top of page
Original.png

ఉసురు



Usuru - Telugu Emotional Story | Kotthapalli Udayababu 

ఉసురు - తెలుగు భావోద్వేగ కథ | కొత్తపల్లి ఉదయబాబు

Published in manatelugukathalu.com on 17/04/2026


మనిషి చేసిన తప్పు…ఎప్పటికైనా తిరిగి వస్తుందా?

“ఉసురు” కథలో అహంకారం, నిర్లక్ష్యం, స్వార్థం వల్ల ఒక మనిషి జీవితం ఎలా మారిపోయిందో గుండెను తాకేలా చూపించబడింది.


సూర్యారావుని చూడటం అదే మొదటిసారి. ఎలక్షన్ డ్యూటీలో అతని కింద నన్ను మొదటి పోలింగ్ ఆఫీసర్ గా వేశారు. రెండవ ఎలక్షన్ క్లాసు ప్రారంభంలో నా పక్కన కూర్చున్న మాస్టారిని అడిగాను. అతను సూర్యారావు దగ్గర సహాయకుడిగా పని చేస్తున్నాడట.


“పెద్ద తిక్కలోడు.. జాగ్రత్త! అన్ని నీ చేత చేయించి తానే చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. అన్నింటికీ ‘అలాగే’ అని తలూపు, నీకు వర్క్ అంతా తెలిసినా సరే. ఎం.ఎల్.ఎ. గారి చుట్టమని బలుపు ఎక్కువ. చస్తున్నాం రోజు స్కూల్లో. అసలు డ్యూటీ తప్పించేసు కోవడానికి చాలా ప్రయత్నించాడు. ఎలక్షన్ ఆఫీసర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు చచ్చినట్టు ఈ ఎలక్షన్ క్లాసుకి వచ్చాడు. తిక్క కుదిరింది..” అని ఒక బూతు పదం వాడి అన్నాడతను విసుగ్గా మొహం పెట్టి.


“అంత బాగా చెప్పేస్తారా ఆ మాస్టారు పాఠాలు?” అడిగాను అమాయకంగా.


నా దృష్టిలో ఎవరు విద్యార్థుల్ని మెప్పించేలా పాఠం చెబుతాడో ఆయనే అచ్చమైన ఉపాధ్యాయుడు. మరి నేనెంత పేరు తెచ్చుకున్నానో నాకైతే తెలీదు.


“నా మొహం.. అక్షరం ముక్క రాదు. ఎప్పుడూ చూడు క్లాసులో నిద్రపోతుంటాడు. చెప్పేది సోషల్ సబ్జెక్టు. ఎప్పుడూ వంద శాతమే.. అదేం అదృష్టమో! ఇంకో విషయం తెలుసా మీకు?” అడిగాడతను.


“ఏమిటది?” ప్రశ్నించాను.


“వాడికి ఈ ఉద్యోగం టాలెంట్ మీద రాలేదు. ‘మా బంధువుల అమ్మాయిని చేసుకుంటే పోస్ట్ క్షణాల్లో వేయిస్తాను’ అన్నాడట ఎం.ఎల్.ఎ. గారు. ‘ముందు పోస్ట్ వేయించండి.. చేసుకుంటాను’ అన్నాడట ఈ అందగాడు. అతను పోస్ట్ వేయించాక, ఏడవ నెల గర్భంతో ఉన్న ఒక అమ్మాయిని ఎం.ఎల్.ఎ. గారి దగ్గరకు తీసుకెళ్లి.. ‘నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏడవ నెల. ఈ అమ్మాయికి అన్యాయం చేసి మీ అమ్మాయిని చేసుకోమంటే చేసుకుంటాను’ అన్నాడట.


ఎం.ఎల్.ఎ.కి వీడి దెబ్బకి కళ్ళు తిరిగిపోయాయట. వేయించింది ప్రభుత్వ ఉద్యోగం, ఎలా పీకించగలడు? కసిదీరా రౌడీలని పెట్టించి కొట్టిద్దామనుకున్నాడట. కులపెద్దలు అడ్డుపడి ‘మన కులపోడిని మనమే కొట్టుకుంటే ఎంత అప్రతిష్ట?’ అని సవరదీసి ఆపారట. లేకపోతే ఇత్తడైపోయేది మీ గురువుగారికి..” అని పకపకా నవ్వాడతను.


“నా గురువేంటి? మీ ప్రధానోపాధ్యాయుడు కదా..” అన్నాను నేను.


“ఈ ఎలక్షన్ డ్యూటీ అయ్యేంతవరకు మీ గురువే..” అన్నాడతను మళ్ళీ నవ్వి. నేను నవ్వాను.


“కానీ మరో ఘోరం జరిగింది బాసూ..” అన్నాడతను సీరియస్ గా ముఖం పెట్టి.


“మళ్ళీ ఏమైంది?” అడిగాను ఆత్రుతగా.


“ఇతను పెళ్లి చేసుకుంటాడని నమ్ముకున్న ఆ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.”


నాకు మైండ్ బ్లాక్. ఎంత ఘోరం!


“ఎప్పటికైనా ఆ అమ్మాయి ఉసురు వాడికి తగలకపోదు..” అన్నాడతను.


“తప్పు.. అలా అనుకోవడం మనకెందుకు లెద్దూ.” తేల్చేశాను నేను.


క్లాసు పూర్తి అవబోతుంటే ఏ పి.ఓ.కి ఏ ఎ.పి.ఓ.ని కేటాయించారో మైక్ లో చదివి, వారిద్దరినీ కలుసుకుని ఫోన్ నంబర్స్ పరస్పరం మార్చుకుని, ఒకరికొకరు ఎలక్షన్స్ పరిసమాప్తం అయ్యేంతవరకు సహకరించుకోవాల్సిందిగా అధికారులు ప్రకటించి, అప్పటికి తాత్కాలికంగా చేతులు దులుపుకున్నారు. నా పక్కనున్న మాస్టారు “రండి.. మా వాడికి మిమ్మల్ని పరిచయం చేస్తాను” అని తీసుకెళ్లి పరిచయం చేశాడు.


“ఆహా.. నువ్వేనటోయ్ పద్మరాజు అంటే! చాలా కష్టపడి పాఠాలు చెబుతావట. పిల్లల చేత మంచి యాక్టివిటీస్ చేయిస్తావట. మంచి కథా రచయితవటగా.. నీలాంటి వాడు తోడుగా ఉంటే నాలాంటి వాళ్ళు హాయిగా తన్నిపెట్టుకుని పడుకోవచ్చు. నా ఫోన్ నంబర్ నోట్ చేసుకో.” అని తనది చెప్పి నాది తీసుకున్నాడు.


అతని అసిస్టెంట్ చెప్పింది నిజమే. ఎలక్షన్ వర్క్ అంతా నా చేత చేయించి, నాకు తను వర్క్ అంతా నేర్పించి చేయించుకున్నట్టు తెలిసిన వారందరికీ చెప్పాడు. నేను నవ్వుకున్నాను. విడిపోయేటప్పుడు అన్నాడు.. “ఈ మండలంలోనే వేరే వేరే చోట్ల పనిచేస్తున్నా, ఉండేది టౌన్ లో కాబట్టి కలుసుకుంటూ ఉందాంలే.”


“సరే సార్” అన్నాను నేను.

*

సీనియారిటీ పెరగడంతో నేను ప్రధానోపాధ్యాయుడిని అయ్యాను. భార్య, ఇద్దరు పిల్లలతో నా వృత్తి – ప్రవృత్తి చక్కగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాను. నా భార్య కాలక్షేపం కోసం ప్రైవేటు కాన్వెంట్ లో ఉపాధ్యాయురాలిగా చేరింది.


ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయితో ఉన్న మరో అబ్బాయిని చూపించి..


“వీడు శ్రీహర్ష అండీ. మనవాడితోనే కలిసి చదువుతున్నాడు. మనవాడికి నాలుగో ర్యాంకు వస్తే వాడికి మొదటి ర్యాంకు వస్తూ ఉంటుంది. మనవాడితో నైట్ స్టడీ చెయ్యడానికి నేనే రమ్మన్నాను. అన్నట్టు వీళ్ళ నాన్నగారు మీకు తెలుసట.. పేరు సూర్యారావట.” అంది నా భార్య.


“ఓహో..” అని వాళ్ళ కుటుంబ విషయాలు అడిగాను. వాళ్ళ అమ్మగారికి గుండె నీరసం అని, ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారని, అమ్మమ్మ తాతయ్య తమ ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకుంటారనీ చెప్పాడు ఆ బాబు.


దాదాపు నెల రోజులు నైట్ స్టడీకి వచ్చిన ఆ బాబు మళ్ళీ రాకపోయేసరికి కారణం అడిగాను నా భార్యని.


“అయ్యో మీకు తెలీదా.. వాళ్ళమ్మగారు పోయారట.” అంది.


హతాశుడినయ్యాను. వెళ్లి పలకరించి వచ్చాను.

మరో 15 రోజుల తరువాత మరో వార్త చెప్పింది.

నిర్ఘాంతపోయాను. సూర్యారావు రెండో పెళ్లి చేసేసుకున్నాడు తమ బంధువుల తాలూకు అమ్మాయిని. బజార్లో కనిపించినప్పుడు కంగ్రాట్స్ చెప్పాను. అతను ఏదో చెప్పబోయి వెళ్ళిపోయాడు.

*

అందమైన, అన్యోన్యమైన నా సంసారం చూసి సమాజానికే కన్ను కుట్టిందో.. నేను చేసిన గత జన్మ పాపమో, నా భార్యకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి తగ్గిపోయి ఇంటికి తీసుకు వచ్చేంతలోనే తిరగబెట్టి మరణించింది.


ఏడాది పాటు మనిషిని కాలేకపోయాను. తను ఉండగానే పిల్లల పెళ్ళిళ్ళ బాధ్యతలు తీరిపోవడంతో తను లేని లోటు తప్ప మరే ఇబ్బందీ లేదు. తను లేనప్పుడు భోజనానికి ఇబ్బంది పడతానని ఎలక్ట్రిక్ కుక్కర్ లో రైస్ పెట్టుకుని, కర్రీస్ కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకోవడం నేర్పింది నా భార్య. అదే నాకు జీవనాధారమైంది. పిల్లలు ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు.


సూర్యారావు నన్ను పలకరించడానికి వచ్చాడు. “నాలాగా పెళ్లి చేసేసుకో రాజూ.. మగాడివి ఎంతకాలం చెయ్యి కాల్చుకుంటావ్? ఇంకా ఐదేళ్లు సర్వీస్ ఉందిగా.” అన్నాడు.


నవ్వేసి ఊరుకున్నాను. కానీ నా పిల్లలు ఊరుకోలేదు.


“మీ సాహితీ కృషి నిర్విరామంగా సాగాలంటే మీరు పెళ్లి చేసుకోండి నాన్న. మీకీ వయసులో తోడు చాలా అవసరం. మా సంసారాల గొడవలో మేము మిమ్మల్ని పొరపాటున నిర్లక్ష్యం చేస్తే మీరు బాధపడతారు.” అంటూ వాళ్ళే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పద్మిని నాకు భార్యగా దొరకడం నాకు దేవుడిచ్చిన వరం అని తరువాత అర్థమైంది నాకు.


మరో మూడేళ్ళలో సూర్యారావు రిటైర్ అయ్యాడు. ఫంక్షన్ కి పిలిచాడు, వెళ్లి గార్లెండ్ చేశాను.


ఒకరోజు బజార్ లో కనిపించి “ నువ్ రచయితవి కదా .ఒక సలహా ఇస్తావా? “ అని అడిగాడు.


“వివరంగా చెప్పండి” అన్నాను.


“నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నలభై లక్షల దాకా వచ్చాయి. అవి నా పిల్లవాడికే చెందాలంటే ఏం చెయ్యాలి?”

అడిగాడు.


“అది నా కష్టార్జితం.. నా పిల్లవాడికే ఇస్తాను అని చెప్పండి.” అన్నాను.


“రాజూ! నా మొదటి భార్య నన్ను ఎంతో ప్రేమగా చూసేది.. తల్లిలా ముందు నా పొట్ట చూసేది. నేను డబ్బుతో ఏమైనా చెయ్యగలననే అహంకారంతో ఆమెకు సరి అయిన వైద్యం చేయించకుండా నిర్లక్ష్యం చేశాను. ఆమె పోయాక నా కన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు అంతా ‘ఆమె చావుకు నువ్వే కారణం’ అంటూ నన్ను వెలివేశారు. పెద్దకార్యం అయ్యాక ఒక్కరూ నా ముఖం చూడలేదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ముఖాన తలుపేసుకున్నారు. ఈ ప్రపంచంలో ఆకలి బాధని మించిన బాధ మరేదీ లేదు రాజూ. నాకు వంట రాదు. నాకు ఆస్మా ఉంది.. బయట తినలేను, పడదు. అన్నం పెట్టే దిక్కులేక దూరపు బంధువుల సహకారంతో రెండో పెళ్లి చేసేసుకున్నాను. పెళ్ళికి ముందే నా పిల్లవాడికి నా ఆస్తంతా ఇచ్చేశాను.


నా కొడుకు మంచివాడే. ‘నా దగ్గరే ఉండు నాన్న’ అంటాడు. కానీ నా కోడలు వాడు ఆఫీసుకు వెళ్ళిపోయాక ‘ఎప్పుడు వెళ్తారు మావయ్య?’ అని అడిగేసేది.. ఏ ముఖం పెట్టుకుని ఉండను చెప్పు? ఈ రెండో ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పుడు వచ్చే నలభై లక్షలలో ఇరవై తన పేర పెట్టాలట.. నామినీ తన కొడుకుని పెట్టాలట. మిగతా ఇరవై మా ఇద్దరి పేరా జాయింట్ గా పెట్టి, ఎవరు ముందు పోయినా మిగతా వారు పిల్లలిద్దరికీ చెరొక పది లక్షలూ ఇవ్వాలట. ఇది న్యాయంగా ఉందా చెప్పు?”

సూర్యారావు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగి, మాసిపోయిన గడ్డం లోకి ఇంకిపోయాయి.


“ అది అన్యాయం .మీరు ఒప్పుకోకండి సర్.” అన్నాను సీరియస్ గా...


“అలా చేస్తే ఇంక నాకు ఈ అన్నం కూడా దొరకదు రాజూ!” అని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు.


నా గుండెలు ఎవరో పిండేసినట్టయింది. ఎలక్షన్ క్లాస్ నాడు వాళ్ళ అసిస్టెంట్ అన్న మాటలు గుర్తొచ్చాయి.


“ఎప్పటికైనా ఆ అమ్మాయి ఉసురు వాడికి తగలకపోదు “...!!!


***

కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

                  2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

  *సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

 2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

చివరగా నా అభిప్రాయం :

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page