top of page

అన్నా చెల్లెళ్ళు

#KLakshmiSailaja, #కేలక్ష్మీశైలజ, #AnnaChellellu, #అన్నాచెల్లెళ్ళు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

 ‘పోతే రానివారు తోబుట్టువులు’


Anna Chellellu - New Telugu Story Written By K. Lakshmi Sailaja

Published In manatelugukathalu.com On 05/10/2025

అన్నా చెల్లెళ్ళు - తెలుగు కథ

రచన: కే. లక్ష్మీ శైలజ


అరుంధతిని చూడగానే సంతోషంగా ఎదురు వచ్చింది అనుష్క. అనుష్క పెళ్ళై నాలుగు నెలలు అయింది. అందువల్ల పుట్టింటి వాళ్ళను చూడగానే అలా ఫీల్ అయ్యింది. ఆమె అనుష్కకు మేనత్త. 


"బాగున్నావా తల్లీ!" అంది అరుంధతి అనుష్కను దగ్గరికి తీసుకుంటూ. 


ఆమె బెంగుళూర్ నుంచి అనుష్కను చూడటానికి వచ్చింది. ఆమె తెచ్చిన పళ్ళు, స్వీట్స్ అనుష్కకు అందించింది. 


"బాగున్నాను అత్తయ్యా" ఆమెకు మంచినీళ్ళు ఇస్తూ అంది అనుష్క. 


మధ్యాహ్నం వరకూ వాళ్ళ ఇంట్లో ఆల్బమ్స్ చూస్తూ, తమ విశేషాలు కొన్ని చెప్తూ గడిపింది అరుంధతి. అనుష్క వాళ్ళత్తయ్య సుధకు వంటలో సహాయం చేసింది అరుంధతి. 


అనుష్క పట్టు చీరలు, కొత్త చీరలు అన్నీ ఒకసారి సర్ది పెట్టింది అరుంధతి. 


తను తెచ్చిన వెండి కృష్ణుడిని వాళ్ళత్తయ్యకు చూపించి అనుష్కకు ఇచ్చిందామె. అనుష్క భర్త అరవింద్ కు ఒక గడియారం ఇచ్చింది. 


ఇంట్లో అనుష్క కూడా అత్తగారితో కలిసి బాగా పనిచేస్తుంటే అరుంధతి సంతోషపడింది. 


"అదేమిటి ఉదయం నుంచీ ఆరతి కనిపించనే లేదు!?" కొంచెం ఆశ్చర్యంగా అంది అరుంధతి. 


ఏమీ చెప్పలేక ఒక వెర్రి నవ్వు నవ్వాడు అరవింద్. "కార్యాలయపు పని చేసుకుంటూ ఉందేమో వదినగారూ" అన్నాడు అరవింద్ వాళ్ళ నాన్న తిలక్. 


ఆ రోజు అరవింద్ పుట్టిన రోజు. పక్క పోర్షన్లో ఆరతి వాళ్ళున్నారు. అరవింద్ చెల్లెలు ఆరతి. అన్నా చెల్లెళ్ళు దగ్గరగా వుంటారని అరవింద్ కు, ఆరతికి తిలక్ ఇక్కడ చెరొక ఇల్లు కొని ఇచ్చాడు. అరుంధతి మనసులో ఏదో సందేహం వస్తొంది. ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఒక గంట స్వంత పనులకు వాడుకోని వాళ్ళెవరున్నారు అనుకుంది. స్వంత అన్న పుట్టిన రోజుకు పక్కింట్లో ఉండి కూడా మధ్యాహ్నమయినా కూడా విషెస్ చెప్పలేనప్పుడు చెల్లెలు ఇంటి పక్కనున్నా.. 'ఇరాక్' లో ఉన్నా ఒకటే అనుకుంది అరుంధతి. 


ఆ తరువాత అనుష్క చెప్పింది, వివరాలు అరుంధతితో. ఆడపిల్లను గౌరవంగా చూడాలని అరవింద్ ను తక్కువ చేసి మరీ అల్లుడిని, కూతురిని ఎక్కువ చేస్తూ అత్త మామలు ఆరతికి విపరీతమైన గౌరవమిచ్చి ఆరతి అంటే అమ్మోరన్నంత శ్రద్ధగా మర్యాద చేస్తారట. ఈ మధ్య తిలక్ ఒక ప్లాట్ కొనుక్కొని ఇంకొక ప్లాట్ ఆరతికి కూడా కొని ఇచ్చాడట. 


అందువల్ల ఆరతి ‘నాకు అమ్మా నాన్నలు డబ్బిస్తారు, అన్న, వదినలకు అసలు రెస్పెక్ట్ ఇవ్వవలసిన అవసరం లేద’న్నట్లు ప్రవర్తిస్తుందట. 


అమ్మా, నాన్న నాకు ఆస్తులిస్తున్నారు, నీతో పనేంటన్నట్లు అన్నయ్యను వారానికొకసారి కూడా చూసి మాట్లాడటం ఏమీ చెయ్యదట. అప్పుడప్పుడు వాళ్ళింటికి వీళ్ళే వెళ్ళి వస్తారట. అది విని అరుంధతి నిట్టూర్చింది. 


ఆర్. ఓ. వేస్ట్ వాటర్ ను సన్నటి పైప్ ద్వారా సందులో ఉన్న చెట్లకు పెట్టి ఉండటం గమనించిన అరుంధతి "చాలా మంచి పని చేశారు. ప్రతి నీటి బొట్టును జాగ్రత్త చెయ్యమని చెప్తూన్నదాన్ని మీరు ఆచరిస్తున్నారు" అనిమెచ్చుకుంది. 


వంటచేసుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. 'కేరళ స్టొరీ' సినిమా గురించి మాట్లాడుతూ "మా క్లాస్ మొత్తానికి ఒకే ఒక ముస్లిం అమ్మాయి వుండేది. వాళ్ళు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేము" అంది అనుష్క. 


అవునంటూ అందరూ బాధపడ్డారు. ‘ఫ్రెండ్ గా వుండి ఆడపిల్లలను మోసం చెయ్యడానికి సహాయపడిందని

అలాంటి వాళ్ళను నమ్మకూడ’దని చెప్పుకున్నారు. 


ఆ రోజు అరవింద్ వాళ్ళమ్మ పాయసం, వడ, పులిహోర చేసింది. అవి కొంత భాగం ఆరతి వాళ్ళకు ఇచ్చి వచ్చింది కూడా. అందులో తప్పేముందిలే, వాళ్ళ కూతురుకి పిండివంటలు ఇచ్చుకోవడం తప్పేం కాదు అనుకుంది అరుంధతి. కానీ అటువైపు నుంచి కూడా అటువంటి మర్యాదలు వుండాలి. అప్పుడే అందరి గౌరవం నిలుస్తుంది, అని మాత్రం అనుకుంది. 


అనుష్క చెప్పినవి మాటలు విన్న అరుంధతి ఆరోజు మధ్యాహ్నం తిలక్ తోను, సుధ తోనూ ఇలా చెప్పింది. 


"ఇలా చెప్తున్నానని ఏమనుకొకండి మరిది గారూ. మాకూ ఆడపిల్ల వుంది. ఎంతవరకు మర్యాదగా చూడాలో అంతవరకూ మర్యాదగా చూస్తాం. అంతేకానీ కొడుకుకు కాదనేంత కాదు. ఆడపిల్లను గౌరవంగా చూడాలి. కానీ ఆ ఆడపిల్ల అన్నదమ్ములను గౌరవించలేనంత కాదు. ఎక్కలేనంత పైకి అందలం ఎక్కిస్తే ఆడపిల్లలు ఆతరువాత దిగమన్నా దిగలేరు. ఆ అహంకారాన్ని అలాగే పెంచుకుంటారు. 


సుధా, మా అమ్మాయికి కూడా ఈ మధ్యనే మా అబ్బాయితో పాటు ఒక ఇల్లు కొనిచ్చాము. అయినా వాళ్ళన్నయ్యతో ఒద్దికగా వుంటుంది. మగపిల్లవాడితో సమానంగా ఆస్తి ఇచ్చారు కదా అని ‘నేను గొప్ప’ అని ఆడపిల్ల అనుకోకూడదు. ఇంకా వాళ్ళ ఆస్తిని ఇచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతగా ఉండాలి గానీ గర్వంగా కాదు. 


ఇలా ఎవరు నేర్పిస్తున్నారో కానీ చాలా పొరపాటు. ఎందుకంటే మనం ఆడపిల్లను గౌరవించి కొడుకుతో సమానమైన ఆస్తులిచ్చి అత్తగారింట్లో గౌరవాన్ని నిలబెడ్తున్నాము. వాళ్ళు కూడా మనకు అనుకూలంగా వుండాలి. ఆ తరువాత మీ ఇష్టం. అందరూ కలిసి ఉంటేనే ఆనందం. 


ఒకవేళ ఆడపిల్లను కొడుకూ, కోడలు నిర్లక్ష్యంగా మాట్లాడితే అప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లకు మనం ఆసరా ఇచ్చి కాపాడాల్సిందే. అంతేగానీ ముందుగానే మనం ఆ పిల్ల వైపు మాట్లాడి అన్నాచెల్లెళ్ల మధ్య దూరాన్ని పెంచకూడదు. 


నేను ఉదయం నుంచీ చూస్తున్నాను. ఇంటిపక్కపక్కనే ఉన్న అన్నాచెల్లెళ్ళు బర్త్ డే కాకున్నా రోజుకొకసారి మొహామొహాలు చూసుకొలేనప్పుడు మీరింత కష్టపడి ఇద్దరికీ రెండు ఇండ్లు పక్కపక్కనే తీసి ఇచ్చినా ఫలితం శూన్యం. ఆడపిల్లకు ఆత్మ గౌరవం వుండొచ్చు కానీ అహంకారం ఉంటే ఇంటికి అనర్థమే కానీ ఆనందమేమీ ఉండదు" 


ఇదంతా విని తిలక్ చాలా సేపు ఆలోచించుకొని లేచి ఆరతి వాళ్ళింటికి వెళ్ళాడు. కొద్ది సేపటికి ఆరతితో వచ్చాడు. అందరూ ఏమీ జరగనట్లు ఆరతితో మాట్లాడారు. ఆరతి అరుంధతిని పలకరించింది. 


అరుంధతి “ఏమ్మా.. అన్నయ్య తో ఆడుకున్న ఆటలన్నీ ఈ రోజు గుర్తుకొస్తున్నాయా?” అంది నవ్వుతూ. 


ఆరతి కూడా నవ్వుతూ అభిమానంగా అన్నయ్యను చూసింది. అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, ఒక డ్రెస్ ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసి అరవింద్ ఆశీస్సులు తీసుకుంది. అందరూ కలిసి భోజనం చేశారు. ఆరతి భర్త క్యాంప్ కు వెళ్ళినందున రాలేదు. 


ఆరతికి పసుపు, కుంకుమ ఇచ్చి చీర పెట్టీ పంపించింది సుధ. తన మాటలు వాళ్ళల్లో కొంతైనా పరివర్తన తెచ్చినందుకు అరుంధతి సంతోషించింది. 


“చాలా సంతోషం సుధా. ఆరతి ఇలా కలిసిపోతుంటేనే తరువాతి తరంలో అన్నాచెల్లెళ్ళ పిల్లలు కూడా కలిసిమెలిసి అంటారు. బంధాలు గట్టిపడతాయి” అంది. 


భవిష్యత్తు లో కూడా అన్నా చెల్లెలు ఇలాగే కలిసి వుండాలని వారిని అరుంధతి ఆశీర్వదించింది. తిలక్, సుధ కూడా అందరూ కలిసి ఉండాలని కోరుకున్నారు. 


 సమాప్తం


కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 సమాప్తం

ree

రచయిత్రి పరిచయం: నా పేరు కె.లక్ష్మీ శైలజ

నేను ఏం. ఏ. ఎం. ఫిల్., చేశాను.

మహిళా అభివృద్ధి శిశుశంక్షేమ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాను. స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర A . కోడూరు. ప్రస్తుతం హైదరాబాదు లో నివాసం. నా పందొమ్మిదవ సంవత్సరం లో మా అమ్మ ప్రోత్సాహం తో మొదటి కథ వ్రాశాను. పాతిక కవితలు వ్రాశాను. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కెనడే వారి (బి.వి.ఆర్.ఫౌండేషన్) బహుమతులను ..అమ్మ, నాన్న, నేను...స్వయంకృతం.. అనే కవితలు గెలుచుకున్నాయి. 10 వ్యాసాలు వ్రాశాను. నేను టెలిఫోన్స్ గురించి వ్రాసిన వ్యాసానికి నంద్యాల కాలేజెస్ లన్నింటిలో ప్రథమ బహుమతి వచ్చింది.

ఇప్పటికి వంద కథలు... తెలుగు వెలుగు, బాల భారతం, ఆంధ్రభూమి, వార్త, సంచిక, ఈనాడు, వార్త, ప్రజాశక్తి, సూర్య, విశాలాంధ్ర, ఉషా, సాహితీ కిరణం, అంతర్జాల పత్రిక మనోహరం లలో , మన తెలుగు కథలు లో ప్రచురితమయ్యాయి. మనతెలుగు కథలు ఐదు కథలు నందు వారం వారం బహుమతులను, సంచిక, సాహితీ కిరణం లందు కథలకు బహుమతులు వచ్చాయి

నా పబ్లిష్ అయిన కథలను ...మనందరి కథలు ...అనే పేరున రెండు

సంకలనాలుగా ప్రింట్ చేయడం జరిగింది.

కొనిరెడ్డి ఫౌండేషన్ ప్రొద్దుటూరు వారు.. మనందరి కథలు... కు మార్చ్ ఎనిమిది 2025 న పురస్కారం ఇవ్వడం జరిగింది.

రచయిత్రుల గ్రూప్ ...లేఖిని...సాహిత్య సాంస్కృతిక సంస్థ... లో 74 మంది రచయిత్రుల తో కూడిన సంకలనం..కథల లోగిలి.. లో నా కథ... పుత్రునికి పునర్జన్మ ...ప్రచురించారు. నారం శెట్టి బాల సాహిత్య పీఠం వారి కథాసంకలనం లో ...జిమ్మీ నా ప్రాణం...అనే కథ ప్రచురించారు.

జిమ్మీ నా ప్రాణం కథ.

వేరే వారి కథలను మన తెలుగు కథలు, మనోహరం లలో చదివి వినిపించాను. సంగీత ప్రవేశం లో జూన్ 2022 న తానా గేయ తరంగాలు జూమ్ మీటింగ్ లో గేయం రచించి పాడటం జరిగింది. నెల్లూరు లో ఘంటసాల పాటల పోటీ లందు ఎస్. పి. వసంత గారు బహుమతిని ఇవ్వడం జరిగింది.

ఇంకా చిత్ర కళలో.. చందమామ.. వారు బహుమతిని ఇవ్వడం జరిగింది.


Comments


bottom of page