'Ara Markulodu' - New Telugu Story Written By Susmitha Ramana Murthy
Published In manatelugukathalu.com On 01/07/2024
'అర మార్కులోడు' తెలుగు కథ
రచన : సుస్మితా రమణ మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సీనియర్ మాస్టారు వీరాస్వామిని స్కూలు టీచర్లలో కొంతమంది మాత్రమే బాహాటంగా ప్రశంసిస్తారు. మిగతా వారు గోడ మీద పిల్లుల్లా ఉంటారు. విద్యార్థులలో మాస్టారంటే సదభిప్రాయం లేదు.
వారు ఏ సబ్జెక్టు పేపరు దిద్దినా, అలా అలా చూసి మార్కులు వేసేయరు. జవాబులు పూర్తిగా చదివి మార్కులు వేస్తారు. అక్షర దోషాలు కూడా భూతద్దంలోంచి చూస్తారు. అర మార్కులు కూడా ఆచితూచి వేస్తారు. మిగతా టీచర్లు మాత్రం పట్టి పట్టి జవాబులు చదవరు. మార్కులు కొసరి కొసరి వేయరు. అందుకే వీరాస్వామి మాస్టారుకి విద్యార్థులలో మంచి పేరు లేదు.
మార్కులు మరీ కత్తిరించి వేస్తారు కాబట్టి వారిని ‘అర మార్కులోడు’ అని విద్యార్థులు అంటుంటారు. పదో క్లాసు పబ్లిక్ పరీక్షలకు మూడు నెలల సమయం ఉంది. అన్ని సబ్జెక్టులకు సిలబస్ ప్రకారం బోధన పూర్తయింది.
టీచర్లు మోడల్ పేపర్లు తయారు చేసారు. వీరాస్వామి మాస్టారు లెక్కలు, సైన్సు సబ్జెక్టులకు మూడేసి పేపర్లు తయారు చేసారు. మిగతా టీచర్ల చేత కూడా అలానే చేయించారు.
మాస్ఠారు ఆధ్వర్యంలో మొదటి విడత నమూనా పరీక్షలు అన్ని సబ్జెక్టులకు పూర్తయాయి. అందరూ పేపర్లు దిద్దేసారు. విద్యార్థులకు అందజేసారు. మాస్టారుగారు దిద్దిన పేపర్లు చూసిన విద్యార్థులు ఆశ్చర్య పోయారు. చాలా మందికి లెక్కల్లో అరవైలు, డెబ్బైలూ వచ్చాయి. సైన్సులో కూడా అలానే మంచి మార్కులు వచ్చాయి. అన్నేసి మార్కులు మాస్టారు గారే వేసారా అని విద్యార్థులతో బాటు టీచర్లు కూడా ఆశ్చర్య పోయారు.
మరో రెండు మోడల్ పరీక్షలు ఉత్సాహంగా రాసారు విద్యార్థులు. ఈసారి కూడా అందరికీ మాస్టారు దిద్దిన పేపర్లలో మంచి మార్కులే వచ్చాయి.
******
పబ్లిక్ పరీక్షలకు పది రోజుల ముందు వీడ్కోలు సమావేశం జరిగింది. “ పరీక్షలు బాగా రాయండి. మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్!” చెప్పారు టీచర్లంతా. వీరాస్వామి మాస్టారు భిన్నంగా మాట్లాడారు.
“పబ్లిక్ పరీక్షలంటే భయపడకండి. మన స్కూల్లో రాసిన ‘మోడల్ ఎగ్జామ్స్’ లాంటివే అవి. పకడ్బందీ వాతావరణంలో జరుగుతాయి అంతే! మీరంతా మోడల్ పరీక్షలు చాలా బాగా రాసారు. ఈ సందర్భంలో నాలుగు పనికొచ్చే మాటలు చెబుతాను. అందరూ బాగా గుర్తు పెట్టుకోండి ..”
“భూతద్దం గారి ప్రవచనాలు మొదలు..”
టీచర్లలో గుసగుసలు మాస్టారు విన్నారు.
“క్లాసులోనే కాదు. ఇక్కడ కూడా మన అర మార్కులోడి సుత్తి భరించక తప్పదు “
విద్యార్థులలో ఒకరు ఎంత నెమ్మదిగా అన్నా ఆ మాటలు మాస్టారు చెవులను తాకాయి. మాస్టారు అందరి వేపు దృష్టి సారించి మరల చెప్పసాగారు.
“ ఏ సబ్జెక్టులోనైనా నిర్వచనాలను పుస్తకంలో ఉన్నట్లే రాయండి. వివరణలు మాత్రం స్వంత మాటల్లో రాయండి. ముందుగా మీకు బాగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు అర్థమయేట్లు నీట్ గా రాస్తే దిద్దే వారికి మంచి అభిప్రాయం కలుగుతుంది” మాస్టారు ఆగి దాహం తీర్చుకున్నారు. “ ప్రశ్నలకు జవాబులు చాలా బాగా వచ్చని పేజీలకు పేజీలు రాసి సమయం వృధా చేయకండి. ఎన్ని పేజీలు రాసినా ఎక్కువ మార్కులు వేయరు. అన్నిటికంటే ముఖ్యం సమయపాలన. పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే వెళ్ళండి. మీ సందేహాలు తీర్చడానికి మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం. చివరగా ఎవరికీ తెలియని ఒక ముఖ్య మైన విషయం చెప్పాలి” అంటూ కొన్ని నిముషాలు ఆగారు వారు.
అందరూ ఆసక్తిగా మాస్టారు మాటలు వినేందుకు నిశ్శబ్దంగా ఉన్నారు.
“నా తోటి టీచర్లందరికీ నేనంటే ఎనలేని అభిమానం! అందుకే నన్ను ‘భూతద్దం‘ అని ప్రేమగా అనుకుంటుంటారు. ఆ మాట నూటికి నూరు పాళ్ళు నిజమే!.. ”
టీచర్లంతా కలవరం చెందారు. ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకున్నారు.
“విద్యార్థులకు కూడా నేనంటే అంతులేని ప్రేమ! వారి దృష్టిలో నేను అర మార్కులోడిని”
విద్యార్థుల ముఖాలు కళ తప్పాయి.
“ ఈ భూతద్దం ఏడాదంతా తూకం రాళ్ళతో జవాబులు తూచి తూచి, మార్కులు వేసినా, అందరూ ఓపికగా భరించారు. ఈ మాస్టారు ఆంతర్యం ఎవరూ అర్థం చేసుకోడానికి ప్రయత్నించ కుండానే, నా పద్ధతి ప్రకారం కష్టపడి చదవడం, రాయడం అలవాటు చేసుకున్నారు” వారి మాటలు అందరినీ ఆలోచింప జేస్తున్నాయి.
“కఠినమైన ఈ శిక్షణ వలన, మీరంతా పబ్లిక్ పరీక్షలలో సునాయాసంగా ఉత్తీర్ణులు అవుతారు “ అంటూ వారు విద్యార్థుల వేపు నవ్వుతూ చూసారు.
“నమూనా పరీక్షలలో ముఖ్యంగా సైన్సు లెక్కల పేపర్లలో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు అభినందనలు” “ ఎవరికీ తెలియని ఆ విషయం చెప్పండి సార్!” టీచర్లలో ఒకరు అడిగారు. “ ఈసారి విద్యార్థుల లెక్కలు, సైన్సు పేపర్లు నేను దిద్దలేదు “
ఆ మాటలకు అందరూ నమ్మలేనట్లు మాస్టారు వేపు చూసారు.
“ఆశ్చర్య పోకండి. మీరు విన్నది నిజమే! పబ్లిక్ పేపర్లు దిద్దడంలో ఎంతో అనుభవం ఉన్న వేరే స్కూలు టీచర్లతో దిద్దించాను”
అప్పటికీ వారి మాటలు ఎవరూ నమ్మలేదు.
“మిగతా సబ్జెక్టుల పేపర్లు కూడా వేరే స్కూలు టీచర్లే దిద్దారు”
‘మాస్టారు మైండు సరిగ్గా లేనట్లుంది! మనం దిద్దిన పేపర్లు వేరే స్కూలు వారు ఎలా దిద్దారు!? ’ స్వగతంలా అనుకుని టీచర్లు ఆశ్చర్య పోయారు.
“జవాబు పత్రాలు జిరాక్సువి మాత్రమే వేరే స్కూలు వారికి పంపించి దిద్దించాను. సైన్సు, లెక్కల పేపర్లు తప్ప, మిగతావన్నీ రెండు సార్లు దిద్దడం జరిగింది. మార్కులలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం గమనించ దగిన విషయం. మన టీచర్లు నేను చెప్పినట్లు పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా దిద్దినందుకు సంతోషం”
టీచర్లు మాస్టారు చర్యకు సంతోషించారు.
“విద్యార్థులు నా తత్వం అర్థం చేసుకుని కష్టపడి చదివారు. వేరే వారు దిద్దినా మంచి మార్కులు తెచ్చుకోవాలనే చాలా కఠినంగా మీ పేపర్లు భూతద్దంతో చూసాను. మీరు మరింత బాగా చదువుతారనే నేనలా చేసాను. ఇంకా బాగా చదవండి. అందరూ ప్రథమ శ్రేణిలో తప్పకుండా పాసవుతారు. ఆల్ ద బెస్ట్!”
విద్యార్థులు, టీచర్లు ఒకేసారి “మిమ్మల్ని తప్పుగా అనుకున్నందుకు మన్నించండి సార్! “ అనడంతో మాస్టారు మందహాసం చేసారు.
/ సమాప్తం /
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి
కలం పేరు : సుస్మితా రమణ మూర్తి
పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.
విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.
కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.
బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో
మీ సుస్మితా రమణ మూర్తి.
.
Comments