top of page
Original.png

ఆత్మావలోకనం - పార్ట్ 2

Updated: Jun 18, 2024


ree

'Athmavalokanam - Part 2/2' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 01/06/2024

'ఆత్మావలోకనం - పార్ట్ 2/2' పెద్ద కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

అమెరికాలో చదువు ముగించుకుని తన ఊరికి తిరిగి వస్తాడు విజయభాస్కర్‍.

అతని మామ వీరవెంకటరావు.

అమెరికాలో చదివిన తన కూతురు ఆమనికి విజయభాస్కర్‍ తో వివాహం జరిపించి, ఇద్దర్నీ అమెరికా పంపాలన్నది అతని ఆలోచన.



ఇక ఆత్మావలోకనం - పార్ట్ 2  చదవండి.


అదే సమయానికి మామా అల్లుళ్ళు హాల్లోకి వచ్చారు. విజయభాస్కర్ ఆమనిని.. ఆమె విజయభాస్కర్‍ని చూడడం జరిగింది. ఆమని నడకలో వేగం తగ్గింది. తల దించుకొని మెల్లగా తన గదిలోకి పోబోయింది.

"మామయ్యా!"

వెనుతిరిగి చూచి వెంటనే తలను త్రిప్పుకొంది ఆమని.


"మంచినీళ్ళు కావాలి!" అడిగాడు విజయభాస్కర్.


"ఆ.. ఆమనీ విన్నావుగా!" ఆమెవైపు చూచాడు వీరవెంకటరావు.


"బావకు మంచినీళ్ళు తీసుకునిరా!" చెప్పాడు.


‘నన్ను అతనికి దగ్గరగా చేరేటందుకు అలా అడిగాడూ. లేకపోయే ఉదయం ఎనిమిది గంటల లోపున అంత దాహమా! ఏదో మండుటెండలో తిరిగివచ్చినట్లు’ అనుకొని వెనుతిరిగి వంటింట్లోకి ప్రవేశించింది ఆమని.


పెద్ద ప్లేట్లలో గారెలు.. ఉప్మా.. ఖాళీ ప్లేట్లతో ఎదురైంది దివ్య.

"ఆ.. వచ్చావా! వీటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టు.. బావా నాన్నలను టిఫిన్ తినేందుకు రమ్మని పిలు" అంది దివ్య. 


ప్లేట్లను అందుకొని "మంచినీళ్ళు కావాకట!" చెప్పింది ఆమని.


"ఎవరికి" అడిగింది దివ్య.

"వారికే" అంది ఆమని.

"అంటే.."

"విజయభాస్కర్ గారికి"

"ఆ.." ఆశ్చర్యపోయింది దివ్య.

"ఆ.." అవునన్నట్టు తలాడించింది ఆమని.

"వా!.. ఏమే.. నీకు ఎంత పొగరే!.. వరసను మరిచిపోయావా.. పేరుతో చెబుతావా?"

"అవునమ్మా!.. ఆయన డాక్టరేగా.. యాక్టర్ కాదుగా!" వ్యంగ్యంగా అంది ఆమని. 

వేగంగా డైనింగ్ టేబుల్ వైపుకు వెళ్ళి రెండు ప్లేట్లను దానిపై వుంచి వెనుతిరిగింది ఆమని.

ఎదురుగా తండ్రి వీరవెంకటరావు.. ప్రక్కన డాక్తర్ విజయ భాస్కర్ ఉలిక్కిపడి ప్రక్కకు జరిగింది.

"విజయ్.. కూర్చో.. రా.." అన్నాడు వీరవెంకటరావు.

విజయభాస్కర్ ఆమనిని పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. దివ్య వచ్చి ఇరువురు ముందు ప్లేట్లు వుంచి ఉప్మాను పెట్టి.. మినప వడలను వుంచి అల్లం చట్నీని (పచ్చడి) వడ్డించింది.

ఆమని నిలబడి చూస్తూ ఉంది.


"ఎందుకే నిలబడిపోయావ్!.. నీవూ కూర్చో.. తిను" ఓ ప్లేట్లో ఉప్మా వడలను వుంచింది.


ఆమని కుర్చీలో విజయభాస్కర్‍కు ప్రక్క వరుసలో కూర్చుంది. ముగ్గురూ తినడం ప్రారంభించారు.

"అత్తా.. మీరూ కూర్చోండి" నవ్వుతూ చెప్పాడు విజయభాస్కర్.


అతనికి తనపైన వున్న అభిమానానికి ఆనందంగా.. "నా అల్లుడికి నామీద ఎంత అభిమానమో.. చూడండీ.. మీరూ వున్నారు!" అంటూ వీరవెంకటరావును ఆమని క్రీగంట చూచింది దివ్య.


తానూ కూర్చుని టిఫిన్ తినడం ప్రారంభించింది.


"అత్తయ్యా!.. మామయ్యా!.. మరదలు ఆమనీ!.. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను పెండ్లి చేసుకొని ఆమనితో అమెరికా వెళ్ళను. ఇక్కడే మన దేశం.. మన ప్రాంతంలోనే వుంటాను. మాయదారి కరోనా.. దేశంలో పూర్తిగా సమసిపోలేదు. నేను నాలుగు రోజులు తాతయ్య అమ్మమ్మతో గడిపి ఆ వూరి పరిసరాల్లో హాస్పిటల్ నిర్మాణానికి స్థలాన్ని తాతగారి సాయంతో కొన్నాను. త్వరలో భవన నిర్మాణం ప్రారంభం కాబోతుంది. ’జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపిగరీయసి’ అన్నట్టు నాకు నా జన్మభూమి స్వర్గతుల్యమే!.. 


నా విజ్ఞానాన్ని నావారి శ్రేయస్సు కోసం వినియోగించటంలో నాకు ఆనందం. ’మానవసేవే మాధవసేవ’ ఈ మహోన్నత పదాలను నేను ఎంతగానో అభిమానిస్తాను. గౌరవిస్తాను.. ఆచరిస్తాను మామయ్యా!.. ఈ నా నిర్ణయంలో ఎలాంటి మార్పూ జరుగదు. మీకు నా నిర్ణయం ఇష్టం లేకపోతే ఆమనిని మీకు నచ్చినవారికిచ్చి ఆమె ఇష్ట ప్రకారం వివాహం జరిపించండి. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.."

"మామయ్యా.. అత్తయ్యా.. నేను గతాన్ని మరువలేదు.. మరువలేను. ఆ సమయానికి సరైన వైద్యం జరుగనందున మా నాన్నగారు మరణించారు. మనవూరి నుండి హాస్పిటల్ వుండే ఆరు కిలోమీటర్లు దూరంలోని గ్రామానికి నాన్నను రెండెడ్ల బండిలో వేసుకొని పోతూ వుండగా మార్గమద్యంలో వారు గతించారు. ఆ గతం నాకు ఎప్పుడూ సింహావలోకనం.. అలాంటి చావు ఎవరికీ సంక్రమించకూడదు. మన ప్రాంతంలో అన్ని గ్రామాల్లో హెల్త్ సెంటర్స్ పెడతాను. వరుసగా అన్నింటిని పర్యవేక్షిస్తుంటాను. కానీ.. కేంద్రం మాత్రం నా తాతయ్య అమ్మమ్మ వూరే. అంటే మామయ్యా.. మీ వూరే.. 


సంవత్సరాలుగా మాటా పలుకులు లేని వీరు.. వారిని కలుసుకోవాలి. వారు పెద్దవారైనారు.. వారికి ఆనందం కలిగించాలి. అందరం కలిసిపోవాలి. ఇది నా సంకల్పం. మిమ్మల్ని శాసించే హక్కు, అధికారం నాకు లేదు. సంకల్ప వికల్పాలు వ్యక్తిగత విషయాలు. ఎవరికి వారు ఆలోచించుకొని కేవలం తన ఆనందాన్ని పంచుతూ చేసే పనివలన అందరికీ ఆత్మానందం కలుగుతుంది. నేను కోరేది.. చేయాలనుకొంటున్నదీ అదే.. ఇక మీ యిష్టం.. నేను చెప్పాలనుకొన్నది చెప్పేశాను. నేను ఏం చెప్పానో అదే చేయబోతున్నాను. అందులో ఎలాంటి మార్పు ఉండదు."

"అత్తయ్యా!.. టిఫిన్ చాలా బాగుంది. ఇంజనీర్‍ని రమ్మన్నాను. వాడు నా చిన్ననాటి మిత్రుడే. డ్రాయింగ్ తీసుకొని వస్తాడు. వాటిని చూచి ఓకే చేస్తే.. హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించవచ్చు. మీరంతా నా ఆశయాన్ని సమర్థించి.. నాతో ఏకీభవించి.. ఆ భవన నిర్మాణానికి నాతో కలిసి రావాలని ఆశిస్తున్నాను. వస్తాను" లేచి బేసిన్‍లో చేయి కడుక్కుని ఆ పెద్దలకు చేతులు జోడించి.. నమస్కరించి వెళ్ళిపోయాడు విజయభాస్కర్.


అతని మాటలకు చర్యలకు వీరవెంకటరావు.. దివ్య.. ఆమని ఆశ్చర్యపోయారు. నిశ్చేష్టులైనారు.

*

"అత్తా!.. నీ కొడుకు ఇంట్లో లేడా!.." సుమతిని సమీపించి మెల్లగా అడిగింది ఆమని.


విజయభాస్కర్ ఇంటి ప్రక్కనే శివాలయం. దేవుని చూచే పేరుతో విజయభాస్కర్‍తో మాట్లాడాలని వచ్చింది ఆమని.


విజయభాస్కర్ తన గదిలో ఇంజనీర్ ఫ్రెండ్ ఇచ్చి వెళ్ళిన హాస్పిటల్ ఎస్టిమేట్‍ను పరిశీలిస్తున్నాడు. డ్రాయింగ్స్ ని ప్రక్కన పెట్టుకొని.. 

ఆమనికి.. సుమతికి మంచి సాన్నిహిత్యం. అలాగే ఆమనికి తన అత్త మాటంటే ఎంతో గౌరవం. ఆమె ఇష్ట ప్రకారమే ఎంల్.ఎస్సీ చదివి టీచర్ ట్రైనింగ్ ముగించి.. ఆమని లెక్చరర్‍గా పనిచేస్తూ ఉంది. తన తల్లికంటే అత్త సుమతి దగ్గర ఆమనికి స్వేచ్ఛ చనువు అధికం..


"ఆమనీ!.."


"చెప్పు అత్తా!.."


రెండు గ్లాసుల టీని ప్లేట్లో వుంచి ఆమనికి అందించింది సుమతి. ’ఆ గదిలో వున్నాడు.. టీ ఇచ్చే సాకుతో వెళ్ళి నీవు మాట్లాడాలనుకొన్న అన్ని విషయాలు మాట్లాడు. సరేనా!" నవ్వుతూ ట్రేని ఆమని చేతికి ఇచ్చింది సుమతి. అందులో కొన్ని బిస్కెట్స్ నూ వుంచింది.


"వూ.. వెళ్ళు" అంది సుమతి.


ఆమని మెల్లగా తలుపు వరకూ నడిచింది. తలుపును తట్టింది..


"అమ్మా!.. ఇదేందమ్మా!.. నీవు రూములోకి వచ్చేదానికి తలుపు తట్టటం ఏమిటమ్మా!"


ఆమని గొంతు సవరించింది. విజయభాస్కర్ ద్వారం వైపు చూచాడు.

నవ్వుతూ చేతిలో టీగ్లాసుల ప్లేట్లతో ద్వారం దగ్గర నిలబడి వుంది ఆమని.


"ఓహో!.. అయ్యవారమ్మగారా!.. రండీ.. రండీ" నవ్వుతూ ఆహ్వానించాడు విజయభాస్కర్.


ఆమని మెల్లగా గదిలో ప్రవేశించింది.

"ఐయామ్ ఎ లెక్చరర్!" తలదించుకొని మెల్లగా అంది ఆమని.


"ఓహో!.. కానీ.. నేను ఇంగ్లీషువాణ్ణి కానే!" ఆమనిని చూస్తూ గలగలా నవ్వాడు విజయభాస్కర్.


"అత్తయ్య టీ ఇచ్చిరమ్మంది"


"ఇవ్వు.. మరో కప్పు!"


"అది నాకు బావా!" లాలనగా అంది.


"అలాగా.. ఓకే.. రా.. కూర్చో! నీతో మాట్లాడాలి"


ఆమనికి సంతోషం.. ’తాను మాట్లాడాలని వచ్చి.. ఎలా మాట్లాడాలా అనే సందేహంతో వున్న తనతో.. తన బావ మాట్లాడాలని అన్నాడంటే.. తనకు అతనితో మాట్లాడటం సులువుగా!’ అనుకొంటూ టీ కప్పు విజయభాస్కర్‍కి అందించింది.


తన చేత్తో నాలుగు ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్స్ ను విజయభాస్కర్‍కు అందించింది ఆమని. అతనికి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది ఆమని. టీ త్రాగటం ప్రారంభించింది.


బిస్కెట్ తిని టీ త్రాగుతూ విజయభాస్కర్..

"ఆమనీ! నిజం చెప్పు.. నేనంటే నీకు ఇష్టమా.. కాదా!.. నీవు ఏమి చెప్పినా నేను ఏమీ అనుకోను.. కారణం.. నావలన ఎవరూ కష్టపడకూడరు. నా సహచర్యంలో నాతో వుంటే.. వారు ఆనందంగా వుండాలి. అది నా తత్వం. పగలు, కక్షలు, సాధింపులు నాకు నచ్చవు.. ఆమనీ!" అనునయంగా చెప్పాడు విజయభాస్కర్.


"నాకూ అవేవీ నచ్చవు బావా!" మెల్లగా చెప్పింది ఆమని.


"మరి.. నా విషయం?" ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు విజయభాస్కర్.


"మీరు ఆరోజు టిఫిన్ తింటూ.. మీరు చెప్పాలనుకొన్నవి నిర్భయంగా చెప్పి వచ్చేశారుగా!"


"అవును.."


"ఆ తర్వాత అమ్మా నాన్నలు.. చెల్లెలు హరతి"


"ఏమనుకొన్నారు ఆమనీ!.."


"మన అల్లుడు.." నవ్వుతూ ఆగిపోయింది ఆమని.

"బంగారు.. బంగారు.. బంగారు.." అంటూ వీరవెంకటరావు.. దివ్య.. హారతి.. వారి వెనుక సుమతి నవ్వుతూ ఆ గదిలో ప్రవేశించారు.


"ఒరేయ్! విజయభాస్కరా!"


"చెప్పండి మామయ్యా!"


"హాస్పిటల్ శంకుస్థాపనకు ముందే మీ వివాహం జరిగిపోవాలి. రేపే ముహూర్తం పెట్టిస్తాను. వెళ్ళీ మా అమ్మానాన్నలను తీసుకొని వస్తాను.. నీవు నా కళ్ళు తెరిపించావురా.. విజయభాస్కరా!" అంటూ పశ్చాత్తాపంతో.. కన్నీటితో చేతులు జోడించారు వీరవెంకటరావు. వారి చేతులను పట్టుకొన్నాడు విజయభాస్కర్.


"మామయ్యా!.. ఈ చేతులతో మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మామయ్యా!" నవ్వుతూ చెప్పాడు.


ఆమని నెమ్మదిగా అతని ప్రక్కకు చేరింది. ఇరువురూ పెద్దలకు నమస్కరించారు.

పెద్దలు ముగ్గురు ఏకచిత్తంతో.. ఆ ఆమని విజయభాస్కర్‍లను మనసారా దీవించారు. ఇరువురి మధ్యన చేరి హారతి నవ్వుతూ అక్కా బావల చేతులు కలిపింది.

================================================================================

సమాప్తి

================================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page