అపురూప బంధం

Apurupa Bandham - Telugu Emotional Story | Varalakshmi Yanamandra
అపురూప బంధం - తెలుగు భావోద్వేగ కథ | వరలక్ష్మి యనమండ్ర
Published in manatelugukathalu.com on 28/09/2026
స్నేహం అంటే కేవలం కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం మాత్రమే కాదు… ఆపదలో ఒకరికొకరు అండగా నిలవడం. +‘అపురూప బంధం’ మనకు రక్తసంబంధం కంటే ప్రేమ, నమ్మకం, మానవత్వమే గొప్ప బంధాలని గుర్తుచేస్తుంది.
రోజూలాగే ఆ రోజు కూడా, సుధ డ్యూటీ ముగించుకుని, అలసిపోయి, రూమ్‌కి వచ్చి, బెడ్ మీద వాలిపోయింది. కొద్దిసేపటికి తన ప్రాణస్నేహితురాలు రజని వచ్చింది.
సుధ, రజనీలది ఒకటే ఊరు కావడంతో, కలిసి చదువుకుంటూ, ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారు.
వీళ్లను బంధువులందరూ… ‘జంటపక్షులని, కవలపిల్లలని’ ఆటపట్టించేవారు.
చదువు అయిపోగానే వాళ్లు ఉద్యోగాల వేట ప్రారంభించారు. కానీ, వెంటనే ఉద్యోగాలు రాలేదు.
సుధకు ఐదు సంవత్సరాలు. కొత్తగా స్కూళ్లో చేరింది.
అప్పటిదాకా అమ్మ దగ్గరే ఇంట్లోనే ఉండి చదువుకునేది. ఇప్పుడు మాత్రం స్కూళ్లో చేరింది. మొదటి రోజని కొంచెం భయంగా ఉంది తనకి. క్లాస్ రూమ్‌లోకి వెళ్లి చూస్తే, మూలన ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఉంది. పుస్తకాల మధ్యలో తల దాచుకుని ఏదో చదువుతోంది.
ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి "నేను సుధ. నీ పేరేమిటి?" అని అడిగింది.
"రజని" అని చిన్న స్వరంలో చెప్పింది ఆ అమ్మాయి. కనీసం కళ్లు ఎత్తి చూడలేదు.
"ఎందుకు ఒంటరిగా కూర్చున్నావ్? నేను నీతో కలిసి కూర్చోనా?" అని అడుగుతూ, సమాధానం కోసం ఎదురు చూడకుండా, రజని పక్కనే కూర్చుంది సుధ.
అప్పటినుండి ఇద్దరూ కలిసే కూర్చునేవారు.
వారం రోజుల తరువాత సుధకు తెలిసింది - రజని ఎందుకు అంత మౌనంగా ఉంటుందో.
రజనికి తండ్రి లేరు. చిన్నప్పుడే చనిపోయారు. తనను వాళ్ల అమ్మ ఒంటరిగా పెంచుతోంది. నిరంతరం ఏదో ఒక పని చేస్తూ జీవనం సాగిస్తోంది.
విషయం తెలిసిన వెంటనే - "నేను ఉన్నాను కదా! ఇకనుండి మనం ఇద్దరం కలిసే ఉంటాం" అని చెప్పి రజని చేతిని గట్టిగా పట్టుకుంది సుధ.
అప్పటినుండి రజని మౌనం మాయమయ్యింది. తను నవ్వడం మొదలుపెట్టింది.
మూడవ తరగతిలో ఉన్నప్పుడు సుధ వాళ్ల నాన్న చాలా అందమైన పెన్సిల్ బాక్స్ ఒకటి కొనిచ్చారు. అందులో రంగురంగుల పెన్సిళ్లు, రబ్బర్లు, కత్తెరలు అన్నీ ఉండేవి.
క్లాసులో అందరూ అది చూసి అసూయపడేవారు.
రజని కూడా ఆ పెన్సిల్ బాక్స్‌ను చూసి మెచ్చుకుంది. కానీ తన దగ్గర ఓ పాత పెన్సిల్ బాక్స్‌లో కొన్ని సాధారణ పెన్సిళ్లు మాత్రమే ఉండేవి.
అది గమనించిన సుధ, "రజని, నువ్వు ఇష్టపడ్డావు కదా? ఇక ఇది నీదే!" అని చెప్పి తన కొత్త పెన్సిల్ బాక్స్‌ను రజనికి ఇచ్చేసింది.
"అబ్బే, ఇది కొత్తది. ఇది నీకే! నాకు వద్దు" అంది రజని.
"మనిద్దరం ఒకటే కదా! నీ దగ్గర ఉంటే నేను కూడా వాడుకోగలను కదా" అని నవ్వుతూ, రజని చేతిలో పెడుతూ చెప్పింది సుధ.
అప్పుడు రజని కళ్లల్లో కృతజ్ఞతా భావం మెరిసింది.
ఒకసారి, ఐదవ తరగతిలో ఉన్నప్పుడు, ఒకరోజు కొంతమంది అబ్బాయిలు రజనిని ఆటపట్టిస్తున్నారు. "నీకు నాన్న లేడు కదా! అమ్మ ఒంటరిగా పనికి వెళ్తుంది" అని హేళనగా మాట్లాడుతున్నారు.
రజని మ్రానుపడి నిలబడిపోయింది. కళ్లల్లో నీళ్లు జలజలా రాలుతున్నాయి.
అప్పుడు సుధ వారి మధ్యలోకి వచ్చి "తనకు నాన్న లేకపోతే ఏంటి? నేను ఉన్నాను కదా! మా నాన్న, అక్క, అమ్మ, అన్నయ్య కూడా ఉన్నారు. మేమంతా రజని కుటుంబమే!" అని గట్టిగా చెప్పింది.
దానికి ఆ అబ్బాయిలు నవ్వుతూ "ఇది మీ అక్క కాదు. వేరే కుటుంబానికి చెందినది" అని అన్నారు.
"కుటుంబం అంటే రక్తసంబంధం మాత్రమే కాదు. ప్రేమ, విశ్వాసం కూడా కుటుంబాన్ని తయారు చేస్తాయి. రజని నా సోదరి. ఆమెను ఎవరైనా బాధపెట్టాలని అనుకుంటే, మొదట నాతో పోరాడి గెలవాలి!" అని దృఢంగా చెప్పింది సుధ.
ఇక అప్పటినుండి ఎవరూ రజనిని ఏమీ అనలేదు.
ఆ తరువాత ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు సుధకు టైఫాయిడ్ వచ్చింది. మూడు వారాలు బెడ్ రెస్ట్.
స్కూలుకు వెళ్లలేకపోయింది. ప్రతిరోజూ స్కూలు అయ్యాక రజని సుధ ఇంటికి వచ్చేది. ఆ రోజు జరిగిన క్లాసుల విషయాలు చెప్పేది. నోట్స్ తీసుకువచ్చేది. సుధకు అర్థం కాని విషయాలను వివరంగా చెప్పేది.
ఒకరోజు సుధ వాళ్ల అమ్మగారు రజనితో, "రజని, నువ్వు ప్రతిరోజూ ఇలా వస్తున్నావు. నీ చదువుకు భంగం వస్తుంది కదమ్మా!" అన్నారు.
"ఆంటీ! సుధ లేకుండా నా చదువు అసలు జరగడం లేదు. తను త్వరగా కోలుకుని వస్తేనే నేనూ బాగా చదవగలను" అని చెప్పింది రజని.
ఆ మాటలు విన్న ఆవిడ మరెప్పుడూ వారిరువురినీ వేరుగా చూడలేదు. సుధ, రజని ఇద్దరూ - తోడబుట్టని కవలలుగా మారారు.
పదవ తరగతి పరీక్షలకు ముందు ఇద్దరూ కలిసి కూర్చుని భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు.
"నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను" అని చెప్పింది సుధ.
"అయ్యో, అంత కష్టం నేను పడలేను. నేను సాధారణ జాబ్ చేసుకుంటాను" అని చెప్పింది రజని.
"రజని, మనిషి కలలు పెద్దవిగా ఉండాలి. నువ్వు కూడా ఏదైనా గొప్ప పని చేయాలి. నేను డాక్టర్ అవుతాను, నువ్వు టీచర్ అవ్వు. లేకపోతే మనిద్దరం కలిసి ఏదైనా సేవా కార్యక్రమాలు చేద్దాం" అని చెప్పింది సుధ.
"మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటామా?" అని అడిగింది రజని.
"ఎల్లప్పటికీ! ఈ జన్మలో మాత్రమే కాదు, ముందున్న అనేక జన్మల్లోనూ కూడా మనం స్నేహితులమే" అని అంది సుధ.
ఇంటర్ కాలేజీలో చేరినప్పుడు ఇద్దరూ వేర్వేరు సబ్జెక్టులు తీసుకున్నారు. సుధ సైన్స్, రజని కామర్స్. కానీ ఇద్దరూ ఒకే కాలేజీలోనే చేరారు.
కాలేజీలో కొత్త స్నేహితులు వచ్చారు. కానీ ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం మారలేదు. లంచ్ టైంలో కలిసి కూర్చుని తినేవారు. ఇంటికి వెళ్లేటప్పుడు కలిసే వెళ్లేవారు.
ఇతర అమ్మాయిలు అప్పుడప్పుడు "మీరిద్దరూ ఇంత దగ్గరగా ఎలా ఉంటారు? మాకు అర్థం కావడం లేదు" అని అడిగేవారు.
"మేమిద్దరం దేవుడు తయారు చేసిన జంట. ఒకరు లేకుండా మరొకరు అసంపూర్ణం" అని చెప్పేది సుధ.
"మా స్నేహం అంటే ప్రేమ మాత్రమే కాదు, నమ్మకం కూడా. ఒకరిపై ఒకరికి అపారమైన విశ్వాసం" అని చెప్పేది రజని.
డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకరోజు ఇద్దరూ కాలేజీ గార్డెన్లో కూర్చుని ఉన్నారు.
"రజనీ, మనం ఎక్కడికి వెళ్లినా, ఏమైనా, ఒకరిని ఒకరు మర్చిపోకూడదు" అని చెప్పింది సుధ.
"ఎప్పటికీ మర్చిపోము. మన స్నేహం శాశ్వతం" అని చెప్పింది రజని.
"అయితే ప్రతిజ్ఞ చేసుకుందాం. ఎంత దూరంలో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఒకరికొకరం తోడుగా ఉంటాం" అని చెప్పి చేతులు కలిపారు ఇద్దరూ.
ఆ ప్రతిజ్ఞనే వారి జీవితాలను ఢిల్లీలో మళ్లీ కలిపింది. ఆ బంధమే వారిని ఎంత దూరంలో ఉన్నా ఒకరినొకరు గుర్తుంచుకునేలా చేసింది.
ఇద్దరి చదువులు వేరైనా - ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానంతో - టైపు, షార్ట్‌హ్యాండ్, కంప్యూటర్ వంటి సాంకేతిక విద్యల్లో కూడా పట్టు సాధించడమే కాక, ఒక సదాశయం కలిగిన వారవటంతో, పాలియేటివ్ నర్సింగ్ కోర్సు కూడా పూర్తి చేశారు.
తల్లిదండ్రులు, బంధువులు "జంటపక్షులు", "కవలపిల్లలు" అని ఎందుకు అనేవారో అర్థమవుతుంది ఈ మూలాలను చూస్తే! వారి స్నేహం కేవలం పరిచయం కాదు.
అది హృదయ సంబంధం. ఆత్మ సంబంధం. అలాంటి అపురూప బంధం ఇలా మొలకెత్తింది వారి బాల్యంలో.
ఒకరోజు సుధ వాళ్ల బంధువు వాళ్లింటికి వచ్చాడు. ఆమాటా, ఈమాటా అయిన తరువాత ఆయన, "మన సుధ నర్స్ కోర్సు చేసింది కదా! ఢిల్లీలో ఒక ఆశ్రమం / ఆసుపత్రి ఉన్నది.
దానిలో నర్సుగా పని చేస్తుందా? అక్కడ తెలిసిన వారున్నారు. వెంటనే పని అవుతుంది. దూరంగా ఉండాలని తను భయపడవలసిన పనిలేదు. మేము అక్కడికి దగ్గరలోనే ఉంటాము.
తన యోగక్షేమాలు మేము తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ తను ఆశ్రమంలోనే ఉన్నా ఇబ్బందేమీ ఉండదు.
చాలా సెక్యూర్డ్‌గానే ఉంటుంది. అక్కడే ఉండే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు” అని భరోసా ఇచ్చారు.
‘అంకుల్ వాళ్లు దగ్గరలోనే ఉంటారు’ అనే భావన ధైర్యాన్నిచ్చింది సుధకు. కానీ, సుధకు తన స్నేహితురాలిని వదిలి వెళ్లడం ఏ కోశానా ఇష్టం లేదు.
"నేను కూడా త్వరలో అక్కడికే వస్తాను. మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు” అని రజని నచ్చచెప్పటంతో, అయిష్టంగానే ఒప్పుకుని... సుధ తన అమ్మానాన్నలను 'ఢిల్లీ వెళ్తా'నని అడిగింది.
నిస్సహాయులకు సేవ చేయాలనే ఆసక్తి, ఆశయం కలది కావటంతో… పట్టుబట్టి... తల్లిదండ్రులను ఒప్పించి, ఆ అంకుల్ సహాయంతో ఢిల్లీకి వచ్చి, ఆ ఆశ్రమంలో చేరింది సుధ.
డబ్బుకు కొదువలేని సుధ తల్లిదండ్రులు మాత్రం కూతురిని తమకు దూరంగా, ఢిల్లీకి పంపడానికి అయిష్టతను వెలిబుచ్చినా, తన మంకుపట్టుకు తలొగ్గి తనను పంపారు.
సుధ ఢిల్లీలోని “క్యాన్సర్ ఆవేదన ఆశ్రమం”లో నర్సుగా బాధ్యతలను స్వీకరించింది. తరచూ రాసుకుంటున్న ఉత్తరప్రత్యుత్తరాలు - స్నేహితురాలికి, తల్లిదండ్రులకు మరియు సుధకి మధ్య వారధులయ్యాయి.
అక్కడ నెలకొన్న ప్రేమపూరిత వాతావరణం, పరిస్థితులు, ఆశ్రమ విధానాలు, క్యాన్సర్ రోగులకు నర్సులు అందిస్తున్న సేవలు సుధకు బాగా నచ్చటంతో, ఆమె మనసుకు చాలా తృప్తిగా ఉంది. అక్కడ పనిచేసే నర్సులంతా పదహారు నుండి ఇరవై సంవత్సరాల వయసు కలవారే.
తాము చేస్తున్న పనిని దైవంగా భావించేవారే. మలయాళం, హిందీ మాట్లాడే వారే ఎక్కువ. తెలుగు మాట్లాడేవాళ్లు చాలా తక్కువ. అయినా, సుధకు అతి తక్కువ కాలంలోనే అందరితో స్నేహం ఏర్పడింది.
కొంచెం కొంచెంగా హిందీ, మలయాళం భాషలను నేర్చుకుంటోంది.
అక్కడకు వచ్చిన పేషెంట్ల మనసుకు ఏ బాధా కలగకుండా చాలా బాగా చూసుకుంటారు. అదొక క్రిస్టియన్ సంస్థ. సేవ చేయడానికి కులమతాలతో పనేముంటుంది? సుధకి తన ఉద్యోగం చాలా తృప్తిని ఇచ్చింది.
మూడేళ్ల పిల్లల దగ్గరనుండి తొంభై ఏళ్ల వయోవృద్ధుల వరకూ పేషెంట్లు వచ్చి అక్కడ ఉండేవారు.... ఇలా కొన్ని నెలలు గడిచాయి.
దేవుడికి కూడా ఆ ప్రాణస్నేహితులను విడదీయడం ఇష్టం లేదేమో! రజని ఎస్.ఎస్.సి పరీక్షలో సెలెక్ట్ అవటంతో ఢిల్లీలోని సి.డబ్ల్యూ.సి లో స్టెనోగా పోస్టింగ్ వచ్చింది. అందరూ సంతోషించారు. రజని కూడా వచ్చింది కాబట్టి, ఇద్దరూ ఆఫీసులకు వెళ్లడానికి వీలుగా ఉండే ప్రాంతంలో ఒక ఇల్లు తీసుకుని సంతోషంగా కాలం గడపసాగారు.
సుధ తన ఆశ్రమంలో వచ్చే క్యాన్సర్ పేషెంట్ల గురించి చెబుతుండేది. రజని కూడా తన ఆఫీసు విషయాలు చెబుతుండేది. సెలవురోజుల్లో రజని ఆశ్రమానికి వెళ్లి సుధకి సహాయం చేసేది.
ఆ రోజు సుధ చాలా డల్‌గా ఉండటం గమనించింది రజని.
స్నేహితురాలి పక్కన కూర్చుని, ఆప్యాయంగా భుజం చుట్టూ చెయ్యి వేసి, తన దగ్గరకు తీసుకుని “ఏమిటి సంగతి?” అని అడిగింది.
“నారాయణరావు గారు చనిపోయారు” అంటున్న సుధ కనులు జలపాతాల్లా వర్షిస్తున్నాయి.
‘నిజానికి నా పరిస్థితి కూడా అలానే ఉంది’ అనుకుంది, అదుపు తప్పుతున్న మనసును అదుపు చేసుకుంటున్న రజని. మనసులో గిరగిరా తిరిగిన ఆలోచనల కాలచక్రం - నారాయణరావుతో తన అనుబంధాన్ని గుర్తుచేస్తోంది.
నారాయణరావుగారు, రజనీ వాళ్లు - ఒకప్పుడు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు.
నారాయణరావు గారు జల్సా పురుషుడు. ఆయనకు చాలా దురలవాట్లుండేవి. ఆయన ఒక గవర్నమెంటు ఉద్యోగస్థుడవటంతో నెలకు ఇంతని జీతం వస్తుంది కాబట్టి జల్సాలు మెండు.
కుటుంబం పట్ల, పిల్లల పట్ల బాధ్యత కొంత తక్కువ. కాదు, కాదు - అస్సలు లేదనే చెప్పాలి.
ఏ కారణం లేకుండానే పిల్లలనూ, భార్యనూ తిట్టడం, కొట్టడం లాంటివి ఆ ఇంట్లో జరగటం, సహజాతీ సహజమైన అతనిలోని దుర్గుణాలకు నిట్టనిలువు నిదర్శనం.
అందరూ నారాయణరావు గారి భార్యను 'సీతమ్మ తల్లి' అంటారు. ఆమె తన రెక్కలుముక్కలు చేసుకుని, శక్తివంచన లేకుండా కష్టపడి, పిల్లలకు మంచితనం, చదువు పట్ల ఆసక్తి కలుగజేసింది. ఏనాడూ నోరు విప్పి కుటుంబ విషయాలు చెప్పేది కాదు.
కానీ, చుట్టుపక్కలందరికీ ఈ విషయాలు తెలుసు. కాలం గడిచేకొద్దీ పిల్లలు చదువుకుని, భగవంతుని దయవల్ల మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
నారాయణరావు దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి టీచర్‌గా నారాయణరావు గారు ఉండే ఊళ్లోనే ఉండేది.
వాళ్ల బతుకులు వాళ్లు బతుకుతున్నారు. నారాయణరావు గారు, భార్య ఇద్దరే ఉంటున్నారు.
కొంతకాలం గడిచింది.
నారాయణరావుగారు రిటైర్ అయ్యారు.
'రోజులన్నీ ఎల్లప్పుడూ ఒకేరకంగా ఉండవు' అని పెద్దలన్నట్లు నారాయణరావు గారి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించడం మొదలైంది. సిగరెట్లు తాగే అలవాటు ఎక్కువగా ఉన్న ఆయనకు లంగ్ క్యాన్సర్ వచ్చింది.
మనిషి అస్థిపంజరంలా తయారయ్యాడు. ఎవరి మాటా వినని మొండిమనిషి ఆయన. భార్యమాట అసలు వినడు.
వైద్యం అంతగా అభివృద్ధి చెందని రోజులవి. ఆయనను పిల్లలు అతిబలవంతం మీద హైదరాబాద్ తీసుకెళ్లి, ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
వివిధ రకాల పరీక్షలు చేసి ఆయనకు లంగ్ క్యాన్సర్ అని తేల్చారు డాక్టర్లు. పిల్లలు ఆయనను క్యాన్సర్ హాస్పిటల్‌లో చేర్చి, వైద్యం చేయించారు. నారాయణరావు రెండు నెలల్లోనే తన పనులు తానే చేసుకునేటంతగా కోలుకున్నాడు.
ఇంతలో ఆయన కొడుక్కి ఢిల్లీ బదిలీ అవటంతో, ఈయన కూడా అక్కడికి వెళ్లకతప్పలేదు. భార్యను రావద్దని ఖరాఖండిగా చెప్పారు నారాయణరావుగారు.
'మనం చేసిన పాపం, తప్పులు మనలను తప్పక వేధిస్తాయి' అనడం నిజమే కదూ! అందుకే నారాయణరావు గారికి అక్కడ కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.
ఎప్పుడూ తన మాటే శాసనంగా బతికిన వాడు.. ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. భార్యను రానివ్వలేదు మరి! ఎవరితో చెప్పుకుంటారు? ఇంట్లో సంవత్సరం వయసు మనవడున్నాడు.
కోడలు ఐదు నెలల గర్భవతి. ఇంటివాళ్లు ఇలాంటి పేషెంట్‌ని మా ఇంట్లో ఉంచవద్దని గొడవ. దానికి తోడు కోడలి సూటిపోటి మాటలు “ఇంతకాలం… అందర్నీ ఎంత బాధపెట్టావు, నీకిలాగే జరగాలి” అని మాటలతో హింసించేది.
పిల్లవాణ్ణి ఆయన దగ్గరకు వెళ్లనిచ్చేది కాదు.
కనీసం వేళకి అన్నం కూడా పెట్టేది కాదు. మందులు వేసుకోవాలి కదా! ఆ అసహాయతను ఆసరాగా తీసుకుని నానా బాధలు పెట్టింది. కోడలి సూటిపోటి మాటలకు తోడుగా తిండి కూడా సరిగా లేక, మానసికంగా కృంగిపోయిన ఆయన ఆరోగ్యం, మరింత క్షీణించింది.
ఏం చేయాలో ఆయన కొడుక్కి అర్థం కాలేదు. ఒక్కోరోజు అతను రాత్రి పది గంటల సమయంలో ఆఫీసు నుండి వచ్చి తండ్రికి అన్నం వండి పెట్టేవాడు.
అరగకపోవటంతో వాంతులయ్యేవి. కోడలి తిట్లు, శాపనార్థాలతో నెలరోజులు గడిచాయి. నారాయణరావు గారి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది.
ఇదంతా తెలుసుకున్న నారాయణరావు కొడుకు స్నేహితుడు - 'ఇక్కడ కేవలం క్యాన్సర్ బాధితులకు ఆశ్రమం ఉన్నదిరా! ఆ ఆశ్రమంలో చేర్చు అంకుల్ని' అని ఆ ఆశ్రమ వివరాలు ఇచ్చాడు.
తండ్రి 'ఒప్పుకుంటాడో, లేదో'నని అనుకుని, విషయాన్ని తటపటాయిస్తూ చెప్పగానే, ఆయన తన కొడుకుతో “నన్ను అక్కడే చేర్చరా! నావల్ల మీరు ఇబ్బంది పడొద్దు” అని అనడంతో, ఈ విపరీత సమస్యకు చక్కటి పరిష్కారంగా ఆ ఆశ్రమంలో చేర్చాడు, తన తండ్రిని.
ఆశ్రమంలో చేరగానే నారాయణరావుకు ఒక గదిని కేటాయించారు. అక్కడ తెల్లని పడక మనసుకు చాలా ప్రశాంతతను ఇచ్చేలా ఉన్న మంచి ఆహ్లాదకరమైన వాతావరణం.
నారాయణరావు మాట్లాడేది తెలుగు. అక్కడి సిబ్బందికి తెలుగు రాదు కాబట్టి, వాళ్లు మాట్లాడేది ఈయన సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు.
“మీకు ఏ దేవుడు ఇష్టం?” అని అడగటమే ఆలస్యం, “శివుడు” అని ఠక్కున చెప్పారు. వెంటనే, శివుని ఫోటో ఆయనకు ఎప్పుడూ కనిపించేలాగా అమర్చారు.
రోజూ గడ్డం చేసి, శుభ్రమైన దుస్తులు కట్టేవారు. ఏం తింటాడో? ఏం తాగుతాడో? అడిగి మరీ ఇచ్చేవారు. అవసరమైన వారికి బ్రష్, స్నానం వంటివి కూడా చేయించేవారు. అయితే, ఈయన మంచంపై ఎక్కగానే, అదుపు చేసుకోలేక, ఆ తెల్లటి పక్కను తడపడం తరచుగా జరిగేది.
కానీ, ఆ నర్సులు తమ ముఖంలో ఏమాత్రం చిరాకు కనిపడనీయక, మరలా పక్క మార్చి పడుకోబెట్టి, మందులు కూడా టైమ్‌కి ఇస్తున్నారు. “చాలా చక్కగా బిడ్డను సాకే ఒక అమ్మ లాగా నన్ను చూస్తున్నారు” అంటున్నప్పుడు ఆయన కనులలో కృతజ్ఞతాభావం స్పష్టంగా తొణికిసలాడేది.
సుధ ఈ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి నారాయణరావును తనే చూసుకునేది. ఆయన తన జీవితంలో చేసిన తప్పులను, భార్యను, పిల్లలను ఇబ్బంది పెట్టిన విషయాలు, డబ్బులు ఎలా దుర్వినియోగం చేశాడో? తన వల్ల తిండికీ, బట్టలకూ కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో? తన గురించిన పూర్తి వివరాలు సుధ, రజనీలతో చెప్పుకుని “చేసిన పాపం చెబితే పోతుంది” అని బాధపడేవాడు.
“నా వారిని బాధించినందుకు శిక్షగా, ఆ భగవంతుడు నాకు ఇప్పుడు ఈ ఒంటరి బతుకును ప్రసాదించాడు. నా భార్య వస్తానంటే అహంకారంతో వద్దన్నాను. కోడలు అన్నం పెట్టేది కాదు, పిల్లవాణ్ణి నా దగ్గరకు రానివ్వదు. నాకిలాగే జరగాలి” అని కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు ఆయన మాటల్లో పశ్చాత్తాపం ధ్వనించేది.
ఒక్కొక్కసారి “ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఇక్కడ చేరాను. ఎడారిలో నీటి చెలమలా మీరు నా పాలిట వరం” అనేవారు.
అలా వారి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడటంతో ఇప్పుడు ఆ స్నేహితురాళ్లు తట్టుకోలేకపోతున్నారు.
ఈయన ఒక్కరినే కాక, వయోభేదం లేకుండా అక్కడ వైద్యం కోసం చేరిన వారిని అందరినీ చాలా ఓర్పుతో, ప్రేమగా చూడటం, ఆ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది ఆచరణ సూత్రాల్లో అతి కీలకమైన అంశం.
కానీ… తన వ్యక్తిగత విషయాలను సైతం ఏ మాత్రం దాచుకోకుండా పంచుకుంటున్న నారాయణరావు గారికి సేవ చేస్తున్న వీరి అనుబంధం మరింత బలపడింది. ఆయనతో ప్రతిరోజూ మాట్లాడటం అలవాటవటంతో, ఆయనను ఇక మీదట చూడలేమనే ఆలోచన వారికి ఊపిరిని సలపనివ్వటం లేదు.
ఆ రోజు ఉదయం ఆశ్రమం మేనేజర్, నారాయణరావు గారి కొడుక్కి ఫోన్ చేయమన్నారు. “మీ నాన్నగారు మాతో మాట్లాడటం లేదు. ఒకసారి మీరొచ్చి చూడగలరా?” అని చెప్పమన్నారు. అప్పటికే నారాయణరావు గారు విగతజీవులయ్యారు.
ఆ అబ్బాయి “సాయంత్రం ఆఫీసు నుండి వస్తాను. పొద్దున్నే ఫోన్ చేశారేంటి మేడం?" అన్నాడు. ఇక చెప్పక తప్పదనుకుని ఫోన్ మేనేజర్ తీసుకుని “మీ నాన్నగారు శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు” అని చెప్పారు.
“అంతిమ సంస్కారానికి, మార్చురీలో ఉంచడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ, అక్క రావాలంటే రెండు రోజులు పడుతుంది" అన్నాడు అక్కడికి వచ్చిన ఆయన కుమారుడు. అప్పుడు ఆశ్రమంలోనే నారాయణరావు పార్థివ దేహాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో, ఆయన పిల్లలు, భార్య వచ్చేదాకా ఉంచారు.
వారందరూ వచ్చిన తరువాత “మీ సంప్రదాయం ఎలా అయితే అలా కార్యక్రమం చేసుకోండి” అన్నారు ఆశ్రమ యాజమాన్యం.
నారాయణరావు కర్మకాండలను వారి కులాచార పద్ధతి ప్రకారం జరుపుకోవడానికి వీలుగా స్వర్గపురికి తీసుకుని వెళ్లడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంబులెన్స్ సౌకర్యం కూడా కలిగించారు.
“సదా మీ సేవలో” అన్నట్లు, ఔదార్యంతో ఉచితంగా ఇన్ని సేవలను అందిస్తున్న ఆశ్రమం వంటి ఆ ఆసుపత్రి… పేదవారికీ, కన్నబిడ్డల ప్రేమకు నోచుకోని నిర్భాగ్యులకు, అయిన వారికి దూరమైన అభాగ్యుల పాలిట ఆశ్రయమిచ్చే దేవాలయమై భాసిల్లుతోంది.
మతం - 'మానవత్వం తెలియజేయమంటుంది' అన్నదానికి నిదర్శనమే ఈ ఆవేదన ఆశ్రమం. భువిలోని దేవతలు - ఆప్యాయంగా ప్రేమామృతం పంచి ఆదరిస్తున్న సుధ వంటి అక్కడి సిబ్బంది.
ఈ బంధం ఏనాటిదో? కులమతాలకు అతీతమై, రోగగ్రస్థులకు ఆదరణామృతాన్ని పంచుతోంది.
ఆ రాత్రి సుధ, రజని ఇద్దరూ మాట్లాడుకోలేదు. నారాయణరావు గారి జ్ఞాపకాలు, ఆయన చెప్పిన మాటలు, పశ్చాత్తాపం, ఆశ్రమంలో ఆయన చివరి రోజులు... అన్నీ గుర్తొచ్చి ఇద్దరి కళ్లూ చెమ్మగిల్లాయి.
"సుధా, మనం చేస్తున్న పని చిన్నదే కావచ్చు. కానీ ఎవరికో చివరి రోజుల్లో తోడుగా ఉండగలగడం, ప్రేమగా చూడగలగడం... అదే నిజమైన సేవ కదా?" అంది రజని, సుధ చేతిని పట్టుకుని.
సుధ మౌనంగా తల ఊపింది. "ఆయన మనకు తాతయ్యలా అయిపోయారు రజని. తన తప్పులు తెలుసుకున్నారు. మారారు. కానీ కాలం ఆయనకు అవకాశం ఇవ్వలేదు."
"కానీ మనం ఇచ్చాం కదా సుధా. ఆయన చివరి రోజుల్లో ప్రేమను చూశారు. గౌరవంగా వెళ్లారు. అది చాలు" అంది రజని.
ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. వారి స్నేహం, వారి వృత్తి, వారి జీవితాల అర్థం - అన్నీ ఆ క్షణంలో మరింత స్పష్టమయ్యాయి. ప్రతి రోజూ సేవలో తరిస్తూ, ఒకే బాటలో - నిస్సహాయులకు తోడుగా నిలిచే దేవదూతలుగా మారారు.
ఈ కథలో ప్రస్తావించబడిన ఆశ్రమం ఢిల్లీలో నిజంగా ఉన్నది ఇప్పటికీ.
దాని అడ్రస్:
Shanti Avedna Sadan,
Safdarjung Enclave,
Factory Road,
Near Safdarjung Hospital, NEW DELHI
DELHI - 110029.
అక్కడి వాళ్లను నర్సులు అనేకంటే దేవదూతలు లేదా మానవరూపంలో ఉన్న దేవుళ్లు అనడమే సబబు. ఎందుకంటే ప్రాణం పోయే చివరి క్షణంలో కూడా ఒంటరితనం కాకుండా, ప్రేమను పంచే చేతులు వారివి.
అపురూపమైన బంధం అంటే రక్తసంబంధమే కాదు, ఆపదలో ఆదుకునే మనసు.
వరలక్ష్మి యనమండ్ర✒️
***
వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర
పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర
కలం పేరు: లేదు
స్వస్థలం: అద్దంకి,ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని
విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.
ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు
1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి)
2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి)
3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి)
తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది.
కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం
4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి)
5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)
6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక)
(400 ఆటవెలది పద్య సంపుటీ)
7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు)
అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి.
పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు
కొన్ని సమూహాలను నిర్వహణ, కొన్ని సమూహాలలో సమీక్షణం
యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను
నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.
ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.
జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం.





Comments