'Athanu Athanu Kadu - Part 1/2' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 10/05/2024
'అతను.. అతను కాదు పార్ట్ - 1/2' తెలుగు పెద్ద కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"మనం బస్సులో వెల్దామంటే వద్దన్నావు.. ఇప్పుడు చూడు, బండిలో పెట్రోల్ అయిపోయింది. ఎక్కడున్నామో కూడా తెలియట్లేదు. ఇదేదో పెద్ద అడవి లాగ ఉంది. చుట్టూ నల్లటి చీకటి.. పలికే దిక్కే లేదు ఇక్కడ.. " అని కోపంగా అన్నాడు కిరణ్.
"ఐ యాం సారీ కిరణ్.. నాదే తప్పు.. "అన్నాడు రాము.
"నిన్ను బండి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించమని పంపిస్తే, ఏం చేసావు.. ?"
"అలా వెళ్ళానా.. అక్కడ పెద్ద హోటల్ కనిపించింది.. వెంటనే ఆకలి గుర్తొచ్చింది.. రెండు ప్లేట్స్ టిఫిన్ తినేసరికి బిల్ కాస్త ఎక్కువ అయిపోయింది.. పెట్రోల్ కి డబ్బులు సరిపోలేదు.. అందుకని.. " అని మెల్లగా అన్నాడు రాము.
"చేసింది చిన్న తప్పు కాదు.. మనం చాలా దూరం వెళ్లాలని తెలిసి కూడా, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించకపోతే ఎలా చెప్పు.. ?” అని కోపంగా అన్నాడు కిరణ్.
“ఈ దట్టమైన అరణ్యంలో పగటి పూట ప్రయాణం చేయాలంటేనే చాలా భయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అడవి లో మనం ఇరుక్కున్నాము. మనం ఈ అడవిలో చిక్కుకుపోయి దాదాపు రెండు గంటలు అవుతోంది. ఇంతవరకూ వేరే వాహనాలు ఏవి రాలేదు. ఈ టైం లో ఇక్కడకు ఎవరు రారు కూడా. చలి కూడా బాగానే వుంది. మనం అడవి మధ్యలో ఉండడం చేత, ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా లేవు.
దూరం నుంచి ఏవో జంతువుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకైనా మంచిది.. నాలుగు కర్రలు తెచ్చి మంట వేసి ఉంచు.. జంతువులు రాకుండా ఉంటాయి.. " అన్నాడు కిరణ్.
"ఇప్పుడు మంట వేశాము కాబట్టి.. జంతువులు అయితే ఇప్పుడు ఇక రావు.. మరి దెయ్యాలు మాట ఏమిటి బ్రో.. ఈ అడవిలో అవి కూడా ఉండొచ్చు కదా.. " అని భయంతో అడిగాడు రాము.
"అవును నిజమే అనుకో.. కానీ భయపడకు.. నేను దెయ్యాలని హేండిల్ చేస్తాను.. నో ప్రాబ్లెమ్.. " అన్నాడు కిరణ్.
"నువ్వు దెయ్యాలని హేండిల్ చేస్తావా.. ? అంటే దెయ్యలతో మాట్లాడతావా.. ?" అని ఆశ్చర్యంగా అడిగాడు రాము.
"అవును.. నీకు ఇంకా నా గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా.. ?" అని అన్నాడు కిరణ్.
"అయితే నువ్వు దెయ్యాన్ని ఎప్పుడైనా చూశావా?" అని అడిగిన రాము గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తోంది.
"చూడడమేమిటి.. ? మాట్లాడాను కూడా.. అయినా అది ఒక పెద్ద కథలే.. " అన్నాడు కిరణ్.
"నాకు ఆ కథ వినాలను ఉంది.. చెప్పు" అని ఆతృతగా అడిగాడు రాము.
********
అది కొన్ని సంవత్సరాల కిందటి మాట. అప్పుడు నేను, కళ్యాణి ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళము. మాకు కొత్తగా పెళ్లైంది. అప్పట్లో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాళ్ళము. ఒక రోజు కళ్యాణి..
"ఏమండీ.. ! మనం అర్జెంటుగా ఇల్లు మారిపోదాము.. కొత్త ఇల్లు తీసుకుందాం" అంది.
"ఎందుకే కళ్యాణి.. ఈ ఇల్లు మనకి చాలా బాగుంది కదా.. ఇక్కడ నువ్వు నేను చాలా సంతోషంగా ఉన్నాము. బయటకు వెళ్లి చూడు.. ఎక్కడ చూసినా, భార్యా భర్తల గొడవలే. ఎక్కడ చూసినా, పెళ్ళాన్ని మొగుడు చంపడమో.. లేక మొగుడిని పెళ్ళాం చంపడమో చూస్తున్నాము. మనం ఇలా హ్యాపీగా ఉండడానికి ఈ ఇల్లు చాలదూ.. ? నాకైతే, ఈ ఇల్లు బాగా నచ్చింది.
నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచీ ఇక్కడే ఉంటున్నాను. నాకు ఇక్కడ చుట్టుపక్కల అందరూ తెలుసు. హౌస్ ఓనర్స్ కూడా చాలా మంచివారు. నేనంటే చాలా అభిమానం. పైగా, ఇక్కడ నుంచి నా ఆఫీసు చాలా దగ్గర.. అన్నీ దగ్గరే. ఇప్పుడు కొత్త ఏరియాకి వెళ్తే, అక్కడ సెట్ అవడానికి కూడా టైం పడుతుంది.. "
"ఈ ఇల్లు చాలా బాగుంది. నాకూ నచ్చింది. మీరు చెప్పినదానికి నేను ఒప్పుకుంటాను. కానీ, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే, ఆ ఫీలింగ్ వేరే కదండీ.. ! మీకు ప్రమోషన్ వచ్చి ఇంత పెద్ద పొజిషన్ కి వచ్చారు.. ఒక మంచి ఇల్లు కొందాము " అని అడిగింది కళ్యాణి.
"ఇప్పుడు ఇల్లు కొనాలంటే, చాలా డబ్బులు కావాలి కళ్యాణీ.."
"అయితే, ఏదైనా సెకండ్ హ్యాండ్ ఇల్లు చూడండి.. సిటీకి దూరమైనా పర్వాలేదు.. మనకి కార్ ఉందిగా" అంది కళ్యాణి.
పెళ్ళాం అడిగిన దేనికీ ఎప్పుడూ కాదనని నేను.. అలాగే అని చెప్పి ఇల్లు కోసం ఒక బ్రోకర్ ని కలిసాను.
మర్నాడు బ్రోకర్ చాలా ఇళ్ళు చూపించాడు. కళ్యాణి కి ఏమీ నచ్చలేదు. చివరికి ఒక ఇల్లు బాగా నచ్చింది. పాతదైనా, పెద్ద ఇల్లు, తక్కువ రేట్ కి రావడం తో ఇద్దరూ 'ఓకే' చెప్పాము.
ఆ ఇల్లు సిటీ కి దూరంగా ఉంది. అక్కడ చుట్టుపక్కల ఇళ్ళు కూడా చాలా దూరంగా ఉన్నాయి. బడ్జెట్ లో ఇల్లు కావాలంటే, తప్పదనుకుని ఇద్దరూ ఒప్పుకున్నాము.
ఇల్లు చూడడానికి కొంచం పాతదిగా కూడా ఉంది.
అనుకున్నట్టుగా ఆ ఇల్లు సిటీ కి చాలా దూరంగా ఉంది. రెండు అంతస్తుల పాత ఇల్లు. చాలా రోజులుగా అందులో ఎవరూ లేకపోవడం చేత.. బూజు పట్టి ఉంది. ఇల్లు ఉన్న ఫలంగా అలాగే, ఫర్నిచర్ తో పాటు తక్కువ రేట్ కి అమ్మేశారు.
"ఏమండీ.. ! మన కొత్త ఇంటికి కొంచం పెయింట్ వేయించండి. చూడడానికి పాతది లాగ ఉంది.. "
"లేదు కళ్యాణీ.. ఇప్పటికే చాలా లోన్ పెట్టి కొన్నాము. పెయింట్ సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఒక మంచి ముహూర్తం చూసి ఇంట్లో దిగిపోవాలి.. "
"అలాగే.. " అంది కళ్యాణి.
ఒక మంచి ముహూర్తం చూసి కొత్త ఇంట్లో పాలు పొంగించి దిగారు.
"ఇప్పుడు చెప్పు కళ్యాణి.. ! ఇల్లు ఎలా ఉంది.. ? ఇప్పుడు హ్యాపీయే గా.. ! మంచి ఇల్లు కొన్నాము. ఈ కొత్త ఇంట్లో నువ్వు కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఇక మన కొత్త ఇంట్లో సందడి చేయడానికి మన పిల్లలు రావాలి.. "
"చాల్లెండి.. ! మీ మాటలూ మీరూ.. " అంది కళ్యాణి సిగ్గుపడుతూ..
ఇల్లు సిటీకి చాలా దూరంగా ఉండడం, అక్కడ దగ్గరలో వేరే ఇళ్ళు లేకపోవడం చేత, కొంచం భయంగానే ఉంటుంది. ఆ రోజు రాత్రి.. ఇద్దరూ పడుకున్న తర్వాత.. ఎవరో ఏడుస్తున్నట్టుగా తోచింది. ఆ ఏడుపు ఎక్కడ నుంచి వస్తుందో.. అని మెట్లు దిగి కిందకు వెళ్ళాను. అది ఇంటికి దూరంగా ఉన్న అవుట్ హౌస్ నుంచి వస్తోంది. వెళ్లి చూడగా.. ఆ శబ్దం ఆగిపోయింది. వచ్చి మళ్ళీ పడుకున్నాను.
మర్నాడు ఉదయం ఇంటి కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్లి తలుపు తీసాను. ఒక పెద్ద మనిషి.. సుమారు ఒక నలభై ఉంటాయేమో.. ఎదురుగా నిల్చొని ఉన్నాడు.
"ఎవరు మీరు.. ? ఎవరు కోసం వచ్చారు?" అని అడిగాను.
"నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను.. మీ కోసమే వచ్చాను.. "
"చెప్పండి.. ఏం కావాలి.. ?"
"రేపు మీరు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నన్ను కొంచం సిటీ లో డ్రాప్ చేస్తారా.. ? నేను ఎక్కువ నడవలేను.. ఓపిక లేదు.. "
"అలాగే సర్.. " అనగానే ఆ మనిషి వెంటనే వెళ్ళిపోయాడు.
మర్నాడు ఉదయం నేను ఆఫీస్ కి బయల్దేరే టైం లోనే, అతను వచ్చాడు. ఇద్దరం సిటీ లోకి వెళ్లిన వెంటనే.. ఒక చోట అతను దిగిపోయాడు. దిగే ముందు..
"బాబు.. నువ్వు ఫ్లైఓవర్ క్రింది నుంచి వెళ్ళు బాబు.. పై నుంచి వద్దు.. అక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది.. "
‘పెద్దాయనకు కొంచం జాగ్రత్త ఎక్కువేమో..’ అని అనుకున్నాను
ఎందుకైనా మంచిదని, ఫ్లైఓవర్ కింద నుంచే వెళ్ళాను. ఆఫీస్ లో పని అయిపోయాక, సాయంత్రం మళ్ళీ ఇంటికి బయల్దేరాను. ఉదయం ఎక్కడ డ్రాప్ చేసానో, అక్కడే అతను మళ్ళీ వెయిట్ చేస్తున్నాడు. బండి ఆపి, "ఏమిటి సర్.. ఇక్కడ ఉన్నారు.. ? ఎక్కడికైనా మళ్ళీ డ్రాప్ చెయ్యాలా?" అని అడిగాను.
"మీ ఇంటికి దగ్గరలో నన్ను దింపు.. " అన్నాడు అతను.
"నాకు దారిలో ఒక చిన్న పని ఉంది.. చూసుకుని వెళ్ళిపోదాం.. " అని అన్నాను.
"నువ్వు కలవాలనుకునే నీ ఫ్రెండ్ ఊరిలో లేడు.. వెళ్లడం వేస్ట్.. " అన్నాడు ఆయన.
అతని మాటలను పట్టించుకోకుండా.. అతనిని దింపి.. నేను నా ఫ్రెండ్ ఇంటికి బయల్దేరాను. వెంటనే ఫోన్ వచ్చింది.. మా ఫ్రెండ్ దగ్గర నుంచి.
"నేను అర్జెంటు గా ఊరు వెళ్ళాను.. నెక్స్ట్ వీక్ కలుద్దాం.. " అన్నాడు నా ఫ్రెండ్.
అన్నీ సర్ చెప్పినట్టే జరుగుతున్నాయి. మొన్న ఫ్లైఓవర్ గురించి.. ఇప్పుడు మా ఫ్రెండ్ గురించి. ఇంతకీ అతను ఎవరు.. ? అడ్రస్ కూడా అడగలేదు. కొన్ని రోజులు పోయాక.. ఒక సండే అతను మా ఇంటికి వచ్చాడు. ఈ సారి లోపలికి రమ్మని పిలిచాను. కాఫీ అడిగితే ఏమీ మాట్లాడలేదు..
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Commentaires