top of page

అమ్మాయి కాపురం

#YasodaPulugurtha, #AmmayiKapuram, #అమ్మాయికాపురం, #యశోదపులుగుర్త, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Ammayi Kapuram - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 11/07/2025

అమ్మాయి కాపురం - తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


అది నవంబర్ మాసం. ఉదయం ఆరుగంటల సమయం. దేవకి పూలసజ్జ తో పారిజాత పుష్పాల కోసం ఇంటి వెనుక భాగానికి వచ్చింది. దొడ్లో రక రకాల పూల చెట్లు, కాయగూరల పాదులతో పచ్చగా కళ కళ లాడుతోంది. ఎర్రని మందారాలు వయ్యారంగా చెట్టుకు వేళ్లాడుతున్నాయి. నక్షత్రాలు పరచినట్లుగా నందివర్ఖనం చెట్టునిండా పూలు. కొన్ని మందారాలు కోసి పూలసజ్జలో వేసుకుంది. అలాగే పారిజాతం చెట్టుకింద పరచిన చాపమీద రాలిన పారిజాతాలను ఎక్కడ నలిగిపోతాయో అన్నట్లుగా నెమ్నదిగా ఒక్కొక్కటి ఏరి పూలసజ్జలో నింపుకుని ఇంట్లోకి వచ్చింది. 


ఇది క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం ఆవిడకి. ఒక గంట సేపు పూజా మందిరంలో భక్తి, శ్రథ్దలతో పూజ చేసుకోవడం ఆవిడ దినచర్యలో తొలి భాగం. 


దేవకిది సొంత ఇల్లు. భర్త బ్రతికుండగానే కట్టిన ఇల్లు. విశాల మైన గదులే కాకుండా ఇంటి ముందు, వెనుక భాగాలలో కూడా విశాలమైన స్థలం ఉంచుకుని కట్టుకున్నారు. ముందు వెనుక రక రకాల కాయకూరలు, పూల చెట్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కళ కళ లాడుతూ ఉంటుంది. భర్త హైద్రాబాద్ లో సెంట్రల్ గవర్న్ మెంట్ డిపార్ట్ మెంట్లో ఆఫీసర్ పోస్ట్ లో పని చేసి రిటైర్ అయిన అయిదు సంవత్సరాలకు హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. 


అప్పటికే పిల్లలిద్దరు పెళ్లిళ్లూ అయిపోయాయి. తనుకూడా ఒక ప్రైవేట్ హైస్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేసింది ఒక ఇరవై సంవత్సరాలు. కొడుకూ కోడలూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ హైటెక్ సిటీ లో ఉంటున్నారు వారి ఆఫీసులకు దగ్గరగా. వారికి అయిదు సంవత్సరాల అబ్బాయి. అమ్మాయి మృదులని మంచి కుటుంబంలోకి కోడలిగా పంపించారు. 


దేవకిని కొడుకూ కోడలు తమ దగ్గరే ఉండమని ఎంత బ్రతిమాలినా, “ఇంకా సమయం ఉందిరా మోహన్, మీ దగ్గర కాకపోతే ఎక్కడ ఉంటా”నంటుంది. “కొన్నాళ్లు సొంత ఇంటిలో ఉండనీరా మోహన్, మీ నాన్నకి ఎంతో ఇష్టమైన తోట ని విడిచి రాలేను రా” అంటూ సున్నితంగా జవాబిచ్చే తల్లిని ఏమీ అనలేడు. పోనీలే ఒకే ఊరిలోనే ఉంటున్నాం కదా అనుకుంటూ సంతృప్తి పడతాడు.


కూతురు మృదులది ఉమ్మడి కుటుంబం. కొన్నాళ్లు ఒక మల్టీ నేషనల్ కంపెనీలో రిలేషన్ షిప్ మేనేజర్ గా ఉద్యోగం చేసి పిల్లలు పుట్టేకా మానేసింది. ఉమ్మడి కుటుంబంలో చక్కగా ఇమిడిపోయి అందరి మన్ననలనూ పొందుతోంది. 

ఒక నెలరోజుల క్రితం తమ పక్క వాటాలోకి ఒక కుటుంబం కొత్తగా అద్దెకు దిగింది. 


పక్క పోర్షన్ ని ఒక మంచి కుటుంబానికి అద్దెకిస్తే తనకు కాస్తంత తోడుగా ఉంటారన్న ఆశతోనే కానీ, అద్దె మీద వ్యామోహం కాదు. అద్దెకు దిగిన కుటుంబ యజమాని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వాళ్లు ఫ్లేట్ కొనాలని ఒక బిల్డర్ కి అడ్వాన్స్ పే చేసారుట. నిర్మాణం పూర్తి అయి హేండోవర్ చేసేసరికి ఒక సంవత్సర కాలం పడుతుందని అనేసరికి ఆ ఫ్లేట్ కు దగ్గరలో నున్న ఈ ఏరియాకి, దేవకి గారింటి లోకి అద్దెకు దిగిపోయారు.

అద్దెకు దిగిన రాంగోపాల్, సునీత దంపతులకు ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయికి పెళ్లి చేసి ఆర్నెల్లు అయిందని, కొడుకు బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని చెప్పారు.


వీళ్లు ఇంట్లో దిగేటప్పుడు పెళ్లైన అమ్మాయి కూడా వీరితోనే ఉంది. చూడడానికి బాగుంది ఆధునికంగా. మెడలో సన్నని నల్లపూసల గొలుసు మాత్రమే ఉంది. కాళ్లకు కొత్త ఫాషన్ మట్టెలు పెట్టుకుంది. ఆ అమ్మాయి అత్తవారిది హైద్రాబాద్ అని సునీత దేవకితో చెప్పింది. అల్లుడు సాఫ్ట్ వేర్ ఇంజనీరంటూ చెప్పింది.


ఆ అమ్మాయి పేరు మేఘన అని వారి పిలుపుల ద్వారా తెలుసుకుంది దేవకి. 

కాలం మరో మూడు వారాలు గడచిపోయాయి. 


కనిపించినప్పుడల్లా నవ్వుతూ పలకరించుకోవడం తప్పించితే ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. మేఘన ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుతూ తోటలో తిరుగుతూ ఉంటుంది. వాళ్లు వచ్చి మూడు వారాలు దాటిపోయినా మేఘన భర్తగానీ, అత్తగారింటి వైపు నుండి ఎవరూ కూడా వీరింటికి రాకపోవడం కాస్త ఆశ్చర్యమనిపించింది దేవకికి. తను ఎవరి వ్యక్తిగత విషయాలలోనూ తలదూర్చదు. అందుకే చూసీ చూడనట్లుగా ఊరుకుంది.

ఆరోజు సునీత దేవుడి కి చక్రపొంగలి నైవేద్యం పెట్టిన తరువాత, కాస్త ప్రసాదం, పళ్లూ దేవకికి ఇద్దామని వారింటి కి వచ్చింది. సునీతను చూడగానే దేవకి నవ్వుతూ ఆహ్వానించింది. 


“ఏమిటి సునీత గారూ, మీరు రావాలా?” మీ అమ్మాయిని పంప లేకపోయారా?” అంటూ అభిమానంగా మాట్లాడింది.


“మా మేఘూనా!” సరిపోయింది! అది లేచే సరికే పది దాటుతుంది. “లేవవే తల్లీ!” అంటూ పదిసార్లు లేపితే గానీ లేవదు.”


“మరి అత్తారింట్లో కూడా ఇదే పద్ధతా?” కొత్త పెళ్లి కూతురు అన్నేసి రోజులు పుట్టింట్లో ఉండిపోతే పాపం మీ అల్లుడికి ఇబ్బంది కాదూ? ఈ రోజులే వాళ్లకు మధుర మైన రోజులు సునీతగారూ. బంధం బలంగా పెనవేసుకునేది ఇప్పుడే. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మీరు నాకు సొంత చెల్లెలి లాగ అనిపించి చనువుగా అంటున్నాను.”


దేవకి మాటలకు సునీత ముఖంలో హఠాత్తుగా రంగులు మారాయి. తడబడిపోతూ, “అయ్యో ఎంత మాట! అదేమీ లేదులెండి. మీకు ఆ చనువు ఎప్పటికీ ఉంది. నేనేమీ అనుకోను. వంట మధ్యలో ఆపి వచ్చాను దేవకి గారూ, వస్తా”నంటూ హడావిడిగా వెళ్లిపోయింది. 


సునీత ముఖకవళికలోని మార్పులు దేవకి దృష్టిని దాటిపోలేదు.

ఆరోజు ఆదివారం. అంతక ముందు రోజే కరెంట్ మీటర్ రీడింగ్ చూసి బిల్ ఇచ్చివెళ్లాడు ఎలక్ట్రీషియన్. ఆ బిల్ ఇద్దామని సునీత వాళ్ల పోర్షన్ లోకి వెళ్లింది దేవకి. వారి పోర్షన్ కాస్త వెనగ్గా ఉంటుంది. మెయిన్ డోర్ తెరిచే ఉంది. డోర్ కి కర్టెన్ వేళ్లాడుతోంది. సునీత పనిమంతురాలే. ఇంటిని చక్కగా నీట్ గా పెడుతుంది. తనకి అలా ఉంటే ఎంతో ఇష్టం. లోపలకు వెళ్ల బోయేదల్లా మేఘన గట్టిగా మాట్లాడుతుంటే అక్కడే ఉండిపోయింది. తన పేరు మేఘన ప్రస్తావించిన మూలాన సభ్యత కాకపోయినా అలా నిలబడిపోయింది.


“అయినా ఆ దేవకీ ఆంటీకి నేను పుట్టింట్లో ఉండిపోతే ఏమిటట నష్టం? నన్ను ఆవిడేమైనా పోషిస్తోందా? సాగుతోందా?” మేఘన గొంతుకలో రోషం.


“అవునే మేఘనా, ఎవరైనా అంటారు. పోషిస్తేనే అనాలని రూల్ ఏమైనా ఉందా?” పెళ్లై ఆరునెలలు కాలేదు, ఇలా భర్తతో తగవు పెట్టుకుని వచ్చేస్తే అడగరా? ఇలా రోజుల తరబడి పుట్టింట్లో తిష్ట వేస్తే సమర్థిస్తారా?”


“చూసావా అమ్మా, నాన్న కూడా ఎలా అంటున్నారో చూడు!”


“అబ్బ ఉండండి మీరు మరీనూ! దానికి అత్తవారింట్లో కంఫర్ట్ గా లేదట. ఉమ్మడి కుటుంబం, సంతలా జనం. ప్రైవసీ లేదుట. వచ్చీపోయే వారికి చాకిరీ చేయలేనని, మనం వేరు కాపురం పెడదామని ఇది అల్లుడి దగ్గర వాపోతే, నవీన్ దీని బాధను అర్థం చేసుకోక పోయి, విడి కాపురం లాంటి మాటలు మరోసారి నా దగ్గర ప్రస్తావించ వద్దని, నేనిక్కడే అందరితో ఉంటాను, నీ కిష్టం లేకపోతే ఫో అంటాడా?! 


అదీగాక మన మేఘనకి మొదటి నుండి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేదు. నన్ను అటువంటి కుటుంబంలోకి ఇవ్వకండంటూ ఏడ్చి మొత్తుకున్నా మీరు విన్నారా?” మరో నెలరోజులు అది ఇక్కడే ఉంటే అతను చచ్చినట్లు పరుగెత్తుకుంటూ వస్తాడు చూడండి.”


“స్టాపిట్ సునీ! ఒక తల్లివై ఉండి కూతురికి అలాగేనా నచ్చచెప్పేది? కూతుర్ని సమర్ధిస్తున్నావన్న మాట.”


“నవీన్ అన్నది కరెక్ట్. కుటుంబ విలువలను గౌరవిస్తాడు కాబట్టే అతను విడి కాపురానికి ఒప్పుకోలేదు. దీన్ని బట్టి ఆలోచించు, అతనెంత సంస్కారవంతుడో, తల్లి తండ్రులను ఎంత గౌరవిస్తాడో! అటువంటి నవీన్ మన మేఘనను కూడా ప్రేమగా చూసుకోడా! బంగారం లాంటి అల్లుడు. పెద్ద చదువులు చదువుకున్నాడు. పెద్ద కుటుంబం అని అన్నీ ఆలోచించి పెళ్లి చేస్తే చివరకు నేను చేసింది తప్పంటావా? 


దాని అత్తగారూ మామగారూ ఎంత మంచి మనుషులో నాకు తెలుసు. అంతగా అది అత్త, మామలు ఉండకూడదని అనుకున్నప్పుడు, ఏ అనాథాశ్రమం నుండో ఎవరో ఒకరిని తెచ్చి పెళ్లి చేయాల్సింది. హాయిగా ఒంటిపిల్లి రాకాసిలా ఉండేది.”

“చూడమ్మా నాన్న!” అంటూ ఏడుపు లంకించుకుంది మేఘన.


“చూడు సునీ! నీ కూతురికి ఎలా నచ్చచెపుతావో నాకు తెలియదు. నేను అత్తవారింటికి వెళ్లను, భర్తతో కాపురం చేయను, విడాకులకు దరఖాస్తు చేస్తానంటే మాత్రం చీరేస్తాను దాన్ని.” కోపంగా లోపలకు వెళ్లిపోయి థడాలున తలుపులు మూసేసుకున్నాడు.


దేవకి కరెంట్ బిల్ ఇవ్వకుండానే తిరిగి తన ఇంట్లోకి వచ్చేసింది. మేఘన ఏదో తాత్కాలికంగా పుట్టింటికి వచ్చిందని మాత్రమే తను భావించింది గానీ, ఇలా అత్తవారింట్లో ఉండలేక వచ్చేయడం తనకూ నచ్చలేదు. అదే తన కూతురైతే, అలానే సమర్థించేదా? ఎప్పటికీ సమర్థించదు. అయినా మృదుల స్వభావమే వేరు. కూతురు గుర్తొచ్చేసరికి ఆమె ముఖంలో దరహాస రేఖలు విచ్చుకున్నాయి.


మృదుల అత్తవారిది పెద్ద కుటుంబం. అత్త మామగారితో బాటూ, మామగారి తల్లి, బావగారూ, మరిది, ఆడపడుచూ అందరూ ఉంటారు. ఆడపడుచు పెళ్లి అయిపోయి పూనేలో ఉంటోంది. మరిదికి ఇంకా పెళ్లికాలేదు. తోటికోడలు గైనికాలిజిస్ట్ గా పనిచేస్తోంది. పెళ్లి అయి పిల్లలు పుట్టేవరకు మృదులు కూడా జాబ్ చేసింది. తరువాత తనకు తానే మానేసింది. అత్తవారింట్లో పెద్ద ఆరిందాలా అన్నీ చూసుకుంటుంది. 

దాని తోటికోడలు శ్రావ్య పెద్ద డాక్టర్ అయినా ఆమెలో ఏమాత్రం, అహం, గర్వం కనపడదు. మృదులా, దాని తోటికోడలు సొంత అక్కా చెల్లెళ్లలా ఉంటారు. హాస్పటల్ నుండి రాగానే మృదుల శ్రావ్యకి కాఫీ కలిపి మరీ అందిస్తుంది.


‘నేనే ఎందుకివ్వాలి, నేనే అన్ని పనులు ఎందుకు చేయాలనుకోదు.’ “మృదులను చక్కగా పెంచారు వదినగారూ,” అంటూ వియ్యపురాలు తనతో ఎన్నో సార్లు అన్నప్పుడు తన మనస్సు ఆనందంతో నిండిపోయింది. మృదుల గురించి ఒక్క ఆక్షేపణ లేదు దాని అత్తవారి నుండి.

ఆ రోజు సాయంత్రం అవుతుండగా దేవకి మేఘన కోసం కబురు పంపింది.


రెండు రోజుల క్రితం దేవకి ఆంటీ తన గురించి అన్నమాటలను తన తల్లి ద్వారా విందేమో, అప్పటినుండి ఆవిడంటే అసహనంగా ఉంది మేఘనకు. పెద్ద ఆదర్శవంతురాలిలా సలహా ఇచ్చింది, మరి ఆమె పిల్లలు దేవకి ఆంటీని ఒంటరిగా ఎందుకు వదిలేసారు? ఊళ్లోనే ఇద్దరు పిల్లలున్నా ఈవిడను ఎందుకు చూడడం లేదు? ఆదర్శాలు వల్లెవేయడం కాదు. ఆచరణలో పెట్టగలగాలనుకుంటూ దేవకి మీద గుర్రుగా ఉంది. 


పిలిచింది కదా, బాగుండదనుకుంటూ వచ్చింది.

మేఘనను చూస్తూనే ఆవిడ చిరునవ్వుతో, “ఏమ్మా నాకో సాయం చేయగలవా?” అంటూ అభిమానంగా అడిగేసరికి ఏమనలేక, “చెప్పండి ఆంటీ తప్పకుండా చేస్తా”నంది.

“ఏమీ లేదు మేఘనా, ఈరోజు మా కార్ డ్రైవర్ కి అర్జెంట్ పని పడిందిట. రాలేనన్నాడు. నేనేమో బయటకు వెళ్లాలి. ఈ కేబ్ లు బుక్ చేసుకోవడం అవీ నాకు తెలియదు. కాస్త కేబ్ బుక్ చేసి నీవు కూడా నాతో రాగలవా? తొందరగానే వచ్చేద్దా”మనేసరికి, ఏమనలేక వస్తానంది.


మేఘన ఇంట్లో చెప్పి వచ్చింది. ఇద్దరూ కేబ్ లో బయలదేరారు.


“మా అమ్మాయి ఇంటికమ్మా, దాన్ని చూసి చాలా రోజులైంది. అదేమో నిన్నటి వరకు బిజీ. దాని ఆడపడుచు కుటుంబం వచ్చి నిన్ననే వెళ్లిందిట. అది ఎప్పుడో గానీ రాదు. నేనే వెడుతూ ఉంటాను. ఒక్కర్తినీ వెళ్లలేకే నిన్ను పిలిచాను.”


‘ఈవిడ కూతురింటికి నేనేమిటి” పానకంలో పుడకలాగా’ అనుకోకుండా ఉండలేకపోయింది.


కూతురి అత్తవారిల్లు హడావిడిగా పెళ్లివారిల్లులా ఉంది. వీళ్లను ఆప్యాయంగా ఆహ్వానించారు. మేఘనను మృదులకు మిగతావారికి పరిచయం చేసింది. 


మృదుల హడావిడిగా కాఫీ, పలహారాలు చేయడం, అందరికి సర్వ్ చేయడం, అందరిని పలకరించడం చేస్తోంది. ఈలోగా తోటికోడలు వస్తే ఆవిడకు టిఫిన్ పెట్టింది. 


“థాంక్యూ చెల్లాయ్!” అనగానే మృదుల నవ్వింది. 

కాసేపు అందరూ సరదాగా మాట్లాడు కొన్నారు. మాట్లాడుతూనే అందరి అవసరాలను గమనిస్తూ అటెండ్ అవుతున్న మృదులనే అదేపనిగా చూస్తోంది మేఘన. 


కాసేపున్నాక బయల దేరుతున్నప్పుడు మృదుల మేఘనకు బొట్టుపెట్టి కొత్త చీర ఇస్తూ, “చీరలు కడతావు కదూ మేఘనా! నీకు ఈ చీర బాగా సూట్ అవుతుంది” అంటూ, “అవునూ, ఈసారి మీ ఆయన్ని తీసుకుని మా ఇంటికి రావాలి సుమా” అంటూ సాగనంపింది.


ఆ వీకెండ్ లో దేవకి కొడుకూ, కోడలూ, వారి అయిదేళ్లు మనవడూ వచ్చారు దేవకి ఇంటికి. 


ఇల్లంతా సందడే. కొడుకూ కోడలు వచ్చారని సునీత కుటుంబాన్ని లంచ్ కి ఆహ్వానించింది దేవకి. “తరువాత వస్తామండీ దేవకి గారూ” అన్నా దేవకి బాగా బలవంతం చేసిన మూలాన వెళ్లక తప్పలేదు.


దేవకి సాయం చేస్తానన్నా, కోడలు రమ్య వద్దని ఆవిడను విశ్రాంతి తీసుకోమంది. వంటంతా తనే చేసింది. “అత్తయ్యా, అత్తయ్యా అంటూ గల గల మని కబుర్లు చెపుతూ, అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది. 


అందరూ లంచ్ కి కూర్చొన్నారు. “మా కోడలే వంట అంతా చేసిందనేసరికి, సునీత, ఆమె భర్త రమ్యని చాలా మెచ్చుకున్నారు. పెద్ద ఉద్యోగం చేస్తూకూడా, ఎంతో సింపుల్ గా ఉంటూ, ఒక సాధారణమైన గృహిణిగా ఇంటి పనులు చేసుకునే రమ్య పట్ల వారికి ఒకలాంటి ఆత్మీయతా భావం కలిగింది. 


సునీత భర్త అయితే తన కూతురు కూడా రమ్యలా ఉంటే ఎంత బాగుండునని మనస్సులో పదే పదే ఇనుకున్నాడు. రమ్య మృదులవైపే చూస్తూ, “మీ వారు రాలేదా?” అనేసరికి సమాధానం చెప్పకుండా తల వంచుకుంది. 


ఆ మధ్య కొన్ని రోజుల క్రితం దేవకీ ఆంటీ కూతురింటికి వెళ్లినప్పటినుండి మృదుల మనస్సులో ఏదో తెలియని సంఘర్షణ చోటుచేసుకోవడంతో అస్తిమితంగా ఉంటోంది.

భోజనం చేస్తూండగా దేవకిగారబ్బాయి మోహన్, “అమ్మా! ఇప్పుడు మాతో వచ్చేసి కొన్ని రోజులుండచ్చుకదా?” అనేసరికి, రమ్య, “అసలు ఇక్కడ ఒంటరిగా ఎందుకుండడం అత్తయ్యా? మీరు ఈ ఇల్లు విడిచి రాలేనంటే, పోనీ మేమే వచ్చేసి ఇక్కడుండి పోతాం. మా ఆఫీసులకు దూరమైన ఆ కష్టాన్ని భరిస్తాం. ఏమంటారు అత్తయ్యా?” అనేసరికి 


“నేనే వస్తాను రమ్యా, మీకెందుకు అవస్థ? ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి, మీ మామగారికి ఇష్టమైన ఈ ఇంటిని, తోటని వదలలేని ఏదో బలహీనతతో రానంటున్నాను తప్పించితే, త్వరలోనే తప్పక వచ్చేస్తానమ్మా. అప్పుడు నన్ను వెళ్లిపోమన్నా నా మనవడి పెళ్లి చూడకుండా ఎక్కడకీ కదలను, సరేనా” అనగానే అక్కడ నవ్వులు విరిసాయి. 


‘అబ్బ, ఆరోజు దేవకి గారి కూతురింట్లోనూ ఇదే హడావిడి, ఆనందం. ఇప్పుడు కొడుకూ, కోడలితోనూ అంతే ఆనందంగా ఉన్నారు ఆంటీ. ఆంటీ పిల్లలు ఇక్కడే ఉన్నా, ఈవిడ ఒంటరిగా ఉన్నందుకు లేనిపోని వెన్నో ఊహించేసుకుంది తను. కానీ అవి నిజం కావన్నమాట. అందరూ కాస్తంత దూరంలోనే ఉన్నా మానసికంగా అందరూ ఒకే దగ్గర ఉన్నట్లుగా, ఎంత ఆప్యాయతని ప్రేమను పంచుకుంటున్నారు అందరూ’ అనుకుంటూ ఆశ్చర్యపోతోంది మేఘన.


మరో వారం రోజులు గడిచాయి. సునీత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఎందుకో. అసలు సందడే లేదు.

దేవకి, సునీత కనిపించేసరికి, “ఏమిటి మీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది, మేఘన కూడా కనబడడం లేదే” అనే సరికి, “ఇంకెక్కడ మేఘన దేవకి గారూ, అది అత్తవారింటికి వెళ్లిపోయింది నాలుగు రోజుల క్రితమే.” 


సునీత ముఖం అంతా ఆనందం పులుముకుంది. సునీతను ఇంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు తను. 


“దేవకి తెల్లబోతూ అవునా సునీతగారూ?” వెళ్లే ముందు ఈ ఆంటీని ఒక్కసారి కలవచ్చు కదా!” మేఘన అత్తవారింటికి వెడుతోందని తెలిసి ఉంటే, నేను కూడా కొత్తచీర, పసుపు కుంకుమలు ఇచ్చి ఉండేదాన్ని కదా’. 


“నిజమేనండీ, దాని మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మంచిరోజు చూసుకుని నేనూ, మీ నాన్నా వచ్చి దిగపెడతాం అని చెప్పినా, ‘నేను ఇక్కడకు వచ్చినపుడు మంచిరోజు చూసుకుని వచ్చానా? వెళ్లేటప్పుడు చూసుకోడాని’కంటూ తిరిగి మమ్మల్నే ప్రశ్నించింది. వెళ్లేటప్పుడు చలిమిడి చేసి పెట్టడానికి కూడా టైమ్ ఇవ్వలేదు మాకు. వాళ్ల నాన్న గబ గబా వెళ్లి స్వీట్ షాప్ నుండి స్వీట్లు కొనిచ్చారు.


“ఆ అన్నట్లు మా మేఘూ మీతో మరీ మరీ చెప్పమంది దేవకి గారూ. ఈసారి దాని భర్తతో కలసి వచ్చినపుడు మిమ్మల్ని కలసి మీతో చాలా మాట్లాడతానంది. మీకు థాంక్స్ కూడా చెప్పమంది. దాని మాటలూ, చేతలూ మాకే అర్థం కావు. మీకెలా అర్ఖమవుతాయంటూ” నవ్వింది.


“ఎందుకు అర్ఖం కావు సునీతా, మీ కంటే మేఘనను నేనే బాగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు కావాలనే నేను డ్రైవర్ ను రావద్దని మీ మేఘనను తీసుకుని మా అమ్మాయి ఇంటికి వెళ్లాను. అక్కడ మేఘనకు జ్ఞానోదయం అవుతుందని ఊహించాను. అలాగే మా అబ్బాయి, కోడలు వచ్చినప్పుడు మిమ్మల్ని లంచ్ కి పిలవడం కూడా మేఘనకి కుటుంబ వ్యవస్థ, విలువల పట్ల ఒక అర్థాన్ని సూచించడానికే. నా ప్రయత్నం వృథా అవలేదు. మేఘన లో చక్కని పరిణితి ఏర్పడింది. ఈ మాటలన్నీ దేవకి మనస్సులో అనుకుంది తప్పించితే సునీతకి చెప్పాలనిపించలేదు.”


సునీత మాటలకు తన సంతోషాన్ని వెలిబుచ్చుతూ, “అమ్మాయి కాపురానికి వెళ్లిపోవడంతో మీ ఇల్లు చిన్న బోయిందన్న మాట. అంతేనండి మరి, బాధ లోనే ఆనందం అంటే ఇదే. వస్తాను, సునీతగారూ”, అంటూ దేవకి తన ఇంట్లోకి నడిచింది.


***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


ree


ree




1 Comment


ఓ మంచి కథ వ్రాశారు యశోధ గారు. ఈ కాలం అమ్మయిలు చాలా మందికి పెద్ద కుటుంబాలలో ఎలా సర్దుకు పోవాలో తెలియక సతమతమౌతున్నారు. ఇటువంటి కథలు చదివితే వారికి కనువిప్పు కలుగుతుంది. వృద్ధుల ఆశ్రమాల సంఖ్య తగ్గుతుంది.😊

Like
bottom of page