అన్వేషిస్తూ..
- Malla Karunya Kumar

- Sep 16, 2025
- 8 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #Anveshisthu, #అన్వేషిస్తూ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

Anveshisthu - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 16/09/2025
అన్వేషిస్తూ - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
“అమ్మా, నేను అర్కను మాట్లాడుతున్నాను...”
“ఆర్కా!, బాబు.. ఎలాగున్నావు?. బాగున్నావా?. ” అని ఉక్కిరిబిక్కిరై ఆనందంతో అడిగింది జానకి.
“ఆ బాగున్నాను. నేను మీతో ఒక విషయం చెప్పాలి. నేను ఒకమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీతో ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. వివరాలన్నీ మళ్ళీ తర్వాత చెపుతాను. నాకు చిన్న పని వుంది. మళ్ళీ చేస్తాను. ” అని గబగబా తాను చెప్పాల్సింది చెప్పి ఫోన్ పెట్టేసాడు.
“అది కాదు ఆర్కా, నేను చెప్పేది విను.. ” అని జానకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసింది. కానీ అటు నుండి సమాధానం రాకపోయే సరికి, ఫోన్ పెట్టేశాడని అర్థమయ్యింది జానకికి. ఎప్పుడూ తన మాట వినని కొడుకు పద్ధతి చూసి ఆమె మనస్సు దుఃఖం తో నిండి పోయింది.
********
“ఆర్కా!, మీ ప్రేమ విషయం ఇంటిలో చెప్పావా?. ” అని స్నేహితుడు రఘు అడగడం తో,
“ఫోన్ చేసి చెప్పాను!, వాళ్ళే ఒప్పుకుంటారు లే.. ” అని బాధ్యత రహితంగా అన్నాడు.
“అదేంటి! నువ్వే స్వయంగా వెళ్లి చెప్పవచ్చు కదా?. ఫోన్లో ఇలాంటి విషయాలు చెప్పడం ఏమిటి?. ” అసహనం తో అన్నాడు రఘు.
“నీకు తెలియదు రా రఘు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళానంటే. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని అని కూడా చూడకుండా నన్ను పని చేయమంటాడు మా నాన్న. ఆ పని, ఈ పని అని నన్ను ప్రశాంతంగా వుండనివ్వడు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి మళ్ళీ ఆ పొలం లో పని చేయాలంటే నా మనసు ఒప్పుకోదు రా.. ” నిట్టూర్చుతూ అన్నాడు అర్క.
అర్క ప్రవర్తన రఘుకు నచ్చడం లేదు. తల్లి తండ్రుల పట్ల అర్క చేస్తున్న నిర్లక్ష్యానికి అర్కను నిలదీయాలి అనుకున్నాడు. కానీ అర్క ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఒకవేళ మాటా మాటా పెరిగి గొడవకు దారితీస్తే అర్క స్నేహం తనకు దూరం అవుతుందని పరిపరి విధాలుగా ఆలోచించి తనని తాను సముదాయించుకుంటూ, “అర్క, వాళ్ళు మన కోసం ఎంతో చేసి ఉంటారు. వాళ్ళను ఈ విధంగా విడిచిపెట్టడం మంచిది కాదు.. ” సుతిమెత్తగా చెప్పాడు రఘు.
ఇంతలో ఫోన్ మ్రోగడం తో, ఫోన్ అందుకొని చూసి, “కాసేపు ఆగు రా, ప్రియ కాల్ చేస్తుంది. ఆమెతో మాట్లాడి వస్తాను.. ” అని పక్కకు వెళ్ళాడు. కొంత సమయం అయిన తర్వత వచ్చాడు.
“రేయ్ అర్క. నా మాట విని ఒక్కసారి మీ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి మాట్లాడి రా. ” అని బ్రతిమలాడి చెప్పాడు రఘు.
“సరే, సరే.. నీ గోల భరించ లేకపోతున్నాను. వారం రోజుల నుండి నన్ను ఈ విషయం మీద వేధిస్తున్నావు రా, వెళ్తాను లే. ” చిరాకుగా సమాధానం ఇచ్చాడు అర్క.
'హమ్మయ్య' అని దీర్ఘ శ్వాస తీసుకొని, 'పాపం ఆంటీ నాకు ఎన్నోసార్లు ఫోన్ చేశారు, అర్కను చూడాలని వుందని. ఇప్పుడైనా వీడు వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అదే చాలు. ' అని తనలో అనుకుంటూ సంతోషించాడు రఘు.
********
తర్వాత రోజు తన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని తన వూరు బృందావనం కు బయలుదేరాడు. కానీ, తాను ఊరికి వస్తున్న విషయం తల్లితండ్రులకు చెప్పలేదు.
ఒక రోజు ప్రయాణం తర్వత, తన గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న టౌన్ కి చేరుకున్నాడు. తన గ్రామానికి వెళ్ళడానికి రావాల్సిన బస్సు ఇంకా రాలేదు. అక్కడ కూర్చొని ఆ బస్సు కోసం ఎదురుచూస్తూ వున్నాడు. చాలా సమయం అయ్యింది. ఇంకా బస్సు రావడం లేదు.
ఇంతలో ఎవరో, "అర్క!" అని పిలవడం తో, వెనక్కి తిరిగి చూసాడు. రెండు అడుగుల దూరంలో ఉన్న రుద్రయ్య మామ వేగంగా, ఆనందంతో అర్క దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
“అర్క!. నువ్వు ఏంటి ఇక్కడ?. నువ్వు వస్తున్నట్టు మీ నాన్న నాతో చెప్పలేదు?. ఎలా వున్నావు?. ” అని ఆప్యాయంగా అడిగాడు రుద్రయ్య.
“బాగున్నాను మామ. మీరు ఎలా వున్నారు?. ”
“నువ్వు బాగుంటే మేము బాగున్నట్టే. సరే పద ఇంటికి వెళ్దాం” అని చెప్పి తన పాత ఎక్సెల్ బండిని తీసుకువచ్చాడు.
ఇద్దరూ కలిసి ఆ బండి మీద ఇంటికి బయలుదేరారు.
“మామా.. మన ఊరికి బస్సు వుండాలి కదా. ఇంత సమయం అయినా అది రాలేదు ఎందుకు?.. ”
చిన్నగా నవ్వి, “ఇంకెక్కడ బస్. అది ఎప్పుడో ఆపేశారు..మన వూరికి బండి లేకుండా రావడం చాలా కష్టం" నిట్టూర్చుతూ అన్నాడు.
ఎప్పటిలాగే గుంతలు తో కూడుకున్న రోడ్డు. దాని కారణంగా కుదుపులు అర్క ను చికాకు పరుస్తున్నాయి. 'ఎన్ని దశాబ్దాలు అయినా ఈ వూరు బాగు పడదు' అని తనలో అనుకున్నాడు అర్క..
ఒకప్పుడు రోడ్డు కి ఇరువైపులా పచ్చగా కనిపించే పొలాలు ఇప్పుడు కనిపించడం లేదు!. అంతా సిమెంట్ స్తంభాలు నాటి కంచె వేసి వున్నాయి.
‘కార్పొరేట్ ప్లాట్ల సేల్ దండ యాత్ర’ అని ఎక్కడో విన్న మాట గుర్తుకు వచ్చింది అర్కకు. వాటిని చూస్తూ వున్నాడు. చిన్ననాటి జ్ఞాపకాలు వెంటాడుతూ వున్నాయి. ఆలోచనలోనే ఇంటి దగ్గరకు చేరుకున్నాడు.
చెప్పాపెట్టకుండా ఇంటికి చేరుకున్న అర్కను చూసి ఆశ్చర్యపోయారు తల్లి తండ్రి. క్షణం ఆగి ఆశ్చర్యం నుండి తేరుకొని, “అర్క!, ఇన్నాళ్ళకి మేము గుర్తుకు వచ్చామా?. వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు?. ” అంటూ బిడ్డని తడిమి చూస్తూ, గట్టిగా హత్తుకుంది జానకి.
“నాకు రావాలని వుంది. కానీ, వీలు కాలేదమ్మ. ” తియ్యగా సమాధానం ఇచ్చాడు అర్క.
“పోనీలే నాయన, ఇప్పటికైనా ఈ తల్లితండ్రుల మీద నీకు దయ కలిగింది. ” అని సంతోషం తో అంది జానకి.
రామయ్య కూడా కొడుకు రాకతో సంతోషించాడు.
అర్క అక్కడికి వచ్చాడని తెలిసి అక్కడకు వచ్చింది రుద్రయ్య కూతురు వీణ.
“బాగున్నావా, అర్క” అని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
ఆమె ను చూసి, మాట్లాడకుండా ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
“అదేమిటి అర్క!. వీణ వచ్చి పలకరిస్తే ముఖం పక్కకు తిప్పుకుంటున్నావు?” ఆశ్చర్యంతో అర్క వైపు చూస్తూ అడిగింది జానకి.
“అమ్మా, నీకు తెలియంది కాదు. ఆమెకు నాకు పొంతన కుదరదని. పోనీలే, నా మనిషని ఉద్యోగం చూస్తే, వద్దని వచ్చేసింది. ఇప్పుడు తన గతి ఏమైందో చూడు. ఈ ఊరులో వుంటూ, పొలంలో పనిచేస్తూ, ఎలా వుందో!. ఉన్నత చదువులు చదివితే సరిపోదు. ఉన్నతంగా ఆలోచించాలి. ఏముంది ఈ ఊర్లో, మట్టి తప్పించి. ” అని వీణ ను దెప్పుతూ అన్నాడు అర్క.
అర్క మాటలకు ఆమె నొచ్చుకుంది, దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది..
“అర్క!, ఈ విధంగా నువ్వు మాట్లాడటం నాకు నచ్చలేదు. ” అని జానకి అంది.
“అమ్మా, నాకు తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలన్నది. ” కఠినంగా పలికాడు అర్క.
ఇప్పుడు తాను ఏం చెప్పినా అర్క వినిపించుకోడు అని గ్రహించి మౌనం దాల్చింది జానకి.
****
అర్క తన ఊరు కి వచ్చి రెండు రోజులు ఇట్టే గడిచిపోయాయి.
ఒకప్పుడు అయితే తనని తన వెంట తీసుకు వెళ్లే తండ్రి ఇప్పుడు రమ్మనకుండా పొలానికి వెళ్లిపోతున్నాడు. తన తండ్రి తీరు ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. 'హమ్మయ్య ఇప్పటికైనా నాన్న నా బాధ అర్ధం చేసుకున్నారు. ' అని తనలో అనుకుంటూ రిలాక్స్ గా ఫీల్ అయ్యాడు అర్క.
సరిగ్గా అదే సమయానికి అర్క ఫోన్ మ్రోగింది. తీసి చూసే సరికి రఘు ఫోన్ చేస్తున్నాడు. ఆనందంతో ఫోన్ లిఫ్ట్ చేస్తూ, “చెప్పరా రఘు, ఎలా వున్నావు?. ” ఆప్యాయంగా అడిగాడు అర్క.
“అర్క, నా జాబ్ పోయింది రా!.. ” రఘు తడారిపోయిన గొంతు తో చెప్తున్నాడు,
ఒక్కక్షణం నిశ్చేష్టుడై, “ఏమైంది రా?. జాబ్ పోవడం ఏమిటి?. ఏ కారణం లేకుండా?. ” అని కంగారు పడుతూ అడిగాడు అర్క.
“నీకు తెలియంది ఏముంది రా. ఈ మధ్యన ఇది మామూలే కదా!. కంపెనీలు ఉద్యోగుల్ని ఆర్థిక మాంద్యం పేరు చెప్పి తొలగించడం. ” నిట్టూర్చుతూ అన్నాడు.
“నువ్వేమి కంగారు పడకు. నేను మాట్లాడతాను. ” భరోసా కల్పిస్తూ అన్నాడు అర్క.
“అర్క!. అదే కదా నా బాధ. నిన్ను కూడా జాబ్లో నుండి తీసేశారు రా. ” పిడుగు లాంటి వార్త చెప్పాడు.
ఈ మాట విని ఒక్కసారిగా అర్క దిగ్భ్రాంతికి లోనయ్యాడు. మొత్తం స్తంభించినట్టు గా అయ్యింది. క్షణం శిలలా మారిపోయి, మళ్ళీ స్పృహలోకి వచ్చి, వణుకుతున్న స్వరంతో, “ఏమిటి రా నువ్వు అంటున్నది?. ” తడబడుతూ అడిగాడు.
“అవును రా ఇది నిజం. చాలా మందిని తీసేశారు. అడిగినా పట్టించుకోవడం లేదు. కానీ మనకు ఒక అవకాశం వుంది. నీ ప్రేయసి ప్రియ ఇంకా జాబ్లో వుంది. ఆమె పేరెంట్స్ కి మన కంపెనీ వాళ్ళు రిలేటివ్స్ అని నీకు తెలుసు కదా!. నువ్వు ఒకసారి ఆమెతో మాట్లాడి మనకు మళ్ళీ జాబ్ వచ్చేట్టు చేయాలి. ” అని రఘు సలహా ఇచ్చాడు.
"సరే, రా నేను ఆమెతో మాట్లాడుతాను" అని దీనంగా అంటూ, తన ప్రేయసి కి ఫోన్ చేసాడు. ఆమె ఫోన్ బిజీ అని వస్తుంది!. మళ్ళీ చేశాడు. ఆ విధంగానే వస్తుంది!.
మళ్ళీ రఘుకు ఫోన్ చేసాడు, “రేయ్ ఆమె మొబైల్ బిజీ అని వస్తుంది. ఆమె లిఫ్ట్ చేస్తే తప్పకుండా మాట్లాడుతాను. ” అని అర్క అన్నాడు.
“ఇంకా నీకు అర్థం కాలేదా అర్క!. ఆమె నీ ఫోన్ ఎప్పటికీ తియ్యదు. ఈ ప్రేమ అంతా నాటకం. నాకు ఎప్పుడో తెలుసు రా ఆమె గురించి. కానీ నీకు చెపితే ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటావో అని నీకు చెప్పలేదు. ఇప్పటికైనా అర్దం అయ్యిందా ఆ ప్రేమ ఎలాంటిదో. ” అని ఫోన్ పెట్టేసాడు రఘు.
'లేదు, ఆమె అలాంటిది కాదు. ఏదో పనిలో వుండి ఫోన్ లిఫ్ట్ చేయక పోయి వుంటుంది. రఘు ఆమె పై అనవసరంగా నిందలు వేస్తున్నాడు. నేను ఆమె మంచిదని నిరూపించి చూపిస్తాను. ' అని తనలో అనుకుంటూ ఆమెకు ఫోన్ చేయడం మొదలు పెట్టాడు.
చాలా సార్లు ఇలానే సాగింది. కానీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమె ఫోన్ బిజీ అనే వస్తుంది.
మెల్లమెల్లగా నిజం అర్క కు అవగతం అవుతుంది. ఒక్కసారిగా తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లు తన బుగ్గల పై నుండి జారడం మొదలయ్యాయి. ప్రేమ అంతా ఓ నాటకం అని తెలిసి లోలోపల కుమిలి పోతున్నాడు. పైగా ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగం పోయిందన్న బాధ మరోపక్క తనని కుదురుగా వుండనీయడం లేదు.
ఏమి చెయ్యాలో తెలియడం లేదు?. ఉద్యోగం వుంది కదా అని ఒక ఇల్లు కొన్నాడు. ప్రతినెలా వాయిదా లెక్కన దానికి సొమ్ము చెల్లిస్తున్నాడు. పైగా క్రెడిట్ కార్డు బిల్స్, ఇంకా చాలా వున్నాయి. అర్క ఆలోచనలతో సతమతం అవుతున్నాడు.
ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. దిగులు తనని నిలువునా ఆవరించింది. అన్నం కూడా సరిగ్గా సహించడం లేదు. ఇలానే రెండు రోజులు గడిచాయి. అర్క తీరును రెండు రోజుల నుండి గమనిస్తూనే వుంది తల్లి జానికి.
కారణం ఏమిటో కనుక్కోవాలని. కొడుకు దగ్గరకు చేరుకొని, “అర్క ఏమైంది?. రెండు రోజుల నుండి దిగులుతో వున్నావు!. ఏమైందో చెప్పు?. ఈ తల్లితో నీ కష్టం ఏమిటో చెప్పు నాన్నా. ” అని ప్రేమతో అర్క ను దగ్గరికి తీసుకొని, గోముగా అడిగింది.
తల్లి అడగడం తో అర్క లో దుఃఖం పొంగుకుంటూ బయటకు వచ్చింది. తనని తాను సముదాయించుకోలేక పోయాడు. "అమ్మా!" అంటూ ఏడ్చి, కాసేపటి తర్వాత మొత్తం వివరంగా చెప్పాడు.
అంతా విని జానకి కంగారు పడింది. తనను తాను సముదాయించు కొని, తర్వాత, “అర్క.. బాధపడకు. ఇలాంటి సమయంలో ధైర్యంగా వుండాలి. నేను మీ నాన్నతో మాట్లాడుతాను. నీ అప్పులు గురించి నువ్వు బాధపడకు. ” అని కొడుక్కి నచ్చజెప్పింది..
తర్వాత వీలు చూసుకొని ఈ విషయం భర్తతో చెప్పింది.
రామయ్య కూడా కొడుకు బాధని చూసి తట్టుకోలేక పోయాడు, "జానకీ, వాడు అంత కష్టంలో వుంటే, మనం ఎలా ఊరుకో గలం. ఏదొకటి చేసి వాడికి సహాయం చేద్దాం. " అని అంటూ, అర్కను పిలిచాడు,
దిగులు ముఖం తో వచ్చి తండ్రి ముందు నిల్చున్నాడు అర్క.
“అర్క!. ఈ తండ్రి నీకు వున్నాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు మళ్ళీ ఉద్యోగం వచ్చేంత వరకు నీ బాధ్యత నాది. కొడుకు ఎంత ఎదిగినా ఏ తండ్రికి బరువు కాడు రా, ఇంత చిన్న విషయం గురించి అంతలా దిగులు పడటం ఎందుకు. నాతో చెప్ప లేకపోయావా. ” అని అంటూ కొడుక్కి భరోసా కల్పించాడు.
మరుసటి రోజు లక్ష రూపాయిలు తెచ్చి కొడుక్కి ఇచ్చాడు. “అర్క ఇదుగో డబ్బులు. నీ అప్పులు తీర్చు. మిగతా వాటి సంగతి తర్వాత చూద్దాం. ” అని తండ్రి అనడంతో, అర్క లో దుఃఖం పొంగుకు వచ్చింది.
"నాన్న" అంటూ గట్టిగా కౌగలించుకున్నాడు.
"నన్ను క్షమించండి నాన్నా" అని కన్నీటి పర్యంతం అయ్యాడు.
“ఊరుకో అర్క, చిన్న పిల్లాడిలా ఏమిటి ఈ కన్నీళ్లు. ” అని తండ్రి కొడుకుని ఓదార్చాడు.
*********
ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయి వున్నారు.
రామయ్య పొలంకు వెళ్తున్నాడు. కానీ, అర్క ను మాత్రం పిలవడం లేదు. తల్లి తన పనిలో తాను వుంది.
అర్క లో ఒంటరి భావన రేగింది. ఏ పని లేకుండా వుండడం తో తన మీదే తనకు చిరాకు కలిగింది.. పొలంకి వెళ్ళి తండ్రికి సహాయ పడాలని అనుకున్నాడు.
తల్లి దగ్గరకు చేరుకొని, “అమ్మ! మళ్ళీ నాకు ఉద్యోగం వచ్చే వరకు నేను నాన్నకు తోడుగా వ్యవసాయం చేస్తాను. ” అని చెప్పి పోలంకు బయలుదేరాడు.
వెళ్తున్న అర్క ను ఆపి, “అర్క! నువ్వు చిన్నప్పుడు మీ నాన్న నిన్ను సెలవు దినాల్లో పొలానికి తీసుకువెళ్లాడు అని బాధపడి నాతో చెప్పేవాడివి. నీ తోటి వాళ్ళు సరదాగా ఆడుకుంటున్నారని బాధపడే వాడివి. కానీ మీ నాన్న ఏమి చేసినా నీ కోసమే చేశారు. అప్పుడు నువ్వు ఈ పనులు నేర్చుకోబట్టే ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పొలం పనికి వెళ్తాను అంటున్నావు. ఇప్పుడైనా అర్దం అయ్యిందా. ఆ పని అప్పుడు నేర్చుకోవడం వలనే ఇప్పుడు ఉద్యోగం కోల్పోయినా ధైర్యంగా వ్యవసాయం చేస్తాను అంటున్నావు.
ఇంకో విషయం, నువ్వు వచ్చిన రోజు నీ యోగక్షేమాలు అడగడానికి వచ్చిన వీణ ను అవమానించి పంపించావు. ఆమె గురించి నీకేమి తెలుసు. ఆమె ఇక్కడ వుండడానికి కారణం ఏమిటో నీకు తెలుసా?. తన తల్లికి కిడ్నీ వ్యాధి సోకిందని తెలిసి ఆమె ఎంత బాధపడింది అన్నది నీకు తెలుసా?. తన తల్లికి తోడుగా వుండాలని నీకంటే ఉన్నత మైన ఉద్యోగం వదిలి తల్లి కోసం ఇక్కడే వుండి పోయింది. ఆ జబ్బుకు కారణం ఇక్కడ కలుషితం అయిన నీరు, మట్టి అని తెలుసుకొని.
ఇక్కడ వున్నవాళ్ళు ఎవరూ కూడా భవిష్యత్తులో ఇలాంటి జబ్బులు బారిన పడకుండా వుండాలని పోరాటం చేసి. ఇక్కడ మంచి నీటి శుద్ధి యంత్రాలు నెల కొనేలా చేసింది. ఎక్కువ హానికర రసాయనాలు వాడడం వలన అవి మట్టిలో చేరి, తిరిగి మన ఒంటిలో చేరి మన ఆరోగ్యం పాడుచేస్తున్నాయని పూర్తిగా శ్రమించి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అందరితో చేయిస్తుంది. తాను కూడా పని చేస్తుంది.
అంతెందుకు నువ్వు కష్టంలో వున్నావని తెలిసి డబ్బులు ఇచ్చింది. మీ నాన్న నీకు ఇచ్చిన సొమ్ము వీణ కష్టార్జితం. నువ్వు అన్నావు కదా. మట్టి తో ఏమి వస్తుందని. ఆ మట్టిని నమ్ముకొని బ్రతికిందే నీకు సహాయం చేసింది. ఈ పల్లెలో పెరిగింది కనుకే, తల్లి తండ్రులకు విలువ ఇచ్చింది కనుకే, నువ్వు అన్ని మాటలన్నా ఒక బంధం వదులుకోలేక ఇంకా సహనం తో వుంది. నీకు తెలియని విషయం ఒకటి వుంది రా. ” అని జానకి అంది.
తల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అర్క!..
“వీణ నిన్ను ఇష్టపడుతుంది. ఈ విషయం నీకు చెప్పాలని ఎన్నో సార్లు అనుకుంది. కానీ నువ్వు ఆమెను చిన్నచూపు చూసి దూరంగా పెట్టావు. అయినా పట్నం గాలి నింపుకున్న నీలో, తల్లితండ్రులను చూడడానికి కూడా తీరిక లేని నీకు. ఈ పల్లెను ప్రేమించి, ఇక్కడ మనుషుల బాగుకోసం, బంధాలు కోసం పరితపించే ఆ పల్లెటూరి అమాయకురాలు ఎందుకు నచ్చుతుంది. ఆ! మరిచి పోయాను, నువ్వు ఎవరినో ప్రేమించావని చెప్పావు కదా. ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడు?. ” అని అడిగింది జానకి..
తల్లి మాటలకు అర్క కళ్ళు కన్నీటి తో నిండి పోయాయి “అమ్మా! నేను మోసపోయాను. అసలైన ప్రేమను గుర్తించ లేక, ఆకర్షణే ప్రేమ అనుకున్నాను. ” వాపోతూ అన్నాడు అర్క.
"ఏమిటి అర్క నువ్వు అంటున్నది?. " విస్తుపోతూ అడిగింది జానకి.
"ప్రియా అవకాశం కోసం చూసే వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. " అని జరిగింది చెప్పి, విలపించాడు.
అర్క చెప్పింది విని, “ఇప్పుడు బాధ పడి ప్రయోజనం ఏముంది అర్క?. చేసింది అంతా చేశావు కదా!. నిన్ను కావాలనుకునే మనిషి ని వదిలి, ప్రియా వెంట పడి మోసపోయావు. ఇప్పుడు నువ్వు వీణ కు క్షమాపణ చెప్పినా ఆమె మన్నిస్తుందా ?. నిన్ను మరలా ప్రేమిస్తుందా?. ఏదైనా ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. అంతా నీ ఖర్మ, మా ఖర్మ” నిట్టూర్చుతూ అంది జానకి.
తల్లి మాటలకు ఆలోచనలో పడ్డాడు. కొంత సమయం ఆగి వేగంగా పొలం దగ్గరకు పరుగుతీశాడు. జరిగిన తప్పును తెలుసు కొని, తన ప్రేమ కోసం అన్వేషిస్తూ, ఆమె తప్పకుండా తన ప్రేమ ఒప్పుకుంటుందని నమ్మకం తో..
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.




Comments