'Athani Kante Ghanudu' - New Telugu Story Written By Sripathi Lalitha
'అతనికంటే ఘనుడు' తెలుగు కథ
రచన: శ్రీపతి లలిత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"అమ్మా! అమ్మా!" మూలుగుతున్న నా కూతుర్ని నెమ్మదిగా పొట్టమీద రాస్తూ, "ఓర్చుకోమ్మా, ఒక్క నాలుగైదు గంటలు, పొద్దున్నకల్లా నీ చేతిలో బుజ్జి పాపో, బాబో ఉంటారు. "
అంటూ ఓదార్చాను.
"అమ్మో! నీకేమి తెలుసమ్మా నా బాధ, హాయిగా కుర్చీలో కూర్చుని బానే చెప్తావు" అని మా అమ్మాయి శ్రేయ అనగానే తిక్క రేగింది నాకు.
"అవునే! నాకేమి తెలీదు. ఏ బాధ లేకుండానే ఆకాశం నుంచి ఊడిపడ్డావు. కడుపుతో ఉన్నప్పటినుంచి చెప్తున్నా, మేక లాగా మెయ్యడం కాదు, కొద్దిగా ఇంట్లో పని చెయ్యి, కాస్త మంచి ఆహరం తిను అని, విన్నావా? ఏ రోజు పిజాలు, బర్గర్లు నా బొందలు.
పాలు తాగవే రెండుపూటలా అంటే కూల్ డ్రింకులు, ఐస్క్రీమ్లు.
మీ నాన్న, మీ ఆయన చేసిన గారాబం, నీ బద్ధకం,
లోపల బిడ్డని బాగా పెంచావు, నువ్వు పెరిగి బీపీ, షుగర్ తెచ్చుకున్నావు.
ఇంకా నయం తొమ్మిది వచ్చాక సమస్య వచ్చింది లేపోతే బిడ్డకి ప్రమాదం వచ్చేది"..
ఇంక నేను తిట్లు ఆపేటట్లు లేదని మూలగడం ఎక్కువ చేసింది శ్రేయ. నిజమో అబద్ధమో తెలీకపోయినా మళ్ళీ నెమ్మదిగా పొట్ట మీద రాయడం మొదలుపెట్టాను.
మాకు ఒక్కతే కూతురు శ్రేయ.
కూతురు అమెరికా వెళితే రోజూ చూడలేను అని, వాళ్ళ పితాశ్రీ హైదరాబాద్ లోనే ఉన్న అల్లుణ్ణి చూసారు.
పెళ్లయ్యాక పక్క సందులో ఇల్లు వెతికారు. అందరికి పక్క సందు అనిపిస్తుంది కానీ మా ప్రహరీగోడలు ఒకటే. రోజూ అక్కడినుంచే అన్ని సప్లైలు.
అవసరమున్నా లేకపోయినా ఏదో వంకతో రోజూ కూతుర్ని చూడాల్సిందే.
నిన్న చెకప్ కి వెళ్తే శ్రేయని చూసిన డాక్టర్ బీపీ బాగా ఎక్కువగా ఉంది అని త్వరగా డెలివరీ అయితే నయమని హాస్పిటల్లో చేరమని చెప్తే డాక్టర్ చెప్పిన ఈ ఆసుపత్రిలో చేర్చాను.
"కారులో పెట్రోల్ ఫుల్ గ కొట్టించి రండి అటు, ఇటు తిరగాలంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది" అని పంపితే ఈ భర్త గారు అజాపజా లేడు.
"ఆసుపత్రికి వెళ్లే టైం అయిందిఎక్కడయ్యా మగడా?" అని ఫోన్ చేస్తే
"నువ్వేగా కార్ మధ్యలో ఇబ్బంది పెట్టకుండా చూడండి అన్నావు, కార్ సర్వీసింగ్ కి ఇచ్చా, ఇంకో రెండు మూడు గంటల్లో ఇస్తాడు" అన్న భర్త మాట విని ఎక్కడ తల కొట్టుకోవాలో తెలీక చేత్తో బాదుకుని ఆయన పీక పిసకలేక ఫోన్ పీక నొక్కాను.
క్యాబ్ పిలుచుకుని ఆసుపత్రికి వస్తే అన్ని నేనే
చూసుకోవాల్సివచ్చింది.
ఇది ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి.
ఇక్కడ అయితే అన్నిరకాల వైద్యులు ఉంటారు ఏ సమస్య వచ్చినా చూస్తారు అని ఇక్కడ చేరాము, మాములుగా చూసే డాక్టర్ సలహాతో.
శ్రేయ ఆఫీస్ ఇన్సూరెన్సు ప్రకారం ఇక్కడ షేరింగ్ రూమ్ దొరికింది.
మహాఅయితే మూడు రోజులు ఏదో ఒకటి సర్దుకుందాము అని తను అంటే, ఒకవైపు శ్రేయ, ఇంకోవైపు వాళ్ళ నాన్న ఒకటే సణుగుడు.
ఇది బాలేదు, అది బాలేదు అని. ఇదేమన్నా మన ఇల్లా సర్దుకుపోవాలి అని కోప్పడింది తను.
"నొప్పులు వచ్చి నార్మల్ కానుపు అవుతుందేమో అని ఇంజక్షన్ ఇచ్చారు డాక్టర్, నొప్పులు అంతగా రాకపోయినా ఈ పిల్ల నొప్పో, నొప్పో అని ఒకటే గోల.
నెమ్మదిగా శ్రేయని ఊర్కోపెట్టేలోగా నర్స్ వచ్చి వరుసగా సూదులు గుచ్చి సెలైన్ పెట్టింది. నొప్పి తగ్గిందో, అలసటకి నిద్ర వచ్చిందో శ్రేయ కళ్ళు మూసుకుని పడుకుంది.
ఇంతలో పక్క బెడ్ వాళ్ళు టీవీ గట్టిగా పెట్టి సినిమా చూస్తుంటే "నెమ్మదిగా పెట్టుకోండి మా అమ్మాయి పడుకుంది" అంది.
"సినిమా చూస్తూ నిశ్శబ్దంగా చూడు అంటే ఎలా ఆంటీ" అంది ఆవిడ నా వంక తల కూడా తిప్పకుండా.
ఒక నిమిషంఉలిక్కిపడింది. తనకంటే ఒక రెండు, మూడేళ్లు చిన్నదేమో నన్ను ఆంటీ అంటుంది ఏమిటి అనే లోగా
"మీ అమ్మాయికి ఏమైంది ఆంటీ" అన్నాడు ఆవిడ భర్త.
అతను పేషెంట్ అనుకుంటా రెండు కాళ్ళకి కట్టు కట్టుకుని ఉన్నాడు.
"డెలివరీకి వచ్చాము, మీకు ఏమయింది అంకుల్" అనపోయి వాళ్ళని తిట్టుకుంటూ నేను కూడా వాళ్ళలా మాట్లాడితే ఎలా? అనుకుని "ఏమైంది అండీ?" అని అడిగింది.
"మోకాళ్ళు నొప్పికి ఎముకలో ఇంజెక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు" అన్నాడు.
‘పోనీలే, వీళ్ళు వెళ్తే రాత్రికి కొంచెం నిశ్శబ్దంగా పడుకోవచ్చు’ అనుకున్నాను.
ఇంతలో వాళ్ళ అబ్బాయి అనుకుంటా ఒక డజను ప్యాకెట్లు తెచ్చాడు తినడానికి.
"ఇన్ని ఎందుకురా" అని తండ్రి అంటే "మళ్ళీ సిటీ ఫుడ్ ఎప్పుడు తింటారో.. తినండి" అంటూ అన్నీ బల్ల మీద పెట్టాడు.
ఆ అబ్బాయి ఉద్యోగంలో చేరి ఆరు నెల్లు అయిందిట.
కిందటి నెలలోనే కంపనీ వాళ్ళు అతనితల్లి, తండ్రికి ఇన్సూరెన్సు ఇచ్చారట.
వేస్ట్ చేయడం ఎందుకు అని మోకాలి నొప్పులకు ఇంజెక్షన్ తీసుకున్నాట్ట.
రెండు కాళ్ళకి నెప్పులు అంటే ఇన్సూరెన్సు డబ్బులు ఒక కాలుకి మాత్రమే సరిపడా వస్తుంది అని వస్తే, డాక్టర్ మందు మిగిలింది ఇంకో కాలుకి కూడా ఇవ్వాలా అంటే ఇమ్మన్నాట్ట.
వచ్చే సంవత్సరం ఇంకో వైద్యానికి రావచ్చు అని. అడక్కుండానే మొత్తం చరిత్ర చెప్పారు. ఆయనకి సిద్ధిపేటలో ఏదో వ్యాపారం. అంతా ఫోన్లమీద ఇక్కడ మంచం మీదనుంచి నడుపుతున్నాడు.
వచ్చిన దగ్గరనుంచి చూస్తే ఆయన ఫోన్లో ఒకటే వాగుడు, ఆవిడ ఇదీ అదీ అని తేడా లేకుండా టీవీ చూడడం, అబ్బాయి తిండే జీవిత ధ్యేయంగా ఏదో ఒకటి తినడం. 'విచిత్ర కుటుంబం' అనిపించింది.
ఈలోగా వాళ్ళ బిల్ వచ్చింది. ఇన్సూరెన్సు రాగానే ఇంకో రెండు గంటల్లో వెళ్ళిపోతాము కదా మనము కట్టే డబ్బులకి సరిపడా అనుభవించాలి అంటూ బయట చల్లగా ఉన్నా ఏసీ వేసి అందరూ రగ్గులు కప్పుకుని టీవీ చూస్తున్నారు.
నేను కూడా ఏమి చేయలేక రగ్గు కప్పుకుని కూర్చున్నాను..
ఇంతలో వాళ్ళకి బిల్లింగ్ వాళ్ళనుంచి ఫోన్ వచ్చింది. "ఏంటి?" ఆ కుర్రాడు ఒక కేక పెట్టాడు.
“ఏమిటి లక్ష కట్టాలా.. ఎందుకు? మేము పదివేలు కట్టాము. మీరే మాకు వాపసు ఇవ్వాలి" అంటూ గట్టి గట్టిగ అరవడం మొదలుపెట్టాడు.
ఇంక మొదలు అయింది నాకు సుత్తి.
మా అమ్మాయి నొప్పులు పెద్దగా రాకపోయేసరికి ఆపరేషన్ కోసం రెడీ చేయడానికి నర్సులు వచ్చి హడావిడి పడుతుంటే పక్క వాళ్ళ గోల ఎక్కువ అయింది.
అమ్మాయిని తీసుకెళ్లి అరగంటలో మనవడు పుట్టాడని శుభవార్త చెప్పారు.
మా మనవడి తండ్రి, మా అమ్మాయి తండ్రి అందరికి వార్త చెప్పటానికి చెరోవైపు ఫోన్ తీసుకుని వెళ్లారు.
మనవడిని, అమ్మాయిని ఎలాగా రూంలోకి తేవటానికి మూడు నాలుగు గంటలు పడుతుంది, కాసేపు నడుము వాలుద్దామని రూమ్ కి వచ్చాను నేను.
పక్క వాళ్ళ మాటలకి నిద్ర పట్టలేదు కానీ మంచి సరదాగా
ఉంది సంభాషణ, దానితో కళ్ళు మూసుకున్నా చెవి అటే వేసాను.
బిల్ తెచ్చి చూపమంటే ఆ సెక్షన్ వాళ్ళు వచ్చి బిల్ ఇచ్చారు. ఇంజెక్షన్ కి లక్ష రూపాయలు, డాక్టర్ ఫీజు లక్ష, మిగిలినివి అన్ని కలిపి ఇంకో లక్ష, మూడు లక్షలకి బిల్ వేశారు.
"మీరు మాకు లక్షన్నర అవుతుందని ఎస్టిమేట్ ఇచ్చారు, అంతకే ఇన్సురెన్సు వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు, ఇప్పుడు మూడు లక్షలు ఎలా వేశారు?" అని కొడుకు లా
పాయింట్.
"మీకు ఒక కాలికి ఇంజక్షన్ కి మేము ఎస్టిమేట్ ఇచ్చాము, కానీ రెండు కాళ్ళకి ఇచ్చాము కదా అందుకే ఎక్కువ అయింది" అని బిల్లింగ్ వాళ్ళ ఉవాచ.
"రెండు కాళ్ళా!"
కొడుకు ఆశ్చర్యపోయి "ఏమిటి నాన్నా" అన్నాడు.
"అవును ఇంజక్షన్ మందు ఉంది, రెండో కాలుకి ఇవ్వాలా అన్నారు, వద్దు అంటే ఏమి చేస్తారు? అంటే పారేస్తాము, ఒకసారి మూత తీస్తే ఇంకా పనికిరాదు అంటే, పారేసేబదులు
కాలికి ఇమ్మన్నాను. మందు ఖరీదు ఒకటే కదా! ఒక కాలికి ఇస్తే అంతే తీసుకుని, రెండో కాలికి మిగిలింది అందులోదే ఇచ్చి ఎలా ఎక్కువ వేస్తారు?" అడిగాడు తండ్రి.
భలే పాయింట్ లాగాడు ఆనుకున్నా నేను.
"ఒక కాలు కి ఎంత ఛార్జ్ చేస్తామో రెండో కాలుకి అంతే సార్.
డాక్టర్ ఫీజు అంతా కలిపి లక్ష ఎక్కువ కట్టాలి" అన్నాడు బిల్లింగ్ అతను.
"మీరు ఎస్టిమేట్ కంటే ఎక్కువ వేసినప్పుడు, మీకు తెలీదా ఇన్సూరెన్సు వాళ్ళు ఇవ్వరు అని అప్పుడే మాకు చెప్పాలికదా, ఎంత ఎక్కువ అవుతుందో చెప్తే, మాకు ఇష్టమైతే చేయించుకునేవాళ్ళం లేపోతే వద్దు అనేవాళ్ళం. చేసాక చెపితే ఎలా?" కొడుకు లా పాయింట్.
‘అమ్మో! సిటీ వాళ్ళు తెలివిగా ఉంటారు అంటారు కానీ ఈ తండ్రి కొడుకులు పాయింట్ల మీద పాయింట్లు లాగుతున్నారు. అసలు ఈ ఇద్దరు లా ప్రాక్టీస్ పెడితే బ్రహ్మాండంగా ఉండేది’ అనుకున్నాను నేను.
ఆ మహా తల్లి ఇవేమి పట్టించుకోకుండా హాయిగా ఒకో కవర్ తెరిచి అందులోవి తింటూ టీవీ చూస్తోంది.
"సరే సర్ మీ బాధ నాకు అర్థమైంది. నేను మా మేనేజర్ గారితో మాట్లాడి మీకు ఒక పదివేలు తగ్గించే ఏర్పాటు చేస్తాను, తొంబై వేలు కట్టండి” అన్నాడు బిల్ బాబ్జి.
"చూడు బాబు, తొంబైవేలు కాదు, తొమ్మిది వేలు కూడా నా దగ్గర లేవు. మీరే నాకు, నేను కట్టిన పదివేలు డిపాజిట్ లోనించి ఇవ్వాలి. అది పెట్టి బస్సు టికెట్ కొని నేను ఇంటికి వెళ్ళాలి. అందుకని మీ బాస్ ని అడిగి డబ్బులు తీసుకురా" అన్నాడు తండ్రి.
బిల్ బాబ్జి బుర్ర గోక్కుంటూ వెళ్ళాడు.
నాకు భయం వేసింది.
బిల్లు కట్టమూ అని ఇలా మొండికేస్తే ఆసుపత్రి వాళ్ళు ఏ
సెక్యూరిటీ చేతో కొట్టిస్తే..
ఆ సీను లో బాగా మునిగిపోయిన నేను
"బాబూ! మీరు ఇలా అంటే వాళ్ళు ఏమన్నా చేస్తే?"
డౌట్ బైటపెట్టాను.
"అయ్యో! అక్కగారు! వాళ్ళేమి చేస్తారు. ఇది ఆసుపత్రి. నేను వీడియో తీసి వాట్సాప్ పెడతాను, దెబ్బకి వీళ్ల సంగతి బయట పడుతుంది, ఇంత అవుతుందని చెప్పకుండా ఇంజక్షన్ ఇచ్చి ఇప్పుడు డబ్బులు అంటే నేనెక్కడినుంచి ఇవ్వాలి?" అన్నాడు ఆంటీ నుంచి అక్కగా ప్రమోషన్ ఇచ్చి.
నిజమేకదా అనిపించింది నాకు.
కొద్దిగా చిన్న ఊరు నుంచి వచ్చారు, అంతగా చదువుకున్న వాళ్ళలా లేరు, దానితో ఆసుపత్రి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరనుంచి డబ్బు లాగుదామనే చూస్తున్నట్టు అనిపించింది నాకు.
ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి మాట్లాడినట్టున్నారు.
మా తమ్ముడు అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న గారు (అది అతనికి నేను పెట్టిన
పేరు) అంటున్నారు.
"అవును సార్! మీరు ఏమన్నారు? మందు మిగిలింది, వేస్ట్ అవుతుంది. ఇవ్వనా అంటే ఇమ్మన్నాను, అదే మందు అదే డాక్టర్లు. నాకోసం ప్రత్యేకం ఏది లేదు.
మరి ఒక దానికి చేసిన దానికి రెట్టింపు ఎలా తీసుకుంటారు సార్. మీరు ముందే చెప్తే నేను వద్దనేవాణ్ణి కదా. లేదంటే ఇన్సురెన్సు వాళ్ళని అడిగి చేసి ఉండాల్సింది. నా దగ్గర డబ్బు లేదు."
ఈ లీగల్ పాయింట్లకి డాక్టర్ గారి మతి పోయి, లేని పోనిది తన పీకకి చుట్టుకుంటుంది అని భయపడి "సర్లెవయ్యా! నా ఫీజు సగం తగ్గిస్తాను, మిగిలింది కట్టు" అని పెట్టేసాడు.
మళ్ళీ బిల్ బాబ్జి వచ్చాడు.
"ఆ ఫీజు తీస్తే మీరు అరవై కట్టాలి" అంటూ.
"నా దగ్గర లేదయ్యా నేను కట్టను, కావాలంటే ఆ మందు నా కాలు నుంచి తీసుకోండి. నేనేమన్నా అడిగానా? మీరే అడిగి మరీ ఇంజక్షన్ ఇచ్చి, డబ్బు కట్టు అంటే, నేను కట్టను ఏమి చేస్తారో చెయ్యండి" విసుగ్గా అన్నాడు మా తమ్ముడు మల్లన్న.
ఈ హడావిడిలో నేను గమనించనేలేదు, అతని భార్య కొడుకు కనపడలేదు.
ఎవరూ లేనప్పుడు నెమ్మదిగా అడిగాను "వాళ్లిద్దరూ భోజనానికి వెళ్ళారా?" అని.
"వాళ్ళు ఉంటే ఇలా మాట్లాడాలంటే ఇబ్బంది అని పంపించేసాను" అన్నాడు తమ్ముడు.
"ఓర్నీ! ఏమి తెలివి అనుకున్నా"
ఈసారి బిల్ బాబ్జి ఇంకో టై ఆయన్ను వెంటబెట్టుకు వచ్చాడు.
“సార్! మీరు చెప్పినట్టు అన్నీ తగ్గించాము. ఒక్క పదివేలు కట్టి వెళ్ళండి” అన్నాడు.
"నాదగ్గర టికెట్ డబ్బులు కూడా లేవు అంటే వినరే, రూమ్ ఖాళీ చేసి గుమ్మంలో కూచుంటా, లేదా, ఒక వెయ్యి ఇవ్వండి వెళ్తాను" అన్నాడు మొండి మల్లన్న.
ఈలోగా రూమ్ కావాలని నర్సులు ఒకటే గోల పేషెంట్ బయట వేచి ఉన్నారు అని.
ఇంతలో మా మనవడు, అమ్మాయి కూడా వచ్చేసారు.
నేను ఆ హడావిడిలో ఉండగా వచ్చాడు తమ్ముడు.
"అక్కగారు వెళ్తున్నా!" అంటూ,
"మరి డబ్బులు" అంటే
"ఇదిగో మూడు వేలు ఇచ్చారు" అని నవ్వుతూ వెళ్ళాడు.
‘నిజంగా ఘనుడివి మల్లన్న’ అనుకున్నా.
మర్నాడు మళ్ళీ మా కోసం బిల్ బాబ్జి వచ్చాడు.
"ఏం బాబు! మాకు జాగ్రత్తగా వేశావా బిల్" అన్నా నవ్వుతూ.
"ఆంటీ! మీ ఇన్సురెన్సు వాళ్ళు అంతా ఇచ్చారు. మీకు ప్రాబ్లెమ్ లేదు" అన్నాడు, నేను ఒక యూనివర్సల్ ఆంటీని అనుకుంటూ.
"నిన్న మీరు బిల్ అంత తగ్గించారు, నిజంగానే ఎక్కువ వేసారా? లేక మీరు నష్టపోయారా?" ఆత్రం ఆపుకోలేక అడిగాను.
"అన్నీ కలిపి ఒక బెడ్ ఖరీదు రోజుకి లక్ష నుంచి లక్షన్నర.
మా పొరపాటు కొంత జరిగింది, కొంత నష్టపోయాము, కానీ కొన్ని సార్లు తప్పదు.
వాళ్లతో ఇంకా లాగితే ఒక రోజు వృధా అవుతుంది. అందుకే ఒకోసారి మేమే డబ్బులు ఇచ్చి వదిలిచ్చుకుంటాం" అన్నాడు.
"ఔరా!" అనుకున్నాను కానీ అలా లా పాయింట్లతో గొడవ పెట్టుకోవడం అందరికీ రాదు,
'అతనికంటే ఘనుడు మా తమ్ముడు మల్లన్న' కి తప్ప
ఇంతకీ మల్లన్న గారి అసలు పేరు ఏమిటో?
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
Comments