాల పట్ల సమాజంలో చిన్నచూపు, పిల్లలకు ధైర్యం లేకపోవడం... పెద్దలు నిర్ణయించే సంబంధాలే చేసుకోవడానికి మొగ్గు చూపేలా చేసేవి. అయితే ఇటువంటి దాంపత్యాలు సరిగా నడవకపోయినా ధైర్యం చేసి బంధాన్ని తెంచుకోవడానికి ఎవరూ ఇష్టపడేవారు కారు. అందువల్ల విడాకుల ప్రస్తావన వచ్చేది కాదు.


దానికితోడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న ఆ రోజుల్లో పెద్దల పట్ల భయం, గౌరవం ఉండేవి. పిన్నవయసులో వివాహం కావడంతో సొంత వ్యక్తిత్వం ఏర్పడే సమయానికే పిల్లలు పుట్టడం వల్ల భార్యాభర్తలు కలిసి ఉండడమే శ్రేయస్కరమని భావించేవారు. కాలక్రమేణా ఉద్యోగరీత్యా ప్రాంతాలు, రాష్ట్రాలు వదిలి రావడం... స్త్రీలలో బాగా చదువుకోవాలనే ఆకాంక్ష పెరగడం... అలాగే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఉన్నత చదువులు చదివించాలనే ఆలోచన తల్లిదండ్రులలో మార్పుకి దారి తీసింది. మైనారిటీ తీరిన తర్వాతే పెళ్ళిళ్ళు చేయాలనే ప్రభుత్వ నిబంధనలు వివాహాలు క్రమేణా కనీసం ఇరవై దాటాకే చేయడానికి దోహదం చేశాయి.

చాలామంది తల్లిదండ్రుల్లో కుమార్తెల అభీష్టం ప్రకారమే ఆమెకు నచ్చిన భర్తని తేవాలనే ఆలోచన మొదలయింది.


ఎప్పుడైతే ఉన్నత చదువులు చదువుకోవడం, ఉపాధి అవకాశాలు ఏర్పడడం జరిగాయో... స్త్రీలు కూడా తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టం చూపడం మానేశారు. చదువు పూర్తయ్యాక, ఉద్యోగంలో స్థిరపడితేనే చేసుకుంటామనే యువతుల సంఖ్య క్రమేణా పెరగసాగింది. తల్లిదండ్రులు కూడా కూతుళ్ల కోరిక మేరకు ఒత్తిడి చేయడం మానేశారు. దీనివలన క్రమంగా అమ్మాయిలకి సంబంధాలు వెదకడం ఇరవై మూడు, ఇరవై ఐదు దాటితే గానీ ప్రారంభం కావడం లేదు. దీని ప్రభావం అబ్బాయిల మీద కూడా పడింది. వాళ్ళకి సయితం ఇరవై ఏడు, ముప్పై వస్తే గానీ సంబంధాలు దొరకని స్థితి ఏర్పడింది.


పెళ్ళి చేసుకోవాలి అనే కోరిక కన్నా "కెరీర్" పరంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తద్వారా మంచి ఆదాయం సంపాదించాలనే కోరిక పెరిగిపోయింది. అయితే ప్రస్తుత వ్యవస్థలో వృత్తిలో స్థిరపడటం అనేది చాలా క్లిష్ట సమస్య. ప్రైవేటు రంగంలో మాత్రమే 99 శాతం ఉద్యోగాలు లభించడం వల్ల ఈ స్థిరపడటం అనేది ఎన్నేళ్ళకి సాధ్యమో తెలియదు. ఇంతకుముందు మంచి ఉద్యోగం, మంచి కుటుంబం ఉన్న అబ్బాయిలకు వివాహాలు సులభంగా జరిగేవి. ఇప్పుడు ఉద్యోగంతో పాటు కారు, ఫ్లాటు, బ్యాంక్ బ్యాలెన్స్, అత్తమామల పోరు లేకుండా ఉండడం... ఇలా ఎన్నో కారణాలకు అమ్మాయిలు ప్రాధాన్యత ఇస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే అమ్మాయిల తల్లిదండ్రులు కూడా దీనికి వత్తాసు పలకడం.


అనేక వివాహ వేదికలు గమనిస్తే అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు విధించే షరతులు రకరకాలుగా ఉంటున్నాయి. ఉదాహరణకి అమ్మాయిల వైపు నుంచి చూద్దాము:

  1. చెడు అలవాట్లు ఉండరాదు. పూర్తి శాఖాహారిగా ఉండాలి.

  2. వ్యక్తిగతంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. పారదర్శకమైన అలవాట్లు ఉండాలి.

  3. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటూ, తన విలువలను పరిరక్షిస్తూ జీవితాంతం సహకరించాలి.

  4. మంచి కుటుంబానికి చెందిన వ్యక్తి కావాలి.

  5. మంచి వర్చస్సు కలిగి, స్థిరమైన ఆదాయం కలిగి ఉండాలి.

  6. వీలున్నంతవరకు హైదరాబాదు గానీ, బెంగళూరు గానీ లేదా చెన్నై గానీ అయితే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

    ఈ షరతులు మచ్చుకి మాత్రమే...

అబ్బాయిలు కోరుకునే అమ్మాయిలు:

  1. సాత్విక స్వభావం కలిగి ఉండాలి.

  2. మంచి విలువలు కలిగి సాంప్రదాయాలు పాటించాలి.

  3. మంచి లక్షణాలు కలది కావాలి.

  4. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి.

    ఇక పైకి చెప్పని కారణాలు... చూడగానే నచ్చాలి, చురుకుగా ఉండాలి, ఆర్థికంగా తనకు తోడ్పడాలి... ఇలాంటివే!

తల్లిదండ్రులు తమ తమ కుమార్తెలకు ఇరవై ఐదు దాటకుండా, అబ్బాయిలకు ముప్పై దాటకుండా చెయ్యాలని తాపత్రయ పడతారు. కానీ పిల్లలను ఒప్పించడం చాలా కష్టమైపోతోంది. దానికితోడు కొందరు తల్లిదండ్రులు చాదస్తంగా తమ అభిప్రాయాలను కూడా పిల్లలకు ఆపాదించి పెళ్ళిళ్ళు జాప్యమవడానికి కారకులవుతున్నారు. ఉదాహరణకు శాఖా పట్టింపు, ప్రాంతీయత వంటివి.


దీనితో కోకొల్లలుగా వెలిసిన వివాహ వేదికలు ఇటువంటి సమస్యలకు తామే పరిష్కారం చూపగలమని ముందుకొస్తున్నాయి. ఈ వివాహ వేదికలు కులాల పరంగా, భాషా పరంగా, ప్రాంతీయ పరంగా సంబంధాలు చూపుతామని ప్రచారం చేస్తూ వ్యాపారం చేస్తున్నాయి. వీటి ద్వారా వివాహాలు వెంటనే అవుతాయని అనుకోవటం భ్రమ.

ఏ వివాహానికైనా యువతీ యువకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం ముఖ్యం. ముక్కు మొహం తెలియని వ్యక్తుల మధ్య స్నేహం ఏర్పడకుండా ఏ పెళ్ళీ జరగదు. అలా ఒకరికొకరు తెలుసుకోకుండా పెళ్ళికి ఒప్పుకోవడం చివరికి విడాకులకే దారి తీస్తుంది.


ఇటీవలి కాలంలో మరొక మార్పు చోటు చేసుకుంటోంది... అదే పెళ్ళికి ముందే యువతీ యువకుల మధ్య శారీరిక సంబంధాలు ఏర్పడడం. దీనివలన సహజంగా స్త్రీ పురుషుల మధ్య దాంపత్య జీవితంలో ఉండే మధురిమ తాలూకు సుఖం గురించి ఆసక్తి లేకపోవడం. ఇందువలన కూడా యువతీ యువకులు వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు.


మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? యువతీ యువకులలో తొందరపాటుతనం ఉండకూడదు. తగు వయస్సులో పెళ్ళి చేసుకోవడం వలన పొందే ఆనందం ఏమిటో వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా తమ తమ పిల్లల మనస్తత్వాలు, ఇష్టాలు గమనించి ప్రవర్తించాలి. పిల్లలను పెళ్ళికి ప్రోత్సహిస్తూనే వారికి వధువుని గానీ వరుడిని గానీ ఎన్నుకోవడంలో మంచి మిత్రులవలె సహాయం చేయాలి. దీనికి వారిలో ఓర్పు అవసరం. వివాహ వేదికలు మనకు వధువు, వరుడి ఎన్నికలలో తోడ్పడవచ్చు. కానీ అమ్మాయి గానీ, అబ్బాయి గానీ వాళ్ళ కుటుంబాల గురించి గానీ పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే పెళ్ళిళ్ళు విజయవంతం అవుతాయి.


చిలకమర్రి సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

చిలకమర్రి సత్యనారాయణ

రచయిత పరిచయం: చిలకమర్రి సత్యనారాయణ

తెలుగు భాష అంటె ఎంతొ మక్కువ..ఆదిలొ నాకవితలు వ్యాసాలు అంధ్రజ్యొతి అంధ్ర పత్రిక ప్రచురించి ఎంతగానొ ప్రొత్సహించాయి. ఉద్యొగరీత్య సిండికేటుబ్యాంక్ లో అధికారిగ పదవి, అనెక ప్రదేశాలను వ్యక్తులను పరిచయంచెసింది. ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో ఉంటూ భిన్న సమస్యలతొ సతమతమయ్యె వ్యక్తులకు  సహయం చెయ్యాలని ఆకాంక్ష.

వర్తమానంలో జరిగే సంఘటనలకు స్పందించడం అలవాటు.చాలా సందేహాలకు భగవద్గీత సమాధానమని నా  నమ్మకం.

చిన్నారి మనవడు అరుష్ తొ కాలక్షేపం. కుటుంబం ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతాను.

తిరిగి నేను రచయితగా మారడానికి అన్నయ్య కృష్ణమాచార్యులు ప్రొత్సహం అయితె తెలుగుకథలు మాధ్యమం  కావడం  నా అదృష్టం.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page