అంతులేని సంపద
- T. V. L. Gayathri

- 10 hours ago
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #అంతులేనిసంపద, #ప్రకృతియేరక్షించు

గాయత్రి గారి కవితలు పార్ట్ 48
Anthuleni Sampada - Gayathri Gari Kavithalu Part 48 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 06/12/2025
అంతులేని సంపద - గాయత్రి గారి కవితలు పార్ట్ 48 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
అంతులేని సంపద.
(వచనకవిత)
**********************************
ధనము కనిపెట్టి మనుజుడు దానికే దాసుడై చరియించుటేల?
మునిగిపోవునకటా! మాయలోబడి మురికి కూపము లోపల!
కపటమెంతయొ చేయుచుండును కాసుకై సతము కడుపుగొట్టి.
చపలత్వముతో బ్రతికి మనశ్శాంతినే కోల్పువునే మదముపట్టి.
ఆయురారోగ్యములు నశియింప నా జీవితమున కర్థమేమిటి?
చేయగలిగిన దేమున్నది? జీవితమ్మున కూడబెట్టున దేమిటి?
ధనమూల మిదం జగత్తను సామెతను తరచి తెలుసుకోవలె!
కనుపించు భోగములు కాటిదాకా వెనుక ముందు నడచి రావులె!
దయాగుణముతో నడచి దానగుణముతో సాగుచుండుటే ధనము.
ప్రయత్నపూర్వకముగా పరులకుపకారము చేయుటే విధివిధానము.
బంధుమిత్రులను కూడి కష్ట సుఖాలను పంచుకొనుటే గొప్ప పెన్నిధి.
బంధములు నిల్పి తల్లిదండ్రులను బాధ్యతగా గాంచుటే పరమావధి.
పసిపాపల బోసినగవులే పసిడి ధారలై గృహమునందు కురియునుగ.
వసివాడని యనురాగముతో భార్యా భర్తలు జీవించుటే భోగమనగ
ఎంచి చూడగా కీర్తి ప్రతిష్ఠలే యెనలేని సొమ్ములై యలరారునుగ.
మంచి తనముతో మెలగుటే మహిలోన తరగిపోని భాగ్యమనగ.
పేదగొప్పయను భేదమును చూపకుండుటే విలువైన విద్యయనగా.
'నాది నాది!' యను భావనయే తుదకు నష్టమును కలిగించుగా.
ఆరోగ్యముతో నూరేళ్లు హాయిగా సాగుటే అంతులేని విభూతి.
తేరిచూడగా పరమాత్మ నెఱుంగుటే దివ్యమైనట్టి యనుభూతి.//
************************************

ప్రకృతియే రక్షించు!
(ఇష్టపది)
************************************
ప్రకృతియే రక్షించు ప్రాణితతిని సతము.
సుకృతంబగు వరమిడి చూపించు స్వర్గమును.
చేవనొసగి జనులకు సిరివాన కురిపించు.
భావి నిలుపుచు ధరణి భారమును తొలగించు.
పర్వతంబులు ఝరులు పావనంబౌ నదులు
సర్వంబు ప్రేమతో జగతికై తపియించు.
పెంచి పోషించు నీ పృథ్విపై పగయేల?
వంచనాపరులైన ప్రజలకా తెలివేది?
ముంచిపోవును కోపమును జూపి ప్రకృతియే!
మంచితనమును బెంచి మానవులు మసలవలె!
కరవు కాటకములే కనరాని కాలమున
నిరతంబు మానవులు నెమ్మితో సాగవలె!
చుక్కలును చంద్రుడును శోభనంబుగ భగుడు
చక్కగా నరుదెంచి శక్తి సంధాయులై
ఆయురారోగ్యమిడ నంజలిని ఘటియించి
వేయిమార్లు నతులు ప్రీతిగా చేయవలె!
భువినెపుడు పూజింప భోగములు పొలయంగ
భవితవ్యంబును నిల్పి ప్రజలెల్ల మెల్గవలె!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments