సహ జీవనము
- Nandyala Vijaya Lakshmi
- 6 days ago
- 4 min read
#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #SahaJeevanamu, #సహజీవనము, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Saha Jeevanamu - New Telugu Story Written By - Nandyala Vijaya Lakshmi
Published in manatelugukathalu.com on 05/10/2025
సహ జీవనము - తెలుగు కథ
రచన: నంద్యాల విజయలక్ష్మి
శేఖర్ గీతల పెళ్ళి పెద్దలు ఏర్పాటు చేసినదే. పెళ్ళికి ముందు శేఖర్ గీత కలిసి పార్క్ కి వెళ్ళారు. గీత కు కొంచము సిగ్గు, భయము వేసాయి. శేఖర్ ఏమి మాట్లాడుతాడో వినాలి అని ఉంది. ఎన్నో ఊహించుకుంది గీత.
ఇవేమి పట్టనట్లు "గీతా. మాది పెద్ద కుటుంబము. మన పెళ్ళయ్యాక నువు అందరితో కలిసి పోయి, బాధ్యతలు పంచు కోవాలి" అన్నాడు శేఖర్.
ఇంక చెప్పేది ఏమీ లేదు అన్నట్లు ఆగాడు.
గీతకు ఇది ఏమంత ముఖ్యము అనిపించలేదు. ఏ ఆడపిల్ల అయినా అత్తగారి కుటుంబముతో కలవాల్సిందే అనుకుంటుంది. వాళ్ళు మరీ రాక్ష సులు అయితే తప్ప, తనకు విలువ ఇచ్చి ప్రేమగా ఉంటే చాలు అనుకుంది. శేఖర్ కి ఎలా చెప్పాలి?.. ఆలోచిస్తోంది.
“ఇంక వెళదాము.” అంటూ శేఖర్ పార్క్ బయటికి నడిచాడు. గీత ప్రాణం ఉసూరుమంది. కాస్సేపు సరదాగా తిరుగుదాము అంటాడేమో అనుకుంది. చేసేది లేక గీత అతనిని అనుసరించింది. తనకు శేఖర్ విషయాలు ఎన్నో తెలుసుకోవాలి అని ఉంది. కానీ ఎలా?
ఇంతలో ఇల్లు వచ్చింది.
“అప్పుడే వచ్చేసారే అంటూ నవ్వింది శేఖర్ అక్క వనజ.
"రండి, టిఫెన్ తినండి” అంటూ అమ్మా నాన్న హడావుడి పెట్టారు. శేఖర్ గబగబా తినేసి "ఇంక మేము బయలుదేరుతాము” అంటూ బయటకు వెళ్ళాడు.
అమ్మ వనజకు బొట్టుపెట్టి పండు తాంబూలము ఇచ్చింది. నాన్న తెలిసిన ఆటో అతనిని పిలిచారు. ఇద్దరూ ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. గీత ఏదో పుస్తకము చదువుతూ పడుకుంది. ఇంతలో అమ్మానాన్నల మాటలు వినబడ్డాయి.
ఈ సంబంధం కుదిరినట్లే. పెళ్ళి చూపులు నామమాత్రమే. వాళ్ళకు మనము తెలుసుట. అందుకనే వచ్చారు.”
"అమ్మయ్య. పోనీలెండి. మీ పని సులువు అయింది. ఇంక పెళ్ళి ఏర్పాటుకు కావలసినవి సమకూర్చుకోవాలి.”
వాళ్ళిద్దరి మాటలలో సంతోషము. గీతకి ఏమి అనాలో తోచలేదు. నిజమే.. నాన్న తన పెళ్ళి సంబంధాల కోసము చాలా ఊళ్ళు తిరిగారు. కొన్ని తన చదువు ఎక్కువ అని మరికొన్ని తనరంగు నలుపు అని కట్నము ఎక్కువ ఇవ్వరేమో అని ఇలా చాలా సంబంధాలు తప్పి పోయాయి.
కొన్ని తమకు నచ్చలేదు. ఆస్థి లేకపోయినా ఉద్యోగము మంచిది అయితే చాలు అనుకున్నారు. అందుకని అమ్మానాన్నలకు ఈ సంబంధము నచ్చింది. శేఖర్ ముభావ స్వభావము గుర్తొచ్చి గీతకు అతను అంటే మరీ ఇష్టం ఏర్పడలేదు కానీ అయిష్టత లేదు. తీరా తను వద్దు అని చెపితే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఇంటికి పెద్దపిల్ల తను. తన పెళ్ళి అయితే కానీ మిగిలిన బాధ్యతలు అవవు. పూర్తి అంగీకారము లేకపోయినా తన ఊహా జీవితానికి స్వస్తి పెట్టి శేఖర్ తో పెళ్ళికి ఒప్పుకుంది గీత. పైగా కట్నము ఇవ్వవలసి వచ్చింది. కొంచెము బాధ అనిపించినా తప్పలేదు.
ఉన్నంతలో శేఖర్ గీతల పెళ్ళి ఘనంగానే చేసారు గీత తల్లిదండ్రులు. శేఖర్ మంచివాడే కానీ చాలా మొండివాడు. తను అనుకున్నది జరగాలి. ఎదుటివారి మనసు అర్థం చేసుకోడు. ఆ ప్రయత్నం చెయ్యడు. ఎవరినీ ఏ విషయములోనూ సంప్రదించడు. తను నిర్ణయము తీసుకుంటాడు. అందరూ అది పాటించాలి. లేకపోతే కోపము వస్తుంది. అప్పుడు చాలా కటువుగా మాట్లాడుతాడు.
ఆ తర్వాత మామూలే. అన్నీ మర్చిపోతాడు. గీతకు మొదట్ల కొంచెము ఇబ్బందిగా అనిపించింది శేఖర్ తీరు. యంత్రములాగా పని చేయడము, వేళకు తినడము, పడుకోవడము అంతే.
సరదాలు సినిమాలకు ఆస్కారము తక్కువ. ఇంట్లో గీత ఒక్కతే ఉంటుంది కదా ఎలా ఉందో ఎలా గడుపుతూ ఉందో కాస్సేపు తన దగర కూచుని సరదాగా కబుర్లు చెపుదాము అనే ఆలోచన కూడా లేదు. ఎంతసేపు ఆఫీస్ స్నేహితులు, టీ. వీ.
గీతకు కొన్ని రోజులకే విసుగు వచ్చింది. ఒకరోజు అత్తగారు మామగారు ఇంటిముందు జీపులో నుండీ దిగడము చూసింది గీత.
‘ఏమిటిలా హఠాత్తుగా.. వీళ్ళు వస్తున్నారని శేఖర్ తనకు చెప్పనే లేదు’ అని మనసులో అనుకుని నవ్వుతూ "రండి " అని ఆహ్వానించింది.
మామగారు వస్తూనే "కొంచెము వేడిగా ఏదెనా ఇయ్యి" అని చెప్పి వెళ్ళారు.
అత్తగారు బాత్ రూం కి వెళ్ళారు. ఉన్న పాలతో కాఫీ కలిపి ఇద్దరికీ ఇచ్చింది.
"తొందరగా అన్నం పెట్టెయ్యి, తిని పడుకుంటాము " అంది అత్తగారు.
ఉన్న కూర అన్నము వాళ్ళకు వడ్డించింది. ఏమిటి ఈ మనిషి ఏ విషయమూ చెప్పడు.. తనగురించి ఏమి అనుకుంటున్నాడు.. ఒక పనిమనిషి అన్న భావనే కనిపించింది గీతకు.
శేఖర్ రాత్రి ఇంటికి వచ్చాక "మీ అమ్మగారు వాళ్ళు వసున్నట్లు నాకు చెప్పలేదేమి " అని అడిగింది గీత.
"ఏమి.. నీకు అన్నీ చెప్పాలా ?” అంటూనే మరో మాటకు అవకాశము ఇవ్వకుండా ఆఫీస్ కాగతాలలో తల దూర్చాడు. నాలుగు రోజులు గడచాయి. అత్తగారి విరుపులు, మామగారి ఆజ్ఞలు, గొంతెమ్మ కోరికలు అన్నీ ఆకళింపు చేసుకుని తనకు వచ్చిన రీతిలో చేసింది.
పెద్దవాళ్ళు కూడా అంతే. వాళ్ళకి కావలిసినవి చేయించుకోవడము.. అంతే కానీ ‘గీతా నువ్వు తిన్నావా’, ‘నీకు ఇక్కడ ఎలా తోస్తోంది’.. ఏమీ అడగ లేదు.
నాలుగు రోజుల తర్వాత శేఖర్,వాళ్ళ అమ్మా నాన్నలను బస్ ఎక్కించి వచ్చాడు.
{“వారము రోజులలో దసరా వస్తుంది, పండగకు ఇద్దరూ రండి అని నాన్న ఫోన్ చేసి చెప్పారు.”
"సారీ నాకు కుదరదు” అని చెప్పాడు శేఖర్.
గీతప్రాణం ఉసూరుమంది. పండగ వస్తుంది అంటే ఎంత సరదా పడే వాళ్ళము. ఇక్కడ దసరా పండగ వచ్చినట్లు కూడా తెలీలేదు. శేఖర్ స్నేహితులతో పార్టీ అని పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఆ రోజు సెలవు కదా ఇంట్లో ఉంటాడేమో అనుకుంది గీత. గీతకు తను పెళ్ళి కాకముందు చేసిన చిన్న ఉద్యోగము గుర్తు వచ్చింది. తన డబ్బు లు సినిమాలకు చీరలకు ఖర్చు పెడుతూ ఉంటే ఎంత అనందముగా అనిపించేది.
గీతకు ఈ జీవితము నిస్సారముగా అనిపించింది. అనుకోకుండా ఒక రోజు సాయంత్రము ఇంటి ముందు నిలబడి ఉంది గీత. అదే టైముకు పక్క ఇంటిదగ్గర స్కూల్ బస్ ఆగడము చూసింది. ఇంచుమించు తన వయసు ఉన్న ఒక ఆమెను చూసింది.
ఆమె గీతను చూసి నవ్వుతూ "మీరు శేఖర్ గారి భార్యా? " అని అడిగింది.
"అవును" అంది గీత.
"నా పేరు శాంతి. మీకు ఏమీ తోచకపోతే మా స్కూల్ లో టీచర్ గా చేయచ్చు. ఆలోచించుకోండి. ఇష్టమైతే రేపు ఎనిమిది గంటలకు తయారు అయి ఉండండి " అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. గీతకు ఎందుకో ఆమె మాటలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. లోపలికి వెళ్ళి ఆలోచించింది.
శేఖర్ కి చెప్పాలి అనిపించలేదు. అతను తన గురించి ఏమీ ఆలోచించడు. అంతే. గీత మర్నాటినుండీ స్కూల్ కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. మర్నాడు పొద్దున్నే వంట చేసింది. తనకు ఒక బాక్స్ లో పెట్టుకుంది. టిఫెన్ తిని తయారయి కూచుంది. శేఖర్ లేస్తూనే గీతను చూసాడు. కానీ ఏమీ అడగలేదు.
ఇంతలో స్కూల్ బస్ హార్న్ వినిపించి గీత "నేను స్కూల్ లో చేరడానికి వెళ్తున్నా” అని చెప్పి వెళ్ళిపోయింది. శేఖర్ కాసేపు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో టేబుల్ మీద ఉత్తరము చూసాడు.
"శేఖర్! మీతో గడుపుతున్న ఈ రోజులు నేను ఒక మనిషిని అనే సంగతి మర్చి ఒక యంత్రము లా గడిపాను. నాకూ కొంచెము ప్రపంచము కావాలి. అందుకే ఏదో ఒకమైన వ్యాపకము కల్పించుకుంటున్నా. మనము సహజీవనము కొనసాగించవచ్చు లేదా విడిపోవచ్చు. ఒక వ్యక్తిగా స్వాతంత్య్రము, భావ ప్రకటనకు స్వేచ్చ కావాలి. సరదాలు సంతోషాలూ ఉంటేనే జీవనము మధురము అవుతుంది. లేకపోతే కళావిహీనముగా ఉంటుంది.
అర్థము చేసుకుని మీరు మారితే సంతోషము. లేకపోయినా విడాకులు అంటూ కోర్టు కి వెళ్ళను. సహజీవనములో కూడా శాంతి పొందాలనే నా ఆశ.
-గీత
***
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి
చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .
రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను
యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .
పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .
విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .
కథ బాగుంది. ఆలోచన జీవితానికి వెలుగు లాంటిది. విద్యా వతి,, విజ్ఞాన మతి కాబట్టే గీత మంచి ఆలోచన చేసింది. మంచి ప్రేరణ నిచ్చే కధ
కథలో గీత పాత్ర చాలా చక్కగా తీర్చిదిద్దారు రచయిత్రి. పరిణతి చెందిన మహిళ ఆవేశంతో కాకుండా, ఆలోచించి నిర్ణయం తీసుకుని అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని , భర్తను మార్చుకునే ప్రయత్నం చేయాలనుకోవడం బాగుంది