top of page

అన్యధా శరణం నాస్తి


'Anyadha Saranam Nasthi' New Telugu Story Written By Ch. Pratap

'అన్యధా శరణం నాస్తి' తెలుగు కథ రచన: Ch. ప్రతాప్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



మాధవయ్య అచ్యుతాపురం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి ఇచ్చిన ఒక ఎకరం పొలంతో వ్యవసాయం ప్రారంభించి, రాత్రింబవళ్ళు కష్టపడుతూ దానిని మూడెకరాలకు పెంచుకున్నాడు. వయస్సుతో పాటు ఆస్తిపాస్తులు కూడా బాగానే పెరిగాయి. ఇద్దరు కొడుకులు కూడా చేతికి అంది రావడం వలన ఇక రేపో మాపో వారికి వ్యవసాయం అప్పజెప్పి తాను విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నాడు. ఒకరోజు పట్నంలో వున్న తన బావగారికి తీవ్రమైన అనారోగ్యం చేసిందని తంతి వచ్చింది. ఆయనను కలుద్దామని రైలులో బయలుదేరాడు. మధ్యేమార్గంలో ఎండల తీవ్రత కారణంగా బాగా దాహం వేసింది. తెచ్చుకున్న మంచి నీళ్ళు అయిపోవడంతో అప్పుడే వచ్చిన స్టేషన్లో దిగి పంపు దగ్గర దాహం తీర్చుకొని, సీసాలో నీళ్ళు పట్టుకుంటుండగా రైలు కదిలిపోయింది.

అతను ఒంటరిగా ప్లాట్ ఫారం పై మిగిలిపోయాడు. స్టేషన్ మాస్టర్ ను వాకబు చేయగా మర్నాడు ఉదయం మాత్రమే తర్వాత రైలు ఉందని తెలిసింది. రైల్వే స్టేషనులో వుండే కంటే చీకటి పడేలోపు పక్కనే వున్న గ్రామానికి వెళ్ళడమే మంచిదని సలహా ఇచ్చాడు స్టేషన్ మాస్టర్. ఇక చేసేది లేక ఆ రాత్రి తలదాచుకునేందుకు పక్కన వున్న గ్రామానికి స్టేషన్ నుండి బయలు దేరాడు. ఆ గ్రామం చాలా చిన్నది. తల దాచుకునేందుకు లాడ్జీ లు, విశ్రాంతి గదులు లేవు. ఆ ఊరిలో తనకు తెలిసిన వారెవరూ లేకపోవడం వలన ఇక ఎక్కడో ఒక చోట ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు మాధవయ్య. ఆ ఊరిలో వున్న రామాలయం అరుగుపై కూర్చోని విశ్రాంతి తీసుకోసాగాడు మాధవయ్య.

ఎనినిది గంటల ప్రాంతంలో ఆలయం మూసి వేస్తున్న ఆలయ పూజారి మాధవయ్యను చూసి ఏమిటి సంగతి, ఇక్కడ ఎందుకు కూర్చున్నారని అడిగాడు. దాంతో జరిగినదంతా మాధవయ్య చెప్పి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని, అందుకు అనుమతించాలని కోరాడు.

ఆలయ పూజారి అందుకు నొచ్చుకుంటూ ఆ రాత్రికి తమ ఇంట్లో బస చేయమని కోరడమే కాక, బలవంతంగా మాధవయ్య చేతులు పట్టుకొని తమ ఇంటికి తీసుకువెళ్లాడు.

తమకు చేతనైనంతలో మాధవయ్యకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసారు పూజారి దంపతులు. స్నానానికి వేడి నీళ్ళు, తినేందుకు కమ్మని వేడి వేడి భోజనం తో పాటు విశ్రాంతి తీసుకునేందుకు తమ పడకగది ఇచ్చి తాము వరండాలో మంచాలు వాల్చుకొని హాయిగా పడుకున్నారు.


వారు చూపించిన ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మాధవయ్య కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పిల్లాయి. ముక్కు మొహం తెలీని ఒక అపరిచిత వ్యక్తిని ఆదరించిన పూజారి దంపతుల ఔదార్యానికి మనస్సులోనే నమస్సుమాంజలులు అర్పించుకున్నాడు.

అప్పుడే నిద్ర పట్టుతోందనగా బయట పెద్ద పెద్దగా అరుపులు వినిపించడంతో మాధవయ్యకు నిద్రాభంగం అయ్యింది. లేచి తలుపు సందు నుండి బయటకు చూసాడు. ఎవరో పెద్దమనిషి పూజారిపై పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఆ మాటలు బట్టి పూజారి కూతురు పెళ్ళి కోసం చేసిన అప్పు ఇంకా తీర్చనందున, వడ్డీ, అసలు కలిపి వారం రోజుల్లో అప్పు తీర్చకపోతే ఇల్లు జప్తు చేస్తానని బెదిరిస్తున్నాడు. కనీసం ఒక నెల రోజులు వ్యవధి ఇమ్మని పూజారి దంపతులు కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమిలాడితే ఆఖరుకు ఒప్పుకొని ఆ పెద్దమనిషి వెళ్ళిపోయాడు.


ఇంత హఠాత్తుగా ముంచుకొచ్చిన ఉపద్రవం నుండి ఎలా భగవంతుడా బయటపడడం అని పూజారి భార్య ఏడిస్తే, ‘అన్నింటికీ ఆపద్భాంధవుడైన ఆ భగవంతుడే వున్నాడు. నిత్య నైమిత్తిక కర్మలను సద్బుద్ధితో, నిస్వార్థంగా చేస్తూ ‘కృష్ణార్పణం’ అంటూ భగవంతునికి అర్పించటంవల్ల మంచి ఫలితాలను దైవమే అనుగ్రహిస్తాడు. మనం ఈ విషయంలో నిమిత్తమాత్రులమే’ అని పూజారి భార్యను ఓదార్చారు. తెల్లవారింది. స్నాన సంధ్యాదులు గావించుకొని ఆ దంపతులు పెట్టిన ఫలహారం తీసుకొని మాధవయ్య, వారి శెలవు తీసుకొని రైల్వే స్టేషన్ బయలుదేరాడు. అయితే పూజారి ఊరిలో ఉన్న రిక్షాను పిలిపించి మాధవయ్యను అందులో సాగనంపాడు. మధ్యాహ్నం పడక గది శుభ్రం చేస్తుండగా పూజారి భార్యకు ఒక సంచీ, ఒక ఉత్తరం కనిపించాయి. ఆ సంచీలో అయిదు వేల రూపాయల నగదు వుంది.


చీటీలో ‘మీరు నాకిచ్చిన ఆతిథ్యానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై వుంటాను. అమ్మాయి పెళ్ళి కోసం మీరు చేసిన అప్పు కొంతవరకైనా ఈ డబ్బుతో తీర్చండి’ అని రాసి వుంది. మాధవయ్య తన బావగారి వైద్యం కోసం తీసుకెళ్తున్న డబ్బులో కొంత భాగం అక్కడే విడిచి వెళ్ళీపోయాడు. దానిని చదివిన పూజారి భార్య కళ్లు ఆశ్రుపూరితాలయ్యాయి. తనను నమ్ముకున్నవారికి ఎప్పుడు భగవంతుడు తోడూ నీడగా వుంటాడని, భక్తుడైనవాడు నిండు మనస్సుతో ‘అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని భగవంతుని వేడుకుంటే, ఆ ఆర్తిని చూసి దేవాధిదేవుడు వెంటనే వచ్చేస్తాడు. శరణు కోరిన వారిని రక్షిస్తాడు.


‘భగవంతునికి ఆర్భాటాలు అవసరం లేదు. కేవలం ఏకాగ్రచిత్తంతో మనసా వాచా కర్మణా భగవంతుడిని నమ్మి భగవంతుని పైన విశ్వాసంతో పని చేస్తే చాలు. ఆ భగవంతుడు ఎల్లవేళలా సాధు రక్షకుడై ఉంటాడు’ అని భర్త చెప్పే మాటలు ఈ రోజున నిజమయ్యాయని అనుకుంటూ గోడపై వున్న అలివేలు మంగ సమేత శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామికి మనస్పూర్తిగా దండం పెట్టుకుంది. (కథా నేపథ్యం 1955 వ సంవత్సరం )

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.


327 views0 comments
bottom of page