'Amlet' New Telugu Story
Written By Madduri Bindumadhavi
రచన: మద్దూరి బిందుమాధవి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆ పూట గిరిజ తన షిఫ్ట్ అయ్యాక బట్టలు మార్చుకోవటానికి రూం లోకి వచ్చింది.
బాగా అలసటగా ఉంది. నిన్న రాత్రి నించి ఈ రోజు ఉదయం వరకు తన అసలు డ్యూటీ. ఇవ్వాళ్ళ డబుల్ డ్యూటీ! కానీ అలసటకి కారణం మాత్రం అది కాదు.
మనసంతా ఆందోళనగా ఉంది. మధ్యాహ్నం లంచ్ కూడా తినబుద్ధి కాలేదు.
కడుపులో ఎవరో చెయ్యి పెట్టి తిప్పుతున్న భావన.
ఇన్నాళ్ళ నించి హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నా ఇలాంటి దిగులు ఎప్పుడు కలగలేదు.
ఎవరో తనని పిలుస్తున్నట్టు భావన! అది తన భావనే కానీ నిజం కాదని తెలుసు. అయినా గిరిజ తలతిప్పిచూస్తోంది.
తప్పు చేశావన్నట్టు తనని ప్రశ్నిస్తున్న ఆలాపన!
@@@@
"గిరిజా...ఈ రోజు గైనిక్ వార్డ్ నర్స్ ముఖ్యమైన పని ఉందని వెళ్ళి పోయింది. అక్కడ ఎక్స్ట్రా డ్యూటీ చెయ్యాలి" అన్నది డాక్టర్ సరళ.
"అలాగే మేడం" అన్నది గిరిజ యధాలాపంగా.
లేబర్ రూం లో..గైనిక్ వార్డ్ లో డ్యూటీ కి ప్రత్యేకమైన పరిణతి.. శిక్షణ ఉండాలని డా. సరళ భావన. గిరిజ ఇంకా జూనియర్. అంత అనుభవం లేదు.
జనరల్ వార్డు డ్యూటీ తో పాటు పోస్ట్ ఆపరేషన్ వార్డులో రోగుల టెంపరేచర్ చూడటం..టైం ప్రకారం మందులుఇవ్వటం..డ్రెసింగ్ చెయ్యటం..ఆర్థో వార్డులో రోగులకి ఫిజియో థెరపీ చెయ్యటం... డాక్టర్ రౌండ్స్ కి వచ్చినప్పుడుసహాయకురాలుగా ఉండటం..చిన్న పిల్లల వార్డులో డ్యూటీ..ఇవే ఎక్కువగా గిరిజ దైనిందిన డ్యూటీలు.
నర్స్ వృత్తి అంటే అత్యంత గౌరవం గిరిజకి.
ఎంతో మంది శారీరక బాధలు దగ్గరనించి చూసి..వారి మానసిక సమస్యలు విని..ఊరట కలిగించటం అంటేభగవంతుడి సేవగా భావిస్తుంది.
కుటుంబ సభ్యులకి కూడా చెప్పుకోలేని అనేక సమస్యలని, ఆర్ధిక బాధలని తమ పైన ఎంతో నమ్మకంతో తమ దగ్గరమాట్లాడే రోగులంటే గిరిజకి ఎంతో ప్రేమ.. ఆత్మీయత.
రెండేళ్ళ నించి ఆ హాస్పిటల్లో పని చేస్తూ ఉన్నా..గిరిజకి ఈ రోజే గైనిక్ వార్డు డ్యూటీ పడింది.
@@@@
"గిరిజా.. అలా దిగులుగా కూర్చున్నావ్ ఏం జరిగింది? లంచ్ అయిందా. ఈ రోజు డబల్ డ్యూటీ అనుకుంటా!" అంటూ వచ్చిన తోటి నర్స్ శ్యామల "క్యారేజి లేదుగా... క్యాంటీన్ కి వెళ్ళొద్దాం పద" అంది.
"లేదు శ్యామలక్కా..ఇవ్వాళ్ళ లంచ్ తినాలనిపించట్లేదు. మొదటి సారిగా నా డ్యూటీ అంటే నాకు జుగుప్సగా ఉంది. ఎంతో ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చాను. మనం ఇంత అమానుషంగా ఉంటామా? ఉండాలా? మనకిమనసు..జాలి..ఆలోచన ఉండవా అనిపిస్తోంది" అన్నది గిరిజ.
"ఇంతలో కాలిన గాయంతో ఎడ్మిట్ అయిన పేషెంట్ బాధ తట్టుకోలేక గొడవ చేస్తున్నాడు. గిరిజమ్మా నిన్నురమ్మంటున్నాడు" అని వార్డ్ బాయ్ పిలిస్తే వెళ్ళింది.
@@@@
ఇంటికొచ్చిన గిరిజ ఫ్రెష్ అయి అన్నం తినబుద్ధి కాక.. తల నొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని పడుకుంది.
గిరిజకి 'అమ్మా నేనేం తప్పు చేశాను? మీరయినా చెప్పచ్చు కదా మేడం' అంటూ తనని ప్రశ్నిస్తున్న చిన్న పిల్లమాటలు వినపడి అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. లేచి మంచి నీళ్ళు తాగి 'ఇంత ఘోరం ఇంతకు ముందు నేనెప్పుడు చూడలేదు. దానిలో నాకు కూడాభాగస్వామ్యం ఉండటం నా దురదృష్టం' అనుకుంటూ రూఫ్ కేసి చూస్తూ పడుకుంది. పొద్దున జరిగిన సంఘటనపీడకలలా తన మనసుని పిండేస్తుంటే నిద్రకి దూరమయింది.
మరునాడు వెళ్ళబుద్ధి కాక హాస్పిటల్ కి వెళ్ళలేదు.
@@@@
"గిరిజా మొన్న లేబర్ రూం లో డ్యూటీ అయినప్పటి నించి నువ్వు బాగా డిస్టర్బ్ అయినట్టున్నావ్! హాస్పిటల్లో నర్స్ గాపని చెయ్యదల్చుకున్న వాళ్ళు అంత సున్నితంగా ఉంటే కష్టం" అన్నారు సరళ మేడం.
"ఎంతయినా...అంత చదువుకుని..అంత పెద్ద ఉద్యోగం చేస్తున్న ఆవిడ చెయ్యాల్సిన పనేనా మేడం అది? వద్దనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ విచ్చలవిడి తిరుగెళ్ళుందుకు? ఆనక చెయ్యి దాటింది అనుకుంటేఇప్పటిదాకా ఆగటమెందుకు మేడం? ఆరు నెలలు నిండాక వచ్చి అలా మనని తీసెయ్యమని అడగటం తప్పు. జీవం పోసుకున్న ఆ చిన్న ప్రాణాన్ని అలా నిర్దాక్షిణ్యంగా తీసెయ్యమనే హక్కు ఆవిడకేముందండి? ఆమెకి మాత్రండేంజర్ కాదా? ఆవిడ చేసిన తప్పుకి శిక్ష ఆ చిన్ని ప్రాణికా" అన్నది ఆవేదన..ఆవేశం గొంతులో నింపుకుని గిరిజ.
"మనం చెయ్యమని చెప్పకూడదా మేడం" అన్నది.
"నువ్వు రోజూ ఎన్ని ఎగ్స్ పగలగొట్టి ఆమ్లెట్స్ వేసుకు తింటావ్? ఇదీ అంతే. చిన్నదానివి నీకు అనుభవంతక్కువ. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావ్!" అని కేకలేస్తూ...
"ఇక దాని గురించి చర్చించకండి.లేనిపోని సమస్యలొస్తాయ్" అని డాక్టర్ సరళ వెళ్ళిపోయింది.
"ఆ స్టేజిలో వస్తే మనకీ రిస్కే! కానీ అలాంటప్పుడు వదిలించుకోవటానికి వాళ్ళు ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తారు. వీళ్ళుకేసులవుతాయని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళ లేరు."
"మనకి నిజంగా కొన్ని రకాల ఇతర సేవలు తక్కువ రేట్ లో చెయ్యాలంటే డబ్బు అవసరం! అందుకే ఎక్కువ డబ్బుఎర వేసి మన ప్రైవేట్ హాస్పిటల్స్ కి వస్తారు. మరొక పేదవారికి సహాయం చెయ్యటానికి డబ్బు కోసం మనం గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటివి చెయ్యటానికి సిద్ధపడక తప్పదు. వాళ్ళ అవసరం మనకి అవకాశం. ఇంత కంటేఎక్కువ ఆలోచించద్దు..మాట్లాడద్దు" అన్నది సీనియర్ నర్స్ అనసూయ.
"లక్షల్లో సంపాదిస్తున్న ఈ తరం యువత...'పెళ్ళి ఒక లంపటం...గుదిబండ. హాయిగా డబ్బుసంపాదించుకుంటున్నాం..ఎవడో ఒకడికి వండిపెడుతూ వాడితో పడుకుని..వాడి కోసం పిల్లల్ని కని...వాళ్ళ ముక్కుచీముళ్ళు తుడుస్తూ.... బాబోయ్ ఈ జంఝాటం అంతా ఎవరు పడతారు' అనుకుంటూ ఎంజాయ్ మెంట్ కోసంలివింగ్ టుగెదర్ కి వెళ్ళటం మొదలుపెట్టాక మన బోటి హాస్పిటల్స్ కి ఇలాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయ్! వాళ్ళప్లెజర్ కోసం ఒళ్ళు తెలియకుండా తిరగటం..వాళ్ళ చెయ్యి దాటిపోయాక ఇలాంటి టెర్మినేషన్లకి వెళ్ళటం ఫ్యాషన్అయిపోయింది" అన్నది ఇంకొక సీనియర్ నర్స్ పద్మావతి.
"మేడం ఆమ్లెట్స్ వేసుకోవటం ..ఇదీ ఒకటే అన్నట్టు మాట్లాడుతుందేంటి? ఇదీ అదీ ఒకటి ఎట్లా అవుతుంది? ఆ ఎగ్స్ పొదిగినా పిల్లలు అవ్వవు. అది జీవ హింస కిందికి రాదు. మనం హాస్పిటల్లో చేస్తున్న పని నిస్సందేహంగా హత్యే" అన్నది గిరిజ అక్కడ ఉన్న మిగిలిన నర్సులతో దృఢంగా!
"హుష్ ఊరుకో..ఇంక ఆ విషయం మర్చిపో! ఈ వృత్తిలో కొనసాగ దల్చుకుంటే నువ్వు కొంచెం రాటు తేలాలి. ఇంకఎక్కువ మాట్లాడితే మేడం నిన్ను ఇంటికి పంపెయ్యచ్చు. మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం అని తెలిస్తే ఇంటికిపంపించేస్తారు మేడం. అసలు ఇన్ని మాటలు మాట్లాడే ఫ్రీడం ఆవిడ ఇవ్వరు."
"అయినా పెద్ద వాళ్ళ విషయాలు మనకెందుకు? మనకి అప్పచెప్పిన డ్యూటీ సిన్సియర్ గా చెయ్యటం..ఇచ్చిన జీతంపుచ్చుకోవటం వరకే మన పని. మన దగ్గర జరిగే ఈ విషయాలు బయటికి తెలిస్తే కేసులవుతాయి" అన్నది శ్యామలపెద్దరికంతో.
మిగిలిన నర్సులు కూడా తమ కంటే వయసులో..అనుభవంలో చిన్నదైన గిరిజకి ఆ విషయమే మరొక సారి చెప్పిహెచ్చరించి వెళ్ళారు.
చిన్నప్పటి నించీ ఫ్లారెన్స్ నైటింగేలే తనకి ఆదర్శం అని నమ్మిన గిరిజ నెమ్మదిగా ఆ సంఘటన తీవ్రత నించిబయట పడింది. కానీ ఇలాంటివి చూసీ చూడనట్లు ఉండటం ఇంకా అలవాటు అవలేదు.
ఆర్తులకి సేవ చెయ్యటానికి తనకొచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని డ్యూటీ కి బయలుదేరింది.
***
మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.
సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments