అల్లరి కన్నయ్య
- T. V. L. Gayathri
- May 20
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #అల్లరికన్నయ్య, #బాల్యపుపరిమళం

గాయత్రి గారి కవితలు పార్ట్ 21
Allari Kannaiah - Gayathri Gari Kavithalu Part 21 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 20/05/2025
అల్లరి కన్నయ్య - గాయత్రి గారి కవితలు పార్ట్ 21 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
అల్లరి కన్నయ్య
(కవిత )
**********************************
మెరుపులతో మబ్బులు వచ్చాయి
ఉరుములతో జడిపించి వేశాయి
రివ్వుమంటు వీచాయి సమీరాలు
జివ్వుమని వణికాయి పాదపాలు
ఊగిపోతున్నాయా వృక్ష శాఖలు
తూగుతున్నాయా తోట విరులు
చిరుచిరు జల్లులు కురుస్తున్నాయి
మరుమల్లెల తీగలు పరవశించాయి
రేగడిమన్నులో పరిమళాలెగశాయి
మూగ జీవాలెల్ల మురిసిపోతున్నాయి
గోవులన్నీ పల్లెకు తిరిగి వస్తున్నాయి
దేవళపు గంటలు మోగిపోతున్నాయి
పిల్లలంతా గంతులు వేస్తున్నారు
తల్లులంతా ముద్దుగ చూస్తున్నారు
అప్పుడే వచ్చాడా గోపాలకృష్ణుడు
చప్పుడును చేయక చాటుగా దాగాడు
ముంతలో వెన్నంత ముందుగా దోచాడు
అంతలో నేమైందో నదృశ్యమైనాడు
వెదుకుతూ తిరిగారు వెఱ్ఱి గోపికలు
మదిలోన గాంచుటే మరచిపోయారు
అల్లరి కన్నయ్య ఎవరికైనా చిక్కుతాడా?
చల్లగా నందరిపై కరుణ చిలికిస్తాడా?//
************************************
బాల్యపు పరిమళం
(గేయం)

గణగణ మంటూ వచ్చింది
రణగొణ ధ్వనులే చేసింది
పుల్ల ఐసులను తెచ్చింది
పిల్లలను మురిపించింది
పిల్లలు పరుగున వచ్చారు
చల్లని ఐసులు తిన్నారు
రంగుంగుల ఐసు పుల్లలు
ఛంగున దూకె చిన్న పిల్లలు
వాడవాడలో తిరిగే బండి
చూడండి మన ఐసుబండి
నవ్వు ముఖాలతో పసివారు
దివ్వెల వెలుగుతో నిలిచారు
చిన్ననాటిదీ చిలిపి జ్ఞాపకం
ఎన్నాళ్ళయినా విస్మరించం
బడిలో నేర్పిన పాఠాలనేకం
తడి యారనిదా మమకారం
మదిలో ఉన్నది భోషాణం
ఎదలో గురుతుల బంగారం
విప్పిచూస్తే వింతగు బాల్యం
గుప్పుమంటుందా పరిమళం
మన తరానికది యమృతం
మన పిల్లలకు తెలియదీ స్వర్గం//
*******************************

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
అల్లరి కన్నయ్య కవిత చాలా చాలా బాగుంది , శుభాకాంక్షలు
కన్నయ్య మనిషిని పట్టుకుంటే దొరకడు, మనసుతో పట్టుకుంటే దొరుకుతాడు...