అమెరికా అల్లుడు
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Jul 31
- 7 min read
#AmericaAlludu, #అమెరికాఅల్లుడు, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

America Alludu - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 31/07/2025
అమెరికా అల్లుడు - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
అమెరికా రిటన్ కెమికల్ ఇంజనీరి సరాగాల సాంబశివ, తన తల్లిమాట ప్రకారంగా ఆ వూరికి కార్లో వచ్చాడు. కారు దిగాడు. ఎదురుగా వచ్చిన నలభై ఏళ్ళ వ్యక్తిని తన మేనమామ సలహాల సాంబయ్యగారి ఇల్లు ఏదని అడిగాడు. ఆ వ్యక్తి పేరు కోతుల కోటయ్య. వారు ;రైటు..... లెఫ్ట్, రైట్, లెఫ్ట్, వీధి రైటు సైడు పదకొండో నెంబర్ అన్నాడు. సరాగాల సాంబశివరావు కార్లో కూర్చున్నాడు.
"ముందుకు పోనీ జిన్నా!..." అన్నాడు.
డ్రైవర్ కారును కదిలించాడు.
దార్లో మరో ఇద్దరిని అడిగి ఎట్టాగైతేనేం, ఎస్.ఎస్.శివ తన మామ సలహాల సాంబయ్య ఇంటికి చేరుకొన్నాడు.
వాకిట వరండాలో వున్న మేనమాన సాంబయ్యగారు అల్లుడిని గుర్తుపట్టలేకపోయాడు.
"ఎవరండీ మీరూ!..." ఆశ్చర్యంతో అడిగాడు.
"మీరు సాంబయ్య అదే సలహాల సాంబయ్యగారేగా!...." అడిగాడు శివ.
"అవును" ఎస్.ఎస్. శివను పరిశీలనగా చూస్తూ అన్నాడు సాంబయ్య.
"మైడియర్ మామ్స్!... నేను మీ అక్క... పార్వతమ్మ కొడుకును అమెరికా రిటన్!..." నవ్వుతూ చెప్పాడు సరాగాల సాంబశివ.
"ఒరేయ్!... సరాగాలా సాంబశివా!... నీవా?... ఎంతగా మారిపోయావురా!... చూచి పదిసంవత్సరాలు. ఎంతగా మారిపోయావురా!..." ఆనందాశ్చర్యాలతో నవ్వాడు సలహాల సాంబయ్య.
"ఓసేయ్!.... వనజాక్షి!.... రారా!.... ఎవరు వచ్చారో చూడవే!...." కాస్త హెచ్చుస్థాయిలో అరిచాడు.
వంటింట్లో మినపప్పు రుబ్బుతున్న వనజాక్షి భర్తగారి అరుపు విని చేతులు కడుక్కొని వరండాలోకి పరుగెత్తింది.
ఆరు అడుగుల అందగాడు అమెరికా రిటన్ సరాగాల సాంబశివను చూచింది.
"ఏమండీ!... ఎవరీ మహావీరుడు?" ఆశ్చర్యంతో అడిగింది.
"మదీయ్య అక్క పార్వతమ్మ కుమారుడే. పేరు సరాగాల శివ! అమెరికా నుంచి వచ్చాడు!..."
"అట్టాగా!..."
"అవును!..."
"ఈ అబ్బాయి వస్తున్నట్లు నాతో మీరు ఒక్కముక్క కూడా చెప్పలేదే!...."
"ఓసి ఓసి నా సంబరాల సావిత్రీ!... వాడు వస్తున్నట్లు నాకే తెలియదే!...."
"మాంజీ!... వీరు మా అత్తగారు కదూ!..."
"అవును అల్లుడు. నీకు అత్తయ్య!... నాకు అర్థాంగి!... ఈ వూరి సర్పంచి, ఓల్డు బి.య్యే!...."
"అబ్బాయ్!... మీ అమ్మగారు అదే మా వదినగారు ఎలా వున్నారు?"అడిగింది సావిత్రి.
"అమ్మ... మా అమ్మ!... బ్రహ్మాండంగా వుంది అత్తయ్యా!...”
“ఇంతకీ అమెరికా నుండి ఎందుకొచ్చినట్టు?... ఆ ట్రంప్ గాడూ తరిమేశాడా!..."
"అత్తా!..."
"ఏం బాబూ!..."
"మీకు ట్రంప్ తెలుసా!..."
"తెలవకపోవడం ఏమిటి?... ఆడు రెండవసారి అధ్యక్షుడైనాడుగా!" సగర్వంగా నవ్వింది సావిత్రి.
"మామా!..."
"ఏం అల్లుడూ!...."
"నేను స్నానం చేయవలె!...."
"అట్టాగా!..."
"అవును మామ్స్!...."
"వేడినీరా చన్నీరా!..."
"ఇది ఎండాకాలము కదా!... చన్నీరు మహా శ్రేష్టం కదా మామా!...."
"ఆ.... అవునవును పద ఇంట్లోకి. డ్రస్సు మార్చుకో. మన ఇంటి వెనకనే పంట కాలువ వుంది. హాయిగా ఓ అరగంటసేపు చల్లని నీట మునిగి వద్దాం పద" అన్నాడు.
కారు డ్రైవర్ జిన్నా ఎస్.ఎస్. శివాను సమీపించాడు.
"ఏం జిన్నా!..." అడిగాడు శివ.
"సారూ!... నేనూ సానం చేస్తనండే!...."
"ఆఁ.... రడీగా వెళదాం" శివా జవాబు.
ఇంతలో సలహాల పెద్ద సాంబయ్య గారు, ఇరువురు మనుషులతో సలహాల చిన్న సాంబయ్య ఇంటి ముందుకు వచ్చాడు.
"ఓరేయ్ చిన సాంబయ్యా!..." బిగ్గరగా అరిచాడు.
ఇంట్లోకి పోబోయిన చినసాంబయ్య వెనక్కు వీధివైపుకు చూచాడు.
ఆగ్రహావేశాలతో వీధి వాకిట్లో వున్న తన అన్న పెద సాంబయ్యను చూచాడు. బెదిరిపోయాడు చిన్న సాంబయ్య.....
"మామా!.... వారెవరు?" అడిగాడు శివ.
"మా అన్న పెద్ద సాంబయ్య....!"
"ఎందుకు వారు అంత పెద్దగా అరిచారు?"
పెద సాంబయ్య ఇరువురు మనుషులు చిన సాంబయ్య ఇంటి వరండాను సమీపించారు.
"ఏరా!... నా అల్లుణ్ణి నీవు బుట్టలో ఏసుకోవాలనుకొన్నావా?" ఆవేశంగా అడిగాడు పెద సాంబయ్య.
వారి ప్రక్కన వున్న ఇరువురిలో సరాగాల సాంబశివకు చిన్న సాంబయ్య ఇల్లు చూపించిన కోతుల కొండయ్య ఒకడు.
"సార్!..." శివాను సమీపించి మెల్లగా పిలిచాడు కోతుల కొండయ్య.
ఎస్.ఎస్. శివ ఆశ్చర్యంతో అతని ముఖంలోకి చూచాడు.
"సార్!... నా వల్ల పొరపాటైనాది. నేను మీకు ఆ పెద్ద సాంబయ్య ఇల్లు సూపించాల్సింది, ఈ చిన సాంబయ్య ఇల్లు చూపించినా!" విచారంగా చెప్పాడు కోతుల కోటయ్య.
"అరే అల్లుడూ, నీవు నాతోరా!... మన ఇంటికి పోదాం!" శివ ఎడమ చేతిని పట్టుకొన్నాడు పెద్ద సాంబయ్య.
దీనంగా ఎస్.ఎస్. శివ చిన సాంబయ్య ముఖంలోకి చూచాడు. బావగారిని చూచిన సావిత్రి ఇంట్లోకి వెళ్ళిపోయింది.
"అల్లుడూ, ఆయన మా అన్న పెద్ద సాంబయ్య. ఆయనకూ ఓ కూతురుంది నాలాగే!.... నీవు ఈడ వుంటే మా మధ్యన గొడవ జరుగుద్ది. కాబట్టి నీవు మా అన్నతో వారి ఇంటికి ఎల్లు!..." మెల్లగా చెప్పాడు చిన్న సాంబయ్య.
శివా... పరిస్థితి అయోమయం అయిపోయింది. ’ఇరువురికీ ఒకే పేరా!... అమ్మ నాతో వీరు ఇరువురు అన్నతమ్ములని నాతో చెప్పలేదే!... ఇప్పుడూ నేను ఏం చేయాలి? ఈ పెద్దమామ చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. చినమామ పొమ్మంటున్నాడు. పెద్దమామతో పోక తప్పదు!... ’ అనుకొన్నాడు శివ.
పెద్ద సాంబయ్య వేగంగా నడుస్తూ శివా చేతిని పట్టుకొని వీధిలో ప్రవేశించాడు. అతనితో వచ్చినవారు పెద్ద సాంబయ్యను అనుసరించారు.
జిన్నా కార్లో కూర్చొని మెల్లగా వారి వెనకాలే నడిపాడు.
పది నిముషాల్లో పెద్ద సాంబయ్య ఇంటికి, ఆయన వారి ఇరువురు అనుచరులు... శివ చేరారు.
"అల్లుడూ!... భయపడకు. ఇది నీ ఇల్లే అనుకో. రేయ్ కోటిగా! అల్లుడోచ్చిండూ. స్నానానికి ఏర్పాటు సెయ్యి!" రంకేలేశాడు పెద్ద సాంబయ్య.
"మామా!...."
"ఏం అల్లుడూ!...."
"నేను కాలవలో చన్నీటి స్నానం చేసొస్తా!.. నాతో కోతుల కొండయ్యను పంపండి" మెల్లగా చెప్పాడు శివ.
"సరే అట్లాగే.... రేయ్ కొండా!... అల్లుడితో కాలవకాడికి ఎల్లు..."
"అట్టాగే మామా!..." కోతుల కొండయ్య జవాబు.
ఆనందంగా శివ, జిన్నా, కొండయ్యలు కాలువవైపుకు స్నానానికి బయలుదేరారు.
*
ఎస్.ఎస్. శివాకు మనస్సు నిండా భయం ఏర్పడింది. వారి తల్లి..... "నాన్నా!... శివా!.... నీవు ఆ గ్రామానికి వెళ్ళి నీకు వరసైన నీ మామ సాంబయ్య కూతురు చూచి, తిరిగి వచ్చేయ్. ఆ పిల్ల నీకు నచ్చితే, నా తమ్ముడిని పిలిపించి ఆ పిల్లతో పెండ్లి జరిపిస్తాను" అని చెప్పింది.
ఇక్కడ పరిస్థితి... ఇద్దరు మామలు. అమ్మ మామలు ఇద్దరున్నారని చెప్పలేదే!... కానీ నేను ఇంతవరకూ ఏ పిల్లనూ చూడలేదు సరికదా ఇరువురి మనుషుల మధ్యన ఇరుక్కుపోయాను. ఒకరు చిన్న సాంబయ్య... మరొకరు పెద్ద సాంబయ్య. చిన సాంబయ్యను తొలుత కలిశాను. మనిషి పిచ్చోడిలా ఎప్పుడూ నవ్వుతూ వుంటాడు. రెండవ మామ పెద్ద సాంబయ్య.
రావణాసురుడిలా పరమ కోపిష్టిలా వున్నాడు.
దార్లో నాకు తారసపడ్డ కోతుల కొండయ్య కూడా నన్ను పిచ్చోడికి, పెద్ద రావణుడికి మధ్య ఇరికించేశారు. ముందు నేను ఇరువురూ అమ్మాయిలను చూడాలి. పలకరించాలి. వారి స్వభావాన్ని తెలిసికోవాలి. ఇద్దరు మామలను నొప్పించకుండా ఈ వూరు నుండి బయటపడాలి. తేడా ఏదైనా జరిగితే పెద్ద మామ నన్ను అబ్బో ఏం చేస్తాడో”
‘ఏమో!.. ఓరే శివా!... నీవు ఎలికల బోన్లో పడ్డవురా!... నీ చదువు, అమెరికా ఉద్యోగం, నీ సంపాదన అవేవీ ఇప్పుడు నిన్ను కాపాడలేవు. జాగ్రత్తగా ఆలోచించు, ప్రతి అడుగూ చూచి ముందుకు వెయ్యాలి!...’ అనుకొంటూ ఆకాశాన్ని చూస్తూ, కాలువ గట్టు మీద నడుస్తున్న ట్రిబుల్ ఎస్ గట్టు మీద వున్న బురదలో కాలేశాడు. జారి కాలువలో పడ్డాడు. నీళ్ళల్లో మునిగాడు.
ప్రక్కనే వున్న డ్రైవర్, కోతుల కొండయ్య ఫక్కున నవ్వారు. కానీ... అవతలవైపు కాలువ కట్టమీద వారివైపుకు నడిచివస్తున్న చిన్న సాంబయ్య కూతురు ’బంతి’ ఛెంగున కాలువలో దూకి ట్రిబుల్ ఎస్ జుట్టు పట్టుకొని పైకి లేపింది.
ట్రిబిల్ ఎస్‍కు ఈత రాదు. పైగా జారి పడటంతో కాలిపాదం బెణికింది. వాపు వచ్చింది. డ్రైవర్ జిన్నా కాలవలో దిగి యజమానికి చేతికి అందించాడు. కోతుల కొండయ్య కూడా నవ్వును ఆపుకొని నీళ్ళల్లో దిగి, ట్రిబుల్ ఎస్‍ను ఒడ్డుకు చేర్చాడు.
ట్రిబుల్ ఎస్ పాదం బెణికిన కారణంగా, లేచి నిలబడలేకపోయాడు. తన్ను కాపాడిన బంతిని చూచి ట్రిబుల్ ఎస్ "థాంక్యూ!..." బాధపడుతూనే అన్నాడు ఆ మాట.
"అమెరికా బాబూ!... ఈమె ఎవరో కాదు. మీ చిన మామయ్య కూతురు. వ్యవసాయం చదువు చదివింది" చెప్పాడు కోతుల కొండయ్య.
బంతి ట్రిబుల్ ఎస్‍ను చూచి.....
"కాలు నొప్పిగా వుందా!" అడిగింది బంతి.
ట్రిబుల్ ఎస్ అవునన్నట్లు తలాడించాడు.
డ్రైవర్ జిన్నా, కోతుల కొండయ్య సాయంతో వారి భుజాలపైన తన చేతులను వేసి, మెల్లగా ముందుకు కదలసాగాడు ట్రిబుల్ ఎస్.
"బంతమ్మా!... ఈన ఎవరో కాదు. మీ మేనత్త కొడుకు. మిమ్మల్నందరినీ చూడాలనొచ్చిండు" అన్నాడు కోతుల కోటయ్య.
బంతి కొన్ని క్షణాలు ట్రిబుల్ ఎస్ ముఖంలోకి చూచింది. ట్రిబుల్ ఎస్ ఆమెకు నచ్చాడు.
నలుగురూ గ్రామంలో ప్రవేశించారు.
"కొండన్నా!.... బావను మా ఇంటికి తీసుకెళదాం" అంది బంతి.
"ఆఁ.... అమ్మా, వీరిని పెదనాన్న గారింటికి తీసుకెళ్ళాలి!..."
"ఎందుకు?"
"వారు వచ్చింది కాలవ ఒడ్డుకు... ఆడనుంచే!...."
"నేను చెప్పినట్లు చెయ్యి!...." హెచ్చు స్థాయిలో అంది బంతి.
"అలా చేస్తే, మీ పెదనాన్న నన్ను చంపేస్తారు తల్లీ!...." దీనంగా పలికాడు కోతుల కోటయ్య.
"ఒరేయ్!... ముందు నన్ను హాస్పిటల్‍కు తీసుకెళ్ళండిరా!... నా కాలు చాలా నొప్పిగా వుంది!..." దీనంగా పలికాడు ఎస్.ఎస్.ఎస్. (సరాగాల సాంబశివ)
"సరే!... అక్కడికే తీసుకెళ్ళు. బావా జాగ్రత్త!..." బంతి ట్రిబుల్ ఎస్ ముఖంలోకి కొన్ని క్షణాలు చూచి తన ఇంటివైపుకు వేగంగా నడిచింది.
డ్రైవర్ జిన్నా, కోతుల కోటయ్య ట్రిబుల్ ఎస్‍తో పెద్ద సాంబయ్య ఇంటి వీధి వాకిటిని సమీపించారు.
అదే సమయానికి ఆయుర్వేద డాక్టర్ చామంతి, పెద్ద సాంబయ్య కూతురు స్కూటిపై గేటును సమీపించింది.
కుంటుతూ ఇరువురు మనుషుల సాయంతో చాలా కష్టంగా నడుస్తున్న ట్రిబుల్ ఎస్‍ను చూచింది.
"కొటన్నా!... ఎవరాయన? ఏమైంది?" స్కూటిని ఆపి అడిగింది చామంతి.
జరిగిన విషయాన్ని కోతుల కొండయ్య చామంతికి చెప్పాడు. చివరగా.... "చిన్నమ్మా!... వీరు మీ బావగారు. మీ మేనత్తయ్య కొడుకు" నవ్వుతూ చెప్పాడు.
చామంతి రెండు క్షణాలు ట్రిబుల్ ఎస్ ముఖంలోకి, ఆ తర్వాత వాచిన ఎడమ పాదాన్ని కాలును చూచింది.
"నొప్పిగా వుందా!...." అడిగింది చామంతి.
అవును అన్నట్లు తలాడించాడు ట్రిబుల్ ఎస్.
"కొండన్నా!... త్వరగా ఇంట్లోకి తీసుకొని రండి. జాగ్రత్త!...."
స్కూటీని ఇంటి ఆవరణంలో నిలబెట్టి ప్రవేశించింది. స్కూటీకి స్టాండ్ వేసి వరండాలోకి. నిలబెట్టియున్న నవారా మంచాన్ని వాల్చింది. స్కూటర్ శబ్దం విని చామంతి తల్లి బంగారమ్మ వరండాలోకి వచ్చింది.
డ్రైవర్ జిన్నా, కోతుల కొండయ్య, ట్రిబుల్ ఎస్‍ను ఆ వరండాలోకి నవారు మంచం దగ్గరికి చేర్చాడు.
ట్రిబుల్ ఎస్ కాలు పాదం చాలా నొప్పిగా వుంది. మంచంపై వాలిపోయాడు. జిన్నా మెల్లగా ఆ ఎడంకాలును మంచంపై వుంచాడు.
చామంతి మెడిసన్ కిట్‍తో వరండాలోనికి వచ్చింది. వెనకాలే పనిమనిషి మంగ ఒక చెంబు గ్లాసులో నీళ్ళను తీసుకొచ్చింది.
చామంతి మెడిసిన్ కిట్‍లోనుండి రెండు గోలీలు (మాత్రలు) తీసి ట్రిబుల్ ఎస్ చేతికి ఇచ్చి ’నోట్లో వేసుకోండి’ అంది. శివా మాత్రలను నోట్లో వేసుకొన్నాడు. మంగ చేతిలోని గ్లాసు తన చేతికి తీసుకొని శివ నోట్లో నీటిని పోసింది. దెబ్బ తగిలి వాచియున్న ఎడంపాదం కాలును తడిగుడ్డతో తుడిచి, ఆ పాదానికి కాలికి సీసాలోని ద్రవాన్ని దూదితో అద్ది మెల్లగా పాదం క్రింద పైనా పట్టించింది.
"మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది. నిర్భయంగా నిద్రపోండి. ఓ గంట తరువాత లేస్తారు. మీరు బెటర్‍గా ఫీలవుతారు!..." చిరునవ్వుతో చెప్పింది చామంతి.
బయటకు బంధువుల ఇంటికి వెళ్ళిన పెద్ద సాంబయ్య వారి ధర్మపత్ని బంగారమ్మ వచ్చారు.
జరిగిన విషయాన్ని కోతుల కోటయ్య వారికి వివరించాడు. అప్పటికి ట్రిబుల్ ఎస్ నిద్రలో వున్నాడు. ఇరువురూ బాధపడ్డారు. చామంతి తాను ఇచ్చిన ట్రీట్‍మెంటును గురించి చెప్పింది.
"అమ్మా!... వీడు నీ బావ అమ్మా.. నా అక్క కొడుకు" చిరునవ్వుతో చెప్పాడు పెద్ద సాంబయ్య.
"నాన్నా!... కొండన్న చెప్పాడు" చిరునవ్వుతో చెప్పింది చామంతి.
బంతి ఇంటికి వెళ్ళి కాలవగట్టు ట్రిబుల్ ఎస్ గారికి జరిగిన ప్రమాదాన్ని గురించి, అతన్ని తాను రక్షించిన విషయాన్ని తల్లితండ్రికి తెలియజేసింది.
చిన్న సాంబయ్య వారి అర్థాంగి సావిత్రి ఆశ్చర్యపోయింది. అల్లుడికి అలా జరిగినందుకు విచారంతో వెంటనే అతన్ని చూచేటందుకు పెద్ద సాంబయ్య ఇంటికి బయలుదేరారు. తోటే బంతి కూడా బయలుదేరింది.
ట్రిబుల్ ఎస్ గారు మెల్లగా కళ్ళు తెరిచారు. చుట్టూ బిక్క ముఖంతో కలయచూచాడు.
పెద్ద మామ సాంబయ్య, వారి అర్థాంగి బంగారమ్మ, కోతుల కొండయ్య, డ్రైవర్ జిన్నా, తన మరదలు చామంతి అందరూ ఆత్రంగా అతన్నే చూస్తున్నారు.
"ఇప్పుడు ఎలా వుంది బావా!...." అడిగింది చామంతి.
ఆమె నోటినుండి వచ్చిన ’బావా’ అనే పలుకుతో పెద్ద సాంబయ్య అర్థాంగి బంగారమ్మ ముఖాల్లో ఆనందం.
ఆఘమేఘాల మీద చిన్న సాంబయ్య, భార్య సావిత్రి (సర్పంచ్) కూతురు బంతి, పెద్ద సాంబయ్య ఇంటికి చేరారు. వారిని చూడగానే, పెద్ద సాంబయ్య, భార్య బంగారమ్మ ముఖాలు వెలెవెలపోయాయి.
"అల్లుడూ!... ఏమైందయ్యా!....." మంచాన్ని సమీపించి వేదనతో ఆత్రంగా అడిగాడు చిన్న సాంబయ్య.
ఎదురుగా వున్న కోతుల కోటయ్య... "అన్నా!.. అసలు ఏం జరిగినాదంటే!...."
"ఆపు. అంతా నేను చెప్పనా!..." అంది బంతి.
క్షణం తర్వాత...
"చామంతీ!...."
"ఏం అక్కా!..."
"బావకు మంచి మందు ఇచ్చినావా?"
బంతి, చామంతి కన్నా మూడు నెలలు పెద్దది. వారిరువురూ ఒకే స్కూలు, కాలేజీలో కలిసి చదువుకొన్నారు. మంచి స్నేహితులు.
కానీ.... చిన్న సాంబయ్య... పెద్ద సాంబయ్యలకే పంతాలు, పట్టింపులు, గొడవలు గందరగోళాలు.....
"మామా!...." మెల్లగా పిలిచాడు ట్రిబుల్ ఎస్. లేచి మంచంలో కూర్చున్నాడు.
"ఎవరిని అల్లుడూ!.. నన్నా, చిన్నోడినా పిలిచింది?" అడిగాడు పెద్ద సాంబయ్య.
బంతి, చామంతి.... "ఏం కావాలి బావా!...." ఆత్రంగా ఇరువురూ ఒకేసారి అన్నారు.
వారి ఆ పలుకులు విని అందరూ ఆశ్చర్యపోయారు.
"చామంతీ!... బావకు ఏం ఆహారం ఇచ్చావ్?" అడిగింది బంతి.
"ఏమీ ఇవ్వలేదు అక్కా!... నిద్రపోయాడుగా!..." అంది చామంతి.
"పెద్దమ్మా!...."
"ఏమ్మా!....."
"నాతోరా!..." బంతి ఇంట్లోకి నడిచింది. బంగారమ్మ బంతిని అనుసరించింది.
ఐదు నిముషాల్లో పెద్ద గ్లాసు నిండా వేడిపాలను తీసుకొని బంతి వరండాలోకి వచ్చింది. పాల గ్లాసును ట్రిబుల్ ఎస్‍కు అందించింది.
"బావా!.... పాలు త్రాగండి" అంది బంతి.
పాలగ్లాసును అందుకొని బంతి ముఖంలోకి చూచాడు ట్రిబుల్ ఎస్.
"బావా!... ముందు పాలు తాగండి" అంది చామంతి.
ట్రిబుల్ ఎస్ పాలు తాగాడు. చామంతి ఖాళీ గ్లాసును అందుకొని తల్లికి ఇచ్చింది.
"మామయ్యాలు, మీ ఇరువురు కూతుళ్ళూ సూపర్. చాలా గొప్పవారు. మంచితనం, మానవత్వం వున్నవాళ్ళు. నాకు ఇప్పుడు బాగుంది. కాలు నొప్పి కూడా తగ్గింది. వూరికి బయలుదేరుతాను. మా అమ్మ నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది. కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తా. ఈ వూరు మీరు పరిసరాలు నాకు బాగా నచ్చాయి." లేచి నిలబడి చేతులు జోడించాడు నవ్వుతూ ట్రిబుల్ ఎస్.
"అల్లుడూ రెండు రోజులు వుండి విశ్రాంతి తీసుకొని వెళ్ళవచ్చుగా!... ఈ స్థితిలో ప్రయాణం అవసరమా!...." అడిగాడు పెద్ద సాంబయ్య.
"వెళ్ళాలి మామయ్యా అమ్మ కోసం!...." మెల్లగా వరండా మెట్లు దిగి కారును సమీపించాడు ట్రిబుల్ ఎస్.
డ్రైవర్ డోర్ తెరిచాడు.
అందరూ కారు చుట్టూ చేరారు.
అందరి ముఖాలను చూచి....
"వెళ్ళొస్తాను" చెప్పి కార్లో కూర్చున్నాడు ట్రిబుల్ ఎస్.
డ్రైవర్ డోర్ మూసి తన స్థానంలో కూర్చొని కారును స్టార్ట్ చేశాడు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentarios