అమ్మాయికి ఇచ్చిన మాట
- Chilakamarri Badarinath
- 3 days ago
- 9 min read
#ChilakamarriBadarinath, #చిలకమర్రిబదరినాథ్, #అమ్మాయికిఇచ్చినమాట, #AmmayikiIchhinaMata, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

Ammayiki Ichhina Mata - New Telugu Story Written By - Chilakamarri Badarinath Published in manatelugukathalu.com on 01/07/2025
అమ్మాయికి ఇచ్చిన మాట - తెలుగు కథ
రచన: చిలకమర్రి బదరినాథ్
మూర్తి గారు, అతని స్నేహితుడు రావు గారు ఆలా మార్కెట్ లో నడచు కొంటూ వెడుతున్నారు. ఇంతలో ఒక షాప్ దగ్గర మూర్తి గారు ఆగిపోయారు. అది లాటరీ టికెట్స్ అమ్మే షాప్.
రావు గారు వెనకకి తిరిగి చూసి, “ఒరేయ్! నీ పిచ్చి నించి బయటకి రాలేవా?” అని అడిగారు.
“ఒరేయ్, రావాలనే అనుకుంటాను కానీ నా మనస్సుని కంట్రోల్ చేసుకోలేక పోతున్నాను. ఇవాళ నిశ్చయించుకున్నాను. ఇది నా జన్మకి చివరి లాటరీ టికెట్. ఇదిగో.. ఇవాళ ఖచ్చితంగా చెబుతున్నాను. ఇక ముందు ఎట్టి పరిస్థితులలోను లాటరీ టికెట్స్ కొనను.” మూర్తి గారు చాల నమ్మకం గా చెప్పారు.
“ప్రతి సారి ఇదే జరుగుతోంది. ఒక సారి గుండెల మీద చేయి వేసుకొని చెప్పు. ఇలాంటి ప్రామిస్ లు నువ్వు ఎన్ని సార్లు చేసావు? ప్రతి సారీ ఈ షాప్ దగ్గరకి రాగానే నీ కాళ్ళు ఆగి పోతాయి. ఇది నీ మానసిక బలహీనత.” రావు గారు ఆవేదన వ్యక్తం చేసారు.
“నా మాట నమ్ము ఇకముందు నాలోవచ్చే మార్పుకి నువ్వు సంతోష పడతావు” మూర్తి గారు చాల దృఢం గా చెప్పారు, అంటూనే, సమాధానం కోసం ఎదురు చూడకుండా షాప్ లోకి వెళ్లి పోయారు.
షాపు వాడు మూర్తి గారిని చూస్తోనే చాలా సంతోషం గా లోపలి ఆహ్వానించాడు.
“రండి సార్! ఒక మంచి లాటరీ టికెట్ వచ్చింది. ఈసారి ఫస్ట్ ప్రైజ్ అయిదు కోట్లు పెట్టాడు. ధర కొంచెం ఎక్కువ చేసాడు కానీ భలే ఛాన్స్. తగిలిందంటే ఒక్క దెబ్బలో కోటీశ్వరుడు అయిపోవచ్చు.” మూర్తి గారు మాట్లాడే లోపే వాడు చెప్పటం మొదలు పెట్టాడు.
“ఎందుకో నాకు ఇవాళ నా మనస్సు చెబుతోంది. ఎవరైతే ముందుగా షాప్ కి వచ్చి ఈటికెట్ కొంటారో వారికీ ఫస్ట్ ప్రైజ్ గారంటీ గా వస్తుందని. నాకని పిస్తోంది ఆ అదృష్టవంతలు మీరే నని.”
షాప్ వాడు ఆ మాట అనగానే రావు గారు వాడికో చురక అంటించారు. “మరైతే ఆ టికెట్ కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని అనిపించినప్పుడు నువ్వే ఎందుకు ఆ టికెట్ కొనుక్కోకూడదు?”
దానికి వాడిచ్చిన సమాధానం “నా టికెట్ నేనే కొనుక్కుంటే నా వ్యాపారం ఎలా నడుస్తుంది. అక్కడ ఆ పండ్లు అమ్మేవాడిని చూడండి. పళ్ళు బాగున్నాయని వాడే తినడు కదా?”
ఈ సంభాషణ నడుస్తోండగానే మూర్తి గారు జేబులో చేయి పెట్టి పర్సు బయటికి తీశారు. డబ్బిచ్చి కళ్ళు మూసుకొని భక్తిగా దేవుడిని స్మరిస్తో ఆ టికెట్ కొనేశారు. ఆ టికెట్ ని పరిశీలనగా చూసారు. తరువాత రావు తో “ఒరేయ్, నీకొక వింత చూపిస్తాను”
“ఏమిటది?” రావు గారు ప్రశ్నించారు.
“నీ కళ్ళముందే నేను ఈ టికెట్ కొన్నాను ఒకసారి మాత్రమే చూసాను. ఈ టికెట్ నెంబర్ ఏమిటో అని నన్నడుగు.”
రావు గారు మూర్తి చేతిలోనించి ఆ టికెట్ తీసుకొని “ఏది.. చెప్పు” అన్నారు.
వెంటనే మూర్తి గారు ‘టికెట్ నెంబర్ KN 3642136789’ అని చెప్పారు.
రావు గారు ఆశ్చర్య పోయారు. “నెంబర్ చాలా కరెక్ట్ గా చెప్పావు” అన్నారు.
మూర్తి గారి ముఖం వెలిగి పోయింది. “ఒరేయ్ ఈ టికెట్ నెంబర్ మాత్రమే కాదు. ఇంతవరకు నేను కొన్న అన్ని టిక్కెట్ల నంబర్లు నేను చెప్పగలను. ఈ శక్తి నాకు దేవుడు ఇచ్చాడు” మూర్తి గారు చాల గర్వం గా చెప్పారు.
వాకింగ్ ముగించుకొని ఇద్దరు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు.
మూర్తి గారు ఇంట్లోకి వెళ్ళగానే ఆయన భార్య శాంత కాఫీ తీసుకొని వచ్చింది. ఆ కాఫీ గ్లాస్ అందుకొని అలవాటు ప్రకారం న్యూస్ పేపర్ తీసుకొని కాఫీ తాగుతో దాన్ని చదివి స్నానాని కని వెళ్లిపోయారు. స్నానం చేసాక పూజగది లోకి వెళ్లి ఒక అరగంట ఎక్కువ గా పూజ చేసారు. తరువాత గుడికి బయలుదేరారు.
ఇదంతా గమనిస్తున్న ఆయన భార్య “ఏమండి, మళ్లీ లాటరీ టికెట్ కొన్నారా? ఇకముందు జన్మలో లాటరీ టికెట్ కొననని మాకు మాట ఇచ్చారు. మర్చి పోయారా?” భార్య నిలేసింది.
“అవును, నువ్వు చెప్పింది నిజమే. కాని నా మనస్సుని కంట్రోల్ చేసుకోలేక పోయాను. నా మిత్రుడు రావు నన్ను వారించినా వాడి మాట నేను వినలేదు.” మూర్తి గారు నిజం చెప్పేసారు.
“ఇదంతా నా ఖర్మ. పెళ్ళైనప్పటి నించి చూస్తున్నాను.. ఇంతవరకు మీరు ఎన్ని వేల రూపాయలు ఈ లాటరీ టికెట్లు కొనటానికి వ్యర్థం చేసారో ఆలోచించండి. కనీసం ఎప్పుడైనా ఒక పది రూపాయలైనా మీకు వచ్చాయా.?” శాంత ఆవేదన వ్యక్తం చేసింది.
“శాంతా! నా మాట నమ్ము. ఇది నా జీవితం లో నేను కొన్న ఆఖరి లాటరీ టికెట్. నా మనస్సు చెబుతోంది ఈ సారి నాకు తప్పుకుండా లాటరీ వచ్చి తీరుతుంది అని.” ఇక భార్యకి వేరే మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గబగబా చెప్పులు వేసుకొని మూర్తి గారు గుడికి బయలు దేరారు.
‘ఇక జన్మలో ఈయన మారరు. డబ్బంతా ఇలా లాటరీ టికెట్స్ అంటూ బూడిదలో పోస్తారు.’ శాంత అసహనంగా తన నెత్తి కొట్టుకుంది.
గుడి లోకి ప్రవేశించగానే పూజారి గారు ఆహ్వానిస్తో, “మూర్తి గారు రండి.. ఇప్పుడే మీ జాతకం చూసాను. మీకు ఆకస్మిక ధన లాభం వుంది. మీరు చాలా అదృష్టవంతలు, మీకు తెలుసు నా జోస్యం ఎప్పుడు తప్పవలేదు. నా మాటలు నమ్మండి.” పూజారి గారు సంతోషం గా చెప్పారు.
నిజమే. ఆయన దగ్గర జోస్యం చెప్పించుకున్న వాళ్ళు ఈయన చాలా కరెక్ట్ గా జోస్యం చెబుతారని మెచ్చుకుంటారు. ఎంతో మంది ఆయన చెప్పిన జోస్యం నిజమైందని సంతోషం తో ఘనంగా ఆయనికి దక్షిణ గా ఇవ్వటం మూర్తి గారు చాలా సార్లు చూసారు. ఈయన అడగకుండానే నాకు ధనలాభం వస్తుంది అని చెప్పాడంటే నిజం గానే నేను కొన్న లాటరీ టికెట్ కి ప్రైజ్ రాబోతోందా ?
మూర్తి గారి మనసు ఆనందం తో గంతులు వేసింది. దేవుడికి దణ్ణం పెట్టుకొని తనకు లాటరీ లో ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకొని, తనకి మంచి మాటలు చెప్పిన పూజారి గారి కి వంద రూపాయల దక్షిణ ఇచ్చి మూర్తి గారు తిరిగి ఇంటి కి వచ్చేసారు.
*************************************************************
“ఏమిటండి ఎదో వెతుకుతున్నారు.” శాంత అడిగింది.
ఏమి వెతుకుతున్నానో అని మూర్తి గారు భార్యకి చెప్పదలచుకో లేదు. ఆయనకి ఉన్నంటుండి గుర్తు వచ్చింది. ఆ లాటరీ టికెట్ ప్యాంటు జేబులో ఉండిపోయింది. ఆ ప్యాంటు కోసం వెతికితే అది కనిపించలేదు. “శాంతా, నేను నాలుగు రోజులు గా వేసుకుంటున్న ప్యాంటు కనిపించడం లేదు. నీకేమయిన తెలుసా?” మూర్తి గారు భార్యని అడిగారు.
“ఓ అదా.. దానిని ఉతికి ఆరేసాను.” భార్య చెప్పింది.
మూర్తి గారి గుండె ఆగినంత పనైంది. గబా గబ పరిగెత్తుకుంటూ వెళ్లి తడి ప్యాంటు వెతికి జేబులొనించి తడిసి పోయిన లాటరీ టికెట్ బయటికి తీశారు. టికెట్ అంత ఎక్కువగా తడవలేదు. అంటే నా అదృష్టం బాగానే ఉందన్న మాట. నా టికెట్ నన్ను వదిలి పోలేదంటే నాకు లాటరీ లో ప్రైజ్ రా బోతోందా? పూజారి గారు చెప్పినట్టు నాకు ఆకస్మిక ధన లాభం కలగబోతోందా. మూర్తి గారి మనసు ఎన్నో ఆలోచనల లోకి వెళ్లి పోయింది.
*************************************************************
మూర్తి గారు హాల్లో కూర్చుని T V చేస్తున్నారు. ఇంతలో స్నేహితుడు రావు లోపలి వచ్చాడు. “ఏరా మీ అమ్మాయి ఇంట్లో వుందా.. నన్నెందుకో రమ్మని ఫోన్ చేసింది.”
“అవునా. అమ్మా సుమా, రావు అంకుల్ ని రమ్మని పిలిచావుట.” మూర్తి గారు అమ్మాయిని పిలిచారు.
“అవును డాడీ. ఒక ముఖ్య విషయం మాట్లాడాలని పిలిచాను. అమ్మా నువ్వుకూడా వచ్చి కూర్చో.” అమ్మాయి పిలవగానే శాంత వచ్చింది.
“ఏమిటమ్మా ఆ ముఖ్య విషయం?” రావు గారు అడిగారు. అందరు శ్రద్దగా వినటం ప్రారంభించారు.
“చెబుతా అంకుల్’ అంది సుమ. “డాడీ! మీరు నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసారు. నేను ఇంక కొద్ధి రోజుల్లో అత్తారింటికి వెళ్ళబోతున్నాను. నన్ను మీరు సంతోషం గా ప్రశాంతం గా అత్తారింటికి వెళ్లేలా చూడాలి”.
“తప్పకుండ అలాగే పంపిస్తాము.” మూర్తి గారు చాల దృఢం గా చెప్పారు.
భార్య వైపు తిరిగి “విన్నావుగా అమ్మాయి మాటలు. అది వెళ్ళేటప్పుడు నువ్వు ఏమాత్రం కంట తడి పెట్టకూడదు.”
తండ్రి మాట ముగించే లోపే సుమ అందుకుంది. “డాడీ! నేను అమ్మ కంట తడి పెట్టటం గురించి మాట్లాడటం లేదు.”
“మరి..?” మూర్తి గారు విస్మయం గా అన్నారు.
“నా బాధ అంతా మీగురించే.”
సుమ మాట పూర్తి అయ్యే లోపే మూర్తి గారు అందుకున్నారు. “ఏమిటి.. నేను కంట తడిపెడతానని నీ భయమా?” తన అనుమానం వ్యక్త్తం చేసారు మూర్తి గారు.
“చూడమ్మా నాది రాతి గుండె. ఈ రోజు వరకు నేను ఎప్పుడైనా కంట తడి పెట్టగా చూసావా?” చాల ధీమా గా అన్నారు మూర్తి గారు.
“అయ్యో డాడీ.. నేను అమ్మ ఏడుస్తుంది, మీరు ఏడుస్తారు అని చెప్పబోవటం లేదు. నా మనసులోని ఆందోళన అంతా మీ గురించే.”
“నా గురించా? ఎందుకని?” మూర్తి గారి ముఖం లో ప్రశ్న.
సుమ చెబుతోంది.. “మీరు లాటరీ టికెట్స్ పిచ్చి లో పడి మీ ఆరోగ్యం పూర్తి గా పాడు చేసుకుంటున్నారు. ప్రతి సారీ లాటరీ టికెట్ కొనడం.. ప్రైజ్ నాకే వస్తుందని కలలు కనడం.. రిజల్ట్స్ వచ్చాక ప్రైజ్ రాలేదని కుంగి పోవటం.. డాడీ! మీరు లాటరీ టికెట్స్ కోసం డబ్బు వృధా చేస్తున్నారని నా బాధ కాదు. వాటివల్ల మీ ఆరోగ్యం పూర్తి గా పాడు చేసుకుంటున్నారు అని మాత్రమే నా ఆందోళన.”
“అవునండి.. అమ్మాయి చెప్పింది నిజం. ప్రతిసారి టికెట్ కొన్నాక దానిమీదే మీ ఆలోచన అంతా ఉంటుంది. అర్ధ రాత్రి నిద్ర నించి లేచి ‘శాంతా, ఒకవేళ మనకి లాటరీ లో కోటి రూపాయలు వస్తే ఏంచేస్తావు..’అనడం, ‘రాకపోతే మీరేం చేస్తారు’ అని నేను అనటం మాములు అయిపోయింది. ఇక ఇంతటి తో సరి పోదు. సరిగా అన్నం తినరు. మందులు సకాలం లో వేసు కోవటం చేయరు. ఎప్పుడు పర ధ్యానం గా ఉంటారు. నేను ఏదైనా మాట్లాడితే విన్నట్టు నటిస్తారు గాని అది మీ బుర్రలోకి ఎక్కదు.” శాంత తన ఆవేదన వ్యక్త్తం చేసింది.
“షాప్ లో వస్తువులు కొనడానికి వెడితే షాప్ వాడి కి డబ్బిచ్చి వస్తువులు తేవటం మర్చి పోతారు. లేకపోతే షాప్ వాడికి డబ్బులు ఇవ్వటం మర్చి పోయి వస్తువులు తెస్తారు. ఒకో సారీ చిల్లర తీసుకోవటం మర్చి పోతారు. ఏమిటండి ఇలా చేసారు అంటే లాటరీ టికెట్ గురించి ఆలోచిస్తో పరధ్యానం లో మర్చి పోయాను అంటారు. దీని వల్ల మీరు నవ్వుల పాలవుతున్నారు అని నా బాధ” శాంత తన ఆవేదన వ్యక్తం చేసింది.
“అవును డాడీ. అమ్మ చెప్పింది నిజం” సుమ అంది.
“ఒరేయ్, వాళ్ళు చెబుతున్నది నిజం” రావు గారు అందుకున్నారు.
“మొన్నటికి మొన్న ఏం జరిగింది? లాటరీ టికెట్ కొంటాను అంటూ నాకు చెప్పకుండా నన్ను విడిచి రోడ్ క్రాస్ చేయబోయావు. ఇంతలో వేగంగా వస్తున్న కారు కింద పడబోయావు. కారు అతను సడన్ బ్రేక్ వేసి ఉండకపోతే నీ ఫోటో కి పూలమాల వేయాల్సి వచ్చేది. ఇది మొదటి సంఘటన కాదు. ఈ లాటరీ టిక్కెట్ల ఆలోచనలో పడి ఎన్నో ప్రమాదాలు ఎదురుకొన్నావు.
నేను ఈ విషయం ఇంట్లో చెబితే చాల కంగారు పడతారని ఎప్పుడు చెప్పలేదు. మొన్న డాక్టర్ గారు ఏమన్నారో నువ్వే విన్నావు కదా? లాటరీ టిక్కెట్ల పిచ్చిలో పడి అనవసర టెన్షన్ తో నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. బీపీ పెరిగిపోతోంది.
నీకున్న ఇతర రోగాల తో పటు ఈ కొని తెచ్చుకున్న టెన్షన్ హార్ట్ ఎటాక్ కి దారి తీయవచ్చు. ఆహారం సరిగా తీసుకోక పోవడం సరైనా నిద్ర లేక పోవటం తో నీ శరీరం కృశించుకు పోతోంది. నీ ఆరోగ్యం బాగు పడాలంటే లాటరీ టికెట్స్ పిచ్చి వదులుకోవాలి. నువ్వు ఇలాగా ఆరోగ్యం నిర్లక్ష్యం చేసుకొంటే, ఏదయినా జరగ రానిది జరిగితే మీ వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పాడు కదా డాక్టర్. మీ అమ్మాయికి నేను ఆ సంగతే చెప్పాను.”
“అవును డాడీ. మీరు ఈ లాటరీ టికెట్స్ కొనే వ్యసనం ఆపకపోతే నేను అత్తారింటికి వెళ్ళాక ఆనందం గా ఉండలేను. అమ్మకి, మీ స్నేహితుడు రావు గారి కి మీరు మాట ఇట్చి దానిని నిలబెట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు నాకు మాట ఇచినా నమ్మే స్థితి లో లేను” కూతురి ఆవేదన కళ్ళలో నీళ్లు చూసి మూర్తి గారు చలించి పోయారు. భార్య కళ్ళు తుడుచుకోవటం కూడా అయన గమనించారు.
“సుమా, నీ బాధ నాకు అర్థం అయింది. నేను నీకు మాట ఇస్తున్నాను. ఇక మీదట నేను లాటరీ టికెట్స్ కొనను. నన్ను నమ్ము.” ప్రాధేయ పూర్వకం గా అన్నారు మూర్తి గారు.
“లేదు డాడీ. నేను నమ్మను. ఇలాంటి మాటలు మీరు చాల సార్లు చెప్పారు. కానీ మాట నిలబెట్టుకోలేదు” దృఢం గా చెప్పింది సుమ.
వాతావరణం నిశబ్దం గా అయిపోయింది. మూర్తి గారు తీవ్ర ఆలోచనలోకి వెళ్లిపోయారు. అవును సుమ చెబుతోంది నిజమే. నేను ఎన్నో సార్లు మాట ఇచ్చి నిలుపోకోలేదు. ఇప్పుడు నేను మాట ఇస్తాను అని చేప్పినా అమ్మాయి నమ్మదు. మరేం చేయాలి నేను ఏమి చేస్తే అమ్మాయి నా మాట నమ్ముతుంది. వీళ్లంతా చెబుతున్నది కూడా నిజమే. ఇన్ని సంవత్సరాలు ఎన్ని టికెట్స్ కొన్నా ఒక దాని కి కూడా ప్రైజ్ రాలేదు. కేవలం మనస్థాపం మిగిలింది. నిజం గానే నా ఆరోగ్యం పాడయింది.
అమ్మాయి కి నమ్మకం కలిగించటానికి నేను ఏదో ఒకటి చేయాలి. ఏమి చేయాలి ఏమి చేస్తే నన్ను వీళ్లంతా నమ్ముతారు. చివరికి ఎదో నిర్ణయాన్ని కి వచ్చిన, మూర్తి గారు సోఫా లోనించి లేచి తన గది లోకి వెళ్లి తాను కొన్న ఐదు కోట్ల విలువైన లాటరీ టికెట్, ఒక అగ్గి పెట్టె తెచ్చారు. అందరు చూస్తుండగా ఆ లాటరీ టికెట్ కి నిప్పంటించి దానిని బూడిద చేసారు.
మూర్తి గారు చెప్పారు “మీఅందరిని బాధిస్తున్న నా వ్యసనాన్ని ఈక్షణం నించి వదిలేస్తున్నాను. ఇప్పుడు గ్రహించాను ఇలాంటి లాటరీ టికెట్స్ నా దగ్గర ఉన్నంత వరకు నాకు మన శాంతి ఉండదన్న నిజం గ్రహించాను. మనిషి కష్టపడి డబ్బు సంపాయించాలి గాని ఇలాంటి అడ్డ దారులలో డబ్బు సంపాదించాలని అనుకోకూడదు. మనం ఊహించింది జరగ నప్పుడు నిరాశ ఎదురవుతుంది అది మనిషిని క్రుంగ దీస్తుంది. నా బలహీనత మీ అందరిని ఎంత బాధపెడుతోందో నాకు అర్థం ఐంది, నేను ఒక ఊహా ప్రపంచం లో జీవిస్తున్నానని.
ఆశ నిరాశల మధ్య కొట్టాడే జీవితం నించి ఇక నేను బయటకి రావాలని దృఢం గా నిశ్చయించు కున్నాను, ఇక ఈ నిర్ణయం ఎట్టి పరిస్థితి లోను మారదు. మీ అందరికి నా మాట మీద నమ్మకం కలగటం కోసమే ఈ టికెట్ ని కాల్చి బూడిద చేశాను” మూర్తి గారి ఆవేశ పూరిత మాటలు, అయన టికెట్ ని కాల్చి బూడిద చేయటం చూసాక అందరికి ఆయన మీద నిజం గా నమ్మకం కలిగింది.
*************************************************************
మూర్తి గారు రావు గారు వాకింగ్ చేస్తో లాటరీ టికెట్స్ అమ్మే షాప్ దగ్గరికి వచ్చారు. మూర్తి గారిని ని చూస్తోనే ఆనందం గా, షాప్ వాడు, షాప్ బయటికి వచ్చి ఆయనను ఆహ్వానించాడు.
“రండి సార్, ఇవాళ ఇంకో కొత్త లాటరీ వచ్చింది. వాళ్ళు ఇస్తున్న ప్రైజెస్ చూస్తే మీరు కొనకుండా ఉండలేరు”
వాడి మాటలు పూర్తి కాకముందే మూర్తి గారు షాప్ వాడికి దణ్ణం పెట్టి “బాబు.. నీతో నా ఋణం తీరిపోయింది. మా అమ్మాయికి మాట ఇచ్చాను, ఇక జన్మలో లాటరీ టికెట్ కొననని. నేను ఇచ్చిన మాట మీద నిలబడతాను. నువ్వు నన్ను ఎంత టెంప్ట్ చేసినా నేను టికెట్ కొనను. ఒకరకం గా మన ఇద్దరి బంధం ఇక తీరిపోయింది.”అని చెప్పి మూర్తి గారు రావు గారి తో కలిసి వాకింగ్ చేసారు. మొత్తానికి మూర్తి గారి కూతురు ఆయనని మార్చ గలిగింది, రావు గారు మనసులో సంతోష పడుతూ అనుకొన్నారు.
ఇప్పుడు మూర్తి గారు ఎంతో హ్యాపీ గా ఉన్నారు. చీకు చింత లేదు టెన్షన్ లేదు ఆరోగ్యం కూడా బాగు పడింది. ఆయన లో వచ్చిన ఈ మార్పుకి అందరు ఎంతో సంతోషించారు. రోజులు గడుస్తున్నాయి.
ఒక రోజు మూర్తి గారి భార్య శాంత మూర్తి గారిని గుడికి వెడదామని అడిగింది. మన అమ్మాయి కూడా వస్తోంది. మీరు మీ వ్యసనం నించి బయట పడ్డారు. అందుకే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవటానికి వెడదాం”
అందరు బయలుదేరుతోండగా రావు గారు వచ్చారు. “అన్నయ్య గారు సమయానికి వచ్చారు. మాతో పాటు గుడికి రండి”
రావు గారు కూడా వాళ్ళతో గుడికి బయలు దేరారు.
మూర్తి గారిని చూస్తోనే పూజారి గారు చాల ప్రేమ గా గుళ్ళోకి ఆహ్వానించారు. పూజ చేయించాక పూజారి గారు మూర్తి గారిని అడిగారు. “నేను చెప్పినట్టు మీకు ధనలాభం కలిగిందా”
దానికి మూర్తి గారు పూజారి గారు “మీరు చెప్పిన జోస్యం నిజమైంది. నాకు కోట్ల కూడా కొలవలేని మనశాంతి, ఆనందం లభ్యం అయ్యాయి. ఇంత కాలం ఆశ నిరాశల మధ్య నలిగి పోతు జీవితం లో ఆనందం పోగొట్టుకున్న నేను, ఇప్పుడు నాకు లభించిన అమూల్య సంపద మన శాంతి తో నేను నా కుటుంబ సభ్యులు నా మేలు కోరే మిత్రుడు ఎంతో ఆనందం గా ఉన్నాం. అందుకే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవటానికి గుడి కి వచ్చాము. ఈ శాంతి, సంతోషం సంపద మా వద్ద శాశ్వతం గా ఉండాలని మమల్ని అందరిని ఆశీర్వదించండి.”
*************************************************************
ఆ రోజు మూర్తి గారు యధావిధిగా వాకింగ్ నించి వచ్చాక భార్య ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకొని టీపాయ్ మీద ఉన్న పేపర్ అందుకున్నారు. రెండవ పేజీ తిరగేయగానే తాను టికెట్ కొన్న తాలూకు లాటరీ రిజల్ట్స్ కనిపించాయి.
ఆ రిజల్ట్స్ తో నాకేం పని అని వేరే పేజీ లో కి వెళ్లారు మూర్తి గారు.
************************************************************
చిలకమర్రి బదరినాథ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: చిలకమర్రి బదరినాథ్
నేను చిలకమర్రి బదరినాథ్ , హైదరాబాద్‌లోని తారనాకకు చెందిన C S I
R-Indian Institute of Technology (IICT) లో Controller of Stores and
Purchase గా పదవీ విరమణ పొందాను. ప్రస్తుతం గువాహటి అస్సాం స్టేట్లోని
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, లో Stores and Purchase
Department సలహాదారునిగా ఆన్‌లైన్‌లో సేవలందిస్తున్నాను.
1969 సంవత్సరంలో నేను “నవీన బాలానంద సంఘం, అనే బాలల సంఘాన్ని
స్థాపించాను. ప్రతి సాయంత్రం పిల్లలను ఒకచోట చేర్చి, ఆటలు, పాటలు,
నాటకాలు, కథల చెప్పడం వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించేవాణ్ణి. మా
బాలానంద సంఘంలోని పిల్లలు ఆంధ్ర బాలానంద సంఘం వారు నిర్వహించే వార్షిక
నాటక పోటీల్లో పాల్గొని, అనేక ప్రతిష్టాత్మక బహుమతులు గెలుచుకున్నారు.
ఆ కాలంలో నేను స్వయంగా రచించి, దర్శకత్వం వహించిన బాలల న్యాయస్థానం,
కాంతికిరణం, ఒక దీపం వెలిగింది, మంచిరోజులు వచ్చాయి వంటి నాటకాలు ఉత్తమ
స్క్రిప్ట్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ప్రొడక్షన్ వంటి అవార్డులు
గెలుచుకోగా, నాటకాల్లో పాల్గొన్న పిల్లలు అక్కినేని నాగేశ్వరరావు రోలింగ్
షీల్డ్, భానుమతి రోలింగ్ షీల్డ్, రాజబాబు రోలింగ్ షీల్డ్ వంటి
పురస్కారాలను సొంతం చేసుకున్నారు.
బాలానంద సంఘంలో పిల్లలకు కథలు చెప్పినప్పటికీ, నేను ఎప్పుడూ కథ రాయలేదు.
ఈ కథ నా తొలి రచన. కథలు రచించాలన్న ప్రేరణ నాకు నా అన్న గారు శ్రీ
చిలకమర్రి గోపాలకృష్ణ మాచార్యులు గారివల్ల వచ్చింది. ఆయన ఆకర్షణీయమైన
కథలను రచించి, అనేక బహుమతులు గెలుచుకుంటున్నారు. ఆయన కథల ద్వారా నాకు
లభించిన ప్రోత్సాహానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ప్రస్తుతం నేను హైదరాబాదులోని సికింద్రాబాద్ రామకృష్ణాపురం ప్రాంతంలో
స్థిరపడ్డాను.
వ్యసనం వల్ల ఎందరి బ్రతుకులోఛిద్రం కావడం చూస్తూంటాం. కుటుంబ సభ్యులకు, మిత్రులకు వుండే వేదన కళ్ళకు కట్టినట్టు చిత్రీ కరించారు. 💐