top of page

వాక్సుధ్ధి -వాక్శక్తి-వాక్చాతుర్యం'Vaksuddhi Vaksakthi Vakchathuryam' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 29/04/2024

'వాక్సుధ్ధి -వాక్శక్తి-వాక్చాతుర్యం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రాజుని, రవినీ గ్రామంలో తల్లి రమణమ్మ కూలీ, నాలీ చేసి కష్టపడి పెంచి పెద్దవాళ్ళను చేసింది. అల్లరి చిల్లరిగా తిరిగే రాజుకు చదువు అబ్బక పొగా, నోటి దురుసుతనం, పొలాల్లో పనివాళ్ళు మాట్లాడుకునే అసభ్య పదజాలం, చెడు అలవాట్లు అలవడ్డాయి. రాజు భవిష్యత్తును గురించి బెంగపడిన తల్లి తన అన్న వద్ద బాధను చెప్పుకుని ' ఎక్కడన్నా వాడికి ఉపాధి చూపించమని కోరగా, ' ఆయన తనకు తెలిసిన ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కుదిర్చి పెట్టాడు. 


ఆయనే తనకు తెలిసిన ఒక మంచి పిల్ల దీపతో పెళ్ళి జరిపించి పట్ణంలో ఒక చిన్న ఇల్లు అద్దెకు చూసి పెట్టాడు. ఇంటర్ వరకూ చదివిన దీప చాలా మంచిపిల్ల, నిదానస్తురాలు. జీవితం అంటే మంచి అవగాహన ఉన్న తెలివైన పిల్ల. తను కూడా ఒక స్కూలులో టీచరుగా పనిచేస్తూ, ప్రైవేటుగా డిగ్రీ చదువుతోంది. రాజుని కూడా చదవమని చెప్పే ప్రయత్నం చేస్తే పురుష అహంకారంతో, నోటి దురుసుతనం చూపేటప్పటికీ ఆ ప్రయత్నం విరమించుకుంది. 'సంస్కారం లేని భర్త ' అని సర్దుకు పోతూ గుంభనంగా సంసారం చేసుకుంటోంది. 


తల్లి కాయకష్టం తెలిసిన రవి, తను కూడా కూలీ, నాలీ చేస్తూ 'వేడినీళ్ళకు చన్నీళ్ళుగా' సంపాదిస్తూ, తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ కాస్త కాస్త కూడబెట్టుకుని కొంచెం కొంచెం పొలం కొనుక్కుంటూ తల్లిని ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆ ఊరిలోనే తెలిసిన ఒక మంచి పిల్ల సరోజను చూసి రవితో పెళ్ళి జరిపించింది రమణమ్మ. రవికి అన్న అంటే చాలా ఇష్టం. కానీ అతను ఎంత ప్రేమగా అన్నను పిలిచినా రాజు ఏనాడూ ప్రేమగా 'తమ్ముడూ' అని పిలవకపోగా, కనీసం మనిషిగా అన్నా చూసేవాడు కాదు. ప్రేమానురాగాలు లేని రాజుతో రవికి రాక- పోకలు కూడా లేవు. 

 

రాజు కాపురం చూసి సంతోషంతో 4 రోజులు ఉందామని వచ్చే రమణమ్మకు కొడుకు నిరాదరణ, ఈసడింపులు, అసభ్య ప్రేలాపన, దురలవాట్లు మనసుకు కష్టం కలిగి, గుండెల్లో గునపం దిగినట్టుగా బాథ కలిగి అతని ఇంటికి రావడం క్రమేపీ తగ్గించేసింది. 


సంస్కారవంతమైన కోడలి ఆదరణ, ప్రేమానురాగాలు మనసుకు కాస్త ఊరటనిచ్చినా, తను రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పెంచిన కొడుకు "ఎప్పటికయినా 'అమ్మా' అని ప్రేమగా పిలుస్తాడని, 'అన్నంపెట్టమ్మా! ' అంటే పాతికేళ్ళ కొడుకును ఎత్తుకొని ఆరుబయట వెన్నెల్లో చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించలేక పోయినా, మనసంతా ఆ భావనను నింపుకొని తన మరో పంచ ప్రాణాలైన ఆ కొడుకుకు ఇష్టమైన గుత్తివంకాయకూర మొ.. వండిపెట్టి దగ్గరుండి కొసరి కొసరి తినిపిస్తూ, వాడి చేత 'అమ్మా! అని పిలిపించుకుంటూ వాడిచేతిలోనే తుదిశ్వాస విడిచి తల కొరివి పెట్టించుకోవాలి " అని ఆ తల్లి లోతుకు పోయిన గాజు కళ్ళతో, పిచ్చి ప్రేమతో ఆశగా ఎదురుచూస్తోంది ఆ కన్న తల్లి. 


తన గ్రామంలోనే వ్రృధ్ధాప్య పెన్షన్ తో, మనోవ్యధతో కాలం భారంగా నెట్టుకొస్తోంది. చిన్నకొడుకు, కోడలు ఎంత ప్రేమగా చూసుకుంటున్నా ఆ తల్లి మనోవ్యధ తీరలేదు. 


మనోవ్యధకు మందులు లేవు కదా! ఆ ఆశ తీరకుండానే కొంతకాలానికి రమణమ్మ తనువు చాలించింది. రాజు, దీపలు వెళ్లి కర్మకాండ తతంగం పూర్తి చేసి వచ్చారు. జీవితం అంటే లెక్క లేని రాజు తన నోటి దురుసు తనంతో ఏ ఉద్యోగం లోనూ ఇమడలేక, భార్య సంపాదనతో బ్రతుకుతూ కాలక్షేపం చేస్తున్నాడు. భర్తను తన ప్రేమతో దారిలోకి తీసుకుని రావాలని దీప చేసిన ప్రయత్నాలన్నీ ' బూడిదలో పోసిన పన్నీరు ' లాగా అయింది. 


కొంత కాలానికి దీప కన్సీవ్ అయి పండంటి కొడుకుకు జన్మ నిచ్చింది. తండ్రిగా మారాక అయినా భర్త మారతాడేమో ఆని భ్రమ పడిన దీపకు అతి కొద్ది నెలలలోనే 'అది తన భ్రమ అనీ, ఇంక అతడిని మార్చ 'బ్రహ్మ 'కు కూడా అసాధ్యం అని' అర్థమైంది. చెడు అలవాట్లతో జులాయిగా మారాడు రాజు. అటువంటి తండ్రి నీడలో తన కొడుకు పెరిగితే వాడి భవిష్యత్తు కూడా పాడవుతుంది అని, డివోర్సు తీసుకుని వేరే ఇల్లు తీసుకుని తన కాళ్ళ మీద తను ధైర్యంగా బ్రతుకుతోంది. కొడుకు హర్షతో హాయిగా ఉంటూ, మానవత్వ విలువలు వాడికి నేర్పుతూ మంచిగా చదివిస్తోంది దీప. 


తనతో పాటే అప్పుడే స్కూలు నుంచి తీసుకువచ్చిన హర్షకు చక్కగా స్నానం చేయించి, ఉతికిన బట్టలు వేసి, వాడికి స్నాక్స్, పాలు ఇచ్చి దగ్గర కూర్చుని చదివిస్తోంది దీప. తెలుగు పుస్తకం తీసి ఆరోజు స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం చదువుతూ

"ఇమ్ముగ చదువని నోరున్, 

'అమ్మా!' అని పిలిచి యన్నమడుగని నోరున్, 

దమ్ముల పిలువని నోరున్, 

గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!" 


“అంటే అర్థమేంటి అమ్మా ?” అన్న ఆ పసిమనసు ప్రశ్నకు 'తన భర్త జీవితమే సరైన సమాధానం' అని మనసులో అనుకుని హర్షను ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని "నీవు బాగా చదువుకుని పెద్దవాడివయ్యాక ఏమి కావాలనుకుంటున్నావు?" అన్న తల్లి ప్రశ్నకు వెంటనే చటుక్కున" కలెక్టర్ అవుతాను" అన్నాడు మెరిసే కళ్ళతో హర్ష. 


"ఇది చాలా మంచి పద్యం. కష్టపడి బాగా చదువుకుంటే మంచి సంస్కారం, వినయ విథేయతలు కలిగి, ఐఏయస్ చదివి నీవు కలెక్టర్ వి అయ్యి మంచి ఉన్నత స్థానంలో ఉంటూ, అందరితో మంచిగా ఉంటూ, నీ నోటి మంచి మాటతో, మంచి మనస్సుతో వందల మంది జీవితాలలో వెలుగును నింపుతావు. 


అలాగే నీవు అమ్మని ప్రేమగా చూసుకుంటూ, ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి రాగానే "అమ్మా! ఆకలవుతోందమ్మా! అన్నం పెట్టవా! " అని ఆడగగానే పరుగు పరుగున వచ్చి నేను ప్రేమగా నీకు కొసరి కొసరి తినిపిస్తాను కదా! అలా అమ్మా "అని ప్రేమగా ఉండాలి. 


నీ తోటి వాళ్ళను, నీ చుట్టుపక్కల వాళ్ళను, నీ ఉద్యోగస్తులను అందరినీ నీ స్వంత అన్నతమ్ములుగా చూసుకుంటూ అందరితో ప్రేమగా ఉంటూ అందరికి సాయం చేయాలి. 


అందరూ ఇలా ఉండాలి అని ఈ పద్యం లోని భావం. "విద్య లేని వాడు వింత పశువు. విద్య సంస్కారాన్ని, వినయ విథేయతలను నేర్పుతుంది. ప్రతి స్త్రీ ని అమ్మా! అని గౌరవించాలి. నీ తోటి వాళ్ళను సోదరులుగా చూస్తూ ప్రేమను పంచాలి. " 


ఇవేమీ లేని వాడి జీవితం" కుమ్మరి మట్టి కుండల తయారీ కోసం మట్టి గుంటలు తవ్వినట్టుగా ఉంటుంది. కుమ్మరి మట్టి కుండ తయారు చేయడం కోసం మట్టి గుంటలు త్రవ్వి, ఆ మడుగులో కాళ్ళతో త్రొక్కుతాడు కానీ అన్ని మట్టి గుంటలు పాత్రలకు, కుండలకు అనుకూలంగా ఉండవు. కొన్ని మాత్రమే యోగ్యం. మంచి బంక మట్టి ఉండాలి. అలాగే పైన చెప్పిన మంచి లక్షణాలు లేని మనుషుల జీవితాలు కూడా వ్యర్థం. ఒక్క మంచి మాటే మనుషులను స్నేహితులను చేసి బంధాలను పెంచుతుంది. ఒక్క చెడు మాట స్నేహితులను విరోథులనుగా కూడా చేసి శత్రృత్వాన్ని పెంచుతుంది. "మాట పదిలం - మనసు పదిలం అంటారు పెద్దలు. ఆ రెండూ స్వఛ్ఛంగా ఉంచుకోవాలి " అన్న తల్లి మాటలను ఆ పసి మనసు అర్థం అయీ అవనట్టు శ్రద్ధగా విన్నాడు. 


   ….సమాప్తం.


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏

50 views0 comments

Comments


bottom of page