top of page

 విధివంచిత'Vidhi Vanchitha' - New Telugu Story Written By Yasoda Pulugurtha

 Published In manatelugukathalu.com On 27/04/2024 

'విధివంచిత' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్"ఏమిటి నాన్నా ఇంతోటి చిన్న అనారోగ్య సమస్యకి అంతలా డీలా పడిపోతారేమిటీ"? 

ఆరోజే హాస్పటల్ నుండి డిస్చార్జ్ అయిన ఆనందరావు కి మందులు వేసి ఆయన సరిగా పడుకున్నాకా పైన దుప్పటిని సరిచేస్తూ చిరుకోపంతో మందలిస్తున్న కూతురు అమూల్య వైపు బేలగా చూసాడు. 


"మీకు వచ్చింది ఛెస్ట్ పెయిన్. సమయానికి వచ్చారని, ఏమీ ఫరవాలేదని ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే చాలని డాక్టర్ చెప్పలేదా? మందులు ఇచ్చారు. వాడితే పూర్తిగా కోలుకుంటారని చెప్పారు కదా నాన్నా? అయినా మీరు అంతగా ఆలోచించి స్ట్రెస్ అవ్వాలసిన సమస్యలు ఏమి ఉన్నాయి నాన్నా"?


"అలా చెప్పవే అమూల్యా, నేవు ఎంత చెప్పినా వినడం లేదు మీ నాన్న" అంటూ వంటింట్లోంచి తల్లి మాట్లాడుతుంటే "అమ్మా ముందు నిన్ను అనాలి. నాన్నకు ధైర్యం చెప్పాలసిన నీవు ముందే నాన్న ఎదురుగా కళ్లనీళ్లు పెట్టేసుకుంటావు” కోపంగా అంటున్న అమూల్య మాటలకు సమాధానమివ్వలేదు కౌసల్య. 


తండ్రి పక్కనే కూర్చుని తండ్రితో చాలా సేపు మాట్లాడి ధైర్యవచనాలు చెప్పిన తరువాత తల్లి దగ్గరకు వచ్చింది అమూల్య. కౌసల్య వంటగదిలో వంట చేస్తోంది. 


"అమ్మా, నిన్ను కోప్పడినందుకు సారీ". నాన్న కి ఏమీ ఫరవాలేదని డాక్టర్ చెప్పారుగా". 


"అవును అమూ. నాన్న గురించి దిగులు కాదే". 


"మరి"?


"ఈ రోజు అంజలి పుట్టిన రోజే అమూల్యా”, ఉన్నట్టుండి ఆవిడ గొంతుకెందుకో గద్గదమైంది. 


"అయ్యో అమ్మా నాకు నిజంగా గుర్తులేదు. నీవు నాన్న గురించి దిగులు పడుతున్నావేమోననుకుంటూ కోప్పడ్డాను. అక్క పుట్టిన రోజన్న సంగతి మరచిపోయాను. 

అప్పుడే అది పోయి అయిదు సంవత్సరాలు అయిపోయిందంటే నమ్మ బుధ్ది కావడంలేదే అమూ”. 


"అమ్మా ఊరుకో. అదేపనిగా ఏడిస్తే చనిపోయిన అక్క తిరిగి వస్తుందా చెప్పు. నాన్నకసలే బాగాలేదు. నీవు థైర్యంగా ఉండాలిగానీ నాన్న దగ్గర ఇలా ఏడిస్తే ఎలాగ"?


"నిజమే అమూల్యా, ఇరవై మూడు సంవత్సరాలు పిల్ల అలా అర్ధాంతరంగా చనిపోవడం తట్టుకోలేకపోతున్నాను". 


"అమ్మా నాన్న గురించి ఆలోచిస్తావా? లేక అక్క గురించే ఆలోచిస్తావా"?


"అక్కని తలచుకోని క్షణం లేదు నాకు. కాని ఎన్నాళ్లని బాధ పడతాం చెప్పమ్మా". 


"సరే అమ్మా నేను ఉంటానిక. మా ఆయన ఇవాళే రావాలి బెంగుళూర్ నుండి. పని పూర్తి కాలేదని రేపు సాయంత్రానికల్లా వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. మా అత్తగారికి జ్వరం. పాపం మా మామగారికి రెండు రోజుల నుండీ కాళ్ల నొప్పులు ఎక్కువైనాయి. రేపు సాయంత్రం రాజేష్ వచ్చాక ఇద్దరం కలసి వస్తాం. నేను నాలుగు రోజులు ఇక్కడ ఉంటాను. జాగ్రత్తమ్మా, ఇంటికి వెళ్లాక ఫోన్ చేస్తాను, బై” అని చెపుతూ అమూల్య వెళ్లిపోయింది. 


అమూల్య వెళ్లిన వైపే చూస్తూ భారంగా నిట్టూర్చింది కౌసల్య. అంజలి ని ఎలా మరచిపోగలదు? అంజలి మరణం కౌసల్య హృదయాన్ని కదిలించి వేస్తోంది. గత జ్నాపకాలు ఆమె కళ్లముందు కదలాడసాగాయి. 


ఆనందరావు రైల్వే లో పనిచేస్తున్నాడు. విశాఖపట్నం వాస్తవ్యుడు. డిగ్రీ పాస్ అయ్యాక రైల్వే కమీషన్ పరీక్ష వ్రాసి సెలక్ట్ అయి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతని తల్లితండ్రులకు ఆనందరావు తరువాత కూతురు రేణుక వారి సంతానం. ఆనందరావు తండ్రి గవర్న్ మెంట్ హై స్కూల్ లో పనిచేసి రిటైర్ అయ్యాడు. తల్లీ తండ్రీ ఇద్దరూ మూడు సంవత్సరాల వ్యవధిలో చనిపోయి అప్పుడే ఏడు సంవత్సరాలు గడచిపోయాయి. కౌసల్య ఆనందరావు కి మామయ్య కూతురే. 


కౌసల్య చాలా అంద గత్తె. డిగ్రీ చదివింది. ఆనందరావు తల్లి వేదవతికి మేనకోడలంటే తగని ఇష్టం. కౌసల్యని ఆనంద్ కి ఇచ్చి చేస్తే ఇద్దరూ తమ కళ్ల ఎదుట చిలకాగోరింకల్లా సంసారం చేసుకుంటుంటే చూసి ఆనందపడాలని ఉవ్విళ్లూరేది. వేదవతి అన్నగారు కూడా సరేననడంతో వారిరువురి పెళ్లి అయిపోయింది. 


ఆనందరావు హైద్రాబాద్ రైల్ నిలయంలో పనిచేస్తూ ఉండేవాడు. పెళ్లైనాకా కౌసల్యతో హైద్రాబాద్ లో సంసారం పెట్టాడు. మామయ్య కూతురైనా ఇద్దరి మధ్యా అంత చనువు ఉండేది కాదు. మామయ్య ఒరిస్సా దగ్గరెక్కడో బేంక్ లో పనిచేస్తూ ఉండేవాడు. మామయ్యతో అంత చనువుకూడా లేదు. 


ఏది ఎలా జరిగినా దైవఘటనను తప్పించుకోవడం ఎవరికీ సాథ్యంకాదేమో. 

ఆనందరావు, కౌసల్యల వైవాహిక జీవితం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగాల్సింది అలా జరగనే లేదు. ఎందుకో కౌసల్య ఆనందరావుతో ముభావంగా దూరంగా ఉండడం మొదలుపెట్టింది. 


ఒకరాత్రి ఆనందరావు నిద్రపట్టక మంచినీళ్లు తాగుదామని వంటగదిలోకి వస్తే కౌసల్య హాల్ లో సోఫాలో కూర్చుని చీకట్లో వెక్కి వెక్కి ఏడవడం గమనించి చటుక్కున లైట్ వేసాడు. ఆనందరావుని చూడగానే భయంతో ముడుచుకి పోయింది కౌసల్య. 


"ఏమి జరిగింది కౌసల్యా. ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావ్" అనగానే భోరున ఏడవడం మొదలు పెట్టింది. 


"బావా నన్ను క్షమించు. నేను ఒక వ్యక్తిని ప్రేమించి మోసపోయాను. మా ఇంటిపక్కనే ఒక ఇంట్లో రూమ్ తీసుకుని ఉండేవాడు. ఎమ్. ఎస్. సి ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. నా స్నేహితురాలి ద్వారా అతనితో పరిచయం అయింది. నన్ను నా అందాన్ని మెచ్చుకుంటూ నా వెంటపడితే అది నిజమైన ప్రేమ అని భ్రమ పడ్డాను. ఫలితంగా అతని తీయని మాటలకు లొంగిపోతూ నా సర్వస్వాన్నీ అతనికి అర్పించాను. అతని పరీక్షలు అయిపోయాయి. జాబ్ రాగానే పెళ్లి చేసుకుంటానన్నాడు. రెండురోజుల్లో ఒక కంపెనీ లో ఇంటర్వ్యూ ఉందని హైద్రాబాద్ వెడుతున్నానని చెప్పడానికని వచ్చాడు. మురిసి పోయాను. నిన్ను వదలలేకపోతున్నానని ఎంతో ఆర్తిగా చెపితే అతని కౌగిలిలో కరిగిపోయాను”. 


వెళ్లిన పదిరోజులకు నాకు ఉత్తరం వ్రాసాడు. మన పెళ్లి జరగదని మా ఇంట్లో ఒప్పుకోరంటూ. ఎందుకంటే మన ఇద్దరి కులాలు, అంతస్తులూ వేరు అన్నాడు. వాళ్లు వేరే కులమని చెప్పాడు. ఇంక కలిసే ప్రయత్నం చేయద్దొని ఎవరిదారులు వారివేనని రాసాడు. ఆ ఉత్తరం నాన్న చేతిలో పడడం నన్ను చంపేయాలన్నంత ఆవేశం రావడం జరిగింది. అప్పుడే వేదవతి అత్త నన్ను కోడలిగా చేసుకుంటానని అనడంతో నాన్న ఆఘమేఘాలమీద నీతో పెళ్లి జరిపించాడు. నేను నిన్ను ససేమిరా చేసుకోనని ఏడ్చినా వినలేదు. నా నోరు కట్టేసి నీకు కట్టపెట్టేసాడు. నిన్ను క్షమించమని అడగడం చాలా చిన్న విషయం బావా. నేను చెడిపోయిన దాన్ని. నన్ను హృదయపూర్వకంగా కోరుకుంటున్న నీకు నేను దగ్గర కాలేకపోతున్నందుకు కారణం ఇదే బావా" అంటూ అతని కాళ్లను పట్టుకుని ఏడ్చేయడం మొదలు పెట్టింది. 


"మాది ప్రేమనుకే, ఆకర్షణ అనుకో, దానికి చిహ్నంగా నా కడుపులో రూపుదిద్దుకుంటున్న ఒక చిన్నారి ప్రాణం. నాకు ఇప్పుడు రెండోనెల బావా. ఇట్టి పరిస్తితిలో నేనేమి చేయాలి? నాకు చచ్చిపోవాలని ఉందంటూ" భోరుమంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. 


"ఆనందరావు కౌసల్యవైపు అలా చేష్టలుడిగినవాడిలా చూస్తూండిపోయాడు. అతని హృదయంలో చెలరేగుతున్న సముద్రపు అలల ఘోఘ". కౌసల్యను జుట్టు పట్టుకుని పాపాత్మురాలా అంటూ తన ఇంటి నుండి బయటకు గెంటగలడా, లేక మామయ్యపై కేసు పెట్టగలడా"?


ఆ రెండూ చేయగలిగితే ఆనందరావు ఒక మామూలు మనిషి మాత్రమే అయి ఉండేవాడు. కానీ మానవత్వాన్ని చాటుకున్నాడు. కౌసల్యకు ధైర్యం చెప్పాడు. జరిగింది ఒక పీడకల అనుకో అంటూ అనునయించాడు. 


నెలలు నిండుతున్న కౌసల్యకు అన్నీ తానై చేసాడు. పురుటికి కూడా ఎవరినీ పిలవకుండా తనే దగ్గరుండీ అన్నీ చేసాడు. పాపాయి పుట్టగానే తన సొంత కూతురు పుట్టినట్లుగా గుండెలకు అదుముకుని మురిసిపోయాడు. అంజలి అని పేరు పెట్టాడు. 

అంజలి పుట్టిన మూడు సంవత్సరాలకు అమూల్య పుట్టింది. ఇద్దరి పిల్లల పట్ల సమానమైన ప్రేమను చూపించేవాడు ఆనందరావు. 


అంజలి చాలా అణుకువగా ఉండేది. ఇంట్లో తల్లీ తండ్రీకి ప్రతీ పనిలోనూ సహాయపడుతూ చక్కగా చదువుకునేది. అమూల్య పెంకి ఘటం. తాను అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. అమూల్య చిన్న పిల్ల అవడం మూలాన కౌసల్యా ఆనందరావులకే కాదు, అంజలికి కూడా మహా ముద్దు. 


అంజలి కి ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే చెన్నైలో ఉద్యోగం వచ్చింది. మరునాడే ప్రయాణం. అన్నీ సర్దుకుంది వెళ్లడానికి. ఈలోపుల కాలేజ్ నుండి వచ్చిన అమూల్య అంజలి వెళ్లిపోతోందని తెలిసి ఒకటే ఏడుపు. "వెళ్లద్దు అక్కా అంటూ అంజలిని పట్టుకుని వదలదే". "అమ్మా అక్కను వెళ్లనివ్వద్దంటూ తల్లి ఒడిలోకి దూరిపోయి ఒకటే ఏడుపు". కౌసల్య అమూల్యని సంభాళించలేకపోయింది. తన పక్కనే కూర్చున్న అంజలి చెల్లెలి వైపే మురిపంగా చూస్తూ "అమూ ఎందుకే అలా ఏడుస్తావ్? రేపు నీ చదువు పూర్తి అయిన తరువాత నిన్ను అమెరికా పంపిస్తాను, వెళ్లి చదువుకోవా అని ఆటపట్టిస్తే", అంజలివైపు తర్జనతో "ఏయ్ అక్కా, నేను నీలా కాదు. నేను ఎక్కడకూ వెళ్లను. ఇదే ఊళ్లోనే ఉద్యోగం చేస్తాను, ఇక్కడే ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుని అమ్మా నాన్ననూ రోజూ చూస్తుంటానని రోషంతో అంటుంటే" తనూ అంజలీ ఒక్కసారిగా నవ్వేసారు. 


తన వరాలమూట అంజలి జ్నాపకాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఈ లోగా భర్త గట్టిగా తనను పిలిచే సరికి ఉలిక్కిపడి గబ గబా అతనున్న గదిలోకి వెళ్లింది. 

"ఏమి చేస్తున్నావ్ కౌసల్యా? అమూల్య వెళ్లిపోయిందా"?


అవునండీ, అరగంట క్రితమే వెళ్లిపోయింది. రేపు సాయంత్రం రాజేష్ తో వస్తాను, నాన్న దగ్గర నాలుగు రోజులుంటానని చెప్పంటూ వెళ్లింది. వంట అయింది పెట్టేస్తాను. డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారా, లేకపోతే ఇక్కడికే తెచ్చేయనా"?


"వస్తాను, ఇప్పుడు బాగానే ఉంది నాకు". 


భర్తకు భోజనం పెట్టింది. అంజలి జ్నాపకాలతో తనకు తినాలనిపించలేదు. భర్త వెళ్లి హాల్ లో సోఫాలో కూర్చుని టి. వి. పెట్టుకున్నాడు. 


వంటిల్లు సర్దుతూండగా అంజలి గుర్తొచ్చింది. రాత్రి భోజనాలు అవగానే వంట గది అంతా నీట్ గా సర్ది పెట్టేది. అటువంటి అంజలి తమకు అందనంత దూరాలకు వెళ్లిపోవడం ఎంత దురదృష్టకరం. 


తన అంజలి కూడా తన లాగే మోసపోవడం విధిలిఖితం కదూ!

జాబ్ లో బాగా స్తిరపడింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మెట్రిమొనీ లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే చెన్నై వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నుండి ఫోన్. అంజలి రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని. 

తనకూ భర్తకూ కాళ్లూ చేతులూ ఆడలేదు. ఏడుస్తూ చెన్నై పరుగెత్తారు. అంజలిని ఆ స్తితిలో చూడలేక కుళ్లి కుళ్లి ఏడ్చారు. సూసైడ్ నోట్ లో ఎవరినీ నిందించకుండా తను వివాహానికి అనర్హురాలినని తెలిసిందని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వ్రాసింది. 


ఆ తరువాత రెండు రోజులకు తమకి కొరియర్ లో ఒక లెటర్ వచ్చింది. అందులో అసలు విషయం వ్రాసింది. 'తన బాస్ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేసాడని, అతనికి అదివరకే పెళ్లి అయిన విషయం దాచి పెట్టాడని, నా ముఖం మీకు చూపించలేక ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని, నన్ను క్షమించమని రాసింది. అమూల్యకు చదువు అయిన వెంటనే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయమని కూడా రాసింది'. 


ఇద్దరూ నెత్తీ నోరు కొట్టుకున్నా లాభం లేకపోయింది. తనకంటే భర్త మరీ డీలాపడిపోయాడు. అంజలి ఆయన ప్రాణం. ఎప్పుడూ ఏదో పొగొట్టుకున్న వాడిలాగ శూన్యంలోకి చూస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే భర్తని బి. పి. , సుగర్ చుట్టముట్టాయి. 


"కౌసల్యా అన్న భర్త పిలుపుకి అంజలి జ్నాపకాలనుండి బయటకు వచ్చి భర్త దగ్గరకు వెళ్లింది. అన్నం తినలేదుకదూ అని భర్త తన ముఖం వైపే చూస్తూ ప్రశ్నిస్తుంటే మౌనంగా తలవంచుకుంది. ఈ రోజు మన అంజూ పుట్టిన రోజు కదూ” అంటూ భర్త జీరపోయిన గొంతుకతో అడుగుతుంటుంటే అవునంటూ తలూపింది. 


నెలలు నిండకుండానే పుట్టేసిందని నలుగురూ ఏమనుకుంటారోనని ఆ రోజు అంజలి పుట్టినప్పుడు అబధ్దమాడాను. ఎందుకు ప్రాణం తీసుకున్నావు తల్లీ? ఈ నాన్నకు అసలు విషయం చెపితే పరిష్కారం చూపేవాడుకదా"? ఆనందరావు గొంతుక గద్గదమైంది దుఖంతో. 


"తప్పు చేయడం మానవ సహజం. దానికి పరిష్కారం ఆత్మహత్యా"? అంటూ విలపిస్తున్న భర్తను సముదాయిస్తూ అతని తలను తన ఒడిలోకి తీసుకుంది కౌసల్య. 

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

42 views0 comments

Comments


bottom of page