అన్యోన్యం: ఓ చిన్న కథ
- Sudha Vishwam Akondi

- 2 hours ago
- 2 min read

Anyonyam: O Chinna Katha - Telugu Comedy Story | Sudhavishwam Akondi
అన్యోన్యం: ఓ చిన్న కథ - తెలుగు హాస్య కథ | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 17/04/2026
దాంపత్యం అంటే… 👉 తగాదాలు కాదు 👉 తగువుల్లో దాగిన ప్రేమ ❤️
"ఏమండీ! బ్లాక్ రైస్... అదే నల్ల బియ్యం అట అండీ! అవి తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుందట! కొలెస్ట్రాల్, గుండె జబ్బులు రావని చెబుతున్నారు. అలాగే రెడ్ రైస్ తింటే అసలు షుగర్ రానే రాదట! ఇంకా ఎన్నో విటమిన్స్ లభిస్తాయి. ఈ బియ్యం ఎంత తిన్నా సమస్య లేదట!
అవే వాడదాం ఇకనుంచి! వీళ్ళకి ఆర్డర్ పెడితే వాళ్లే పంపిస్తారు! మీరు వెళ్లి తేనక్కర్లేదు! ఎవరిని చూసినా షుగర్ ఉందనే అంటున్నారు. ముందు జాగ్రత్తగా మనం వాడితే, ఆ రోగాలు మనకు రాకుండా ఉంటాయి" అని సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చింది ప్రమీల భర్త అర్జునరావుకు
అర్జునరావు రిటైర్మెంట్ తీసుకుని నెల రోజులు అయింది. ఎల్.ఐ.సి. ఆఫీసులో పని చేసి రిటైర్ అయ్యారు. ఉన్న ఒక్క కొడుక్కి ఆరేళ్ల క్రితమే పెళ్లి చేసేశారు. వాళ్ళు తమకు కాస్త దూరంలో ఉంటారు. మనుమడు, మనుమరాలు పుట్టారు. వాళ్ళు స్కూల్ నుంచి ఇటు వస్తుంటారు.
కోడలు మంచిదే! కానీ తను పనిచేసే స్కూలుకు దగ్గరగా ఇల్లు తీసుకున్నారు సౌలభ్యం కోసం. అత్తాకోడళ్లు కలివిడిగా ఉంటారు కలిసినప్పుడు. కోడలు వర్కింగ్ అయినా వీలు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరకు వస్తుంటుంది పిల్లల్ని తీసుకుని. వీకెండ్‌లో అందరూ కలిసి ఉంటారు.
ఇక్కడ సొంత ఇంట్లో వీళ్ళు ఇద్దరే! అర్జునరావు రిటైర్డ్ అవ్వడంతో ప్రమీలకు పని తగ్గింది. కాస్త రెస్ట్ టైం దొరికింది. అప్పట్నుంచి సెల్ ఫోన్ ఆమె చేతిలోకి వచ్చింది. ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, చూస్తూ ఉంటుంది. ఒక్కోసారి హెల్త్ అంశాలపైనే పోస్టులు అదే పనిగా చూసి, ఇలా ఆవేశపడుతుంటుంది.
అదృష్టవశాత్తు తమకు ఏ రకమైన జబ్బులు రాలేదు. ఇద్దరూ ఆరోగ్యంగానే వున్నారు.
ఇలా ఏదో ఒకటి మార్చి, ఒక్కోసారి ఒక్కోటి తింటే ఆరోగ్యం అని పోస్టులు వస్తూ ఉంటాయి. ఇలాంటివి అస్సలు నమ్మడు అర్జునరావు. సమయానికి మితంగా తింటూ, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే, ఆరోగ్యంగా ఉంటారని అతని నమ్మకం.
భార్య ఇలాంటి ఆలోచనలు చెప్పినప్పుడు చిరాకు వస్తుంది అతనికి. ఇప్పుడు కూడా భార్య ఉపన్యాసం వినగానే కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నాడు.
"అవునా! అలాగే ఆ రైస్‌నే తిందాం! ఈరోజు నేనే వంట చేసి, ఆ రైస్ పెడతాను! సరేనా! నువ్వు టీవీ చూస్తూ ఉండు! లేదంటే ఫేస్‌బుక్ చూసుకో!" అన్నాడు భార్యతో
నాకు చెప్పకుండా ఎప్పుడో ఆ రైస్ తెచ్చినట్టున్నాడు ఈయన! సర్ప్రైజ్ చేద్దామని ఇప్పుడు వండి పెడతానని అంటున్నాడు' అని ప్రమీల భావించి, సంతోషించింది.
"ఓ! ఆ బియ్యం ఎప్పుడో తెచ్చారా?" అంది నవ్వుతూ
అతనూ నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళాడు.
కాసేపటికి వంట రెడీ అయిందని చెప్పగానే, సంతోషంగా డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళింది ప్రమీల.
"పెళ్లి అయిన ఇన్నేళ్లకు ఈయన తొలిసారిగా వంటచేసి పెడుతున్నారు! అప్పుడు ఏదో ఆఫీస్ పని ఒత్తిడికి ఏ సాయం చేసేవారు కాదేమో! 'ప్రేమ లేదనీ, అందుకే ఏ సాయం చేయట్లేదని' విసుక్కునేదాన్ని! కానీ ప్రేమ ఉంది! అయ్యో! అనవసరంగా అలా అనుకున్నాను. మా ఆయన బంగారం!" అని మనసులో మురిసి ముక్కలైపోతూ కూర్చుంది.
ఇంతలో కిచెన్‌లో నుంచి చిన్న చిన్న గిన్నెల్లో పదార్థాలు తీసుకుని వచ్చి, టేబుల్‌పైన అందంగా అమర్చాడు అర్జునరావు.
"ఇక మొదలుపెట్టు! నువ్వు చెప్పిన ఆరోగ్యకరమైన రైసుల రుచి చూసి చెప్పుము దేవీ!" అన్నాడు నాటకీయంగా.
నవ్వుకుంటూ గిన్నెలపై ఉన్న మూతలు తీసిన ప్రమీల ముఖంలో నవ్వు మాయమైపోయింది. ఆ స్థానంలో కోపం కూడా వచ్చేసింది.
కానీ అదేమీ పట్టించుకోకుండా...
"అదేమిటి దేవీ! ఈ నల్ల అన్నం, ఆ ఎర్ర అన్నం తిని, షుగర్ ను రాకుండా చేసుకుందాం! కానివ్వుము!
ఏమిటి అలా చూస్తున్నావు? అన్నం కొద్దిగా మాడితే రెడ్ రైస్, మొత్తం మాడితే నల్ల రైస్! అంతేకదా!" అన్నాడు నవ్వుతూ మళ్ళీ.
"మాడిన రైస్ కాదు మహప్రభో! అవి వేరేగా పండిస్తారు. అందుకే చెప్పినప్పుడు సరిగ్గా వినాలి! 'ఊఁ' కొట్టడమే కానీ చెప్పేది సరిగ్గా వినిపించుకోరు! ఎప్పుడు విన్నారు గనుక! అప్పుడు ఆఫీసూ... గాడిద గుడ్డూ... అని చెప్పేది వినిపించుకునేవారు కాదు! ఇప్పుడు ఇలా రిటైర్ అయినా అదే తంతు!" అంటూ ప్రమీల మాటల యుద్ధం మళ్లీ మొదలుపెట్టింది
"విదేశాల నుంచి పట్టుకొచ్చి, ఇక్కడి జనాలపై ఏవేవో ప్రయోగాలు వాళ్ళు రుద్దుతున్నారు. సరిగ్గా టైమ్‌కి తగినంత తిని, చక్కగా ప్రశాంతంగా ఉంటే ఏ రోగమూ రాదు! నా మాట విను!" అని తను కూడా తన అభిప్రాయాన్ని సమర్థించుకునే ఉపన్యాసం ఇచ్చి, మళ్ళీ కిచెన్‌లోనుంచి వేరే గిన్నెలు పట్టుకొని వచ్చాడు.
"నిన్ను ఆటపట్టిద్దామని అలా కొద్దిగా చేసి పెట్టాను. మాములు రైస్ కూడా వండానులే! ఇదిగో !" అని టేబుల్ పైన పెట్టాడు.
అప్పుడు ఆమె శాంతించింది. ఆకలికి కడుపు నకనకలాడిపోతోంది. ఇద్దరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు.
మళ్లీ సరదా కబుర్లు మాములే! అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న తగాదాలు మాములే వాళ్లకు. అన్యోన్య దాంపత్యం మరి.
సుధావిశ్వం

-సుధావిశ్వం




Comments