top of page

అరుణోదయం


'Arunodayam' New Telugu Story

Written By Ch. Pratap

'అరుణోదయం' తెలుగు కథ

రచన : Ch. ప్రతాప్


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఉదయం పది గంటలౌతోంది. నిద్ర మత్తు ఇంకా వదలలేదు అరుణకు. ఇంతలో సైడ్ టేబుల్ మీద పెట్టిన మొబైల్ రింగవుతుండడంతో ఇంత పొద్దుటే ఫోన్ ఎవరు చేస్తున్నారో, పనీ పాటా లేకుండా, అసలు రాత్రి పడుకునే ముందు మొబైల్ ను ఆఫ్ చేయకపోవడం నేను చేసిన పెద్ద తప్పు అని విసుక్కుంటూ ఫోన్ ఎత్తింది అరుణ. అవతలి నుండి తల్లి. " ఏమిటే ఆ మొద్దు నిద్ర. నిన్న రాత్రి పది సార్లు ఫోన్ చేసాను. బదులే లేదు. ఉదయం నుండి కనీసం ఇంకొక పది సార్లు చేసాను. జవాబు లేదు. నువ్వెక్కడ వున్నావో, ఏం చేస్తున్నావో అని హడలెత్తి చస్తున్నాను. నాన్న నీకు వాట్సాప్ లో మెస్సేజి కూడా పెట్టారు. దానికి కూడా సమాధానం లేదు " అంటూ పెద్దగా అరవడం మొదలు పెట్టింది. "అబ్బబ్బ, ఎందుకమ్మా అలా అరుస్తావు. నిన్న ఆఫీసు నుండి వరుణ్ డేటింగ్ కు రమ్మంటే డిన్నర్ కు వెళ్ళాను. వచ్చేసరికి ఒంటిగంటయ్యింది. ఆఫీసులో అలసట కూడా తోడవడం వలన మత్తు నిద్ర పట్టేసింది. నీ కూతురు ఇంకా చిన్న పిల్ల అనుకున్నావా? కుక్కెత్తుకు పోవడానికి?" విసుక్కుంది అరుణ. "అది కాదే, నెత్తికి ఇరవై అయిదు ఏళ్ళు వచ్చేయి. పెళ్ళీడు దాటిపోతోంది. శుభ్రంగా మేము చూసిన ఒక మంచి సంబంధం చేసుకొని హాయిగా సుఖ పడవచ్చు కదా? ఈ డేటింగులూ అవీ మనకెందుకు ? విదేశీ సంస్కృతిని అనుకరించడం చాలా ప్రమాదం. రేపు ఏదైనా జరగరాని తప్పు జరిగితే మనకెంత అప్రతిష్ట? సమాజంలో అసలు తలెత్తుకు తిరగగలమా ? అయినా పెళ్ళీ కాకుండా పరాయి మగాళ్ళతో తిరగడం చాలా అనర్ధాలకు దారి తీస్తుంది. ఎప్పుడు తప్పు జరుగుతుందో అని అనుక్షణం హడలి చస్తున్నాను. నా మాట విని మేము చూసిన ఆ ఏలూరు సంబంధం ఫైనల్ చేసెయ్యి, వచ్చే శ్రావణంలో పెళ్ళి చేసేస్తాము" అంటూ ఆవిడ ఇంకా ఏదో అనబోతుంటే "అమ్మా, స్టాపిట్" అంటు పెద్దగా అరిచింది అరుణ. "నీకెన్ని సార్లు చెప్పాలి? సంస్కృతి, సంప్రదాయం అంటూ పాత చింతకాయ పచ్చడి భావాలను నాపై రుద్దవద్దని? ఇదుగో, మళ్ళీ చెబుతున్నాను. నేను మేజర్ని. పైగా మల్టీ నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీలో సీనియర్ ప్రోగ్రామర్ గా పని చేస్తున్నాను, నెలకు లక్షన్నర జీతం. స్వతంత్రంగా బ్రతుకుతున్న నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నాకు నచ్చినవాడితో తిరుగుతాను. ఇటీజ్ నన్నాఫ్ యువర్ బిజినెస్. ఇంకొకసారి పని కట్టుకొని ఫోన్ చేసి సూక్తులు గట్రా వల్లించావంటే నెంబర్ బ్లాక్ చేసి పారేస్తాను" అని విసురుగా ఫోన్ కట్ చేసి అవతల పడేసింది. రాత్రి వరుణ్ తో డేటింగ్ లో హాయిగా ఎంజాయ్ చేసింది. తన రూముకు కూడా రమ్మన్నాడు. కాని ఎలాగూ వచ్చే నెల నుండి అతనితో లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ లో వుందామని నిశ్చయించుకుంది. అప్పుడే వెళ్ళవచ్చునని, వెళ్ళాక సంసారిక బంధానికి శ్రీకారం చుడదామని అనుకుంది. రాత్రంతా అతనితో గడిపిన క్షణలను తలుచుకుంటూ మధురమైన ఊహలలో తేలియాడుతూ పడుకుంది. పొద్దున్నే అమ్మ బలవంతంగా నిద్ర లేపి, పనికిరాని పాత చింతకాయ పచ్చడి సూక్తులు వల్లించి తన మూడంతా పాడు చేసేసింది. ‘ఛ, ఛ, రోజే ఆరంభమే చెత్తగా వుంది’ అనుకుంటూ బాత్రూములోకి దూరింది. స్నానం చేసాక కాఫీ త్రాగుతూ వాట్సప్ చాట్స్ చూసింది. వరుణ్ నుండి ఒక ఇరవై మెస్సేజిలు వున్నాయి. రాత్రి తన రూములో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసానని, నువ్వు రానందున డిస్సపాయింట్ అయ్యాయని నొచ్చుకుంటూ రాసాడు. ఇక నాన్ వెజ్ జోక్స్ ఒక పది దాకా పంపాడు. వాడికి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ అనుకుంటూ వాడితో తీసుకున్న ఫొటోలను చూసుకుంది. వరుణ్ భలే స్మార్ట్ గా వుంటాడు. తనలాగే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ కలిపి నెలకు మూడు లక్షల జీతం. ఈ బెంగుళూరు మహానగరంలో దర్జాగా బ్రతికెయ్యవచ్చు. వాడిది తమ కులం కాదు. తమది వెజ్ కులమైతే వాళ్ళది నాన్ వెజ్ కులం. అయితే ‘దర్జాగా బ్రతకడానికి ఈ పనికి మాలిన కులాలు అడ్డం కావు కదా?’ అన్నది తన నిశ్చితాభిప్రాయం. అయితే తాను చిన్నప్పటి నుండి ఆధునిక భావాలతో, విదేశీ సంస్కృతి ప్రభావంతో పెరిగింది. అల్ట్రా మోడర్న్ జీవిత విధానంలో ఏ బరువు, బాధ్యతలు, భవ బంధాలు లేకుండా బ్రతకడమే తనకిష్టం. కాలేజీ జీవితంలో ఎందరో తన వెంట పడ్డారు. తనను పెళ్ళి చేసుకోమని, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని డజన్ల కొద్దీ అబ్బాయిలు ప్రాధేయపడ్డారు. అయితే ఈ పెళ్ళి అనే చట్రంలో ఇరుక్కుపోవడం తనకిష్టం లేదు. విదేశాలలోలా ముందు కనీసం ఒక అయిదేళ్ళు సహజీవనం చేసి, ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకొని, కెమిస్ట్రీ కుదిరి, ఆలోచనల ఫ్రీక్వెన్సీ మాచ్ అయితే అప్పుడు పెళ్ళి సంగతి ఆలోచించవచ్చు. ఒకవేళ ఈ సహజీవనం లో పిల్లలు పొరపాటున పుడితే వారిని ఆ అనాధ శరణాలయంలోనో ఇచ్చేసి వదిలించుకోవచ్చు. ముందు పార్టనర్ తో పెళ్ళి పట్ల ఎటువంటి కమిట్ మెంట్ వుండకూడదు. ఈ అయిదేళ్ళ అనధికారిక వైవాహిక జీవితం ఎక్సయిటింగ్ గా వుంటే అప్పుడు వాడితో పెళ్ళి గురించి అలోచించవచ్చు లేదా బ్రేకప్ చెప్పి ఇంకొకరిని వెతుక్కోవచ్చు. వయస్సుతో పాటు పెరిగే కోరికలను తీర్చుకోవడం కోసం చిన్న వయస్సులోనే పెళ్ళి, కుటుంబం అనే చట్రంలో ఇర్రుకోవడం అవసరమా? పశు పక్ష్యాదులు ఎటువంటి కమిట్మెంట్ లేకుండా హాయిగా, బాహాటంగా, స్వేచ్చగా తమ కోరికలు, వాంఛలు తీర్చుకోవడం లేదూ? వాటికి తప్పు కానిది తనకు మాత్రం ఎందుకు తప్పవుతుంది ? దాహం, ఆకలి తీర్చుకోవడం ఎంత సహజమో, శారీరక కోరికలు తీర్చుకోవడం కూడా సమాజంలో అంతే సహజం గా వుండాలి. అమెరికాలో ఇటువంటి జీవిత విధానం ఎంతో సహజమని, దానికి అక్కడ ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదని తన స్నేహితులు చెబుతుంటారు. ఇంతటి చిన్నదానికి చిన్నప్పటి నుండే పెళ్ళి, సంసారం అనే గుదిబండలు తగిలించడం ఎందుకో అరుణకు అర్ధం కావడం లేదు. ఇదీ అరుణకు తన జీవితం పట్ల వున్న ప్రణాళిక. అక్కడ హైదరాబాదులో అరుణ తల్లి అరుణ మాటలకు కుప్పకూలిపోయే పెద్దగా ఏడవసాగింది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక అగ్రహారంలో పుట్టి పెరిగిన తనలో అణువణువునా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలు జీర్ణించుకొని వున్నాయి. రోజూ నాలుగు గంటలకు నిద్ర లేచి స్నానం చేసి దైవారాధన చెస్తే గాని కాఫీ కూడా ముట్టదు. రోజంతా భగవన్నామస్మరణ చేస్తునే వుంటుంది. తండ్రి హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వోద్యోగి సంబంధం తెచ్చినప్పుడు ససేమిరా వద్దంది. ఆధునిక సమాజంలో అందునా మహానగరాలలో ఇమడడం కష్టమని నెత్తీ నోరు కొట్టుకుంది. కాని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడైన తాను ఇంతకంటే మంచి సంబంధం తేవడం కష్టమని తండ్రి బలవంతం చేయడం తో ఇక తప్పదని ఒప్పుకుంది. అయితే భర్త చాలా మంచివాడు. ఆమె మనస్సు నొప్పించకుండా మసలుకునేవాడు. పెళ్ళయిన పదేళ్ళ తర్వాత అరుణ పుట్టడం వలన భర్త, ఇరు పక్కల తల్లిదండ్రులు విపరీతమైన గారాబం చేసారు. అంతేకాక అరుణకు ప్రతీదీ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంలో భర్త అరుణను అత్యాధునిక సమాజంలో పెంచాడు. భారతీయత, భారతీయ సత్ సంప్రదాయాలు చెద పట్టినవని, అమ్మాయిలను సంప్రదాయం పేరిట బందీలుగా, బానిసలుగా చేస్తారని, అదే విదేశీ సంస్కృతిలో అయితే ఎలాంటి పరిమితులు లేక స్వేచ్చగా బ్రతకవచ్చునని అభిప్రాయం అరుణలో బలపడింది. రోజులు గడుస్తున్నాయి. అరుణ, వరుణ్ లు చట్టాపట్టాలు వేసుకొని వారాంతరాలలో సినిమాలు, షికార్లు, డిన్నర్లు చేస్తున్నారు. ఒకరోజు వరుణ్ లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ కోసం అర్ధరాత్రి పన్నెండు గంటలకు, పౌర్ణమి వెన్నలలో ప్రతిపాదించగా అరుణ ఒప్పుకుంది. అందుకు ఒక రోజు కూడా నిర్ణయించుకున్నారు. ఇరుపక్షాల తల్లిదండ్రులు ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి వారికి చెప్పాల్సిన అవసరం లేదని, ఒకవేళ తెలిస్తే వారిని ఎదిరించడానికి, అవసరమైతే తెగతెంపులు కూడా చేసేసుకోవాలని నిర్ణయించుకున్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఇరవై మందికి సహజీవనం ప్రారంభించబోయే శుభ సందర్భంలో డిన్నర్ ఇవ్వాలని కూడా నిర్ణయించు కున్నారు. ఆ రోజు డిసెంబరు 31 వతేదీ. ఆ రోజు శనివారం. వారాంతపు శెలవప్రస్తుత సంవత్సరానికి ఆఖరు రోజు. రేపే నూతన సంవత్సరం. . నిద్ర లేస్తునే అరుణ ఉత్సాహంతో ఎగిరెగిరి పడుతోంది. ఆరోజే ఫ్లాట్ ఖాళీ చేసి అరుణ వరుణ్ ఇంటికి వెళ్ళాలన్నది ప్రణాళిక. తన సామానులన్నింటినీ ప్యాకింగ్ చేసుకుంది. పనిమనిషికి, వాచ్ మెన్ కు ఇవ్వాల్సినవి ఇచ్చేసింది. పన్నెండు గంటలవుతుండగా వాట్సాప్ తీసి మెస్సేజిలు చెక్ చేసుకోసాగింది. అప్పటికే స్విగ్గీలో భోజనం ఆర్డరు చేసేసుకోవడం వలన వంట బాధ లేదు. తీరికగా మెస్సేజిలు చదువుతుంటే కొలీగ్ రమ్య నుండి వచ్చిన ఒక మెస్సేజ్ చూసి తుళ్ళిపడింది. అది వరుణ్ ఒక అమ్మాయి ఒళ్ళో ఒక పార్కులో పడుకొని వున్న ఫొటో. దాని కింద ‘ఇదీ నీ ప్రియుడి అసలు స్వరూపం’ అన్న టెక్స్ట్ మెస్సేజి వుంది. ఆ ఫొటో చూడగానే అరుణ అదిరిపడింది. నెత్తిన పిడుగు పడ్డట్లు, తన నవనాడులు కుంగిపోయినట్లనిపించింది. మళ్ళీ మళ్ళీ దానిని పరీక్షగా చూసింది. సందేహం లేదు. అది వరుణే. ఒక అమ్మాయికి అయిస్ క్రీం తినిపిస్తున్నాడు. దానిని చూస్తే ఒక నెల కింద ఒక పార్కులో తన ఒళ్ళొ పడుకొని అయిస్ క్రీం తినిపించిన ఘటనే గుర్తుకొచ్చింది. వెంటనే రమ్యకు ఫోన్ చేసింది. రమ్య ఫోన్ ఎత్తగానే ఇక ఎలాంటి ఉపోధ్ఘాతం లేకుండా " ఏమిటే ఈ పిచ్చి ఫొటోలు. ఎక్కడి నుండో ఒక ఫొటో పట్టుకువచ్చి మార్ఫింగ్ చేసి, అది వరుణ్దని నన్ను మోసం చేయాలనుకున్నావా? నువ్వు ప్రేమించబోయిన వరుణ్ నిన్ను కాదని నన్ను లైక్ చేసాడనే అక్కసుతొనే కదా నువ్వు ఈ అఘాయిత్యానికి ఒడికట్టావు?" అని హిస్టరికల్ గా అరిచింది. అవతల లైన్ లో వున్న రమ్య కు అసలు మాట్లాడే అవకాసం కూడా ఇవ్వకుండా ఆవేశం, క్రోధం, అక్కసు, కలిపి తన్నుకొస్తుంటే ఏదేదో మాట్లాడేసింది. కొంత సేపయ్యాక తన ఆవేశం తీరాక ఇంక ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ సోఫాలో కూలబడిపోయింది. ఒక అరగంట తర్వాత రమ్య అరుణ ఇంటికి వచ్చింది. ఆమెను చూస్తూనే ఆవేశం చల్లారిపోయిన తర్వాత విపరీతమైన బాధలో వున్న అరుణ రమ్యను చుట్టేసుకొని ఏడవసాగింది. రమ్య ఎంతో సమతుల్యంతో, నిగ్రహంతో అరుణను ఓదార్పు మాటలతో అనునయించింది. అరుణ కాస్త తెప్పరిల్లాక, తన ఫోన్ లో వున్న వరుణ్ ఫొటోలను చూపించింది. అవి అనేక మంది అమ్మాయిలతో క్లోజ్ గా వున్నప్పుడు తీసినవి. "నీ వ్యవహారంపై అనుమానం వచ్చిన నేను మా అన్నయ్యకు వరుణ్ నేపధ్యంపై ఆరా తీయించే బాధ్యత అప్పజెప్పాను. తాను, తన ఫ్రెండ్స్ కలిసి వరుణ్ వ్యవహారాపై నిఘా వుంచారు. ఆధారాలుగా అనేక ఫొటోలు సేకరించారు. అతను ఒట్టి మోసగాడు. అనేక మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడిపాడు. నడుపుతున్నాడు కూడా. అవసరం తీరాక అమ్మాయిలను కూరలో కరివేపాకులా అవతల పడెయ్యడం వాడికి వెన్నతో పెట్టిన విద్య. ఎదురుతిరిగిన అమ్మాయిలకు తాను వాళ్ళతో క్లోజ్ గా వున్న ఫొటోలు చూపించి బెదిరించి వాళ్ళను వదిలించుకుంటాడు. అందంతో పాటు, చక్కని ఆదాయం వున్న నిన్ను బుట్టలో వేసాడు. నువ్వే ముందుకు వచ్చి లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ అనడంతో ఎగిరి గంతేసాడు. అయిదేళ్ళ తర్వాత ఎలాగోలా నిన్ను వదిలించుకోవచ్చునని వాడి ప్లాన్. నా అనుమానం వాడు నీతో సన్నిహితంగా వున్న కొన్ని ఫొటోలు ఇప్పటికే సంపాదించి వుంటాడు. అయితే ఏమీ ఆందోళన పడవద్దు. వాటిని సంపాదించే బాధ్యత మా అన్నయ్య మీద పెట్టాను. ఈ ఆధారాలు నాకు ఈ రోజు ఉదయమే లభించాయి. ఏ రోజే నువ్వు వాడి ఫ్లాట్ కు వెళ్తున్నావని భార్గవి పొద్దున చెప్పింది. నీ జీవితం వాడి వలన నాశనం కాకూడదనే సద్దుదేశంతోనే ఈ ఫొటో పంపించాను. నిన్ను రక్షించలనే తపన తప్ప నీ మీద అసూయతోనో లేక కోపంతోనే చేసినది కాదు" ఆవేశం తగ్గేటప్పటికి రమ్య మాటలలోని సారాంశం అరుణకు అర్ధం కాసాగింది. అరుణ ఇప్పుడు ఏం చెప్పినా విని, అర్ధం చేసుకునే స్తితిలో వుందని గ్రహించిన రమ్య తన కౌన్సలింగ్ కొనసాగించింది. “మన భారతీయ సనాతన సంప్రదాయంలో పెళ్ళికి ఎంతో విశిష్టత వుంది. పెళ్ళి అంతే సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది, కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం. ధర్మార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్ధం చేయటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణా మార్గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు. కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి ఈ వివాహం తర్వాత ప్రారంభం అయ్యే సంసారిక జీవితాన్ని సహజీవనం, లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ పేరిట అనైతిక పునాదులపై ప్రారంభించడం చాలా తప్పు. ఇవి బూజు పట్టిన సనాతన సంప్రదాయాలో లేక పాత చింతకాయ పచ్చడి భావాలో కాదు. స్త్రీ పురుషులు సమాజంలో కలిసి మెలిసి ఆనందంగా జీవించడానికి, తమద్వారా తమ వంశాభివృద్ధి చేసుకోవడానికి నిర్దేశించిన నైతిక జీవన విధానం. జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిస్తుంది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందడం మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్నిపొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభి వృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతంది. క్రమ బద్ధమైన జీవితాన్ని ఆశచూపి పురుషుడినీ, భధ్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్ళి అనే తాడుతో గట్టిగా కట్టి పడేశాక ఇక వారివైపు చూడదు సమాజం. పెళ్ళికున్న పాత ధర్మాలు పాతబడ్డాయి, కొత్తవి రాలేదు అన్నారు చలం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు. స్త్రీ పురుషులిద్దరూ కలిసి ధర్మార్ధ కామ మోక్షాలను సాధించుకోవదమే పెళ్ళి పరమార్ధం. జీవిత భాగస్వామ్య వ్యవస్థతో రెండు ఆత్మలు ఒక్కటిగా మమేకమవడమే పెళ్ళి పరమార్ధం. పెళ్ళితోనే స్త్రీ పురుష సంబంధాలకు నైతికత ఏర్పడుతుంది. పెళ్ళి వెనుక వున్న సృష్టి రహస్యం, పెళ్ళి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు కలిపి దంపతులిద్దరినీ సృష్టి కారకులుగా నిలబడతాయి. స్త్రీ, పురుషులు ఒకరికొకరు కట్టుబడి ఉండటం ఈ సమాజం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పరుచుకున్న విలువ. ఆ విలువకు బయట జరిగి ‘అనంగీకార’ అనుబంధాలకు వెళ్లిన జంటలు ఎక్కువగా కష్టాలనే ఎదుర్కొన్నారు, సమాజపు దృష్టిలో దోషులుగానే నిలుచున్నారు. భారతీయ సమాజంలో అయితే ప్రేమలోగాని, వివాహంలోగాని జీవిత భాగస్వామిని వంచన చేసి మరొకరితో బంధంలో ఉండటం పూర్తి అనైతికంగా పరిగణించబడుతుంది. దీనిని సభ్య సమాజంలో మసలుతున్న మనందరం అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పటికైనా నీ ఆలోచనా విధానం మార్చుకో. సనా, తన భారతీయ సత్సంప్రదాయాలు, జీవిత విధానం గత పది వేల సంవత్సరాలుగా అమలులో వున్నది. వచ్చే పది వేల సంవత్సరాల వరకు మన భారతీయులకు అదే దిక్సూచిగా నిలవనున్నది. విదేశీ సంస్కృతిని అనుకరించడం ఆత్మహత్యా సదృశ్యం. గీతలో భగవంతుడు చెప్పినట్లు అది పరధర్మ ఆచరణ కిందకే వస్తుంది". రమ్య యొక్క రమ్యమైన మాటలతో అరుణలో సంవత్సరాలుగా పేరుకొని వున్న అజ్ఞానంధకారాలు పటాపంచలైపోయాయి. విదేశీ సంస్కృతిపై మోజుతో ఎంతగా తప్పటడుగులు వేసిందో అర్ధయ్యింది. ‘నా మాట విని త్వరగా పెళ్ళి చేసుకొని జీవితంలో సుఖపడి మా బాధ్యతలను కొంతవరకైన తగ్గించు’ అంటూ ప్రాధేయపడే అమ్మ ముఖమే కళ్ళ ముందు మెదలసాగింది. ఆమెలో అరుణోదయమయ్యింది. తల్లితో కరువుతీరా, మనసు తీరా మాట్లాడడానికి, తన నూతన ఆలోచనా విధానం పాలుపంచుకోవడానికి మనస్పూర్తిగా మొబైల్ తీసింది. ***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.


265 views0 comments

Comments


bottom of page