top of page

అమ్మ

#అమ్మ, #Amma, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguHeartTouchingStories

Amma - New Telugu Story Written By D. Mehaboob Basha

Published In manatelugukathalu.com On 16/06/2025

అమ్మ - తెలుగు కథ

రచన: డి. మెహబూబ్ బాషా

సేకరణ: కర్లపాలెం హనుమంత రావు


(కర్లపాలెం హనుమంత రావు హనుమంతరావు గారు 'బొమ్మకు కథ' ఫేస్ బుక్ పేజీలో నిర్వహిస్తున్న పోటీలో బొమ్మకు కథ - 2 బహుమతి పొందిన కథ)


"నాన్నోయ్!"


"చెప్పు తల్లీ!"


"అమ్మ ఎక్కడి కెళ్ళింది?"


 "వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది."


 "అమ్మకు కూడా అమ్మ ఉందా?"


 "నీకు వున్నట్టే అమ్మకూ ఓ అమ్మ ఉందమ్మా."


 "ఆ అమ్మ ఎక్కడ ఉంటుంది?"


 "తన ఇంట్లో."


 "ఆ ఇల్లు ఎక్కడ వుంది?"


 "మన ఊరికి చాలా దూరం."


 "మనం కూడా అక్కడికి వెళదాం నాన్నా!."


 "ఆ ఊరు చాలా దూరం. మనం అంత దూరం వెళ్ళలేం."


 "మరి అమ్మ అంత దూరం ఎలా వెళ్ళింది?"


 "అమ్మకు దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు."


 "అమ్మకు ఇచ్చిన శక్తిని దేవుడు మనకు ఎందుకు ఇవ్వలేదు?"


 "దేవుడికి అమ్మ అంటే ఇష్టం."


 "దేవుడికి నువ్వంటే ఇష్టం లేదా?"


 "దేవుడికి మనుషులందరూ సమానమే అయినా పిల్లలకు జన్మ నిచ్చే తల్లులంటే ఎక్కువ ఇష్టం."


 "ఎందుకలా?"


 "ఎందుకంటే తొమ్మిది నెలలు పిల్లల్ని కడుపులో మోసి జన్మ నిస్తారు కాబట్టి."


 "అమ్మ కూడా నన్ను తొమ్మిది నెలలు మోసిందా నాన్నా?"


 "అవునమ్మా."


 "ఇప్పుడు నువ్వు కూడా నన్ను మోస్తున్నావు కదా."


 "నేను మోసేది నా భుజాల పైన. నాకు నువ్వు బరువు అనిపిస్తే నిన్ను కిందికి దించుతాను. కాని అమ్మకు ఆ అవకాశం లేదు. నిన్ను తన కడుపులో మోసింది కనుక బరువు అనిపించినప్పుడు కిందికి దించే మార్గం లేదు. నువ్వు పుట్టేవరకు రాత్రీపగలు తొమ్మిది నెలల వరకు ఎన్ని ఇబ్బందులు కలిగినా సంతోషంగా నిన్ను మోసింది."


 "మరి నన్ను అంత ఇష్టపడి మోసిన అమ్మ నన్ను వదిలి తన అమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళిపోయింది నాన్నా?"


 "నీకు నీ అమ్మ పైన ప్రేమ వున్నట్టే నీ అమ్మకు కూడా తన తల్లిపైన ప్రేమ ఉంటుంది కదా. అందుకే ఆమె దగ్గరికి వెళ్ళింది."


 "అమ్మ మన ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తుంది?"


 "ఆ సంగతి ఆమె నాకు చెప్పలేదమ్మా."


 "అమ్మకు ఫోన్ చేసి అడుగు నాన్నా."


 "అక్కడికి ఫోన్ తగలదు. ఎందుకంటే నీ అమ్మ వున్న ఊరిలో టవర్లు లేవు." 


 "ఫోన్ తగలకపోతే అమ్మకి ఉత్తరం రాయి నాన్నా."


 "అక్కడికి ఉత్తరాలు కూడా వెళ్ళవు తల్లీ."


 "అలాగైతే మనమే అక్కడికి వెళదాం నాన్నా. అమ్మను చూడకుండా నేను ఉండలేను."


 "అమ్మకు బదులు నేను వున్నాను కదమ్మా."


 "నీతో పాటు నాకు అమ్మ కూడా కావాలి నాన్నా."


 "నీకు అమ్మ లేని లోటు నేను తీరుస్తానమ్మా."


 "కాని అందరు పిల్లలకి నాన్నలతో పాటు వాళ్ళ అమ్మలు కూడా వున్నారు కదా నాన్నా. నాకెందుకు అమ్మ లేదు?"


 "నీకు అమ్మనీ, నాన్నని నేనే తల్లీ."


 "అమ్మ అమ్మే అవుతుంది. నువ్వు అమ్మ ఎలా అవుతావు? నాకు నీతో పాటు అమ్మ కూడా కావాలి నాన్నా."


 "అమ్మ పనులన్నీ నేనే చేస్తాను. ఇక అమ్మతో నీకేం పని?"


 "నేను అమ్మతో ఆడుకుంటాను."


 "అమ్మ అనుకొని నాతోనే ఆడుకో."


 "అమ్మ నన్ను ఒడిలో పడుకోబెట్టుకొని కథలు చెప్పేది."


 "నేను కూడా చందమామ కథలు చెబుతాను."


 "అమ్మ నాకు రోజూ రాత్రి చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించేది."


 "నేను కూడా అలాగే తినిపిస్తానమ్మా."


 "అమ్మ జోలపాట పాడి నన్ను నిద్రపుచ్చేది."


 "నేను కూడా అలాగే చేస్తాను తల్లీ."


 "అయినా అమ్మ లాగ నువ్వు చెయ్యలేవు నాన్నా."


 "అలా అనుకోవద్దు. ప్రతి బిడ్డకీ అమ్మ ప్రేమ కనిపిస్తుంది. కాని నాన్న ప్రేమ కనిపించదమ్మా."

 "ఎందుకు కనిపించదు?"


 "ఎందుకంటే నాన్న తన బిడ్డల పట్ల ప్రేమను ప్రదర్శించడు. మనసులోనే దాచుకుంటాడు. కాని అమ్మకు అలా దాచుకోవటం సాధ్యం కాదు. మనసులో వున్న మొత్తం ప్రేమను ఎప్పటికప్పుడు బయట పెడుతుంది. అమ్మ ప్రేమ జలపాతం లాంటిది. వుధృతంగా, ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. నాన్న ప్రేమ నది లాంటిది. మెల్లగా, ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కాని రెండిట్లో ఉండేది మమకారం అనే స్వచ్ఛమైన నీరే!"


 "నీ మాటలు నాకు అర్థం కావటం లేదు నాన్నా."


 "నీది ఇంకా చిన్న వయసు కదమ్మా. నా మాటలు నీ చిట్టి బుర్రకు అర్థం కావాలంటే నువ్వు ఇంకా ఎదగాలి."


 "నేను ఎప్పుడు ఎదుగుతాను నాన్నా?"


 "నీకు మీ అమ్మ వయసు వస్తే ఎదిగినట్టు లెక్క."


 "అమ్మ వయసు నాకు ఎప్పుడు వస్తుంది?"


 "నువ్వు పెరిగి పెద్దయ్యాక నీ పెళ్ళై ఓ బిడ్డ పుట్టినప్పుడు నీకు అమ్మ వయసు వస్తుంది. అప్పుడు నా మాటలన్నీ నీకు అర్థమవుతాయి."


 "మళ్ళీ నీ మాటలు నాకు అర్థం కావటం లేదు నాన్నా."


 "చెప్పాను కదమ్మా. నువ్వు పెద్దయ్యాక అర్థమవుతాయని."


 "కాని నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావనిపిస్తోంది."


 "ఎందుకలా అనిపిస్తోంది?"


 "మన పక్క ఇంట్లో వుండే చంటి వాళ్ళమ్మ కొన్ని రోజుల ముందు చంటిని తీసుకొని చంటి అమ్మమ్మ ఊరికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కాని అమ్మ వెళ్ళి చాలా కాలమైంది. ఇంతవరకు తిరిగి రాలేదు. ఎందుకు రాలేదు? నిజం చెప్పు నాన్నా?"


 "నేను నిజమే చెప్పాను తల్లీ. మీ అమ్మ తిరిగి రాకపోతే నేనేమి చెయ్యగలను?"


 "చంటి వాళ్ళమ్మ చంటి వల్ల నాన్నతో కొట్లాడి వెళ్ళిందని చంటి చెప్పాడు. అమ్మ కూడా నీతో పోట్లాడి వెళ్ళిందా నాన్నా?"


 "లేదమ్మా. నాతోనే కాదు, ఇంకెవరితోనూ పోట్లాడే అలవాటు మీ అమ్మకు లేదు."


 "లేకపోతే నేను సతాయిస్తున్నానని నా పైన అలిగి అమ్మ తన అమ్మ ఊరికి వెళ్ళిపోయిందా?"


 "ఏ తల్లి కూడా తన పిల్లలపై అలగదు. మీ అమ్మ కూడా ఎప్పుడూ నీ పైన అలగలేదు తల్లీ."


 "అలాగైతే నన్ను వదిలి అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది నాన్నా? చంటిని వాళ్ళమ్మ తీసుకు వెళ్ళినట్టు అమ్మ నన్ను ఎందుకు తన వెంట తీసుకెళ్ళలేదు? చెప్పు నాన్నా?"


 "ఎందుకమ్మా, అమ్మ గురించి అంతగా ఆరాట పడుతున్నావ్? అమ్మకు బదులు నేనున్నాను. అమ్మలా నిన్ను ఎత్తుకు తిరుగుతున్నాను కదా."


 "అమ్మలా ఎత్తుకోలేదు. అమ్మ నన్ను తన నడుంపై ఎత్తుకొనేది. నువ్వు భుజాల పైన ఎత్తుకున్నావ్. అమ్మలా ఎందుకు ఎత్తుకోలేదు?"


 "అమ్మ తను చూసేదంతా నీకు కనపడాలని అలా ఎత్తుకొనేది. అయితే నాకు కనపడని ప్రపంచం కూడా నీకు కనపడాలని నిన్ను నా భుజాల పైకి ఎత్తుకున్నాను. మంచిదే కదా."


 "మరి నీకు నా పైన అంతగా ప్రేమ ఉంటే అమ్మ గురించి ఎందుకు అబద్ధం చెబుతున్నావ్ నాన్నా?"


 "నేను చెప్పింది నిజం కాకపోవచ్చు. కాని అబద్ధం కూడా కాదు."


 "మళ్ళీ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావ్."


 "నీకు అర్థం చేసుకొనే వయసు వచ్చాక అన్ని విషయాలు వివరంగా చెబుతాను, సరేనా?"


 " వద్దు నాన్నా. నాకు ఇప్పుడే అన్ని విషయాలు చెప్పెయ్."


 "అలా మారాం చెయ్యకూడదు తల్లీ. నాన్న చెప్పింది వినాలి."


 "అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా. అమ్మ గురించి ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెబుతున్నావ్. నిజం చెప్పటం లేదు."


 "నువ్వింకా చిన్న పిల్లవి. కొన్ని విషయాలు నీకు అర్థం కావు."


 "అలా అనుకోవద్దు. నాకు బాగానే అర్థమవుతుంది. నాకు రోజూ రాత్రి కలలో అమ్మ కనిపిస్తుంది. పడవలో వెళ్ళిపోతూ నాకు టాటా చెబుతుంది. అమ్మ నిజంగానే పడవలో వెళ్ళిపోయిందా నాన్నా?"


 "భగవంతుడా, నీకు అలాంటి కల వస్తోందని నాకు తెలీదు. నువ్వు ఎప్పుడూ ఆ కల గురించి నాకు చెప్పలేదు."


 "ఇప్పుడు చెబుతున్నాను కదా. అమ్మ నిజంగా పడవలో తన అమ్మ ఊరికి వెళ్ళిపోయిందా?"


 "నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదమ్మా?"


 "చెప్పు నాన్నా, రోజూ అమ్మ గురించే ఆలోచిస్తున్నాను. అమ్మను చూడకుండా నేను ఉండలేను."


 "చెబుతానమ్మా. ఇంత చిన్న వయసులోనే నీకు దేవుడు ఇంతటి ఆలోచనా శక్తి ఇచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. బహుశా గుండెల నిండా తల్లి పట్ల వున్న నీ ప్రేమను చూసి దేవుడు కూడా చలించినట్టున్నాడు. నీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెబుతా, విను. ఏడాది క్రితం మా పొలంలో ఎరువులు వేయటానికి నేను ఎద్దుల బండిలో వెళుతుంటే నాకు తోడుగా మీ అమ్మ కూడా వస్తానని చెప్పి నిన్ను ఎత్తుకొని బండెక్కింది. మేం పొలంలో ఎరువు చల్లాక భారీ వర్షం కురిసింది. వర్షం కాస్త తగ్గాక మేం బండిలో ఇంటికి బయలుదేరాం. దారి మధ్యలో ఓ వాగు వుధృతంగా పారుతోంది. అయినా ధైర్యం చేసి బండి ముందుకు నడిపాను. అవతలి ఒడ్డు సమీపించే వరకు బండి బాగానే వెళ్ళింది. ఒడ్డు నాలుగు అడుగుల దూరంలో ఉండగా ఓ ఎద్దు తూలి పడటంతో బండి నీటిలో మునగసాగింది. 


నేను వరదలోనే కిందికి దిగి ఎద్దును లేపటానికి ప్రయత్నించాను. కాని సాధ్యం కాలేదు. ఇక మేం వరదలో కొట్టుకు పోవటం ఖాయమని అర్థమయ్యాక నీ అమ్మ కనీసం నిన్నైనా కాపాడాలనుకొని నిన్ను ఒడ్డు పైకి విసిరేసింది. మరుక్షణం బండి బోల్తా పడటంతో మీ అమ్మ వరదలో కొట్టుకు పోయింది. నా కాలు బండి చక్రంలో ఎరుక్కోవటంతో నేను వరదలో కొట్టుకు పోలేదు కాని నీటిలో మునిగి ఉక్కిరి బిక్కిరి అయ్యాను. చివరికి ఎలాగోలా కాలు బయటికి తీసి వరదలో ఈదటానికి ప్రయత్నించాను. అదృష్టవశాత్తు ఓ చోట ఒడ్డు పై నుంచి వేళ్ళాడుతున్న ఓ చెట్టు కొమ్మ చేతికి అందటంతో అతి కష్టంగా నేను ఒడ్డుకి చేరుకోగాలిగాను. కాని బండి చక్రంలో ఇరుక్కున్న నా కాలి ఎముక విరగటం వల్ల నడవలేకపోయాను. 


అయినా కుంటుకుంటూ నీ అమ్మ నిన్ను విసిరేసిన చోటికి చేరుకున్నాను. ఒడ్డు పక్కనే వున్న పొదల్లో చిక్కుకొని ఏడుస్తున్న నిన్ను చూసి నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. నిన్ను ఎత్తుకొని కొంత దూరం నడిచి స్పృహ తప్పి పడిపోయాను. రాత్రంతా ఇద్దరం అక్కడే వున్నాం. తెల్లవారాక ఊరి వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు. కాని సకాలంలో వైద్యం అందకపోవటం వల్ల డాక్టర్లు నా కాలు కొంత భాగం తీసేశారు. నీ అమ్మ వరదలో చాలా దూరం కొట్టుకుపోయి శవంగా తేలింది. ఆ తల్లి సరైన సమయంలో నిన్ను ఒడ్డు పైకి విసిరేసి ఉండకపోతే నువ్వు కూడా చనిపోయేదానివి. నీ అమ్మ నీకు జన్మ నివ్వటమే కాదమ్మా, పునర్జన్మను కూడా ఇచ్చింది."


 (వుధృతంగా ప్రవహిస్తున్న ఓ వాగులో చిక్కుకున్న ట్రాక్టర్ లో వున్న ఓ తల్లి తను నీటిలో మునిగిపోయే ముందు తన పసిబిడ్డను ఒడ్డుపైకి విసిరి కాపాడటానికి విఫల యత్నం చేసింది. ఆ హృదయ విదారక దృశ్యాన్ని కళ్ళారా చూశాక మదిలో మెదిలిన భవొద్వేగాలకు అక్షర రూపమే ఈ చిన్న కథ)


***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


Comments


bottom of page