అందరూ హీరో హీరోయిన్లే
- LV Jaya
- 1 day ago
- 5 min read

Andaru Hero Heroines - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 03/07/2025
అందరూ హీరో హీరోయిన్లే - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 14)
రచన: L. V. జయ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
పెళ్ళి తరువాత మొదటిసారి ఆఫీసుకి వెళ్ళింది జాగృతి. స్నేహితులు, కొలీగ్స్ అందరి అభినందలు అందుకున్నాక, కంప్యూటర్ ముందు కూర్చుని, పని మొదలు పెట్టాలనుకుంది కానీ, ఎంత ప్రయత్నించినా, పని మీద ద్యాస కుదరలేదు. అత్తగారింట్లోనున్న జరిగిన కొన్ని విషయాలు గుర్తువచ్చి, కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
జాగృతిని గమనిస్తున్న స్వప్న, దగ్గరికి వచ్చి, "జాగృతీ, అంతా ఓకేనా? ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమయిందో చెప్పు" అని కన్నీళ్లు తుడుస్తూ అడిగింది. ప్రాణస్నేహితురాలు వచ్చి అడగడంతో, మనసులోని బాధ బయటకి వచ్చింది జాగృతికి.
*********************************************
జాగృతి ఆడపడుచు పల్లవి, "ఏదైనా సినిమా చూద్దామమ్మా. " అంది వాళ్ళ అమ్మ రాధతో.
"హిందీ సినిమా చూద్దాం. నీ ఫేవరెట్ హీరోయిన్ జుహీచావ్లా సినిమా పెట్టు" అంటూ పల్లవికి సౌంజ్ఞ చేసింది రాధ. పల్లవి 'ఖయామత్ సి ఖయామత్ తక్' పెట్టింది.
"అవునూ, మనం హిందీ సినిమా చూస్తుంటే, మరి ఈవిడ ఏం చేస్తుంది? ఈవిడకి హిందీ రాదుగా పాపం. " అంది రాధ, జాగృతిని ఉద్దేశించి.
"నాకు హిందీ వచ్చండి. మీరిద్దరూ చూడండి. నాకు సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేదు. " అంటూ అక్కడినుండి లేచింది జాగృతి.
"అన్నీ అబద్దాలే. దీనికెలా హిందీ వస్తుంది? మనం నార్త్ లో ఉన్నాం కాబట్టి, మనందరికీ వచ్చు. దీని బతుకంతా ఆంధ్రాలోనే కదా అయిపొయింది. " అంది రాధ, జాగృతిని వెక్కిరిస్తూ.
రాధ మాటతీరు జాగృతికి నచ్చలేదు. 'ఈ ఇంటికి వచ్చినప్పటినుండి చూస్తున్నాను, ప్రతిదానికి నన్ను, మా వాళ్ళని ఎలా అవమానించేలా అని చూస్తున్నారు ఈవిడ! అది, ఇది, అని మాట్లాడుతున్నారు! ఏమిటి నాతో ఈవిడాకున్న ప్రాబ్లెమ్?' అనుకుని, "ఆంధ్రాలో ఉంటే, హిందీ రాకూడదనేమి లేదుకదండి" అంది రాధతో.
"నువ్వు ఇంగ్లీష్ మీడియం కూడా కాదు కదా మా పిల్లల్లాగా. తెలుగులో పుట్టిపెరిగావ్ పాపం. నీకేం వస్తుంది అని అడిగాను" అంది రాధ.
'ఈ ఇంటికి వచ్చినప్పటినుండి ఈవిడ గొప్పలు తట్టుకోలేకపోతున్నాను.' అనుకుని, "భాష నేర్చుకోవడాని కేముందండి. ఎపుడైనా నేర్చుకోవచ్చు." అంది జాగృతి సౌమ్యంగా.
"నీకెంత హిందీ వచ్చొ చూస్తాను. మాతోపాటు సినిమా చూడు అయితే. " అంటూ జాగృతిని బలవంతంగా కూర్చోబెట్టి, పల్లవి పెట్టిన సినిమా చూడమంది.
సినిమా మొదలవకముందే, "మా పల్లవి, అచ్ఛం జుహీచావ్లా లాగా ఉంటుందని, మా నార్త్ వాళ్ళందరూ అంటారు. ఈ సినిమాలో జుహీచావ్లా లాగ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో, మా పల్లవికి కూడా కాలేజీలో చదువుకునేటప్పుడు అలానే చేయించాను. చక్కగా తయారయ్యి, కాలేజీకి వెళ్ళితే, పల్లవి అందాన్ని చూసి, ఆడపిల్లలందరూ కుళ్లిపోయేవాళ్ళు, అబ్బాయిలు వెనకపడేవారు. BA అవ్వగానే, పెళ్ళిచేసేసాం. వెంటవెంటనే చక్కగా ఇద్దరు పిల్లల్ని కనేసింది. " అంటూ పల్లవిని పొగుడుతూ, జాగృతిని తిట్టింది రాధ.
పాతజ్ఞాపకాలని గుర్తుతెచ్చుకుని మురిసిపోయింది పల్లవి.
"సమర్థ్ ని ఏమనేవారమ్మా? పవన్ కళ్యాణ్ అని కదా. " అని అడిగింది పల్లవి, రాధని.
"అవును. ఆంధ్ర వెళ్తే చాలు, సమర్థ్ ని అందరూ పవన్ కళ్యాణ్ తో పోల్చేవాళ్ళు. వాడి జుట్టు కూడా పవన్ కళ్యాణ్ జుట్టులాగా ఉంటుంది. ఇక్కడ కాలేజీలో, వాడు క్రికెట్ ఆడుతుంటే, వాడు జుట్టు అలా అలా ఎగరెయ్యటం చూడడానికి ఆడవాళ్ళందరూ వాడి చుట్టూ చేరేవాళ్ళు. కాలేజీలో ఉన్నప్పుడే వాడికి పెళ్ళిసంబంధం వచ్చింది తెలుసా. ఏ విత్తు వేస్తే, ఆ పంట పండుతుందంటారు. నేను కాబట్టి, అంత అందమైన పిల్లల్ని కన్నాను. " అంది రాధ గర్వంగా.
"నాన్నని శోభన్ బాబు అనేవారు కదమ్మా. నాన్న గురించి కూడా చెప్పు. " అంది పల్లవి, రాధని ప్రోత్సహిస్తూ.
"మీ నాన్నని ఇప్పటికీ అందరూ శోభన్ బాబు అనే పిలుస్తారు. ఆయన స్టేజ్ ఎక్కి, 'భలే మంచి రోజు, పసందైన రోజు' అని పాడుతుంటే, పెళ్ళైన ఆడవాళ్లు కూడా, చప్పట్లు కొట్టడం మర్చిపోయి ఆయన్నే చూస్తుండిపోయేవారు. అలాంటి అందమైన భర్తని చేసుకున్నందుకు నన్ను చూసి కుళ్ళిపోయేవారందరూ. " అంది రాధ మురిసిపోతూ.
"నువ్వు, నాన్నా మొదటిసారి కలిసినప్పుడు ఏమైందో చెప్పమ్మా. ప్లీజ్. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది. " అని రాధని అడిగింది పల్లవి.
పల్లవి, రాధని ఏదైనా చెప్పమని అడిగిన ప్రతిసారి, రాధ, పల్లవిని చిరాకుగా జాగృతిని చూడడాన్ని జాగృతి గమనించింది.
'వీళ్లిద్దరు కావాలనే ఈ విషయాలని నా ముందు మాట్లాడుతున్నారు అని అర్ధం అవుతోంది. కానీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. ' అనుకుంది జాగృతి.
రాధ కళ్ళుమూసుకుని, గతస్మృతుల్ని నెమరువేసుకుంటూ, "అప్పుడు నాకు పదహారేళ్లు. చాలా చిన్న పిల్లని. తొమ్మిదో క్లాస్ చదువుతున్నాను. నవలలు చదివే అలవాటు ఎక్కువగా ఉండేది నాకప్పుడు. నేను చేసుకోబోయే అతను, ఆ నవలల్లోని హీరోలా ఉండాలనుకునేదాన్ని. ఒకరోజు, లంగా ఓణీ వేసుకుని, మా ఇంటి కిటికీ దగ్గర కూర్చుని, యద్దనపూడి సులోచనారాణి నవల చదువుకుంటున్నాను.
అచ్చం నేను చదివే నవలలోని హీరోలా, పెద్ద కాలరున్న షర్ట్, బెల్ బాటమ్ ప్యాంటు, టక్ చేసుకుని, బెల్ట్ పెట్టుకుని, బూట్స్ వేసుకుని, సిగరెట్ కాలుస్తున్న మనిషి మా ఇంటివైపే వస్తుండడం చూసాను. మొదటిచూపులోనే, అతని మీద మనసు పారేసుకున్నాను. అతను నేనున్న కిటికీ దగ్గరికి వచ్చి, 'రాధ ఇల్లు ఇదేనా?' అని నన్ను అడిగితే, నా మనసులో వీణలు మోగినట్టు అయ్యింది.
సిగ్గుతో పరిగెత్తి లోపలకివెళ్ళి, ఇలాంటతను నాకు భర్తగా వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను. తరువాత తెలిసింది, అతను నన్ను చూడడానికే వచ్చాడని. పెళ్లిచూపులు జరగకుండానే, అతను నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నపుడు నా అనడానికి అవధులు లేవు. గొప్పింటి సంబంధమని, కట్నం అడగలేదని, శోభన్ బాబు లాగా ఉన్నాడని అందరూ అంటుంటే, నేనెంత అదృష్టవంతురాలనో తెలిసి మురిసిపోయాను. నా స్నేహితులందరూ నన్ను చూసి ఎంత కుళ్లిపోయారో తెలుసా?" అంది రాధ సిగ్గుపడుతూ.
అప్పుడే వచ్చిన మాణిక్యాలరావు, రాధ చెప్పిందంతా విని, "చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అని నిన్ను చూసి అబ్బాయిలందరూ పాడేవారని చెప్పవేం వాణిశ్రీ. " అన్నాడు.
రాధ మొహం సిగ్గుతో కందిపోయింది. "నేను వాణిశ్రీ లాగ ఉంటానని అందరూ అంటారు. మన కుటుంబాన్ని చూసి, నాకు ఎంత గర్వంగా ఉంటుందో. అందరం అందమైన వాళ్ళమే కదా. " అంది రాధ మురిసిపోతూ.
మాణిక్యాలరావు వెళ్ళగానే, జాగృతిని చీదరంగా చూస్తూ, "మనఇంటికి ఇలాంటిది వచ్చిందేమిటో! అసలు సమర్థ్ కి ఇదెలా నచ్చిందో అర్ధంకావటంలేదు. ఒక్క అవయవం కూడా సరిగ్గాలేదు ఈవిడకి. ఆడపిల్ల లక్షణాలు అస్సలేవు. అందుకే దీనికి పెళ్ళి కూడా ఇంత లేట్ అయ్యింది.
ఇంజనీరింగ్ చదివిందని గొప్ప. దీని చదువు నాకెందుకు, నాలిక గీసుకోవడానికి. ఇక బాగ్ ఊపుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. వీళ్ళకి పిల్లలు ఎప్పుడు పుడతారో, పుట్టే పిల్లలు ఎలా ఉంటారో? అసలు దీని మొహం సమర్థ్ ఎలా చూడగలుగుతున్నాడో?" అంది రాధ.
జాగృతి, మెరిట్ లో ఇంజనీరింగ్ చదివింది. పెద్ద ఐటీ కంపెనీలో, మంచి ఉద్యోగం చేస్తోంది. చూడడానికి సింపుల్గా, హుందాగా ఉంటుంది. అందంగా ఉండాలని, హీరోయిన్ లా కనపడాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. చదువు, ఉద్యోగం తప్ప ఇంకేమి ఆలోచించని జాగృతి, రాధ అంటున్న మాటలని, చూస్తున్న చూపులని తట్టుకోలేకపోయింది. 'వీళ్ళు నన్ను ఇన్ని మాటలు అని, వీళ్ళ గురించి నేను కూడా అనుకునే అధికారాన్ని నాకు ఇచ్చారు.
నిజంగానే ఈవిడ అనుకుంటున్నట్టు, ఈవిడ కుటుంబ సభ్యులు అంత అందంగా ఉన్నారా? సమర్థ్ తప్ప మిగతావాళ్లందరూ నాకన్నా పొట్టివాళ్ళే! అందరూ లావుగానే ఉన్నారు!! చిన్నకళ్ళతో, బారపళ్ళతో, నోరువిప్పితే 32 పళ్ళు కనపడేటట్టుగా ఉంటూ, కీచుగొంతుతో మాట్లాడుతున్న పల్లవి, మిస్ ఇండియా అయిన జుహీచావ్లాలాగా ఉందా?!
మొగాళ్ళని ఆకర్షించుకునేలా తయారవ్వడం, పిల్లల్ని కనడం ఇవేనా ఆడవాళ్ళకుండాల్సిన లక్షణాలు? పెళ్లికోసం మాత్రమే డిగ్రీ చదువుకున్న పల్లవిని, నన్నూ ఎలా పోల్చగలరు? చామనచాయకన్నా తక్కువ రంగుతో, పొట్టతో, బండగా ఉన్న సమర్థ్, పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడా?
కాకిపిల్ల కాకికి ముద్దు అంటే ఇదేనేమో! ఇక ఈవిడకి, నోట్లో నాలుగు పళ్ళు ఉన్నాయి. కనీసం నాలుగున్నర అడుగులు కూడా లేని ఈవిడ, తనని తను వాణిశ్రీతో పోల్చుకుంటోంది. బాబోయ్ ఇదేం అందం పిచ్చి. ఒంటినిండా స్ఫోటకం మచ్చలున్న ఈవిడ భర్త, శోభన్ బాబు!
వీళ్లిద్దరికీ మొదటి చూపులోనే పుట్టిన ప్రేమ! దానికో కథ!! గురివింద గింజ, తన నలుపెరగదు అని, ఇలాంటివాళ్ళని చూసే అంటారేమో!! ఇంత వయసొచ్చినా, ఆ సిగ్గెంటో? ఆ గొప్పలేంటో!!' అనుకుంది జాగృతి.
************************************************************
"చదువు, సంస్కారం ఉన్నవాళ్ళింటికి వెళ్లాననుకున్నాను. కానీ అందం పిచ్చి, హీరో హీరోయిన్లతో పోల్చుకుని వాళ్ళంటికి వెళ్ళాను. వీళ్ళకి నా మంచితనం, చదువు, సంస్కారం అక్కరలేదు. మా అత్తగారి మాటలు, చూపులు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది స్వప్న" అని కళ్లనీళ్లు పెట్టుకుంది జాగృతి.
"అయ్యో. జాగృతీ. బాధపడకు. ఎలాంటివాళ్ళకైనా సినిమాలపిచ్చి, అందంపిచ్చి ఎక్కువగానే ఉంటున్నాయి. నీకలాంటి అలవాట్లులేవని అందరూ నీలాగే ఉండరుగా. మీ అత్తగారు, ఆవిడ గొప్ప ఎంత చెప్పుకున్నా పర్వాలేదుకాని, నిన్ను ఇంతలా అవమానించడం తప్పే. నువ్వు బాధపడకుండా ఉండాలంటే, నేనొకటి చెప్తాను. చేస్తావా?" అంది స్వప్న. చెప్పమంది జాగృతి.
"వాళ్ళనివాళ్ళు సినిమా హీరోహీరోయిన్లతో పోల్చుకున్నారు కదా, మరి నువ్వెలా ఉంటావో వాళ్ళకి తెలియదను కుంటున్నావా?" అంది స్వప్న.
"అంటే? నాకు అర్ధం కాలేదు. " అంది జాగృతి.
"నిన్ను మొదటిసారి చూసినప్పుడే, నువ్వు సిమ్రాన్ లాగ ఉన్నావని అనుకున్నాను నేను. " అంది స్వప్న.
"అబ్బా. నువ్వు కూడానా?" అంది జాగృతి తలపట్టుకుని.
"చెప్పింది విను. నిన్ను హీరోయిన్ పోలిస్తే, నీకు నచ్చదని నాకు తెలుసు. అందుకే, ఇన్నాళ్ళు నీకీ విషయం చెప్పలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేనే కాదు, నిన్ను, నీ పర్సనాలిటీని, పొడుగుజుట్టుని, డిగ్నిటీనీ చూసి, మన ఆఫీసులోవాళ్ళందరూ కూడా అలానే అనుకుంటారు. నువ్వు ఇంత సింపుల్గా ఉన్నా, నీ వెనక ఎంతమంది అబ్బాయిలు పడ్డారో తెలుసా? " అంది స్వప్న.
"ఆపు స్వప్న. ప్లీజ్" అంది జాగృతి చిరాకుగా.
"నేను చెప్పేది నీకు అర్ధంకావటంలేదు. ఇంతమందికి నువ్వు సిమ్రాన్ లాగ అనిపించినప్పుడు, మీ వాళ్ళకి అనిపించే ఉంటావుగా? నువ్వు బాగుంటావని మీ అత్తగారికి, ఆడపడుచుకి తెలుసు. ఆ కుళ్లుతోనే నిన్ను ఏడిపిస్తున్నారు." అంది స్వప్న.
"నన్ను కావాలనే ఏడిపిస్తున్నారు. ఆ విషయం నాకు అర్ధం అయ్యింది. " అంది జాగృతి.
"ఇంకెప్పుడైనా మీ అత్తగారు నిన్ను వెక్కిరిస్తే, నేను సిమ్రాన్ లాగా ఉంటానని అందరూ అంటరాని చెప్పు. గొప్పలు చెప్పి, నిన్నంక అవమానించదు. " అని సలహా ఇచ్చింది స్వప్న.
"ఇంతకీ నన్ను కూడా అందం పిచ్చున్నవాళ్లతో కలిపేసావ్. " అంది జాగృతి కోపంగా.
"తప్పదు జాగృతి. ఎలాంటివాళ్ళని అలాంటి మాటలతోనే కొట్టాలి. అప్పుడే వాళ్ళకి అర్ధమవుతుంది. " అంది స్వప్న.
స్వప్న ఇచ్చిన సలహాకి, ధైర్యానికి, జాగృతి మనసు కుదుటపడి, "ఇంతకీ, అందరం హీరోహీరోయిన్లమే అన్నమాట. నిజంగా ఇలా చెప్పాలంటావా?" అంది నవ్వుతూ.
"నేను నీకు చెప్పినవేవి, నువ్వు వాళ్ళతో చెప్పవని నాకు తెలుసు. 'అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీలేనిదే ఎగిరెగిరి పడుతుంది' అంటారే. నువ్వు అలాంటిదానివి. నువ్వెలా ఉన్నావో అలాగే ఉండు. వాళ్ళకి చెప్పకు. కానీ మనసులో అనుకో. నీకు మనశ్శాంతి అయినా వస్తుంది. " అంది స్వప్న, జాగృతిని హత్తుకుని.
***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
బాగుంది