top of page

అర్థాంగి


'Arthangi' New Telugu Story

Written By Sujatha Thimmana

రచన: సుజాత తిమ్మన




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కృష్ణయ్య రంగుని అద్దెకు తీసుకున్నాయేమో మేఘాలు ...

వెన్ననంతా దోచేసి అంచులెంబడి పూసుకుని

వికటాట్టహాసాలు చేస్తూ పరిగెడుతున్నాయి

రూపాలు మార్చుకుంటూ…


కరిగిపోతున్న వెన్న చినుకులుగా మారి ..

చల్లగా కురుస్తోంది ధరణిని తడుపుతూ…


వెలుగు రేఖలు, దర్పణం వంటి చినుకు పూల నుండి పరావర్తనం చెంది, ఏడురంగులతో వంతెన వేసాయి నింగిని నేలను కలుపుతూ …


ఆనందరావు లోని ఆనందం అంతా ఆ ఇంద్రధనుస్సుపై ఎగురుతూ … జారుతూ … గెంతుతూ ఉంది .. ఉత్సుకతను దాచుకోవాలనే ప్రయత్నంలో వడివడిగా అడుగులు వేస్తున్నాడు ..


చేతిలో ఉన్న కవరును ఎంతో ఆరాధనగా చూసుకుంటూ

లిఫ్ట్ లోకి వచ్చి అయిదవ నంబర్ నొక్కాడు.


"సాహితీరత్న " అవార్డును, ముప్పై ఐదువేల చెక్ ను అందజేస్తూ..

తాను వ్రాసిన నవల గురించి వచ్చిన పేరుమోసిన సాహితీవేత్తలందరు ఎంతో మెచ్చుకుంటూ … తనని పొగుడుతూ ఉంటే… సమయాన్ని .. చివరికి తననే మరచిపోయాడు ఆనందరావు.


సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయినతరువాత, సమయం గడవక ఎప్పుడో కాలేజీ రోజుల్లో వ్రాసుకునే రచనా వ్యాపకానికి తిరిగి శ్రీకారం చుట్టాడు ఆనందరావు …


స్వతగాహా సాహిత్యాభిమాని … ఎన్ని పనుల వత్తిడులు ఉన్నా కొద్దీ సమయం చిక్కినప్పుడు తప్పని సరిగా ఎదో ఒక పుస్తకం చదువుతూ ఉండేవాడు …


అందుకే చాలా కొద్ది కాలంలోనే మంచి రచయితగా సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్నాడు.


ఐదో అంతస్తు చేరిన లిఫ్ట్ లోనుంచి వడి వడి గా అడుగులు వేసుకుంటూ, తీసిఉన్న తలుపులోనుంచి లోనికి వెళ్లి చేతిలో ఉన్న కవరును అక్కడే ఉన్న టేబుల్ పై పెడుతూ, కళ్ళతోనే చుట్టూ చూసాడు తన భార్య సుమతి కోసం. నిశబ్దం తప్ప ఆ ఇంట్లో ఇంకేమి లేదు …


"సుమా ... " అంటూ రూమ్ లోకి వచ్చిన ఆనందరావు అక్కడ ఆమె లేకపోవటం గమనించి, 'ఎక్కడకెళ్ళిందీ?!' అని ఆలోచిస్తూ రూము నుండి బయటకు వస్తూ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని సుమతి కి కాల్ చేసాడు.

"పదములె చాలు రామా ... " పాట వినిపిస్తూ … సుమతి ఫోన్ అక్కడే మ్రోగింది …


"హమ్మయ్యా... ! ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుండి . ఇంత చల్లటి వాతావరణములో వేడి వేడి కాఫీ .. అది సుమ చేసిన కాఫీ తాగుతూ ఉంటే .. ఎంత బాగుంటుంది ... ". అని తలపోస్తూ .. ముందుగా కాస్త ఫ్రెష్ అవుదాం అనికుని వాష్ రూమ్ లోనికి వెళ్ళాడు ఆనందరావు.


సన్న బార్డర్ ఉన్న తెల్లటి లుంగీ కట్టుకుని మొఖం టవల్ తో ఒత్తుకుంటూ బెడ్ రూములోనుంచి బయిటికి వచ్చి .... మళ్ళీ “సుమా .. " కొంచం గట్టిగానే పిలిచాడు అసహనంగా… లోలోన ‘ఎక్కడ ఉంది .. ’ అనుకుంటూ …


నాలుగు గదులు .. పెద్ద హాలు .. విశాలమైన వంట గది… మూడు బాల్కనీలు … దేవుడి కోసం ప్రత్యేకంగా సుమతి కట్టించుకున్న చిన్న గుడిలాంటి గది.. అన్ని వైపులా తిరుగుతూ.. చూస్తూ ఉన్నాడు .. ఎక్కడైనా ఆరోగ్యం బాగాలేక పడిపోయిందా… అన్న అనుమానంతో…


'అయినా నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా.. నాతో చాలా మాములుగా మాట్లాడింది… ఏ విషయము చెప్పలేదు… ఎందుకైనా మంచిది వాళ్ళ చెల్లికి కాల్ చేస్తా... ' అనుకుంటూ .. సులోచన నంబర్ డయల్ చేసాడు … రెండు రింగులకే 'హలొ బావగారు ... ' అంటూ సులోచన..


'హలొ సులోచన… మీ అక్క సుమతి అక్కడికి వచ్చిందా... ' అని అడిగాడు కాస్త కంగారుగా…


'లేదండి బావగారు … రెండు రోజులయింది నేను అక్కతో మాట్లాడి.. నేనే అడుగుదాం అనుకుంటూ ఉన్నా… అక్క ఎలా ఉంది అని… అంతలో మీరే అడిగారు… గుడికి గాని వెళ్ళిందేమో … వస్తుంది లెండి… కంగారు పడకండి... ' కాస్త అనునయిస్తున్నట్టు గా అంది సులోచన …


'అలాగలాగే… మరి ఉంటా… వచ్చాక ఫోన్ చేయిస్తా .. ' అంటూ పెట్టేసాడు... టేబుల్ పైన పెట్టిన అవార్డు షీల్డ్ ను చేతుల్లోకి తీసుకుంటూ .. కింత గర్వంగా భావిస్తూ..


**************

బైటికి వెళ్లి చూసి వచ్చాడు… కాసేపైనతరువాత...... ఆకాశం పూర్తిగా నల్లగా ముంచేసింది... చినుకులు పెద్ద పెద్దగా ... శబ్దం చేస్తూ .. వడివడిగా పడుతున్నాయి.. తెలియని గుబులు మొదలయింది ఆనంద్ రావు గుండెల్లో...

వంట గదిలోకి వెళ్ళాడు.. అన్ని శుభ్రంగా సర్ది ఉన్నాయి.. ఓ ప్రక్కగా వేసి ఉన్న . డైనింగ్ టేబుల్ పైన రెండు కూరలు .. పొద్దున్న చేసిన దొండకాయ రోటి పచ్చడి ... పప్పు .. చారు... హాట్ ప్యాక్ టిఫిన్ బాక్స్ లో రెండు పుల్కాలు .. రైస్ కుక్కర్ లో రైస్ .. అన్ని రాత్రి డిన్నర్ కి సరిపడా చక్కగా అమర్చి ఉన్నాయి...

,,

తాను తినే కంచం కూడా బోర్లించి ఉంది...

ఆ కంచం కింది నుంచి తెల్లటి కాగితాలు రెపరెపలాడుతూ కనిపించాయి ...


కంచం లేపుతూ కాగితాలని చేతుల్లోకి తీసుకున్నాడు ... ఏంటివి అనుకుంటూ...

కళ్లద్దాలు సరి చేసుకుంటూ ... విప్పి చూసాడు...

సుమతి వ్రాసినట్టుందే... అనుకుంటూ...

అక్షరాలా వెంబడి అతని చూపులు పరిగెడసాగాయి...


ప్రియమయిన శ్రీవారికి,


ప్రియమయిన అన్న పదం విని .. వ్రాసుకుని బహుశా మూడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి కదండీ...

చేతిలోని పుస్తకాల బరువును గుండెలకు హద్దుకుంటూ.. నా స్నేహితురాళ్ళతో కలిసి నడుచుకుంటూ కాలేజీ నుండి ఇంటికి వెళుతూ వుంటే... వెనక వెనక వచ్చేవాళ్ళు మీరు.. గుర్తు ఉందా.. బెల్బాటం ప్యాంటు తో రోడ్లన్నీ ఊడ్చేసేవాళ్ళు ... అలా సంవత్సరం వెంటపడ్డారు ..


మీరు డిగ్రీ మూడోసంవత్సరం చదువుతున్నారు కదూ.. పరీక్షలు అయిపోగానే.. మీఅమ్మనాన్నలతో మా ఇంటికి వచ్చి సూటిగా మా నాన్నగారితో మాట్లాడించారు ... బెదిరిపోతున్న నా కళ్ళలోకి చూస్తూ...


మౌనంతో జవాబు చెపుతూ .. "అబ్బాయి పిజి అయిపోయి ఉద్యోగం వచ్చిన తరువాతే పెళ్లి ... కానీ అప్పటి వరకు ఒక మాట అనుకుందాం అన్నయ్యగారు .. " అని అత్తయ్య అడగటం ... నాన్న "ఏరా పాపడు.." అంటూ నా వైపు ప్రశ్నర్ధకంగా చూడటం ... అమ్మ కూడా సుముఖంగా తలఊపడం.. ఉప్పొంగుతున్న సంతోషపు సముద్రాన్ని చెక్కిళ్ళలో చేర్చి చూపించటంతో ... నాన్నగారు కూడా సరే చెప్పారు... మీరు పిజి కోసం హైదరాబాదు వెళ్లిపోయారు... అప్పుడే కదూ... నీలి రంగు ఇన్లాండ్ లెటర్స్ మన మధ్య ఎన్నో .. విహంగాలై ఎగిరాయి...


ఎన్ని కబుర్లు ..

రాతల్లోనే మాటలు ..

ముద్దు ముచ్చట్లు..


పిజి అవగానే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావడంతో ఏ అభ్యంతరాలు లేక పోవటంతో మన వివాహం జరిగి మనం ఒక్కటయ్యాము ... నా చదువు డిగ్రీ ఆఖరి పరీక్షలు వ్రాయకుండానే ఆగిపోయింది. మీతో పాటు జీవితం పయనిస్తూ ఉంటే మన మధ్యలోకి వచ్చారు మన ఇద్దరు పిల్లలు ... వాళ్ళ ఆలనలో పాలనలో.. తల్లినై సంతృప్తిగా సమయాన్ని వాళ్లకై వెచ్చించాను .


మనకి ఇటువైపు .. అటువైపు బంధువులు ఎక్కువ అవటం మూలాన.. హైదరాబాదు ఎవరు వచ్చినా మన ఇంట్లోనే బస చేసేవారు... కాదు అని చెప్పలేని తనం మనది.. వచ్చేవాళ్ళు పోయేవాళ్లు .. ఇల్లంతా సందడి .. తీరికలేని పని...


ఇక పొతే .. మన ఇంటి స్వవిషయానికి వస్తే.. ఏ విషయం అయినా నాతోఎప్పుడు సంప్రదించే వాళ్ళు కాదు మీరు..

ఏదైనా నేను చెప్పాలని చూసినా ‘నీకేం తెలియదు.. ’ అంటూ .. కొట్టిపడేసే వాళ్ళు మీరు ..

నిజమేనేమో అనుకునేదాన్ని ..


అత్తగారు ఉన్నంతవరకు ఆవిడతోనే నా సమయం గడిచేది... పిల్లలు ఎదిగారు .. వారి ఇష్టాను సారంగానే మంచి చదువులు చదువుకుని .. విదేశాల్లో సెటిల్ అయ్యారు .. వాళ్ళ పెళ్లిళ్లు .. మనవళ్ల ముద్దు ముచ్చట్లు అన్ని సక్రమంగా జరిగిపోతూ ఉన్నాయి ..


అయినా ఎదో వెలితి... ఇది అని చెప్పలేని అశక్తత .. శరీరం అలసిపోతూ ఉంది.. కానీ మానసికంగా ఆలోచనల తుట్టెలు .. లో లోన ...


మీరు రిటైర్ అయ్యారు... మనకి కాస్త సమయం చిక్కుతుంది అనుకున్నా... మీ దృష్టి సాహిత్యం వైపు మళ్లించుకుని పూర్తిగా బిజీ అయిపోయారు... వేళకు తినడం కూడా తీరికలేనంతగా... ఇక నేను అని ఉన్నా అన్న ధ్యాసే లేదు మీకు..


ఇంత పెద్ద ఇంట్లో పనివాళ్ళతో కాలక్షేపం ఎంతని చెయ్యను ..

ప్రతీరోజు బాబాగారి గుడికి వెళ్లేదాన్ని .. అక్కడ శ్యామలక్క అని ఒకావిడ పరిచయం అయ్యారు.. ఆవిడతో కలిసి సత్సంగం కి వెళ్లడం అలవాటు చేసుకున్నాను... నాతో పాటు ఎందరో పరిచయం అయ్యారు..

ప్రతీ వాళ్ళకి ఎదో ఒక కలత.. బాధ.. వాటి మీద నేను ఆవేదన చెందటం అర్ధం లేదు అనిపించింది...

ఎలాగూ. ఎదో ఒకరోజు మన మధ్య భగవంతుడు ఎవరినో ఒకళ్ళను ముందు తీసుకునిపోతాడు... అప్పుడు ఒంటరివాళ్లమే అవుతాము అదే... ముందే మనం ఈ దూరాన్ని అలవాటు చేసుకుంటే.. ఒంటరిగా బ్రతకటం అయినా అలవాటు అవుతుంది ....


అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చి ఈ సంఘం తరఫున ఉన్న ఆశ్రమంలో జాయిన్ అయ్యాను ... మీకు మాటల్లో చెప్పాలంటే వీలు కావడం లేదు... మీరు అంత సమయం నాకు ఇవ్వటం లేదు... అందుకే...


ఆనాటి ఉత్తరం గుర్తుకు వచ్చి ఇలా వ్రాస్తున్నాను... అన్యధా భావించకండి .. తప్పు అనుకుంటే మన్నించండి..

సదా మీ ప్రేమను కోరే..


మీ అర్ధాంగి

"సుమతి "


వర్షం మరింత పెద్దదైన సూచనగా బాల్కనిలోనుంచి జల్లు కొట్టి ఆనందరావు వళ్లంతా తడిపేసింది... కంటి నీటిని తోడు తీసుకుంటూ ... తెల్లటి గడ్డంలో ఇంకలేక చుక్కలై కిందికి జారుతూ...

సుజాత తిమ్మన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


********* సమాప్తం *******

రచయిత్రి పరిచయం: పేరు సుజాత తిమ్మన.

డిగ్రీ చదువుతుండగానే వివాహం... ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలు.

చిన్నప్పటి నుంచీ మనసులో కలిగిన భావాలను నోటు పుస్తకంలో వ్రాసుకోవడం అలవాటు.

అలా కవితలు లెక్కకు మించి వ్రాసాను, వ్రాస్తూనే ఉంటాను.

ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రికలో తరచుగా ప్రచురితం అయ్యేవి.

బహుమతులు, ప్రశంసా పత్రాలు రావడం సర్వ సాధారణం.

ముఖ పుస్తకంలో అనేక సమూహాలలో నేను కనిపిస్తూనే ఉంటాను.

30 కథల వరకు వ్రాసాను. ఇక ఈ కథ "అర్థాంగి" నమస్తే తెలంగాణ వీక్లీ లో అచ్చయిన కథ.

మన తెలుగు కథలు లో నన్ను చేర్చుకున్నందుకు ధన్యవాదాలతో...

సుజాత తిమ్మన.



34 views0 comments
bottom of page