అమ్మ
- T. V. L. Gayathri
- May 9
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #అమ్మ, #Amma, #మనవీరసైనికులు

గాయత్రి గారి కవితలు పార్ట్ 19
Amma - Gayathri Gari Kavithalu Part 19 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 09/05/2025
అమ్మ - గాయత్రి గారి కవితలు పార్ట్ 19 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
అమ్మ
(కవిత )
******************************
అమ్మ హృదినిండుగా నమృతంపు రసధార
కమ్మగా బిడ్డలకు కలిమినే పంచునట
ప్రేమబంధంబొకటి పృథ్విలో ప్రాణులకు
క్షేమంబు కలిగించి జీవంబు నిల్పునట
ఆ రూపమేసృష్టికాలంబనై నిలుచు
కారుణ్య మూర్తిగా గారాలనే పంచు
జీవనము నిడుచుండి శ్రేయమ్ము కోరుతూ
సేవలను సల్పి తను చివికి పోతుంది
తల్లిగా బాధ్యతలు తలకెత్తి మోస్తుంది
చల్లనౌ దీవెనలు సతము కురిపిస్తుంది
అమ్మ లేకున్నచో నవనిలో వెలుగేది?
అమ్మయే వేలుపులకారాధ్యమౌతుంది.
అమ్మకై విష్ణువే నవనిలో పుట్టాడు
అమ్మ పాలను త్రావి యందలంబెక్కాడు
కరిగిపోతుంటుంది కర్పూరమై తల్లి
పరమాత్మ రూపిణికి భక్తితో వందనం!//
************************************
మన వీరసైనికులు
(కవిత )

యుద్ధం యుద్ధం
ఉధృతంగా యుద్ధం
ప్రాణాలు తీస్తుంది
భయానకమైన యుద్ధం
దాయది కుట్రతో
దద్దరిల్లిన దేశం
వీరులై మనవారు
విజయాన్ని తెస్తారు
రక్తాన్ని చిలికించి
రక్షణగా నిలుస్తారు
బలముతో శూరలై
భయము తొలిగిస్తారు
మన ఆయుధసంపత్తి
కెదురన్నది ఉంటుందా?
పిరికి పందలకిపుడు
వెఱపు తెలిసివస్తుంది
ఉగ్రవాదపు భూమిపుడు
ఉనికిలో నుంటుందా?
కన్నెర్ర చేశామంటే
కాలి బూడిదవుతుంది
శక్తిసామర్ధ్యాలను చూపి
జగతినే గెలవగల
భరతమాత బిడ్డలే
వైరులను తరిమేస్తారు
మనవీర సైనికులు
మాయను సంహరిస్తారు
జయమంచు నినదించి
జగతిని గెలిచేస్తారు
విజయ పతాకాన్ని నేడు
విను వీధిలో ఎగరేస్తారు
చరితలో మన కీర్తిని
శాశ్వతంగా నిలుపుతారు.//
*******************************

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments