విజయదశమి 2023 కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ
'Amma Aligindi' New Telugu Story
Written By Varanasi Bhanumurthy Rao
'అమ్మ అలిగింది' తెలుగు కథ
రచన: వారణాసి భానుమూర్తి రావు
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రాజ్య లక్ష్మికి రాజారావుతో పెళ్ళి అయి పాతిక సంవత్సరాల అవుతోంది. రాజ్యలక్ష్మి కి బి ఏ డిగ్రీ పూర్తయిన వెంటనే పెళ్ళి అయిపోయింది. రాజారావు అప్పుడు బాంక్ లో ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. రాజ్యలక్ష్మి రాజారావుల వైవాహిక జీవితం అందంగా ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ఈ పాతికేళ్ళు సాగి పోయింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.. చక్కని సంతానం. అబ్బాయికి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు అమ్మాయికి ఇరవై ఏళ్ళు. సి ఏ చేస్తూ వుంది. ఒక పేరు పొందిన చార్టర్డ్ అక్కౌంటంట్ ఆఫీసులో ఆర్టికల్ క్లర్క్ గా పని చేస్తూవుంది. ఇంటిలో ముగ్గురూ బిజీ నే! పొద్దున్నే పది గంటలకు ఇల్లు వదిలితే రాత్రికి ఇల్లు చేరుకొంటారు. ఇక రాజారావయితే బాంక్ లో ఆఫీసు పని ఎక్కువగా వుందని రాత్రి పదయినా ఇల్లు చేరడు. వస్తూనే డిన్నర్ చేసి ముసుగు తన్ని పడుకొంటాడు అలసటతో. ఇక పిల్లలు అంతే! ఏదో మొక్కు బడిగా కొన్ని మెతుకులు తిని ఆ కంచాలన్నీ డైనింగ్ టేబుల్ మీద వదిలేసి ఎవరెవరి రూంలలోకి వెళ్ళి మొబైల్ ఏవో పనికి రాని ప్రోగ్రాం లు చూసుకొంటూ ఉంటారు. ఇంటిలో వీరి అవసరాలు తీర్చడానికి ఒక మర యంత్రంలా ఇరవై నాలుగు గంటలూ అవిశ్రాంతంగా పని చేస్తున్న ఒక ఇల్లాలు, ఒక అమ్మ ఉందనే ధ్యాసే లేదు. కనీసం అమ్మతో కాస్సేపు కూర్చొని మాట్లాడాలనే ఆలోచనే రాదు వారికి. దీనికంతటికీ కారణం తనే! చిన్న పిల్లలు అనీ వారికి ఏ పనీ చెప్పకుండా అన్నీ రాజ్య లక్ష్మే చేసుకొనేది. అది చాలా పెద్ద తప్పు. మగ పిల్ల వాడు, ఆడ పిల్ల అని బేధం లేకుండా ఇంటిలో అన్ని పనులూ నేర్పించాలి. పనిమనిషి మానేస్తే ఇల్లు క్లీన్ చెయ్యడం, గిన్నెలు తోమడం, డస్టింగ్ చెయ్యడం, పాట్స్ లో ఉన్న చెట్లను ట్రిం చేసి నీళ్ళు పొయ్యడం, వాషింగ్ మెషీన్ నుండి డ్రై అయిన బట్టల్ని హాంగింగ్ స్టాండ్ కి ఆర బెట్టడం లాంటి పనులన్నీ ఇంటిలో మగ, ఆడ పిల్ల అనే తేడా లేకుండా నేర్పించాలి. అలాగే మగ పిల్లలకు గూడా వంట పని చెయ్యడం నేర్పించాలి. టీ కాఫీ, చారు, సాంబార్, కూరలు చెయ్యడం నేర్పించాలి. అప్పుడు వారు పెద్దయిన తరువాత కడుపు కాల్చుకోకుండా చక్కగా ఇంటిలో వంట చేసుకొని తింటారు. ఒక వేళ ఫారిన్ కి పోయినా, వంట వచ్చు గాబట్టి చక్కగా వండుకొని తింటారు. ఈ కాలంలో ఆడపిల్లలకి గూడా ఏ ఇంటి, వంట పని చెప్పకుండా అతి సున్నితంగా పెంచి పెద్ద తప్పులు చేస్తున్నారు తల్లి దండ్రులు. ఆడపిల్లలు అత్త వారింటికి పోక ముందే అన్ని పనులూ నేర్చుకొంటే మంచిది. కొందరికి స్నానం చేసిన తరువాత చక్కగా కూర్చొని భగవత్ ఆరాధన చెయ్యడం రాదు అంటారు. పూజ ఎలా చెయ్యాలో, దీపం వెలిగించి, అగరు బత్తీలు వెలిగించి నాలుగు స్తోత్రాలు చెప్పడం గూడా రాదు. పూజలు చెయ్యడం నామోషీ! దానికి కారణం తల్లిదండ్రులే! పిల్లల బాధ్యతా రహిత ప్రవర్తనకు కారణం తల్లి దండ్రులే! ఈ పరిస్థితి నుండి మనం బయట పడాలి. రాజ్యలక్ష్మి గూడా ఇలాంటి తప్పు చెయ్యడం వల్ల, ఇంటిలో అందరి పనులూ తానే చెయ్యడం వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టు కొనింది. ఇంకొన్ని రోజులు ఇలా వుంటే తాను తప్పక డిప్రెషన్ లో పడి పోతుంది. రాజ్యలక్ష్మి కి రానురానూ అసహనం పెరిగి పోతోంది. ఇంటిలో పని ఒత్తిడుల వల్ల ఆరోగ్యం గూడా క్షీణించింది. నిస్సత్తువ శరీర మంతా అవహించడం వల్ల పనులు చెయ్యడానికి శక్తి చాలడం లేదు. పొద్దస్తమానమూ ఇంటి చాకిరీతోనే సరి పోతోంది. తన కంటూ ఒక వ్యాపకం లేదు. పోనీ ఇంటిలో గుర్తింపు గూడా లేదు. ప్రతి రోజూ టంచనుగా కంచం లోకి పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ బాక్సులకు, రాత్రి మళ్ళీ ఏ పుల్కాలో, చపాతీలో, దానిలోకి కూరలు వండడం తోనే తన బ్రతుకు సాగుతోంది. ఒక రకంగా ఇది థాంక్ లెస్ జాబ్. జ్వరం వచ్చినా, శరీరంలో బలహీనత వున్నా వండి పెట్టాల్సిందే ! ఎందుకంటే వారి ముగ్గురికీ వంట చెయ్యడం రాదు గదా, కనీసం కాఫీ, టీ పెట్టుకోవడానికి గూడా చేత గాదు. ఇంటి పనులు చెయ్యాలంటే వారికి ఎక్కడ లేని బద్ధకం. ఇక పోతే ఒక రోజు వేసుకొన్న డ్రస్సు మరుసటి రోజు వేసు కోరు. ఆ డ్రస్సులన్నీ వాషింగ్ మెషిన్ లో కుక్కి పోతారు. వాళ్ళ బండ లాంటి జీన్స్ పాంటులు ఉతకడం తనకు శక్తికి మించిన పని అవుతోంది. పనమ్మాయి ఉన్నా అన్ని పనులూ సక్రమంగా చెయ్యదు. నెలకు నాలుగైదు రోజులు డుమ్మా కొడుతుంది. ఇల్లు శుభ్రం చేసి తడి బట్ట వెయ్యడం, గిన్నెలు, కంచాలు కడగడం ఆమె పని. ఆ పని తప్ప ఇంకొక్క పని ఎక్కువ చెప్పినా చురచురమని చూస్తుంది. ఒప్పుకొన్న పని తప్ప వేరే పని చెయ్యదు. ఆ రాత్రి రాజారావు పది గంటలకు ఇల్లు చేరాడు. భోజనాలయ్యాక, రాజ్యలక్ష్మి ఒక విషయం అడిగింది. తన క్లాస్ మేట్ లలిత బ్రహ్మ కుమారీస్ రాజయోగ క్లాసుల్లో చేరింది. తను గూడా చేరుతానని భర్త పర్మిషన్ అడిగింది. "నాకు గూడా కొంచెం చేంజ్ గావాలి. నేను గూడా ఆ ఫ్రీ క్లాసుల్లో చేరుతాను. " అని అన్నది రాజ్యలక్ష్మి. సరే నని ఒప్పు కొన్నాడు రాజారావు. సాయంత్రం ఆరు గంటల నుండి బ్రహ్మ కుమారీ వారి రాజయోగ ప్రాక్టీసు క్లాసుల్లో చేరింది రాజ్య లక్ష్మి. చేరిన తరువాత తనకు చాలా హాయి అనిపిస్తోంది. మనస్సు ప్రశాంతంగా ఉంది. అంతకు ముందున్న ఆరాటం, ఒత్తిడి తగ్గుతున్నాయి. శరీరం గూడా తేలికగా ఉంది. ఎలాంటి నెగటివ్ అలోచనలు రావడం లేదు. తెల్ల చీర, తెల్ల జాకెట్ వేసుకొని ప్రతి రోజూ క్రమం తప్పకుండా క్లాసులకు హజరయ్యి వారి రాజయోగ పద్ధతుల్ని బాగా నేర్చుకొంది. క్లాసులు అయి పొయ్యాయి. ఇక రాజ్య లక్ష్మి ఇంటిలోనే మెడిటేషన్ సెషన్లు ప్రాక్టీసు చేస్తోంది. తను ఒక చిన్న గదిలో తెల్ల పరుపులు పరచి, ఒక గోడకు ఎర్ర బల్బును తగిలించి ఆ ఎర్రటి వెలుగు తప్ప మిగతా గది అంతా చీకటిగా ఉంటుంది. రాజ యోగలో పరమాత్మ జ్యోతి ఆకారంలో జ్యోతి బిందువు నుండి మన వైపు కాస్మిక్ కిరణాలను ప్రసరింప చేస్తారు. ఎంత ఎక్కువ మెడిటేషన్ చేస్తే ఆ దివ్య బిందువు నుండి శక్తి మన వైపు ప్రసరిస్తుంది. రాజ్య లక్ష్మి రాత్రి పదయినా ఆ ధ్యానం నుండి బయటకు రాలేక పోతోంది. చేసేదేమీ లేక రాజారావు, పిల్లలు ఆ వుడికించిన అన్నం, కూరలు వేసుకొని తిని పడుకొనే వారు. కొన్ని రోజుల తరువాత మౌంట్ అబులో అడ్వాన్స్‌డ్ మెడిటేషన్ కోర్సు అనౌన్స్ చేశారు. లలతతో పాటు పది మంది బ్రహ్మ కుమారీలు గూడా వెడుతున్నారు. రాజ్య లక్ష్మి గూడా లలితతో పాటు మౌంట్ అబు కి వెడాతానని రాజారావుకు చెప్పుంది. తనకు ఇష్టంలేక పోయినా సరే నని ఒప్పుకొన్నాడు. ఒక పాతిక వేలు ఫ్లైట్ టికెట్లకు, ఖర్చులకు ఇచ్చాడు రాజారావు. ప్రయాణానికి కావలిసిన వన్నీ సమ కూర్చుకొని రాజస్థాన్ లోని జైపూర్ కి పోవడానికి హైదరాబాదు ఏర్ పోర్ట్ దాకా రాజారావు కార్లో డ్రాప్ చేశాడు. అప్పటికే లలితతో పాటు ఇంకా పది మంది తెల్ల చీరలు కట్టుకొని నవ్వుకొంటూ మురిసి పోతున్నారు. రాజ్యలక్ష్మి ని చూస్తూనే వారంతా స్వాగతిస్తూ కేరింతలు కొడుతూ నవ్వు కొంటున్నారు. *************************************** జైపూర్ నుండి మౌంట్ అబూ చేరుకొన్న లలిత బృందం వారి వారికి కేటాయించిన గదుల్లోకి వెళ్ళి పొయ్యారు. లలిత, రాజ్య లక్ష్మికి ఒక గదిని కేటాయించారు. రేపటి నుండి అడ్వాన్స్‌డ్ కోర్సు ప్రారంభం అవుతుంది. బాగా నేర్చు కొని ప్రాక్టీసు చేస్తే ఇక్కడే వాలంటీర్ గానో, టీచర్ గానో పర్మినెంట్ గానో ఇక్కడే చక్కగా వుండి పోవచ్చు. ఆ సంసార ఝంఝాటాలను వదిలించుకొని ఇక్కడే ప్రశాంతంగా బ్రతికెయ్యొచ్చు అన్న లలిత మాటలు ఎందుకో రాజ్యలక్ష్మి మనస్సులో బలంగా నాటు కొన్నాయి. *************************************** పది రోజులు క్లాసులు ముగిశాయి. ఈ పది రోజులూ మొబైల్ గానీ, ఇంటి వారితో ఎలాంటి కమ్యూనికేషన్ వుండ గూడదు. పదిహేను రోజులయినా రాజారావుకు ఎలాంటి కబురు అందలేదు. రాజ్యలక్ష్మి ఏమయిందోనని భయ పడి పొయ్యాడు. వెంటనే మౌంట్ అబూకి పోవడానికి నిశ్చయించుకొన్నాడు. కొడుకు కూతుర్ని గూడా వెంట బెట్టుకొని జైపూర్ కి పొయ్యే విమానంలో కూర్చొన్నారు. మౌంట్ అబూ చేరుకొని బ్రహ్మ కుమారీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో రాజ్యలక్ష్మి, లలిత గురించి వాకబు చేశాడు. అరగంట తరువాత లలిత, రాజ్యలక్ష్మి ని వెంట బెట్టుకొని వచ్చింది. అమ్మను చూస్తూనే బావురు మన్నారు పిల్లలిద్దరూ. రాజారావు కు రాజ్యలక్ష్మి ని చూస్తూనే దుంఖ మాగింది గాదు. వస్తున్న దుంఖాన్ని ఆపుకొని, " పది రోజుల క్లాసులయి పొయ్యాయి గదా! ఇక ఇంటికి పోదాం రా రాజీ ! " అన్నాడు రాజారావు. ఎలాంటి హావ భావాలు చూపకుండా, నిశ్చల సమాధి స్థితిలో ఉన్న రాజ్యలక్ష్మి " నేను ఇంక ఇంటికి రాను. నాకు ఇక్కడే హాయిగా ఉంది. నన్ను మళ్ళీ ఆ సంసార వూబి లోనికి తోయకండి. నాకిప్పుడు ఏ భవ బంధాలు లేవు. నేను ఆ పరమాత్మను దర్శించే యోగ్యతను సంపాయించు కొంటున్నాను. మీ పాటికి మీరు ఇంటికి వెళ్ళి మీ పనులు చూసుకోండి. " అంది రాజ్యలక్ష్మి నిర్లిప్తంగా, నిశ్చలంగా. ఆమె మొహం ఒక దివ్య తేజస్సుతో వెలిగి పోతూ ఉంది. పిల్లలిద్దరూ ఏడ్చేశారు. "అమ్మా.. మమ్మల్ని క్షమించు. నీకెలాంటి కష్టాల్ని కలిగించ నియ్యము. మా పనులు మేము చేసు కొంటాము. మా బట్టలు మేము ఉతుక్కొంటాము. మా కంచాలు మేము కడుక్కొంటాము. నీకు వంట ఇంటిలో అన్ని పనులకూ హెల్ప్ చేస్తాము. కూరగాయలు తరిగిస్తాము. బ్రేక్ ఫాస్ట్ చేస్తాము. నువ్వు ఎన్ని పనులు మాకు చేసి పెట్టే దానివో ఈ పది రోజుల్లో మాకు తెలిసింది. నువ్వు ఇంటి కోసం ఎంత కష్ట పడ్డావో గూడా మాకు అర్థమయింది. " అన్నారు పిల్లలు ఇద్దరూ అమ్మను హత్తుకొని. "రాజ్యలక్ష్మి.. నన్ను క్షమించు. పాతికేళ్ళు గా ఇంటి పనుల కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. మేము గూడా నువ్వు ఒక మనిషివని, నీకు విశ్రాంతి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను పని చేసే ఒక మర యంత్రాంగా భావించామే తప్ప నువ్వు ఇంటి కోసం ఎంత కష్ట పడుతున్నావో గమనించ లేదు. ఇక పై నా షూ నేను పాలీష్ చేసుకొంటాను. నా బట్టలు నేను వుతుక్కొంటాను. మార్కెట్ కి పోయి ఇంటికి కావలసిన వెచ్చాలు, కూరగాయలు నేనే కొనుక్కొని వస్తాను. నా కాఫీ, నా టీ నేనే చేసుకొని నీకు గూడా కలిపిస్తాను. వంటింట్లో నీకు చేదోడు వాదోడుగా కూరగాయలు తరిగిస్తాను. నా లంచ్ బాక్స్ నేనే కట్టు కొంటాను. ఇక నువ్వు మా కళ్ళ ముందర హాయిగా నవ్వు కొంటూ వుంటే చాలు. అవునోయ్.. ఆదివారం.. నీకు లీవు ఇస్తున్నాను. ఆ రోజు నువ్వు ఏ పనీ చెయ్య నక్కర లేదు. ఆ రోజు మన కిచెన్ క్లోస్. ప్రతి ఆదివారం ఏ మంచి హోటల్లోనో లంచ్ చేద్దాం. చాలా.. ఇంకా మేము తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే క్షమించమని అడుగుతున్నాము. " అన్నాడు రాజారావు చెంప దెబ్బలు వేసుకొంటూ.. ఈ సన్ని వేశాన్ని చూసి రాజ్యలక్ష్మి, లలితతో పాటు మిగతా వారు ఘొల్లు మని నవ్వారు. రాజారావు గుండెల మీద గువ్వలా ఒదిగి పోయింది రాజ్యలక్ష్మి. ఆమె కళ్ళ లోంచి రెండు కన్నీటి బొట్లు ఆమె చెక్కిళ్ళ మీదుగా జారి ఆ విద్యుత్ వెలుగులో మెరుస్తున్నాయి. మరుసటి రోజు ఫ్లైట్ లో హైదరాబాదు కి బుక్ చేసుకొని అందరూ ఇల్లు చేరుకొన్నారు. **************************************** |
వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.
వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.
వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.
తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.
*వీరి ముద్రిత రచనలు* ------------------
1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.
2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .
3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్ నెల 17 వ తేదీ వెలువరించారు. ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు
4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.
5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!
*అముద్రిత రచనలు*
1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.
2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.
3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.
4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.
*విద్యాభ్యాసం* -----------
వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.
ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు. ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు. తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు. వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు. ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.
*వృత్తి* ------
వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.
వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు; 1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ 2. సహస్ర కవి రత్న 3. సాహితీ భూషణ 4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో. 5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.
Hindu Dharma Margam • 11 hours ago (edited)
కథ చాలా బాగుంది.వ్యాఖ్యాతగా మీరు చక్కగా చదివారు.రచయిత గారికి అభినందనలు.