top of page
Writer's pictureYasoda Pulugurtha

అనుకున్నది ఒకటి అయినది ఒకటి

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)

'Anukunnadi Okati Ainadi Okati' - New Telugu Story Written By Yasoda Pulugurtha

Published In manatelugukathalu.com On 16/11/2023

'అనుకున్నది ఒకటి అయినది ఒకటి' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"చూడండి తనూ, మనూ! ఇద్దరినీ మీరు చదివినంత చదువులు చదివించాము. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసాము. అన్నీ సమానంగా జరిగినట్లే ఈ ఆస్తి కూడా సమానంగా పంచాలనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఇద్దరినీ పిలిపించాను." కూతురు తనూజ, మనోహర్ వైపు సాభిప్రాయంగా చూసాడు విరూపాక్ష.


అదే హాల్లో, వీళ్ళకు కాస్త దూరంలో, శూన్యంలోకి దిగులుగా చూస్తూ కూర్చొని ఉంది అతని భార్య మహాలక్ష్మి.


"మీ ఇష్టం నాన్నా! కానీ ఇంత అర్జంట్ గా ఎందుకు ఈ పంపకాలు!?"


మనోహర్ వైపు చూసాడు. అతను తలవంచుకుని ఆలోచిస్తున్నాడు.


"సంవత్సరంగా క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. డెబ్బయ్యేళ్ళు దాటాయి. శరీరం రోజుకో రకంగా ఉంటోంది. నాకు ఏ క్షణాన ఏమౌతుందో తెలీదు. మీ అమ్మ ఈ ఊరిలోని ఈ ఇంట్లోనే ఉంటానంటోంది." ఏ భావోద్వేగాలు లేని ముఖంతో వివరించాడు.


"నాన్నా! మీరేమనుకోనంటే నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను."

"తప్పకుండా మనూ!"


ముగ్గురు మనోహర్ వైపు చూస్తున్నారు. అందరినీ ఓసారి చూసి, తండ్రి వైపు తిరిగి....

"అన్నీ సమానంగా అంటున్నారు కాబట్టి చెప్పాలనిపిస్తుంది. చెల్లి మెడిసిన్ చేసింది. పీజీ అయ్యేప్పటికి ఎనిమిదేళ్ళ అయ్యింది తన చదువు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు?!

నేను చదివింది ఎమ్ టెక్. ఆరేళ్ళు. మెరిట్ లో ఫీజు కూడా తక్కువే.


తనూ పెళ్ళికి కట్నం లేకపోయినా తన బంగారం కోసం, పెళ్ళి ఖర్చులకు ఎన్ని లక్షలైంది?! నా పెళ్ళికి ఎంత ఖర్చయింది!?


తనకు రెండు కాన్పులు, శ్రీమంతం, బారసాలలు ఎంత ఖర్చయింది!? నాకోసం ఇటువంటి ఖర్చులు ఏమున్నాయి?!

రేపు అమ్మ ఒంటరైతే తనను ఆడపిల్ల చూసుకోవాల్సిన బాధ్యత లేదంటారు.


ఇప్పుడు మాత్రం ఎంతో న్యాయంగా ఆస్తిలో ఆడపిల్లకు సమానమైన హక్కు ఉందంటున్నారు!" ఆవేదనగా అన్నాడు.


ముగ్గురూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అతని వైపు.

విరూపాక్ష మనోహర్ మాటలకి విస్తుపోయి చూస్తున్నాడు.

వీడు.....వీడు మనూ ఏనా? ఏమైంది వీడికి?


చెల్లెలంటే ప్రాణం పెట్టే మనోహర్ ఉన్న ఆస్తిని పిల్లలిద్దరికీ సమంగా పంచుతానంటే చెల్లెలికి తాను ఇంతవరకూ ఖర్చు పెట్టిన డబ్బుకి లెక్కలు కడ్తూ ఆస్తంతా తనకే చెందాలంటూ రూల్స్ మాట్లాడుతున్నాడు.


తనూజ కూడా ఆశ్చర్యపోతోంది. మనూ అన్నయ్య ఇలా అంటాడని ఊహించలేదు. నాన్న కి వచ్చిన కేన్సర్ అడ్వాన్స్ దశలో ఉందని తనకు తెలుసు. రెండు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం బ్రతకడని నాన్నకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ మోహన్ కృష్ణ తనతో చెప్పాడు. నాన్న బ్రతికి ఉండగానే ఆస్తి పంపకాలు జరగక పోతే నాన్న పోయిన తరువాత అన్నయ్యకే ఆస్తి వెళ్లిపోతే తనేమి చేయగలదు? ఈ సారి నాన్నను చూడడానికి వెళ్లినపుడు విల్లు వ్రాయమని తనే నెమ్మదిగా టాపిక్ తేవాలనుకుంది.


కానీ సడన్ గా నాన్న అన్నయ్యనీ తననీ ఉన్నపళంగా రమ్మనమన్నాడు. నాన్నే స్వయంగా ఆస్తి టాపిక్ తెచ్చి ఇద్దరికీ సమంగా పంచేస్తానంటే హమ్మయ్య కాగల కార్యం గంధర్వులే తీర్చారంటే ఇదేనేమో అనుకుంటూ ఆనందపడింది. తను నోరు జారకుండానే అన్నీ అనుకూలంగా జరిగిపోతుంటే అంతకంటే కావలసింది ఏముందనుకుంది.


కానీ, మధ్యలో నక్షత్రకుడిలా అన్నయ్య తన చదువుకీ, పెళ్లికీ, పురుళ్లకీ లెక్కలు కడ్తూ ఆస్తి మొత్తం తనే కాజేయాలని చూస్తున్నాడు. తను అలా జరగనివ్వదు. డబ్బు చేదు కాదు తనకు. రెండు చేతులా సంపాదిస్తున్నా పుట్టింటి వైపు వచ్చే ఆస్తిని వదులుకునే మూర్ఖురాలు కాదు. మనూ అన్నయ్యతో పోట్లాట పెట్టుకునైనా తను నాన్న ఆస్తిలో సగం పట్టుకు వెళ్లాల్సిందే. తన భర్త రాహుల్ కూడా పదే పదే చెప్పి పంపించాడు. మీ నాన్న ఏ క్షణాన పోతాడో, దగ్గరుండి ఆస్తి వ్రాయించుకో అంటూ తనను ఏయిర్ పోర్ట్ లో డ్రాప్ చేస్తున్నపుడు గుర్తు చేసాడు కూడా.


తనూజ, ఆమె భర్త ఇద్దరూ పూనేలో కార్పెరేట్ హాస్పటల్ లో పని చేస్తున్నారు. విరూపాక్ష తనూజ తెలివికలదని మెడిసన్ చదివించాడు. తనూజ కూడా ముందు నుండీ మెరిట్ స్టూడెంట్ మూలాన మెడిసన్ పూర్తిచేసింది. తరువాత పి.జీ కూడా చదివింది. ఫీజులు ఎక్కువైనా చెన్నై లో మంచి కాలేజ్ లో చేర్పించి హాస్టల్ లో పెట్టి కూతురిని చదివించాడు. పి.జీ లో ఉండగా తనకు సీనియర్ అయిన రాహుల్ ని ప్రేమించింది. రాహుల్ కూడా తనూజను ఇష్టపడ్డాడు. ఇరువురి వైపు కుటుంబాలకు సమ్మతమవడంతో పి.జి పూర్తి అవగానే విరూపాక్ష కూతురికి అట్టహాసంగా పెళ్లి జరిపించాడు. కూతురికి ఏభై తులాల బంగారం, కారు కూడా కొనిచ్చాడు.


తనూజ భర్త రాహుల్ డబ్బు మనిషి. చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. డబ్బే అతనకి సర్వస్వం. చేసే ప్రతీ పనికి డబ్బు విలువకట్టే మనిషి అతను. మామగారు అవసాన దశలో ఉన్నారే పాపం అన్న కనీస సానుభూతి కూడా లేదు అతనిలో.


మనోహర్ బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య వినీత కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరే. బాగా డబ్బు కలిగిన కుటుంబంలో నుండి వచ్చిన అమ్మాయి. మానవతా విలువలకు, కుటుంబ విలువలకు అర్ధం తెలియకుండా పెరిగింది.


మనూ మా నాన్న నన్ను అర్జంట్ గా రమ్మనమన్నాడని చెపితే ‘ఏమైందిట ముసలాయన కి సడన్ గా’ అని ప్రశ్నించింది. మామగారికి సంవత్సరం నుండి బాగాలేదని తెలుసు. ఒకసారి వీకెండ్ లో భర్తతో కలసి కారు లో హైద్రాబాద్ వెళ్లి మామగారిని చూసొచ్చింది చుట్టపు చూపుగా. పెళ్లి అయిన తరువాత అత్తగారింటికి వెళ్లిన సందర్భాలను వేళ్లమీద లెక్క పెట్ట వచ్చు. అత్తగారూ మామగారంటే తృణీకార భావన.


"చూడు మనూ, వెడితే వెళ్లావు గానీ ఆ ముసలాళ్లిద్దరినీ కూడా వెంటపెట్టుకుని వచ్చేస్తావేమో. నీదసలే జాలిగుండె కూడాను. ఆ రోగాలు, రొస్టుల మనుషులకు సేవ చేయడం నా తరం కాదు. మనిషిని పెడతానన్నా నా కిష్టం లేదు".


"అవునూ, మీ నాన్న ఎలాగూ ఎంతో కాలం బ్రతకడని డాక్టర్లు చెప్పేసారు కదా. ఇంకా ఆయనకి ఆయన ఆస్తుల మీద అంత మమకారం ఎందుకు? కూడా తీసుకుపోతాడా ఏమిటి? ఫక్కున నవ్వింది వినీత తన జోక్ కి తానే. నీవే కదా వారసుడివి. ఆస్తి వ్రాయించేసుకో. మళ్లీ ఆ డాక్టరమ్మ నాకూ కావాలంటూ పోటీకి వస్తుంది".


భార్య ఎంత చెపితే అంత మనోహర్ కి. "చూడు వినీ నేను మరీ అంత దద్దమ్మలా కనిపిస్తున్నానా? మా నాన్న ఆస్తంతా నాదే. అది తాతల నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు. మా నాన్నే సంపాదించాడు. మా చెల్లెలికి ఎలా వస్తుంది"? ఈ సారి ఎలాగైనా సరే ఆస్తి వ్యవహారం సెటిల్ చేసుకుని మరీ వస్తాను సరేనా అంటూ భార్య చుబుకం పట్టుకుని ప్రేమగా ఆమె పెదాలను స్పృశించాడు.


మనోహర్ మాటలు విన్న విరూపాక్ష క్షణం సేపు మౌనంగా ఉండిపోయాడు. తన నిర్ణయానికి పిల్లిద్దరూ కట్టుబడి ఉంటారనుకుని అపోహ పడ్డాడు. ఆస్తి అంతా తనకే రావాలన్న అర్ధాన్ని స్పురిస్తూ మాట్లాడిన మనూ మాటలకు నివ్వెరపోతూ, సరేలే తరువాత మాట్లాడుతుందాం ముందు భోజనాలు చేయండంటూ ఆ చర్చ అప్పటికి ఆపేసాడు.


ఆరోజు సాయంత్రం తనూజ తల్లి ఒడిలో పడుకుని ప్రేమగా కబుర్లు చెపుతోంది.


"అమ్మా ఎందుకే అంత దిగులు పడుతున్నావు నాన్న గురించి. దిగులు పడుతూ కూర్చుంటే ఆయన ఆరోగ్యం తిరిగి వస్తుందా చె”ప్పంటూ తల్లి చేతికి ఉన్న బంగారు గాజులను సవరిస్తూ ధైర్యం చెపుతోంది. కూతురి మాటలకు ఆవిడ కళ్లనుండి కన్నీటి బొట్లు రాలిపడుతున్నాయి. చీర చెంగుతో కళ్లు అద్దుకుంటోంది.


“ఇన్ని గాజులు ఎందుకు వేసుకుంటావే అమ్మా, అసలే మీరిద్దరే ఇంట్లో. అవునూ విశ్వం అన్నయ్య మిమ్మలని చూసి వెడుతున్నాడని, నాన్నకు కీమో ధెరఫీ ఇచ్చినపుడు అతనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడని, సరళ వదిన కూడా అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి తోడుగా పడుకుంటోంది అన్నావు కదా. ఏ క్షణంలో ఎవరికి ఏ దుర్భుద్ది పడుతుందో ఏమో, తలో చేతికి రెండు జతలు గాజులు ఉంచుకుని ఈ ఆరు ఒంకీ గాజులూ నా కిచ్చేయమ్మా. నేను జాగ్రత్త పెడతా”నంటూ ఆవిడ చేతుల నుండి ఆ గాజులు తీసేసింది.


"ఆ అమ్మా మరచిపోయాను, నీ చంద్రహారం, పలకసరుల గొలుసు ఇంట్లోనే ఉన్నాయా లేకపోతే బేంక్ లాకర్ లో ఉన్నాయా?”


మహాలక్ష్మి కి విశ్వాన్ని అతని భార్యనూ తనూజ అలా అనడం బాధ కలిగించింది. భర్తకు పెదనాన్న మనవడు విశ్వం. అదే ఊళ్లో పక్క వీధిలోనే ఉంటారు. విరూపాక్ష అంటే అభిమానం. బాబాయ్ అంటూ తరచుగా వచ్చి పలకరిస్తాడు భార్యతో కలసి వస్తూ. బాబాయ్ కి కేన్సర్ అని తెలిసాకా పిల్లలిద్దరూ దగ్గర లేరన్న జాలితో బాబాయ్ కి అన్ని వేళలా ఆసరాగా ఉంటున్నాడు. అతని భార్య సరళ కూడా ఉత్తమురాలు. ఏదో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఉన్నంతలో ఇద్దర పిల్లలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న అభిమానధనుడు. బంధుత్వానికి విలువనిస్తాడు. విశ్వాన్ని కన్న కొడుకులాగే అభిమానిస్తాడు విరూపాక్ష.

"అమ్మా నేనడిగినదానికి బదులివ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయావేమిటి"?


‘ఆ... ఆ, నగల గురించి కదా అడిగావు. అవన్నీ బేంక్ లాకర్ లోనే ఉన్నాయిలేవే తనూ’.


"అమ్మా అన్నయ్య ఇందాక ఏమన్నాడో గుర్తుందా? నీవు ఒంటిరిదానివైతే నీ బాధ్యత తనదే అన్నట్లుగా అనలేదూ? ఒట్టి దమ్మా, వాడి మాటలను నమ్మకు. అంత ప్రేమ నీ మీదే ఉంటే వదినను ఎప్పుడైనా ఇక్కడ వదిలేడా? ఏం వదిన కూడా రావచ్చు కదా ఇప్పుడు. నాన్న ఆస్తికోసం వాడు మాట్లాడుతున్న దొంగ మాటలవి. నీవు వెర్రి మాలోకంలా నాన్న చనిపోగానే అన్నయ్యతో వెళ్లిపోతావేమో. రానని చెప్పు ఖరాఖండీగా. నీకు సాయంగా ఒక అటెండర్ ని పెడతాను. అప్పుడప్పుడు నేను వచ్చి చూసి వెడతాను. సరేనా?”


మహాలక్ష్మి కూతురు ఏమి మాట్లాడుతుందో అర్ధం కావడం లేదు. తెల్లబోయింది కూతురి మాటలకు. ఏమిటి, ఇంకా ఆయన బ్రతికి ఉండగానే ఏదో అయిపోయినట్లుగా మాట్లేడుస్తున్నా రనుకుంటూ దుఖపడింది. మనూ గానీ తనూ గానీ తండ్రి ఆరోగ్యం గురించి విచారించడం లేదు. ఎలా ఉన్నారు నాన్నా అన్న పరామర్శ లేదు. ఆస్తి పంపకాలమీదే ఉంది వాళ్ల దృష్టి అంతా. అయినా ఆయన్ని అనాలి. అసలుకే ఆరోగ్యం సరిగాలేనప్పుడు ఇప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడడం అవసరమా?


ఆ రోజు రాత్రి భోజనం చేసాకా మనోహర్ తనూజ ఉన్న గదిలోకి వెళ్లాడు. భర్తతో ఫోన్ లో మాట్లాడుతున్న తనూజ మనోహర్ ను చూడగానే మాట్లాడడం ఆపేసి, ‘రా అన్నయ్యా కూర్చో’ అంటూ కుర్చీ ముందుకు తోసింది.


"ఏమే తనూ, ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పు. నాన్న నీకు బోల్డు ఖర్చు పెట్టి చదివించి, లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేసాడు. నీవూ బావా పూనేలో రెండు చేతులా సంపాదించు కుంటున్నారు. అయినా నాన్న ఆస్తి మీద అంత ఆశ ఎందుకే? నాన్న ఆస్తి మొత్తం నాకే చెందుతుంది. నాన్న నీకు సగం ఆస్తి వ్రాసి ఇస్తా నంటే ఊరుకోను. మర్యాదగా చెపుతున్నాను. ఆ ఆస్తి నాకే వ్రాసి ఇచ్చేయమని చెప్పు” అంటూ కోపంగా అన్నాడు.


“చూడు మనూ అన్నయ్యా, నేనేమీ వెర్రిబాగుల దాన్ని కాదు అంతా నీకే ఇవ్వమని చెప్పడానికి. నాన్నే సగం ఆస్తి నాకు ఇస్తానంటుంటే నీ వెవడివిరా కాదు అనడానికి. ఒక వేళ నీవు అడ్డుపడినా ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు.


పెద్ద.. అమ్మ బాధ్యతను నీవే మోస్తానన్నట్లు నాన్న ముందు ప్రగల్భాలు పోతున్నావు. నీ భార్యామణి ఎలాంటిదో నాకు తెలీదనుకోకు".


"అవును అమ్మ బాధ్యతను మోస్తానో వదిలించుకుంటానో నీ కనవసరం". నీకో సంగతి తెలుసా? ఇప్పుడు అమ్మా నాన్నా ఉంటున్న ఇంటిని కూడా నా పేరు మీద వ్రాయించేసు కుంటాను".


“అది ఎలారా ఫూల్. అమ్మ ఈ ఇంటిలోనే ఉంటానంటోంది కదా. అమ్మ చచ్చేవరకూ ఈ ఇల్లు అమ్మ పేరునే ఉంటుంది. అమ్మ పోయే లోపుల ఎన్ని మార్పులు వస్తాయా ఎవరికి తెలుసు”, హేళనగా అంది తనూజ.


“లేదు, అమ్మను నేను నా దగ్గరే ఉంచుకుంటాను. ఇంక ఇక్కడ ఈ ఇల్లు ఎందుకు? అమ్మి పడేస్తాను”.


"ఓ, నీది ఎంత కుత్సితపు బుధ్దో నాకు తెలియకనా? అలా మభ్యపెట్టి అమ్మను ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనో పడేసే దుర్మార్గుడివి".


"ఓహ్ ఎంత ప్రేమ తల్లీ అమ్మ అంటే, పోనీ అమ్మను కళ్లల్లో పెట్టుకుని నీవు చూసుకుంటావా”, వెటకారంగా ప్రశ్నించాడు.


"మధ్యాహ్నం అమ్మ ఒడిలో పడుకుని ప్రేమగా తీయగా మాట్లాడుతూ అమ్మ బంగారు గాజులు నీ బేగ్ లో వేసుకున్నావా లేదా"?


"అవును అవి ఎలాగూ నాకే వస్తాయి, అమ్మ చనిపోయాక. ఎలాగూ నావే కదా అని ముందరే తీసేసు కున్నాను. ఇంకా లాకర్ లో ఉన్న అమ్మ నగలన్నీ కూడా నావే".


"డాక్టర్ వి కదా, అమ్మకింత విషం ఇచ్చి చంపేసి వాటిని మూటకట్టుకుని ఫో” అంటూ కోపంగా గదిలోంచి బయటకు వచ్చేసాడు. క్రీనీడలో తలుపు పక్కగా నిలబడిన ఒక ఆకారం చటుక్కున పక్కకు వెళ్లిపోయింది.


మర్నాడు మధ్యాహ్నం భోజనాలు అయిపోయాకా అందరినీ హాలులో సమావేశపర్చాడు విరూపాక్ష.


తనూజ తనకు శెలవు లేదని వెళ్లిపోతానంటోంది. మనూ కూడా ఆస్తి వ్యవహారం నాన్న ఎప్పుడెప్పుడు తేల్చి చెపుతాడా అన్న ఆత్రుతతో చూస్తున్నాడు.


“చూడండి మనూ తనూ, నేను మిమ్మలని ఇద్దరినీ ఉన్నపళంగా రమ్మనమని చెప్పిన కారణం ఏమిటో మీకు చెప్పాను.


కనీసం ‘ఎలా ఉంది నాన్నా మీ ఆరోగ్యం’ అన్న ఒక్క కుశల ప్రశ్న కూడా మీ నుండి లేదు. నాన్న ఎలాగైనా పోతాడు కదా, ఎందుకు అడగడం అని అనుకుని ఉండచ్చు. తనూ పెద్ద డాక్టర్. దానికి నా పరిస్తితి అంతా తెలుసు. కానీ దానిలో ఏ మాత్రం ఆదుర్దా గానీ బాధ గానీ లేవు. నా కోసమే తల్లడిల్లి పోతున్న మీ అమ్మను ఎవరైనా ఓదార్చారా?


మానవతా బంధాలన్నీ డబ్బుతోటే ముడిపడి ఉన్నాయన్నది అక్షరాలా నిజం. మీ రిద్దరూ నా ఆస్తి గురించి తగువులు పడుతున్నారని అర్ధం అయింది. కాట్లకుక్కలు కూడా మీ కంటే నయమేమో. నేను ఇంకా చావకుండానే నన్ను చంపేసి మాట్లాడుకుంటున్నారు ఇద్దరూ. ఏ ఒక్కరికీ అమ్మ మీద ప్రేమ లేదు. అమ్మ ఈ ఇంట్లోనే ఉంటానంటోంది అని నేను చెప్పినా మీ నుండి స్పందన లేదు. అదేమిటి అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుందన్న ఆవేదన గానీ బెంగ గానీ ఎవరిలోనూ లేదు. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటూ అమ్మ ని ఇద్దరూ ప్రేమగా చూసుకుంటారని ఎన్నో ఊహించాను. ఆ ఉద్దేశ్యం తోటే ఇద్దరికీ ఆస్తిని సమానంగా ఇవ్వాలనుకున్నాను. కానీ నా ఆశను వమ్ము చేసారిద్దరూ.


నా కడుపున పుట్టక పోయినా విశ్వం నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఈ విషయం మీకు తెలిసినా మీలో ఏ మాత్రం సిగ్గూ కలగడంలేదు. విశ్వం ఆర్ధికంగా ఎంత కష్టపడుతున్నా ఏ నాడూ నా ముందు చేయి చాచి డబ్బు సాయం చేయమని అడగని ఆభిమాన ధనుడు. సరళ మామయ్యగారూ, అత్తయ్యగారూ అంటూ ఎంతో ప్రేమగా ఉంటుంది. అమ్మ కి ఒంట్లో బాగాలేక లేవలేకపోతే ఎంతో సేవ చేస్తుంది. ఏనాడైనా నీ భార్య మమ్మలని అలా పిలిచిందిరా మనూ?


నిన్న రాత్రి మీ అమ్మ మీ ఇద్దరి మాటలూ విని దుఖంతో తల్ల్లడిల్లిపోయింది. నాకు చెప్పకూడదనుకుందిట. కానీ అర్ధరాత్రివేళ కూర్చుని ఏడుస్తుంటే కారణం అడిగితే అప్పుడు చెప్పింది.


నేను రాత్రి అంతా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. నేను సంపాదించిన ఆస్తి అంతా నా స్వార్జితం. దాన్ని ఎలాగైనా చేసుకునే హక్కు నాకు ఉంది. ఆస్తిలో సగం భాగం, ఈ ఇల్లు విశ్వం పేరున వ్రాస్తాను. విశ్వం, సరళ మీ అమ్మను కళ్లల్లో పెట్టుకుని మరీ చూసుకుంటారు. మిగతా సగం కేన్సర్ ఇన్ స్టిట్యూట్ కి డొనేట్ చేస్తాను.


ఈ నా నిర్ణయం మీకు కోపం తెప్పిస్తుందని తెలుసు. ఒక తండ్రిగా మీకు ఏది కావలసి వచ్చినా సంతోషంగా సమకూర్చాను. ప్రయోజకులను చేసాను. కానీ మీలో ఎవరికీ మీ తల్లితండ్రుల పట్ల గౌరవాభిమానాలు లేవు. మీరు నా కడుపున పుట్టిన బిడ్డలేనా అనుకుంటూ విచారపడుతున్నాను ఇప్పుడు.


ఇంతకంటే నేనేమీ మాట్లాడలేని స్తితిలో ఉన్నానంటూ లోపలికి వెళ్లిపోయాడు విరూపాక్ష.


మనూ, తనూల ముఖాలు అవమానంతో ఎర్రపడ్డాయి. ఇద్దరూ ఒకరినొకరు క్రోధంగా చూసుకున్నారు. తండ్రి తీసుకున్న నిర్ణయానికి తిరుగు ఉండదని తెలుసు కనుక ఇద్దరూ మరో మాట మాట్లాడకుండా తిరుగు ప్రయాణ మయ్యారు.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








99 views0 comments

Kommentare


bottom of page