top of page

ఆనందాల ఆదివారం



'Anandala Adivaram' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 21/05/2024

'ఆనందాల ఆదివారం' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"గుడ్ మార్నింగ్ బాస్!"

బాస్ ఆనందరావును చూచి నవ్వుతూ చెప్పాడు కిరీటి.


ఆనందరావు ఆ ఆఫీస్ బాస్. ట్రేడింగ్ కంపెనీ. కిరీటి వారి అసిస్టెంట్. ఆనందరావు కిరీటి ముఖంలోకి దీనంగా చూచాడు.

"బాస్! ఏం నీరసంగా వున్నారు? ఆరోగ్యం సరిగా లేదా!" అడిగాడు కిరీటి.


"కిరీటీ!...."


"సార్!..."


"రేపు ఆఫీసుకు రావాలి"


"సార్! రేపు ఆదివారం!...."


"అందుకే ఆఫీసుకు రావాలి!"


"సార్!.... ఆదివారం ఆఫీసు ఎంది సార్!" ఆశ్చర్యంతో అడిగాడు కిరీటి.


కిరీటి ప్రశ్నకు ఆనందరావు ముఖంలో అప్రసన్నత. తీక్షణంగా కిరీటి ముఖంలోకి చూచాడు ఆనందరావు.

"సార్!.... నా ప్రశ్నకు మీకు కోపం వచ్చిందా!"


"ఆహా!... గత ఆదివారం గుర్తుకు వచ్చి ఆనందం పొంగింది!...."


"అర్జంటు పని ఏమీ లేదు కదా సార్!"


"వుంది!"


"అదేమిటి సార్!"


"నేను నీకు వివరాలు ఇప్పుడు చెప్పాలా?"


"మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఒక నిర్ణయం తీసుకొంటాను సార్!"


"అంటే.....?"


"ఎన్నిగంటలకు రావాలి? ఏం చేయాలి?... అనేది తెలిస్తే నేను ఆదివారాన్ని ఎలా గడపాలనేది ప్లాన్ చేసుకొంటాను సార్!"


"ఫుల్ డే పని వుంది"


"ఏం పని సార్!"


"కిరీటీ! నీవు నన్ను విసిగిస్తున్నావ్!" కోపంగా అన్నాడు ఆనందరావు.


"సార్!.... నేను ఏమీ తప్పుగా మాట్లాడలేదు కదా సార్!..." బిక్కముఖంతో అడిగాడు కిరీటి. రెండు క్షణాల తర్వాత....

"సార్!...." మెల్లగా పిలిచాడు కిరీటి.


"చెప్పు!...."


"సినిమాకు టిక్కెట్ ఆన్‍లైన్‍లో మ్యాటినీ షోకు బుక్ చేశాను సార్!"


"సినిమాకా!"


"అవును సార్!"


"ఏ సినిమా?"


"ఆర్. ఆర్. ఆర్"


"ఎన్ని టిక్కెట్లు బుక్ చేశావ్?"


"నాకు నా భార్యకు కలిపి రెండు!"


"కిరీటీ!"


"సార్!"


"నీకు పెండ్లి అయ్యి ఎంతకాలం అయ్యింది?"


"మూడు నెలలు. పెండ్లికి మీరూ వచ్చారు కదా సార్!"


"నేనూ వచ్చానా?"


"అవును సార్!.... వచ్చారుగా!"


"కిరీటీ!...."


"సార్!...."


"నీ భార్య మంచిదేనా?"


కిరీటి ఆశ్చర్యపోయాడు. ’బాస్ నన్ను ఈ ప్రశ్నను అడగడంలో వారి ఉద్దేశ్యం ఏమిటి?’


"జవాబు చెప్పు కిరీటి?"


"సార్!... నా భార్య మా మేనమామ గోవిందరాజుగారి కూతురు. చాలా మంచిది సార్. తను నాకు చిన్నతనం నుంచీ బాగా తెలుసు."


"ఓహో!...."


"సార్!"


"ఏమిటి?"


"మరి నేను రేపు ఆఫీసుకు..."


"తప్పక రావాలి. నేను వస్తున్నాను. అవును నీ భార్య నిన్ను ఎప్పుడూ ఎదిరించదా!"


"ఆ సర్వేశ్వరుని దయ వలన ఇంతవరకూ లేదు సార్!" క్షణం ఆగి..... "సార్!....

మరి మీ ఆవిడ? తప్పుగా అనుకోకండి!"


"రాక్షసి..." కసిగా చెప్పాడు ఆనందరావు.


"సార్!...." ఆశ్చర్యపోయాడు కిరీటి.


"అవును.... తాను అనుకొన్నది వెంటనే జరిగిపోవాలి. పోయిన ఆదివారం ఏం జరిగిందో తెలుసా!...."


"మీరు చెప్పలేదు కదా!"


"అవును కదా!"


అవునన్నట్లు కిరీటి తలాడించాడు.


"చెబుతా విను!"


"చెప్పండి సార్!..."


"పద క్యాంటిన్‍లో కాఫీ తాగుతూ మాట్లాడుకొందాం!"


ఇరువురూ ఆఫీసు నుండి బయటికి వచ్చి క్యాంటిన్ వైపుకు నడిచారు.

"సార్!..."


"ఏమిటి?..."


"రేపు నేను చేయవలసిన పని ఏమిటో చెప్పండి సార్. ఈరోజు ఓవర్ టైం చేసి ముగిస్తాను."


"మరి నేను....?"


"మీరు హ్యాపీగా కరెక్ట్ టైముకు ఇంటికి వెళ్ళండి సార్. రేపు ఆఫీసుకు రావద్దు!" 


ఆనందరావు పరీక్షగా కిరీటి ముఖంలోకి చూచాడు. ఇరువురూ క్యాంటిన్‍లో ప్రవేశించారు. కాఫీ ఆర్డర్ చేశాడు ఆనందరావు. బేరర్ కాఫీ కప్పులను వారి ముందుంచాడు. ఇరువురూ సిప్ చేశారు.

"సార్!...."


"ఏమిటి కిరీటీ!" సౌమ్యంగా అడిగాడు ఆనందరావు. క్షణం తర్వాత....

"కిరీటీ!...."


"సార్!..."


"అరవంలో ఒక సామెత ఉంది."


"ఏమిటి సార్ అది?"


"మనవి అమియదెల్ల ఇరవన్ కుడుత వరం!...."


"అంటే అర్థం సార్!...."


"నీకు తమిళ్ రాదుగా!"


"అవును సార్!...."


"ఆ మాటల అర్థం ’భార్య సమకూరడం అనేది ఆ దైవం ఇచ్చిన వరం’ అని"


"సూపర్ సార్!"


"ఏంది సూపరు?"


"ఆ సామెత సార్!"


"కిరీటీ!..." నీరసంగా అన్నాడు ఆనందరావు.


"నా అర్థాంగి నా కష్టాన్ని, నా ఇష్టాన్ని అర్థం చేసుకోదయ్యా!"


"అయ్యో పాపం!...." ఆశ్చర్యంగా అన్నాడు కిరీటి.


"పోయిన ఆదివారం ఏం జరిగిందో తెలుసా!"


"మీరు చెప్పాలి కదా సార్!"


"ఆ... అవును విను. మా ఇంట్లో పాత మిక్సీ గ్రైండరు, ఫ్లాస్క్, కుక్కరు, అల్యూమినియం సామాన్లు వున్నాయి. రోడ్డున ఒక పాత సామానుల కనుగోలుదారు, ’పళయ మిక్సీ, గ్రైండర్, ఫ్లాస్క్, కుక్కర్ తరమాన వెలకు వాంగ పడుం, వాంగమ్మా వాంగో, వాంగయ్యా వాంగో’ అని అరచుకుంటూ వచ్చాడు. వాణ్ణి మా ఆవిడ పిలిచింది. వాడు ఇంట్లోకి వచ్చాడు. ఆ పాత సామన్లను అతని ముందు వుంచింది. వారు వాటిని పరీక్షించి యాభైరూపాయలు ఇస్తానన్నాడు. నాకు మెలకువ వచ్చినా ఆదివారం కదా అని విశ్రాంతిగా పడుకొన్నా"


"సార్!..."


"ఏమిటి?"


"అతను అరవంలో అన్న మాటకు అర్థం ఏమిటి సార్!"


"పాత సామాగ్రిని న్యాయమైన వెలకు కొనబడును అని..."


"ఓహో!... అలాగా!.... తరువాత చెప్పండి సార్!...."


"ఆదివారం కదా!... నేను హాయిగా ఇంకొంతసేపు నిద్రపోవాలనుకొన్నా. తాను వచ్చి నన్ను లేపింది."

"తొమ్మిది గంటలైంది. ఎంత ఆదివారం అయినా ఏమిటి పాడు కుంభకర్ణుని నిద్ర. లేవండి. పాతసామన్ను కొనే అతను వచ్చాడు. నాకు అరవం రాదుగా. అతనితో మాట్లాడి ఆ సామాన్ను అమ్ముదురుగాని మిమ్మల్నే లేవండీ. వాడూ నట్టింట్లో కూర్చొని వున్నాడు" అంది.


"వాణ్ని పిలిచింది ఎవరు?" అడిగాను.


"నేనే!..." తన సమాధానం.


"నేను కాదుగా!...."


"ఏంటి జోకా!... లేవండి" ముఖంలో చిరాకు.


నా అదృష్టాన్ని తలచుకొంటూ హాల్లో ప్రవేశించాను. "ఎన్నా అప్పా సామాన్ పాతిటియా. ఎల్లాతుకుం ఎవళతరువే" అడిగాను.


"సార్!..."


"ఏమిటి కిరీటీ?"


"మీరు అరవంలో ఏమడిగారు?"


"అన్ని పాత సామానులకు ఎంత ఇస్తావని అడిగా!... వాడు అంబది అన్నాడు"


"అంటే!...."


"యాభై రూపాయలు!"


"మా ఆవిడ ముఖంలోకి చూచి ఆ మాటే చెప్పాను. కనుగోలుదారు మీద మా ఆవిడకు కోపం వచ్చింది."


"దౌజండ్.... వన్ దౌజండ్...!" అంది మా ఆవిడ.


"ఎక్కడ యాభై రూపాయలు.... ఎక్కడ వెయ్యి రూపాయలు ఈ బేరం అయ్యేది కాదనుకొన్నా...."


"ఫైనల్ రేట్ హండ్రెడ్!" అన్నాడు వాడు.


"నో.... నో.... దౌజెండ్!.... మా ఆవిడ మాట...."


"ముడియాదు!...." వాడి జవాబు.


"అంటే ఏంటి సార్!"


"కుదరదు"


"ఓహో!..." క్షణం తర్వాత కిరీటి.... "తరువాత!..." అడిగాడు. 


"వాడు మమ్మల్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నేను శోష వచ్చినట్లు సోఫాలో కూర్చున్నా."


"మా ఆవిడ వంటింట్లోకి వెళ్ళి ఐదునిమిషాల్లో కాఫీ గ్లాసుతో నా ముందు ప్రత్యక్షమై, గ్లాసును నాకు అందించింది. నా ప్రక్కన చిరునవ్వుతో సోఫాలో కూర్చుంది. అప్పుడు నాకు అనిపించింది ఏదో ఫిటింగ్ పెట్టబోతూ వుందని. ఊదుకొంటూ కాఫీ త్రాగడం ప్రారంభించాను.


"ఏమండీ!.... ఏమండీ!.... మీరు స్నానం చేసి టిఫిన్ పొంగలి మీకు ఇష్టమైనది చేశాను. తినండి. మనం రంగనాథన్ స్ట్రీట్‍కు వెళదాం!..." చిరునవ్వుతో చెప్పింది.


చేతిలోని కాఫీ గ్లాసు జారిపోబోయింది. గట్టిగా పట్టుకొన్నాను. "రంగనాథన్ స్ట్రీట్‍కు ఎందుకు?" మెల్లగా అడిగాను.


"ఈ సామానులు విక్రయించి. ఓ పెద్ద కుక్కర్ కొనేటందుకు! " నవ్వుతూ చెప్పింది నా అర్థాంగి సుందరి.


మనస్సున అనుకొన్నాను ’ఇది సుందరి కాదు బందర్ (కోతి)’ అని... "


"కిరీటీ!..... నా భార్య వలన నేను ఒక గుణపాఠం నేర్చుకొన్నాను." విరక్తిగా నవ్వుతూ చెప్పాడు ఆనందరావు.


"అదేమిటి సార్!"


"వాళ్ల మాటను మనం కాదనకూడదు. అంటే రెండు విధాల మనకు నష్టం" విరక్తిగా చెప్పాడు ఆనందరావు.


"అవునా సార్!..." అమాయకంగా అడిగాడు కిరీటి.


మౌనంగా రెస్టు రూముకు వెళ్ళి స్నానం చేసి డ్రస్ చేసుకొని హాల్లోకి వచ్చాను. ఈలోగా మా ఆవిడ రెండు రైసు బ్యాగుల్లో ఆ పాత సామాన్లను అమర్చి గోతాల మూతిని కట్టేసింది. టిఫిన్ తిని, ఆ మూటలను బులెట్ ముందు వెనుక అమర్చుకొని రంగనాథన్ స్ట్రీట్‍కు ఇరువురం బయలుదేరాము. ఆదివారం అయినందున పెద్దగా ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. ఆ స్ట్రీట్‍లో ఎప్పుడూ తిరుణాల జనం. అందునా ఆ రోజు ఆదివారము. ఇసుక వేస్తే నేల రాలనంత జనం. మేజర్ పోర్షన్ ఆడవారే. శరవణా స్టోర్స్ లో ప్రవేశించాము. లోన మహారద్దీ. పాత సామానుల కనుగోలు కౌంటర్‍ను సమీపించి నా చేతిలో వున్న రెండు సంచులను వారి ముందు వుంచి విప్పి సామాన్లను చూపించాము.


వారు.... "నూట యాభై రూపాయలు. వీటి విలువ. మీకు ఏం కావాలి?" అడిగాడు. అతను తమిళియన్... కాని తెలుగు తెలుసు.

"టూలీటర్స్ బటర్ ఫ్లై కుక్కర్..." మా ఆవిడ జవాబు.


"నేను.... మా పాతసామానుకు మరీ చాలా తక్కువ ధర కొట్టారు. మరో మాట చెప్పండి." అడిగాను.


"అందరేట్ ఫైనల్ సార్! బ్యాలన్స్ క్యాష్ కట్టి కుక్కర్ వాంగి కోంగో!..." అన్నాడు ఆ కౌంటర్ వ్యక్తి.


"అంటే ఏంటి సార్!..."


"నేను చెప్పిన నూటయాభై పాతసామానుల ఫైనల్ రేటు. బ్యాలన్స్ కు క్యాష్ చెల్లించి కుక్కర్ తీసుకోండి అని..."


"కుక్కర్ని కొన్నారా సార్!"


"హు....." విరక్తిగా నవ్వాడు ఆనందరావు.

"వీళ్ళు మనలను ఇంటికి వచ్చిన వాడిల మోసం చేస్తున్నారు. ప్యారీస్ కార్నర్‍లో మరో అంగడి ఉంది. అక్కడికి పోదాం పదండి" ఆవేశంగా అంది మా ఆవిడ.


"తప్పదా సుందరీ!" షాపు నుంచి బయటికి చూచాను.


"తప్పదు!...." తాను ముందుకు నడిచింది.


నేను బయట పెట్టిన సామాన్లన్ని సంచుల్లో వుంచి మూతి బిగించి పాతాళభైరవి పాత సినిమాలో మాంత్రికుడు కీ.శే. రంగారావు గారి వెనుక, కీ.శే. రామారావు తోటమాలి నడచిన తీరిగా బులెట్‍ను సమీపించి, ఆ పాత సామన్లు శ్రీమతితో ప్యారీస్ కార్నర్‍కు చేరాను. ఆ షాపు వ్యక్తి మార్వాడి.... "మేము పాత సామానులను కొనము. పరశువాకంలో మా బ్రాంచి వుంది అక్కడ తీసుకొంటారు. మీరు అక్కడి వెళ్ళండి సార్!" వినయంగా వ్యాపార రీతిలో అతను చెప్పాడు.


నా పరిస్థితి.... ’పూర్తిగా మునిగిన వానికి చలి ఏమిటి?’ అదీ నా స్థితి....

"పదండి పరశువాకం...." నా దేవేరి ఆజ్ఞ.


సమయం రెండు గంటలు. పొట్టలో ఎలకలు గడబిడ. ఈ మూటలతో హోటల్లో ప్రవేశిస్తే.... జనం వింతగా చూస్తారేమో!... అనే సందేహం... రెండున్నరకు పరశువాకం షాప్ చేరాము. వారు పాత సామాన్ను పరీక్షించి "రెండువందలు ఇస్తాము. మీకు ఏం కావాలి?" అడిగారు.


"ఫైవ్ హండ్రెడ్!" అర్థాంగి గారి వచనం.


"నో మేడం. మేము బేరాలు ఆడే రీతిగా పాత సామాను ధరను చెప్పము. ఏదో మీరు అడిగారు కాబట్టి ’టూ ఫిఫ్టీ, వీటి వెల ఫైనల్!" చిరునవ్వుతో చెప్పాడు ఆ ఇరవై సంవత్సరాల యతిరాజు. అతను తెలుగువాడు.


నేను "ఏమిటి తమరి ఆజ్ఞ?" అడిగాను సుందరిని.


"బేరం చేయండి!..."


"సుందరీ! నా వల్ల కాదు...."


"బాబూ!.... మీ పేరేంటి" సుందరి గారి ప్రశ్న.


"యతిరాజులు. మాది నెల్లూరు!"


"రాజూ!...."


"అమ్మా!....."


"ఐదువందలు...." సుందరి పూర్తిచేయకముందే....

"వీలుకాదమ్మా!..." వినయంగా చెప్పాడు యతిరాజులు.


నేను ప్రశ్నార్థకంగా సుందరి ముఖంలోకి చూచాను.

"బ్యాలన్స్ పే చేసి టూ లీటర్స్ బటర్ ఫ్లై కుక్కర్ తీసుకోండి" అది అర్థాంగి సుందరి ఆజ్ఞ.


"బాబూ!... యతిరాజు బిల్లు వేసెయ్యి బాబు!"


"అలాగే సార్!"


కౌంటర్ వద్దకు వెళ్ళి బిల్లు ప్రిపేర్ చేసుకొని ఐదునిమిషాల్లో తన స్థానానికి వచ్చాడు యతిరాజు. బిల్లుని చూచి.... "సార్!... బటర్ ఫ్లై టూ లీటర్స్ కుక్కర్ వెల 1900/- మీ పాత సామానుల వెల టూ ఫిఫ్టీ. మీరు చెల్లించవలసినది 1650/- రూపాయలు. ఇదిగో బిల్లు" అందించాడు యతిరాజు.


"సమయం నాలుగు గంటలు. పదిగంటలకు బయలుదేరిన మా పాత సామానుల విక్రయయాత్ర, కొత్త కుక్కర్ కొనుగోలు నాలుగు గంటలకు ముగిసింది,’ అనుకొన్నాను మనస్సున. క్షుద్భాద, దీనంగా సుందరి ముఖంలోకి చూచాను.


"సంతోషమా!...." అడిగాను.


"చాలా!..." నవ్వుతూ చెప్పింది సుందరి.


"సుందరీ!.... ఆకలి?"


"అరగంటలో ఇంటికి పోగలము కాదా!"


"అర్థాంగిగారూ! ఆత్మరాముడు అంతవరకూ ఆగలేనంటున్నాడు. ప్రక్కనే శరవణ భవన్ హోటల్ ఉంది ఏదైనా తిని ఇంటికి బయలుదేరుదాం! ఏమంటావ్?"


"మీ ఇష్టమే నా యిష్టం" అందంగా నవ్వింది సుందరి.


"కొత్త కుక్కర్‍తో ఇరువురం షాపు నుండి బయటికి వచ్చాము. శరవణ భవన్‍లో ప్రవేశించి టిఫిన్ తిన్నాము. నిజం చెప్పాలంటే నాకన్నా తనే ఎక్కువగా తిన్నది. ఇదిగో కిరీటీ!.... ఆడవారికి మన కన్నా ప్రతీదీ అధికమే!...."


"ఐదుగంటలకు ఇంటికి చేరాము. కిరీటి, ఆ రీతిగా పోయిన ఆదివారం నా పాలిట ’ఆనందాల ఆదివారం’ అయింది. ఈ ఆదివారం సుందరిగారు ఏ ప్రోగ్రాం పెట్టిందో నాకు తెలియదు. బులెట్ మీద ఆమెను ఎక్కించుకొని చెన్నై మహానగరంలో మెట్రో రైలు పనిజరిగే ఈ రోజుల్లో వీధుల్లో ట్రాఫిక్‍లో సంచారం చేయలేకపోతున్నా. అందుకే రేపు నేను ఆఫీసుకు రావాలని నిర్ణయించుకొన్నా!....."


"సార్ మరి నేను?.... ఆర్...ఆర్... ఆర్. మ్యాటనీ సినిమా!...."


"కిరీటీ నీవు రేపు ఆఫీసుకు రావద్దు. భార్యతో కలిసి జాలీగా సినిమాకు వెళ్ళు. రాత్రికి...." హేళనగా నవ్వాడు ఆనందరావు.


"సార్!.... ధన్యవాదములు. మీది బంగారు మనస్సు." చేతులు జోడించాడు ఆనందంతో కిరీటి.

*

సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



57 views0 comments

Comments


bottom of page