top of page
Original.png

ఆకలి పాఠాలు

3 hours ago
4 min read

పూణేలో ఆకలితో అలసిపోయిన యువకుడికి పేద దంపతులు చపాతీలు వడ్డిస్తున్న దృశ్యం – ఆకలి పాఠాలు కథ

Aakali Paatalu - Telugu Social Story | Harish Babu Pondugula

ఆకలి పాఠాలు - తెలుగు సామాజిక కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 06/10/2026


“ఆకలి పాఠాలు” హరీష్ పొందుగుల రచించిన హృదయాన్ని హత్తుకునే సామాజిక విలువల కథ. ఉద్యోగం కోసం పూణే వెళ్లిన ఓ యువకుడికి ఎదురైన ఆకలి, ఒంటరితనం, అనుకోని ఆతిథ్యం ఈ కథలో ప్రధానాంశాలు.


అవి నేను పీజీ పూర్తి చేసి జాబ్ ప్రయత్నాలలో ఉన్న రోజులు... ఎన్నో వ్యయప్రయాసల తరువాత ఒక్క జాబ్ వచ్చింది. ముందు 'హైదరాబాద్ పోస్ట్' అన్న కంపెనీ వాళ్లు సడన్గా ఆఫర్ ఇచ్చేటప్పుడు పూణేలో పోస్టింగ్ ఇచ్చారు.


మరి ఏమి చేస్తాం? జాబ్ దొరకటమే కష్టంగా ఉన్న రోజుల్లో అండమాన్ అయినా పర్లేదు అని ఫిక్స్ అయిపోయిన రోజులు... తోటి క్లాస్మేట్స్ ఏ పర్సంటేజ్ లేకపోయినా రిఫరెన్స్తో మంచి జాబ్స్ కొట్టేస్తున్న రోజులు... "నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు? ఏమిటి?" అని ఇంట్లో వాళ్లు పూటపూటా దెప్పుతున్న రోజులు... సరే అని ఇష్టం లేకపోయినా తలదించి ఆఫర్ తీసుకుని ఇంటికి వచ్చాను.


మరి పూణే వెళ్లి ఎక్కడ ఉండటం? ఏమి చేయటం? అని ఆలోచిస్తుంటే, మా బ్రదర్ వాళ్ల కొలీగ్ వాళ్ల బ్రదర్ ఉన్నాడట పూణేలో. అతని రూమ్లో జాయిన్ అవ్వు, మెల్లగా సెటిల్ అయ్యాక రూమ్ మారొచ్చు అన్నాడు. సరే అని సండే మార్నింగ్ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుని బస్సు ఎక్కాను.


తెల్లవారింది... బస్సు దిగి ఆటో పట్టుకున్నాను. జాన్ అనే అతని రూముకి వెళ్లాను. లోపలికి వెళ్తున్నాను... దేవుడా! అది రూమ్ కాదు... రైల్వే స్టేషన్! పది మంది ఉంటున్నారు. 'ఆకలి రాజ్యం' సినిమాని నాకు నిజంగానే చూపించారు.


ఇంకా తప్పేదేముంది? జాబ్ జాయినింగ్ ఆ మరుసటి రోజే కదా! అక్కడే ఉన్నాను. ఇంకా ఆ రూమ్లో చూస్తే అన్నీ "రూల్స్"యే...


ఏమైనా తినాలంటే అందరికీ పెట్టాలి; పోనీ వండుకుందామంటే వాళ్లే వండాలంట; వాళ్లు తినేటప్పుడే మనం తినాలాట! ఒక రోజు మొత్తం నరకం చూశాను.


పోనీ బయట తిందాం అంటే, అప్పటికి పూణే ఇంకా అంత డెవలప్ కాలేదు, ఒక్క వాడాపావ్ తప్ప... ఇడ్లీ, దోశ... ఏమీ దొరకవు. వాడాపావ్ ఏమో మనకి దిగదు.


ఎలాగో పొద్దున్న ఆఫీస్ జాయిన్ అయ్యాను మొత్తానికి. అక్కడే కాంటీన్లో టిఫిన్, భోజనం చేసేశాను. ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేద్దాం అనుకున్నాను; కానీ అక్కడ డిన్నర్ ఉండదట.


మరేం చేయటం? రూమ్లో మళ్లీ ఆ వెయిటింగ్ చూసే ఓపిక నాకు లేదు. సరే, ఏమైనా సరే బయటే తిని వెళ్దాం అనుకుని... సరే, ఇంత పెద్ద నగరంలో తినడానికి ఏదో ఒకటి దొరక్కపోతుందా అని అనుకుంటూ రోడ్డు పక్కగా నడవటం మొదలుపెట్టాను.


అప్పటికి పూణే పెద్దగా డెవలప్ కాలేదు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే, ఇంకో కిలోమీటరు వరకు ఖాళీ రోడ్డే ఉంటుంది; పైగా దుమ్ము ఎక్కువ. అలా ఆ చీకటిలో, ఆ దుమ్ములో ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచాక కూడా ఏ హోటల్ కానీ, టిఫిన్ సెంటర్ కానీ కనిపించడం లేదు.


ఏమి చేయటమా అని ఆలోచిస్తుంటే... ఆ పక్కన ఒక చిన్న గుడిసె కనిపించింది. వాళ్లని అడిగితే ఏమైనా చెప్తారేమో, హోటల్ ఎంత దూరం అని... (అప్పటికి ఇంకా స్మార్ట్ఫోన్స్, మ్యాప్స్ లేవు లెండి).


"హలో! కోఈ హై భాయ్?" (ఎవరైనా ఉన్నారా?) అని నాకు వచ్చిన హిందీలో పిలిచాను.

వాళ్లు లోపలికి రమ్మన్నట్టు సైగ చేశారు.


లోపల చిన్న లైట్ ఉంది... ఒకావిడ చపాతీ కలుపుతోంది. ఇంకో అతను ఆవిడ భర్త అనుకుంటా, పక్కనే కూర్చున్నాడు. నన్ను కూర్చోమన్నారు.


నేను మొహమాట పడుతుంటే, ఏమీ పర్లేదు అని రమ్మని సైగ చేశారు. ఏంటో చెప్పమన్నారు.

"ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా?" అని అడిగాను.


"నువ్వు రెండు మూడు కిలోమీటర్లు నడిచి ఉంటావు, అలసిపోయి ఉంటావు, నీళ్లు తాగు," అని ఇచ్చారు.


తాగాను... అలసి ఉన్నాను కదా!


"ఇక్కడ హోటల్స్ ఏవీ ఉండవు బాబు! వాడాపావ్ ఉంటుంది, అది ఇక్కడ దొరకదు," అని చెప్పారు.


మళ్లీ వాళ్లే చెప్పారు... "చూస్తే చాలా దూరం నుంచి నడిచి వచ్చినట్టున్నావు. ఒక పని చెయ్యి... నువ్వు మాలోనే తినేసేయి, ఇంకో నాలుగు చపాతీలు చేస్తాను," అంది వాళ్ల ఆవిడ.


నేను ఆ క్షణంలో ఏమి ఆలోచించానో తెలీదు కానీ, "సరే," అలాగే అన్నాను.


చపాతీ చేసి కూర వేసి ప్లేట్లో ఇచ్చారు ఇద్దరూ.


నేను తిన్నాను... మధురంగా ఉంది. నేను తిన్న బెస్ట్ మీల్స్ అదే ఏమో అనిపించింది!

వాళ్లు చూస్తే పెద్ద జాతి వాళ్లలాగా లేరు, మంచి ఇల్లు కాదు... కూలీ చేసుకునే వాళ్లలాగా ఉన్నారు. కానీ ఆ క్షణం నాకు అవన్నీ గుర్తు రాలేదు, నా ఆకలి మాత్రమే గుర్తొచ్చింది.


ఆకలికి జాతి, మతం, ఉచ్ఛనీచాలు తెలీవు. ఆకలికి ఒకటే తెలుసు... ఆకలి తీరటానికి కాస్త ఆహారం, అంతే!


చేతులు కడుక్కుని వెళ్లేముందు, నా జేబులో నుంచి ఒక 100 రూపాయలు ఇవ్వబోయాను. అప్పుడు వాళ్ల మాట విన్నాక నేను ఎంత సంస్కారహీనుణ్ణి అనిపించింది!

"మా ఇంటికి తినే సమయంలో ఎవరు వచ్చినా అతను మాకు అతిథి లాంటివాడు.


భగవంతుడు మా విలువల్ని అప్పుడప్పుడు పరీక్షించటానికే నీలాంటివాళ్లని పంపుతుంటాడు... కానీ మేము ఎప్పుడూ ఓడిపోలేదు. అతిథిదేవోభవ అన్నారు కదా!" అన్నారు.


ఆకలి మనకి మన పుస్తకాల్లో లేని ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తుంది...

ఇంకా చెప్పాలంటే మన పిల్లల్ని ఆకలితో నెలకి ఒక్కసారైనా దేశ సంచారం చేసి రమ్మని చెప్పాలి; అప్పుడే మనుషుల గురించి, విలువల గురించి వాళ్లే మనకు చెబుతారు.


// సమాప్తం //



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:




హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page