ఆత్మవిశ్వాసమే ఆయుధం
- Harish Babu Pondugula

- 8 minutes ago
- 5 min read

Aatmavishwasame Aayudham - Telugu Inspirational Story | Harish Babu Pondugula
ఆత్మవిశ్వాసమే ఆయుధం - తెలుగు ప్రేరణాత్మక కథ | హరీష్ బాబు పొందుగుల
Published in manatelugukathalu.com on 31/08/2026
జీవితంలో ప్రతి అడుగు మనం అనుకున్నట్టే సాగదు. కొన్నిసార్లు ఒక చిన్న సమస్య వెనుక మరో సమస్య వస్తుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనలోని అసలు ఆత్మవిశ్వాసం బయటపడుతుంది. అలాంటి సమయంలో భయపడకుండా, ఓపికగా, సానుకూలంగా ఆలోచించగలిగితే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించవచ్చు.
రాత్రి పదకొండు గంటలు దాటింది. హైదరాబాద్ శివార్లలోని బెంగళూరు హైవే పక్కన చీకటిలో తండ్రి రామ్మూర్తి, కొడుకు సుమన్ నిలబడి ఉన్నారు. అటుగా వెళ్తున్న లారీలు, ట్రక్కులు, క్యాబ్‌లను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.
సుమన్: "అసలు నా తలరాతే ఇలా ఉంది! హడావుడిగా బస్సు ఎక్కేటప్పుడు నువ్వు పర్సు, టికెట్ ఇంట్లోనే మరిచిపోవడమేంటో అసలు అర్థం కాదు. ఇప్పుడు ఈ అర్ధరాత్రి హైవే మధ్యలో ఆ కండక్టర్ మనల్ని దింపేసి వెళ్లిపోవడానికి కారణం మీ ఈ అజాగ్రత్తే!"
అర్ధరాత్రి వేళ, హైవే మీద చీకట్లో చిక్కుకోవడంతో సుమన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ప్రయాణం మధ్యలో ఇలా దింపేయడం ఏంటని తండ్రిపై కోపంతో ఊగిపోయాడు.
"ఏంటి నాన్నా ఇది! చిన్న పిల్లవాడిలా పర్సు, టికెట్ ఇంట్లోనే మరిచిపోవడం ఏంటి? రేపు ఉదయం నాకు బెంగళూరులో పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. ఆన్-క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ రాక అల్లాడిపోతున్న నాకు, ఈ ఆఫ్‌క్యాంపస్ ఇంటర్వ్యూ ఎంత ముఖ్యమో మీకు తెలుసా? ఇప్పుడు ఈ అర్ధరాత్రి హైవే మీద మన పరిస్థితి ఏంటి?" అంటూ తండ్రిని పదే పదే విసుక్కుంటూ, చిన్నచూపు చూస్తూ తిట్టసాగాడు.
కానీ రామ్మూర్తి గారు మాత్రం ఎంతో ప్రశాంతంగా, ఓపికగా ఉన్నారు.
"ఏం పర్వాలేదు సుమన్, ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఈ రాత్రికి ఎవరో ఒక క్యాబ్ డ్రైవర్ మనల్ని గమ్యానికి చేరుస్తాడు" అంటూ కొడుకును సానుకూల దృక్పథంతో ఓదారుస్తూ వచ్చారు.
కానీ సుమన్‌కు మాత్రం కోపం తగ్గలేదు, హైవే మీద నిలబడి తండ్రిని నిందిస్తూనే ఉన్నాడు.
అలా కొద్దిసేపు గడిచాక, వారి ముందు ఒక క్యాబ్ వచ్చి ఆగింది. కారులోంచి డ్రైవర్ అరవింద్ కంగారుగా దిగి, "మీలో ఎవరికైనా డ్రైవింగ్ చేయడం వచ్చా?" అని అడిగాడు.
సుమన్ ఆశ్చర్యపోతూ, "ఎందుకు?" అన్నాడు.
దానికి అరవింద్ నీరసంగా, "నేను రోజంతా విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేసి అలసిపోయాను. కళ్లు మూసుకుపోతున్నాయి. వెనుక సీట్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు. రేపు ఉదయం బెంగళూరులో ఆయనకు ఒక అత్యవసర సర్జరీ ఉంది, టైమ్‌కి వెళ్లాలి. నాకు మెలకువ లేదు, ఎవరైనా డ్రైవింగ్ చేస్తే సాయం చేయండి" అని ప్రాధేయపడ్డాడు.
అది విన్న రామ్మూర్తి గారు ఏమాత్రం సంకోచించకుండా ముందుకు వచ్చి, "నేను డ్రైవింగ్ చేస్తాను బాబు, పద" అన్నారు.
రామ్మూర్తి గారికి కన్‌స్ట్రక్షన్ (ఇళ్ల నిర్మాణ) రంగంలో అనుభవం ఉంది, చిన్నప్పటి నుంచి అన్నీ నడిపిన అనుభవం ఉంది.
ఆయన కారు ఎక్కి ఎంతో నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. సుమన్, ఆ డాక్టర్ గారు ఊపిరి పీల్చుకున్నారు.
రామ్మూర్తి గారు డ్రైవింగ్ చేస్తున్న ఆ పాత క్యాబ్ మార్గమధ్యంలో, తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుదుపులతో ఆగిపోయింది. డ్రైవర్ అరవింద్ ఎంత ప్రయత్నించినా ఇంజిన్ స్టార్ట్ కాలేదు.
అరవింద్ (కంగారుగా): "అయ్యో! ఇంజిన్ పూర్తిగా సీజ్ అయిపోయినట్లుంది సార్. ఇక ఇది ముందుకు కదలదు. డాక్టర్ గారి సర్జరీకి టైమ్ అవుతుంటే ఈ మధ్యలోనే ఆగిపోయిందే!"
డాక్టర్ (ఆందోళనగా): "అరెరే... ఇప్పుడు ఎలా? తెల్లవారితే ఆపరేషన్ ఉంది. టైమ్‌కి వెళ్లకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం!"
సుమన్ (తల పట్టుకుంటూ): "ఇంకేముంది... మా నాన్న చేసిన పనులకి, ఈ మధ్య హైవే మీద ఇలా నడక ప్రయాణం చేయాల్సిందేమో! నా ఇంటర్వ్యూ బూడిదలో కలసినట్లే."
రామ్మూర్తి (ప్రశాంతంగా): "కంగారు పడకండి బాబు, సమస్య వచ్చినప్పుడు భయపడితే లాభం లేదు. దారిలో ఏదో ఒక వాహనం వస్తుంది, ప్రయత్నిద్దాం."
అందరూ ఆ కారు దిగి రోడ్డు పక్కన నిలబడి చేతులు ఊపుతూ మరో వాహనం కోసం ప్రయత్నించారు. కాసేపటికి అటుగా వస్తున్న ఒక పెద్ద గూడ్స్ లారీని రామ్మూర్తి గారు ఆపారు. లారీ క్యాబిన్‌లో డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ఎలాగైతేనేమి ప్రాణాపాయంలో ఉన్న డాక్టర్ పరిస్థితిని వివరించి, వాళ్ళని కూడా ఎక్కించుకోవడానికి లారీ డ్రైవర్ ఒప్పుకున్నాడు.
లారీ మెల్లగా హైవేలో వెళ్తూ ఉంది.
లారీ ఎక్కి కూర్చున్నప్పటి నుంచి ఆ లారీ డ్రైవర్ మొహం ఎందుకో కోపంతో ఎర్రబడింది.
ఇంతలో డ్రైవరు ఫోన్ మోగింది. ఆన్ చేసి భార్యతో విసుగ్గా అన్నాడు.
లారీ డ్రైవర్: "నీతో వేగలేకపోతున్నానే! నేను ఊరికెళ్తే చాలు ఫోన్ చేసి ఏడుస్తావు. నా ప్రాణాలు తోడేస్తున్నావు! ఫోన్ పెట్టేయ్! నీ యమ్మ.. మనశ్శాంతి లేదు" అని విసుగ్గా ఫోన్ కట్ చేశాడు.
డ్రైవర్ ముఖంలో ఉన్న తీవ్రమైన కోపాన్ని గమనించిన రామ్మూర్తి గారు చాలా కూల్‌గా మాట్లాడటం మొదలుపెట్టారు.
రామ్మూర్తి: "ఏంటయ్యా బాబు, అంత కోపంగా ఉన్నావు.. నిదానంగా ఉండు.. కోపము మనిషి ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంటి దగ్గర భార్యతో ఏమైనా గొడవా?"
లారీ డ్రైవర్ (విసురుగా): "అవును సార్! రోజూ ఇదే గోల. ఇంట్లో ఏం లేదని, ఎప్పుడు వస్తావని ఆమె ఫోన్ చేసి వేధిస్తుంటుంది. నా బతుకే ఒక లారీ టైర్ అయిపోయింది, ఎప్పుడు ఏ ముల్లు గుచ్చుతుందో తెలియదు."
రామ్మూర్తి (నవ్వుతూ, అతని భుజంపై చెయ్యి వేసి అన్నారు): "చూడు బాబు... సంసారం అన్నాక చిన్నపాటి అలకలు, పోట్లాటలు సహజం. వాళ్ళు నిన్ను అడుగుతున్నారంటే, నీ మీద నమ్మకం ఉందని అర్థం, నీతో ఉన్న బంధం మీద ప్రేమ మీద ఉన్న నమ్మకమే కదా.. లేకపోతే అసలు ఫోనే చేయరు కదా.. నాకు తెలిసిన చాలా కాపురాలు.. చదువుకున్న వాళ్ళు ఒకరికి ఒకరు ఫోన్ కూడా చేసుకోని వాళ్ళు ఉన్నారు అంటే నమ్మగలవా..
కానీ నువ్వు విసుక్కుంటే ఆ దూరం మరింత పెరుగుతుంది. ఈ అర్ధరాత్రి హైవే మీద ఎవరితో మాట్లాడతావు చెప్పు? ఆమె నీకు నీడలాంటిది. నవ్వుతూ ఒక్క మాట మాట్లాడితే ఇద్దరి మనసులు ప్రశాంతంగా ఉంటాయి.. ఏది ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి.. ఏమమ్మా తిన్నవా.. అని అడుగు ఎలా మాట్లాడుతుందో చూద్దువు గాని" అన్నారు.
లారీ డ్రైవర్ మళ్ళీ భార్యకి ఫోన్ చేశాడు.. "ఏమే తిన్నవా" అని అడిగాడు మెల్లగా.
ఇప్పుడు అతని భార్య మునుపటిలాగా అరవలేదు.. "ఆ తిన్నాను అయ్యా.. నువ్వు తిన్నవా.. రోడ్డు మీద చూసి నడుపు.. త్వరగా వచ్చేసేయ్" అని మెల్లగా అడిగింది.
లారీ డ్రైవర్ కంటి నుండి ఒక చుక్క నీరు రాలి పడటం రామ్మూర్తి గమనించాడు.
ఆ లారీ డ్రైవర్ రామ్మూర్తి గారి మాటలకు ఒక్కక్షణం నిశ్చేష్టుడయ్యాడు. అతని మొహంలోని కఠినత్వం కరిగిపోయి, చిరునవ్వు వచ్చింది.
లారీ డ్రైవర్: "నిజం చెప్పారు అంకుల్... మీ మాటలు వింటే నా మనసంతా తేలికైంది" అంటూ మళ్లీ భార్యకు ఫోన్ చేసి ప్రశాంతంగా మాట్లాడాడు.
అలా లారీలో కొద్ది దూరం ప్రయాణించాక, ఒక టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిమిత్తం ఆ లారీని ఆపారు. లారీ దిగి పోలీసులు తనిఖీ చేస్తుండగా, క్యాబిన్‌లో ఉన్న రామ్మూర్తి, సుమన్, డాక్టర్‌లను చూసి పోలీసులకు అనుమానం వచ్చింది.
పోలీస్ ఆఫీసర్ గట్టిగా అన్నాడు: "ఏంట్రా ఇది? గూడ్స్ లారీలో ప్రయాణీకులను అక్రమంగా ఎక్కించుకుని తిరుగుతున్నారు! ఇదొక ఇల్లీగల్ వెహికల్ (అక్రమ రవాణా వాహనం) కిందకి దిగండి అందరూ.. లారీని సీజ్ చేయాలి!"
సుమన్ భయపడిపోతూ "సార్ సార్! మేము అక్రమంగా రాలేదు. మాకు అత్యవసరమైన పని ఉంది..." అని జరిగిందంతా వివరించడానికి ప్రయత్నించాడు.
అయితే ఆ పోలీస్ ఆఫీసర్ రామ్మూర్తి గారి వైపు చూసి, ఆయన వయసు, ప్రశాంతమైన ముఖకళను గమనించాడు.
డాక్టర్ తన ఎమర్జెన్సీ గురించి చెప్పడంతో ఆఫీసర్ కరిగిపోయాడు. వాళ్ళ ఐ.డి. కార్డ్స్ లైసెన్సు అన్నీ పరిశీలించాడు.. ఎక్కడ అనుమానంగా అనిపించలేదు.
పోలీస్ ఆఫీసర్ అన్నాడు: "సరే సరే, మీ పరిస్థితి అర్థమైంది. కానీ నిబంధనల ప్రకారం ఈ లారీలో ప్రయాణించడం కుదరదు. ఒక పనిచేయండి..." అని పక్కనే ఉన్న జీపు దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళు సీజ్ చేసిన ఒక క్యాబ్‌ని పిలిపించాడు.
పోలీస్ ఆఫీసర్ వాళ్ళని అందులో పంపిస్తూ "నేనే స్వయంగా మీకోసం ఒక క్యాబ్ ఏర్పాటు చేస్తున్నాను. నేరుగా ఎక్కడా ఆగకుండా బెంగళూరు వెళ్లిపోండి. కాకపోతే మాకు ఒక చిన్న సాయం చేయాలి. మా డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఒక సీక్రెట్ పార్శిల్‌ను బెంగళూరులోని ఒక పోలీస్ స్టేషన్‌లో (PS) ఇవ్వాలి. వెళ్లేటప్పుడు దాన్ని అక్కడ భద్రంగా అప్పగించండి చాలు. ఈ టెన్ రూపీస్ నోట్ చూపించండి.. వాళ్ళు నమ్ముతారు" అన్నాడు.
రామ్మూర్తి: "అలాగే సార్, చాలా కృతజ్ఞతలు!" అని నవ్వుతూ ఆ పోలీసుల ఏర్పాటు చేసిన క్యాబ్ ఎక్కారు.
అలా ఆ రాత్రంతా కష్టాలు ఎదురవుతున్నా, ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, చివరికి తెల్లవారేసరికి సుమన్‌ను బెంగళూరుకు తీసుకువచ్చారు రామ్మూర్తి.
మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికల్లా ఎలాగైతేనేమి సుమన్ అనుకున్న సమయానికి బెంగళూరు చేరుకున్నాడు. వెంటనే హడావుడిగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి వెళ్లి, ప్రశాంతంగా ఇంటర్వ్యూ హాజరై అన్నీ రౌండ్లు క్లియర్ చేసి విజయవంతంగా పూర్తి చేశాడు. మధ్యమధ్యలో వాళ్ళ నాన్న టిఫిన్ భోజనంకి సహాయం చేస్తున్నారు.
అంతా అయాక, సాయంత్రం ప్రశాంతంగా కూర్చున్న తండ్రి రామ్మూర్తితో సుమన్ మాట్లాడుతూ... "నాన్నా, నిన్న రాత్రి ఆ ప్రయాణంలో మనం ఎంత నరకం అనుభవించాము! అన్నీ అనుకూలంగా ఉంటే హాయిగా వెళ్లేవాళ్ళం కదా" అన్నాడు.
అప్పుడు రామ్మూర్తి గారు చిరునవ్వు నవ్వుతూ, కొడుకు భుజంపై చెయ్యి వేసి అసలు నిజం చెప్పారు:
"సుమన్... నేను ఆ రోజు పర్సు, టికెట్ మర్చిపోవడం యాదృచ్ఛికం అనుకుంటున్నావా? కావాలనే అవన్నీ ఇంట్లోనే వదిలేసి వచ్చానురా. ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం రాలేదని నువ్వు పడుతున్న అశాంతి, ఆతృత నాకు తెలుసు. ఎలాంటి కష్ట పరిస్థితి ఎదురైనా కుంగిపోకుండా, సానుకూలంగా (Positive) ఎలా ఆలోచించాలో నీకు నేర్పించడానికే నేను ఈ నాటకం ఆడాను.
ఈ రోజుల్లో మనకు సాంకేతికత టెక్నాలజీ, వసతులు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. కానీ మనుషుల్లో చివరి క్షణం వరకు ఓపిక పట్టే సహనం కరువైంది. ఏ చిన్న సమస్య రాగానే కృంగిపోతున్నారు. కష్టాలను ఎదుర్కొనే మానసిక ధైర్యం ఉంటే ఏ విజయం అయినా మన సొంతం అవుతుంది రా."
తండ్రి చెప్పిన ఆ గొప్ప జీవిత పాఠాన్ని అర్థం చేసుకున్న సుమన్, కన్నీళ్లతో తండ్రిని హత్తుకున్నాడు.
-- సమాప్తం --
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:
హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: హరీష్ బాబు పొందుగుల
ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు. వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష .








Comments