top of page

అమ్మ కోరిక

#AmmaKorika, #అమ్మకోరిక, #Mayukha, #మయూఖ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #అమ్మకొడుకుకథ

Amma Korika - New Telugu Story Written By Mayukha

Published In manatelugukathalu.com On 08/06/2025

అమ్మ కోరిక - తెలుగు కథ

రచన: మయూఖ


"అమ్మా! సాయంత్రం రెడీగా ఉండు. త్యాగరాయ గాన సభకు తీసుకువెళతాను. డాడీ.. మీరు కూడా!" అంటూ హడావిడిగా బయటికి వెళ్లిపోయాడు కిరణ్. 


వసుంధర, సాంబమూర్తిల ఏకైక కొడుకు కిరణ్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నాడు. బ్యాంకుకు వచ్చే ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి. సాంబమూర్తి టీచర్ గా చేసి రిటైర్ అయ్యాడు. వసుంధర గృహిణి. సాహిత్యాభిలాషి, తెలుగు సాహిత్యం అంటే ఎంతో మక్కువతో ఎన్నో పుస్తకాలు చదివింది. కిరణ్ కి చిన్నతనం నుంచి రామాయణ, భారతాల్ని చదివి వినిపించేది. 


కిరణ్ 8వ తరగతిలో ఉన్నప్పుడు సీబీఎస్ఈ సిలబస్ లో సెకండ్ లాంగ్వేజ్ హిందీయా.. తెలుగా.. అన్నప్పుడు తెలుగు వైపే మొగ్గు చూపింది వసుంధర. అందరూ నేషనల్ లాంగ్వేజ్ హిందీ తీసుకుంటే మంచిది కదా అన్నా, "కాదు, మాతృభాషలో ఉన్న సౌలభ్యం పరభాషలో ఉండదు, మాతృభాషను అర్థం చేసుకుంటే మనం సొంతంగా రాయగలం. అదే పరభాష అయితే అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. ఇంకా భాష రానప్పుడు పదాల కూర్పు ఎలా సాధ్యం?" అని తెలుగు భాషకే మొగ్గు చూపింది. 


కిరణ్ 10వ తరగతిలో తెలుగు ఉపవాచకంలో రామాయణం గురించి, దానిలోని పాత్రల గురించి అలవోకగా రాసేశాడు. 96 మార్కులతో తెలుగులో క్లాస్ ఫస్ట్ వచ్చాడు. కిరణ్ కి కూడా తెలుగు సాహిత్యం అంటే ఇష్టం ఏర్పడింది. చిన్న చిన్న కథలు చదవడం మొదలెట్టాడు. కాలం గిర్రున తిరుగుతోంది. 

 *****

కిరణ్ చదువులో చురుకు అవడంతో డిగ్రీ పూర్తి చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే బ్యాంక్ ఆఫీసరు గా సెలెక్ట్ అయ్యాడు. శని, ఆదివారాలు సెలవులు అవడంతో తల్లిని, తండ్రిని తీసుకుని గుళ్ళకి, సాహిత్య సభలకి తీసుకువెళ్లడం కిరణ్ కి అలవాటు. 


ఆదివారం అవడంతో ముగ్గురు కలిసి టిఫిన్ తిన్నారు. ప్లేట్లు సింకులో వేసి ఆదివారం పేపర్ తో వచ్చే బుక్ తీసుకుని పజిల్స్ నింపి పుస్తకం అంతా చదివింది వసుంధర. పుస్తకం చదవడంతో టైం తెలియకుండా 12 అయింది. 


‘అమ్మో.. ఇక వంట మొదలెట్టాలి’ అనుకుంటూ ఫ్రిడ్జ్ లోంచి కూరగాయలు తీసి చకచకా వంట చేసి అన్నం రెడీ చేసి పెట్టింది. కిరణ్ అప్పుడే బయట నుంచి వచ్చాడు. వంకాయ కారం పెట్టిన కూర, సాంబారు, కొబ్బరి పచ్చడి చేసింది. ముగ్గురు టేబుల్ చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు.


భోజనాలు అయిన తర్వాత "అమ్మా! నువ్వు కూర్చో. నేను టేబుల్ క్లీన్ చేస్తాను" అంటూ చక చకా టేబుల్ సర్దేసి క్లాత్ పెట్టి టేబుల్ తుడిచాడు. వసుంధర మురిపెంగా కొడుకు వంక చూస్తూ అనుకుంది. ‘ఎంత మంచివాడో, ఆడవాళ్ళ కష్టసుఖాలు అర్థం చేసుకుంటాడు. కోడలుగా ఏ అదృష్టవంతురాలు వస్తుందో’ అనుకుంది. 


సాయంత్రం అయింది. వసుంధర లేత గులాబీ రంగు బెంగాల్ కాటన్ చీర కట్టుకుని, రెండు వరుసల ముత్యాలు మెడలో వేసుకుంది. చేతికి రెండు బంగారు గాజులు, చిన్న ముడి తో హుందాగా ఉంది. వసుంధర కిరణ్ ని అడిగింది "సాయంత్రం ఏం ప్రోగ్రాం రా"?


"పుస్తకావిష్కరణ ఉంది అందరూ పెద్దపెద్ద వాళ్లు వస్తారు. సాహిత్యం అంటే ఇష్టం కదా! అందుకే తీసుకు వెళుతున్నాను అమ్మా" అన్నాడు కిరణ్. 


ముగ్గురు కలిసి కార్లో బయలుదేరారు. త్యాగరాయ గాన సభ అంతా జనాలతో నిండిపోయింది. 


‘అమ్మ కోరిక’ పుస్తకావిష్కరణ అంటూ అక్కడక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి. ‘అమ్మ కోరిక’ కింద ‘వివిధ కథల సమాహారం’ అనే టాగ్ లైను ఉంది. ప్రముఖ రచయితలు ఒక్కొక్కరు వస్తున్నారు. 


వసుంధర అనుకుంది ‘ఎవరో పెద్ద రచయిత పుస్తకం అయి ఉండొచ్చు. లేకపోతే ఇంత మంది రారు. వీళ్ళందర్నీ పుస్తకాలలో చూడడం తప్ప ఎవరిని పర్సనల్గా చూసింది లేదు’ అనుకుంది. 


స్టేజ్ అంతా రంగురంగుల పూలతో అలంకరించారు. 

మెరూన్ కలర్ ముఖమల్ క్లాత్ మీద "అమ్మ కోరిక" అని బంగారు రంగు అక్షరాలతో కర్టెన్ మెరిసిపోతోంది. పుస్తక ఆవిష్కరణ ప్రముఖ పత్రిక ఎడిటర్ చిరంజీవి గారు అని ఉంది. 


కిరణ్ బ్యాంక్ మేనేజర్ అవడంతో ఎప్పుడూ ముందు వరుసలోనే సీట్లు కేటాయిస్తారు. అందరూ ఒక్కొక్కళ్ళే కిరణ్ దగ్గరకు వచ్చి కరచాలనం చేస్తున్నారు. అతిథులు అందరూ వచ్చారు. కిరణ్ ఒక్కసారిగా స్టేజి మీదకి వెళ్ళాడు. 


‘వీడు ఎందుకు పైకెక్కుతున్నాడు?’ అనుకుంది వసుంధర. 


కిరణ్ మైక్ తీసుకుని "మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ స్వాగతం. ఎడిటర్ చిరంజీవి గారికి స్వాగతం పలుకుతూ ఆయన్ని ఈ సభకు అధ్యక్షత వహించవలసినదిగా కోరుతున్నాను" అన్నాడు. 


అలాగే మిగిలిన రచయితల పేర్లు కూడా చదివి అందర్నీ ఆహ్వానించాడు స్టేజి మీదకి. 


ఈ తతంగం చూసి విస్తూ పోయింది వసుంధర. దీప ప్రజ్వలన కార్యక్రమం అయిన తర్వాత కిరణ్ మైక్ తీసుకుని మాట్లాడడం మొదలెట్టాడు. "నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన చిరంజీవి గారికి, ప్రముఖ రచయితలకు, రసజ్ఞులైన అతిధులకు నా నమస్కారాలు. ఈ తల్లి కోరిక అనే పుస్తకం ఎడిటర్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహాతల్లి అక్షర రూపం ఇస్తే, దాన్ని పుస్తకంగా వేయమని సలహా ఇచ్చి, నాకు వెన్నంటి సహకరించిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు" ఉద్వేగంగా అన్నాడు కిరణ్. 


పుస్తకం ఆవిష్కరణ అయింది కానీ ఆ పుస్తక రచయిత ఎవరో ఎవరికీ తెలియదు. అందరూ ఆత్రుతగా పుస్తకం పేజీలు తిరగేస్తున్నారు. 


కిరణ్ మళ్లీ మాట్లాడుతూ "చాలా సంవత్సరాల క్రితం ఈ రచయిత్రి ఎన్నో ఆణిముత్యాలు లాంటి కథలని రాసి వివిధ పత్రికలకు పంపితే, ఎవరు వేసుకోలేదు. ఎన్నో సమకాలీన సమస్యలను స్పృశిస్తూ, వాటికి పరిష్కారాలు చెబుతూ రాసిన వ్యాసాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ పత్రిక వాళ్లు వేసుకోలేదు. నేను అందర్నీ అనట్లేదు కానీ కొన్ని పత్రికలు ప్రముఖ రచయితల కథల్నే వేసుకుంటాయి. దానిలో కంటెంట్ ఉందా? లేదా? అని ఆలోచించరు. 


కొంతమంది రచయితలు పరిచయంలో నేను అన్ని రాశాను, ఇన్ని రాశాను అని వేసుకుంటారు. ఈ పత్రికలు కూడా అటువంటి వాళ్ళ రచనలనే తీసుకుంటాయి. కొత్త వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవాలంటే అనుభవం ఉందా అంటారు ఉద్యోగం ఇస్తేనే కదా! అనుభవం వచ్చేది. ఈ విధంగానే ఈ రచయిత్రి రాసిన కథలు ఏవీ ముద్రణకి నోచుకోలేక పోయాయి. అందుకే ఈ పనికి నేను పూనుకున్నాను. ఈ రచయిత్రి ఎవరో కాదు. మా అమ్మగారు వసుంధర దేవి” అని ప్రకటించి, తల్లిని సగౌరవంగా వేదిక పైకి తీసుకువచ్చాడు. 

ఆశ్చర్య ఆనందాలతో ఉన్న వసుంధర చెమ్మగిల్లిన కళ్ళతో వేదిక మీద పెద్దలకు నమస్కరించి తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుంది. 


కిరణ్ మళ్లీ కొనసాగించాడు "ఇప్పటివరకు ఈ విషయం మా అమ్మగారికి కూడా తెలియదు. పుస్తకావిష్కరణ అంటే ఎవరిదో అనుకున్నారు. నేను ఒకసారి మా ఇంట్లో పాత పుస్తకాల కోసం వెతికితే ఒక పెట్టెలో కనిపించాయి. చూస్తే అన్నీ మా అమ్మ స్వదస్తూరితో రాసిన కథలు. చదువుతున్న కొద్ది నా మతి పోయింది. ఇంత మంచి కథలని ఎవరు వేసుకోలేదా! వాటిని వెలుగులోకి తేవాలని ఒక కథని నా పేరు మీద రాసి, డెసిగ్నేషన్ రాసి పంపితే ఒక పత్రిక వారు వేసుకున్నారు. 


అప్పుడు ఎడిటర్ చిరంజీవి గారిని కలిసి చెబితే ఆయన ఓపిగ్గా ఆ రచనలన్నీ చదివి ‘మనమే ప్రింట్ చేయిద్దాం. పుస్తక రూపంలోకి తెద్దాం’ అన్నారు. ఆయన సలహా కార్యరూపం దాల్చింది. 


చివరగా చెబుతున్నాను పత్రికల వాళ్ళకి నా సలహా.. ఏదైనా ఒక కథ వచ్చినప్పుడు దాన్ని చదవండి, చిన్నచిన్న తప్పులుంటే మెరుగులు దిద్దండి, అంతేకానీ అనవసర ప్రలోభాలకు పోయి మంచి సాహిత్యాన్ని పాఠకులకు దూరం చేయకండి" అంటూ హర్షద్వానాల మధ్య ముగించాడు కిరణ్. 


ఎడిటర్ చిరంజీవి మాట్లాడుతూ "ఆవిడ రచనలు చదివాను. అన్ని ఆణిముత్యాలే. ముత్యాలన్నీ ఒక దారానికి కడితే ఒక దండ తయారైనట్టు "అమ్మ కోరిక" అనే కథల సమాహారం ఒక ముత్యాల కోవలాంటిది. ప్రముఖ రచయిత్రి మాలతి చందూర్ గారు ప్రమదావనం శీర్షిక రాసినట్లుగా మా పత్రికలో వసుంధర గారిని సమకాలిన సమస్యల మీద వ్యాసాలు రాయవలసినదిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను" అన్నాడు హర్షద్వానాల మధ్య. 


అందరి కోరిక మీద వసుంధర మాట్లాడుతూ "సభకు నమస్కారం. నే ను పెద్ద రచయిత్రిని కాను. కానీ నా మనసులో ఉన్న భావాలకే అక్షర రూపం ఇచ్చాను. సమాజంలో ఉన్న మూఢాచారాలని తీసివేయడానికి నేను సంఘసంస్కర్తను కాను. కానీ నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రాసాను కానీ, ఏవి ముద్రణకి నోచుకోలేకపోయాయి. దాంతో నిరాశ, నిస్పృహ వచ్చి నా రచన వ్యాసంగాన్ని వదిలేసాను. 


కానీ ఇప్పుడు నా బిడ్డ నాలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. తల్లి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే వాడే కొడుకు. కిరణ్ ని చూసి చాలా గర్విస్తున్నాను. 


సమాజాన్ని, యువతని మంచి మార్గం వైపు తీసుకు వెళ్లడానికి రచనలు చేయడానికి అవకాశం కల్పించిన చిరంజీవి గారికి నమస్కారాలు. నా మనసు తెలుసుకొని నా ఆకాంక్షని నెరవేర్చిన నా కొడుకుకి దీవెనలు తప్ప నేను ఏమీ ఇవ్వలేను. ఎందుకంటే నాకంటే పెద్దవాడు అయితే శతకోటి వందనాలు సమర్పించేదాన్ని. నాకు సాహిత్యం అంటే ఇష్టం వల్ల నా కోసం ఎన్నో విలువైన పుస్తకాలు కొన్నాడు. సాహితీ సభలకి తీసుకువెళ్తాడు. 


ఇప్పుడు కూడా అదే అనుకున్నాను కానీ, ఇది నా సభ. నాకోసం కేటాయించిన రోజు. ఇప్పుడు మళ్లీ నాలో నూతనోత్సాహం వెళ్లి విరుస్తోంది. వయసు అనేది శరీరానికే కానీ మనసుకి కాదు" అంటూ కిరణ్ ని ప్రేమగా ముద్దు పెట్టుకుంది వసుంధర. 


"అమ్మ కోరిక నెరవేర్చిన ఘనుడవయ్యా!” అంది ఆప్యాయంగా. 


 సమాప్తం


మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comentários


bottom of page