ఆసరా!
- Ramu Kola

- Dec 19, 2025
- 3 min read
#RamuKola, #రాముకోలా, #Asara, #ఆసరా, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Asara - New Telugu Story Written By - Ramu Kola
Published In manatelugukathalu.com On 18/12/2025
ఆసరా! - తెలుగు కథ
రచన : రాము కోలా
రామయ్య చిరువ్యాపారి.
గల్లీలో ఉదయం ఆరు గంటలకే కూరగాయల బండి పెట్టేవాడు అదే అతనికి జీవనాధారం.. రోజుకి రెండుమూడు వందల రూపాయలు సంపాదించి, భార్య పార్వతి, ఇద్దరు పిల్లలతో తృప్తిగా జీవనం గడిపేవాడు.
అతని మంచితనము, మాట తీరు పలకరించే విధానం అందరినీ ఆకట్టుకునేది. అదే అతన్ని ఆపద సమయంలో ఆదుకునేందుకు సహకరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కూరుస్తున్న వర్షాలకు అతని పూరిల్లు నేలమట్టం అయింది. ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి. మరో పక్క. రెక్కాడితే కానీ డొక్క నిండని కుటుంబ పరిస్థితి. ఏం చేయాలో తోచక దిగాలుగా చెట్టు కింద కూర్చుని ఉన్న రామయ్యని దూరం నుండి చూసాడు శ్రీనివాసరావు.
శ్రీనివాసరావు మున్సిపల్ ఆఫీసులో క్లర్ జాబ్ చేస్తుంటాడు. తనది కూడా మధ్యతరగతి కుటుంబమే. అందుకే తనకు కావలసిన కూరగాయలు రామయ్య దగ్గర కొనేవాడు. పరోక్షంగా అతనికి సహాయం చేసినట్లు ఉంటుందని.
ఇప్పుడు రామయ్య పరిస్థితి చూడగానే శ్రీనివాసరావు గుండె తరుక్కపోయింది.
"రామయ్యా.. వర్షం కారణంగా నీ ఇల్లు కూలిపోయిందని తెలిసింది. పిల్లలు కలవాడివి. ప్రస్తుతం ఎక్కడ ఉంటావు. నా ఇంటి ఆవరణలో ఖాళీ జాగా ఉంది. ప్రస్తుతం. అక్కడ నీ బండి పెట్టుకోవచ్చు. నాలుగు రోజులు తర్వాత ఏదైనా బ్యాంకులో లోన్ ఇప్పిస్తాను. ఇప్పుడు తాత్కాలికంగా నాలుగు రేకులతో నివాసం ఏర్పాటు చేద్దాం. వెళ్ళి పిల్లల్ని, నీ భార్యని తీసుకుని వచ్చేయి" అని భరోసా ఇచ్చాడు.
రామయ్య గొంతు మూగబోయింది. “సార్.. మీ దయ జన్మజన్మలకూ మర్చిపోను, ” అని చేతులు జోడించాడు.
కాలక్రమేణా రామయ్య జీవితం మారింది.
వ్యాపారం పుంజుకుంది. బ్యాంకులో ఉన్న అప్పు తీర్చేసాడు. ఎంత పని వత్తిడి ఉన్నా సాయంత్రం శ్రీనివాసరావు గారు వచ్చే వరకు ఉండి నాలుగు మాటలు మాట్లాడి తన కూరగాయలు బండి పక్కన పెట్టి వెళ్ళేవాడు.
అలా కూర్చుని ఒక రోజు మాట్లాడుతూ శ్రీనివాసరావు గుండెపోటుతో నేలపై కుప్పకూలిపోయాడు. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. పండుగకు ఊరికి వెళ్ళారు.
సమయం లేదు. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటూంది.
రామయ్య శ్రీనివాసరావును హాస్పిటల్ లో చేర్చాడు.
“సార్.. మీరు లేకపోతే నేను లేను!. మీరు కోలుకోవాలి. నాలాంటి వారిని ఎందరినో ఆదుకోవాలి.. దేవుడా!.. సార్ త్వరగా కోలుకునేలా చేసే బాధ్యత నీదే. అలాగే చేస్తావు కదా!. అని కాళ్ళపై కూర్చుని దైవాన్ని వేడుకున్నాడు రామయ్య.
మరుసటి రోజు మంచం మీద శ్రీనివాసరావు కళ్లు తెరిచాడు. దగ్గరలో రామయ్య కనిపించాడు. ఏం జరిగిందో శ్రీనివాసరావుకు ఒక్కొక్కటి గుర్తుకు రాసాగింది.
రామయ్యను దగ్గరకు రమ్మంటూ పిలిచి, రామయ్య చేతులు తన చేతుల్లోకి తీసుకొని
“రామయ్య.. నువ్వు లేకపోతే నేను చచ్చేవాణ్ణి, నువ్వు నా పాలిట దేవుడివి. నీ ఋణం ఎన్ని జన్మలకు తీరుతుందో." అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
రామయ్య చలించి పోయాడు..
కళ్లలో నీళ్లు పొంగాయి. “సార్.. మీరు నాకు ఆసరా కల్పించిన దేవుళ్ళు.
ఈ రోజు నేను నాలుగు రాళ్ళు సంపాదిస్తూ కుటుంబంతో సంతోషంగా ఉన్నానంటే అది మీ సహకారమే. మీకు సేవ చేసే భాగ్యం నా అదృష్టంగా భావిస్తున్నాను, ” అని చేతులు పట్టుకున్నాడు.
మానవత్వం అంటే ఇదే – ఇవ్వడం, ఆదుకోవడం, ఒకరి కన్నీటిని మరొకరు తుడవడం. అని తెలియజేస్తూ గోడ గడియారం టంగ్ టంగ్ మంటూ మ్రోగింది.
***
రాము కోలా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
రచయిత పరిచయం : నా పేరు రాము కోలా. మాది ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు.
విద్యార్హత డిగ్రీ.
ఇప్పటివరకు150 కథలు,1500 కవితలు వ్రాసాను. అనేక వార్తా పత్రికలు నా కవితలు, కథలుప్రచురించి తగిన గుర్తింపునిచ్చాయి. గాంధీ గ్లోబల్ ఫామిలీ & గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారు గాంధీ విశ్వకవి సమ్మేళనం 2020 హైదరాబాద్ లో నిర్వహించి ఇచ్చిన " సాహిత్య రత్న" బిరుదు నాకు అమూల్యమైనది.




హృదయపూర్వక అభినందన🙏
"రాము కోలా గారు, మీరు రాసిన ఈ కథ చాలా హృద్యంగా ఉంది.
'సహాయం - కృతజ్ఞత' అనే రెండు మనిషికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలను రామయ్య, శ్రీనివాసరావు పాత్రల ద్వారా అద్భుతంగా చూపించారు. సమాజంలో మాయమవుతున్న మానవత్వాన్ని గుర్తు చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
" మొక్కై వంగనిది మానై వంగునా" అన్నట్లుగా, మనం నాటిన సాయం అనే విత్తనం ఎప్పటికైనా మనకు నీడను ఇస్తుంది. శ్రీనివాసరావు గతంలో చేసిన సాయం, ఆయనకు ప్రాణదానం రూపంలో తిరిగి లభించింది.
మనం ఇతరుల కన్నీళ్లు తుడిస్తే, మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడు అన్నా విషయం తెలియజేశారు .