top of page

అందమైన అబద్ధం



'Andamaina Abaddham' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 04/05/2024

'అందమైన అబద్ధం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



"ఏయ్ సుజీ ! సాయంత్రం బ్యాంకు నుంచి త్వరగా వస్తాను. సరదాగా సినిమాకెళ్లొద్దాం. నీవు, వంశీ సిధ్ధంగా ఉండండి". చెప్పాడు హరి. 


"అలాగే" అని భర్త చేతికి లంచ్ బాక్స్ ఇచ్చింది సుజాత. దాన్ని అందుకుని 'బై' చెప్పి ఆఫీసు కెళ్లాడు హరి. కాసేపటికి వంశీని లేపి వాడి పనులన్నీ చూసి, వాడికి బాక్సు రెడీ చేసి వాడిని స్కూలులో దించి వచ్చింది. ఆతర్వాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసింది. సాయంత్రం స్కూలుకు వెళ్లి వంశీని తీసుకుని వచ్చి వాడిని రెడీ చేసి తనూ‌ రెడీ అయింది. హరిరాగానే అతనికి స్నాక్స్, టీ ఇచ్చింది. ముగ్గురూ కలిసి సరదాగా సినిమాకు వెళ్లివచ్చారు. చక్కని జంట, ముచ్చటైనసంసారం. రోజులు సాఫీగా గడుస్తున్నా యి. 


ఒకరోజున సుజాత షాపింగ్ చేస్తుంటే అక్కడ ఎదురైన ఒకామెను చూసి ఆశ్చర్యపోయింది. ఆవిడ కూడా అంతే. సుజాత వెంటనే తేరుకుని సంతోషంగా "హాయ్ రాధా!" అనటం, ఆవిడ కూడా అంతే ఆనందంతో " హాయ్ సుజీ" అనటం, ఇద్దరూ ఒకళ్లనొకళ్లు హత్తుకోవటం జరిగింది. కాలేజీలో ఇద్దరూ మంచిస్నేహితులు. చదువు పూర్తయాక రాధ వాళ్లు వేరే ఊరికి వెళ్లటం, ఆ తర్వాత సుజాతకు పెళ్లి అవటంతో ఇంక ఇద్దరి మధ్యనా ఏ కమ్యూనికేషన్ లేదు. మరలా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కలవటం. షాపింగ్ పూర్తి చేసుకున్నాక సుజాత రాధను తీసుకుని తన ఇంటికి వచ్చింది. 


అతిథి మర్యాదలయ్యాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. సుజాత హరితో తనకు పెళ్లి, వంశీ పుట్టటం అంతా చెప్పాక, రాధ తన గురించి వివరంగా చెప్పింది. 'బాంకు లో పనిచేస్తున్న వెంకట్ తో తనకు పెళ్లి, సంతోషంగా కాపురం. అన్యోన్యంగా ఉన్న ఆ జంటను చూసి 'విధికి కన్నుకుట్టిందా' అన్నట్లుగా పెళ్లైన 2సం..తర్వాత ఒక యాక్సిడెంట్ లో వెంకట్ ఈలోకాన్ని వీడటం, కొన్నాళ్లకు అతని ఉద్యోగం తనకు రావటం, 'దెబ్బ మీద దెబ్బ' అన్నట్లుగా కూతురికి వచ్చిన కష్టాన్ని చూసి దిగులుతో తన తల్లిదండ్రులు చనిపోవడం, ప్రాణాధికంగా ప్రేమించిన భర్త, తల్లితండ్రులు లేని బాధను భరిస్తూ ఇలా ఒంటరిగా రోజులు గడుపుతున్నాను. ' అని గద్గదిక స్వరంతో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే సుజాత స్నేహితురాలిని దగ్గరకు తీసుకుని కన్నీటిని తుడిచి "ఇంక నుండీ నీకు నేనున్నాను. నీకే కష్టం వచ్చినా నాతో చెప్పటం మరవద్దు" అని సముదాయించి ధైర్యం చెప్పింది. 


కాసేపు ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకున్నాక రాధ తన ఫోన్ నెంబరు, ఇంటి అడ్రసు చెప్పి తనింటికి తప్పకుండా రమ్మని చెప్పి వెళ్లింది. ఆతర్వాత ఇద్దరి మధ్యన తరచూ ఫోన్ల సంభాషణలు మాములే. కొన్నాళ్లకు రాధ అదే ఊరిలో వేరే బ్రాంచ్ కు బదిలీ అయింది. అక్కడే తన సహోద్యోగి అయిన హరిని చూసింది. హరిది తన ప్రక్క సీటులోనే. పరిచయాలయ్యాక 'ఏ సందేహం వచ్చినా తనను అడగమన్న ' అతని మాటతీరు, కలుపుగోలుతనాన్ని మనసులోనే మెచ్చుకుంది రాధ. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా అతన్ని కొన్ని సలహాలు, సందేహాలు అడిగేది రాధ. బాంకులో కూడా అతనికి మంచి పేరుంది. క్రమేపీ ఇద్దరి మధ్యనా మంచి స్నేహం ఏర్పడింది. కొన్ని నెలలకు రాధ గతం గురించి ఆమె నోటి వెంట విన్న హరి బాధపడి 'ఒక స్నేహితుడిగా నీకు ఏకష్టం వచ్చినా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండమని' చెప్పి ఓదార్చాడు. తన గురించి చెప్తూ 'తన భార్య చాలా మంచిదని, భార్యా బిడ్డతో సంతోషకరమైన జీవితం' అని చెప్పాడు. ఎవరి ఉద్యోగబాధ్యతలలో వాళ్లు బిజీగా ఉన్నారు. కాలం సాఫీగా గడిచిపోతోంది. 


ఒక రోజున ఏదోపనిమీద సుజాత బయటకు వెళ్లింది. బాగా నీరసంగా అనిపిస్తే దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేద్దామనుకుని వెళ్లింది. బేరర్ కు ఆర్డరిచ్చాక చుట్టూ పరికించి చూడగా ఒక్క చోట చూపులు ఆగిపోయాయి. ఒక టేబుల్ ప్రక్కన కుర్చీలలో తన భర్త, రాధ కూర్చుని మాట్లాడుతూ కన్పించారు. వాళ్లని చూసి ఆశ్చర్యపోతూ వాళ్ల వద్దకు వెళ్లి కూర్చుందామనుకుని వాళ్లేదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. వాళ్లు తనని చూడలేదు. కాసేపటికి వాళ్లు బయటకు వెళ్లాక తను కూడా ఇంటికి వెళ్లింది. 


ఆ సాయంత్రం హరి బాంకు నుంచి ఇంటికి రాగానే రోజూలాగానే అతనికి స్నాక్స్, టీ ఇచ్చింది. మాటల మధ్యలో తను హోటల్ కు వెళ్లిన విషయం చెప్తూ ' అక్కడ మీతో మాట్లాడుతున్న ఒకావిడను చూశాను. ' అంది సుజాత. ' ఆవిడ తన సహోద్యోగి రాధ. అనుకోకుండా అక్కడ ఆవిడను కలిసి ఏదో మాట్లాడుతూ టిఫెను చేశాము' అన్నాడు హరి. ఆ రాత్రి రాధ ఫోన్ చేసి 'తన సహోద్యోగి హరి సాయంతో అత్తింటి వైపు కోర్టు కేసు నుంచి బయటపడ్డాను. అతను చాలా మంచి వ్యక్తి. ఒక సోదరుడిలా తనకు సాయపడ్డాడు. కృతజ్ణతగా అతన్ని ఈరోజున హోటల్ కు పిలిచి లంచ్ ఏర్పాటు చేశాను' అని మాటల మధ్యలో చెప్పింది. 


భర్త చెప్పిన 'అందమైన అబధ్ధానికి ' మనసులోనే నవ్వుకుంది సుజాత. తన భర్త మనసు గురించి, స్నేహితురాలి గురించి తెలుసు కనుక వాళ్ల మీద తనకేమాత్రం అనుమానం లేదు. పైగా రాధకు తన భర్త చేసిన సాయం విని అతన్ని మనసులోనే మెచ్చుకుంది సుజాత. 


 ఒక ఆదివారం నాడు రాధను తన ఇంటికి భోజనానికి పిలిచింది సుజాత. రాధ రాగానే హరిని, వంశీని పరిచయం చేసింది. రాధను తన స్నేహితురాలిగా భర్తకు పరిచయం చేసింది. ముద్దులొలికే వంశీని చూసి రాధ చాలా ముచ్చట పడింది. రాధా, హరి ఒకళ్లనొకళ్లు ఆనందంతో, ఆశ్చర్యంగా చూడటం గమనించిన సుజాత "మీరిద్దరూ సహొద్యోగులు, మంచి స్నేహితులని రాధ మాటల ద్వారా తెలిసింది. అంతే కాకుండా మీరు ఒక సోదరుడిగా రాధకు చేసిన సాయం కూడా తెలుసు. ఆరోజున హోటల్ లో మీ ఇద్దరినీ చూశాను. మీ ఇద్దరి మంచి మనస్సులు నాకు తెలుసు కనుక ఈరోజు సంతోషంగా రాధను భోజనానికి పిలిచి ఇలా సమావేశం ఏర్పాటు చేశాను " అన్న సుజాత మాటలకు హరి కళ్లు చెమర్చాయి. "అయామ్ సారీ సుజీ. ఆనాడు నేను నీతో అబధ్ధం చెప్పాను. నన్ను క్షమించు. " అని సుజీని దగ్గరకు తీసుకున్నాడు హరి. నవ్వుతూ భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది సుజాత. రాధ, వంశీ చప్పట్లతో సుజాత తెప్పరిల్లి సిగ్గుపడి "అందరం సంతోషంగా భోజనాలు చేద్దామంటూ" డైనింగ్ టేబుల్ వద్దకు దారి తీసింది. వంశీని ఎత్తుకొని రాధ, హరి ఆమెను అనుసరించారు. 


కబుర్లతో అందరూ భోజనాలు పూర్తి చేశాక రాధకు మంచి చీర పెట్టి " చూడు రాధా! దేవుడు నాకు హరి లాంటి మంచి భర్తను, నీలాంటి మంచి స్నేహితురాలిని ఇచ్చినందుకు మనస్సులోనే ఆ దేవుడికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను " అని హత్తుకున్న సుజాతను చూసి రాధ కళ్లు, హరి కళ్లు ఆనంద భాష్పాలతో చెమర్చాయి. 


"నీలాంటి స్నేహితురాలు ఉన్న నేను చాలా అదృష్ట వంతురాలిని సుజీ " అని వాళ్ల వద్ద వీడ్కోలు తీసుకుని తన ఇంటికి వెళ్లింది రాధ. 

   ….సమాప్తం.


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏





72 views0 comments
bottom of page