top of page

ఆత్మీయత

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Athmiyatha' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

'ఆత్మీయత' తెలుగు కథ

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఢాం ఢాం గిన్నెల చప్పుడు పెద్ద పెద్దగా వినపడుతుంది. బాత్రూంలో స్నానం చేస్తున్న మనోజ్. పక్కింట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అనుకుని గబగబా స్నానం ముగించుకుని బయటకు వచ్చాడు.


వస్తూనే “అర్చనా.. ఒకసారి ఇలారా” అంటూ గట్టిగా పిలిచాడు. అర్చన రాలేదుకానీ ఆమె విసిరిన గిన్నె దఢాలుమని వచ్చి మనోజ్ కాలికి తగిలింది. కుయ్యో అంటూ వంట ఇంటివైపు చూసాడు.


‘అయ్యబాబోయ్.. ఇది మనింటి భాగోతమేనా! అయిపోయింది. అంటే ఈ రోజు నేను ఆఫీసునుండి లేటుగా వచ్చాను. వస్తూనే బాత్రూంలో దూరిపోయాను. అదన్నమాట ఈ విసరడాలు. తప్పుతుందా వెళ్ళి బ్రతిమాలు కోవడాలు అర్చన మూతి వంకలు తిప్పడం.. ఇవన్ని షరా మాములే కదా! కొత్తగా ఏదన్నా ఉంటే కనుక భయపడాలి’ అనుకుంటూ పిల్లిలా అడుగులో అడుగువేస్తూ అర్చన వెనకాల వచ్చి నిలుచున్నాడు.


“అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి.. తనొక్కడే కష్టపడి వస్తున్నాను అనుకుంటున్నాడా? ఇంతలేటుగా రావడమే కాకుండా పాటలు పెట్టుకొని అరగంట నుండి జలకాలాడుతున్నాడు, ఏం నేనొక్కదాన్నే తేరగా దొరికాను.. పిల్లలను చూస్తే చిన్నవాళ్ళు, ఇద్దరం కలిసి చెరొకపని చేసుకుందాము అని నెత్తి నోరు కొట్టుకున్నా రోజు ఇదే రామాయణం.


ఇక నావల్ల కాదు నేను ఉద్యోగం మానేసి చక్కగా ఇంటిపట్టున ఉంటాను, ” అంటూ మనోజ్ ను చూస్తూ రుసరుసలాడుతూనే కడిగిన గిన్నెలు బుట్టలో వేస్తుంది అర్చన.


తప్పు చేసినవాడిలా తల కిందకు వంచుకొని. “సారి అర్చన .. నేను కావాలనే లేటుగా రాలేదు డియర్, మా ఫ్రెండ్ సురేశ్ కు యాక్సిడెంట్ అయితే అందరం కలిసి హాస్పిటల్ కు వెళ్ళి చూసివస్తున్నాము, హాస్పిటల్ నుండి వచ్చాను అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? ముందు స్నానం చేసిరమ్మని మెడ పట్టి గెంటివేస్తావు అవునా? అందుకని స్నానానికి వెళ్ళాను అంతే కదోయ్” అడిగాడు అర్చన చుబుకం పట్టుకుని.


ఒక్కసారిగా చల్లబడిపోయింది అర్చన. “ఏమిటండి మీరనేది? సురేశ్ అన్నకు యాక్సిడెంట్ అయిందా? అయ్యో! ఇప్పుడెలా ఉంది, దెబ్బలు బాగా తగిలాయా? నాకు చెబితే నేను ఆఫీసునుండి అలాగే వచ్చేదాన్ని” అంది బాధపడుతూ.


“ఆ తగిలాయి కొంచెం బాగానే.. కాకపోతే ఎక్కడ ఎముకలు విరగలేదు అది సంతోషం, అదిసరే అర్చనా.. నీకు అంత తొందరెందుకు, నేను వచ్చాక ఇద్దరం కలిసి చేసుకుంటాము కదా! ఈ లోపల పిల్లల హోం వర్క్ చేయిస్తే అయిపోతుంది, ఈ మాత్రం దానికే ఓ నశాళానికి అంటే కోపంరావడం, ఆ కోపాన్ని దేనిమీద పడితే దానిమీద చూపెట్టడం ఇదేం బాగాలేదు అర్చన. ఎందుకంటే చూడు కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్న గిన్నెలన్ని ఎలా నొక్కులు పడ్డాయో, ” గిన్నెలు చూపెడుతూ అన్నాడు మనోజ్.


“ఏమిటోనండి .. మా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువయింది, ఒకరిమీద చాటుకు ఒకరు మాట్లాడుకోవడాలు ఇవన్ని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, ఇంటికి వస్తే బోలెడంతపని ఉంటుందాయే, ” అంది తలపట్టుకుని.


“అర్చనా .. పోని ఒకపని చేద్దామా? అడిగాడు మనోజ్. చెప్పండి అన్నట్టుగా తలెత్తింది.


“నేను చెప్పేది నువ్వు ప్రశాంతంగాను విను, మొత్తం వినకుండానే నామీద విరుచుకుపడకు సరేనా? మీ అమ్మ ఒక్కతే ఆ పల్లెటూరిలో ఉంటుంది కదా! మరి కొన్నాళ్ళపాటు ఆవిడను పిలుచుకుందాము, కనీసం ఇంతవంటచేసి పెట్టినా చాలుకదా! ఏమంటావు డియర్” అడిగాడు.


“బాగానే ఉంటుంది కానీ మా అమ్మ తెలిసిన వాళ్ళింట్లో వంటలు చేస్తుంది. అది వదిలి రమ్మంటే ఏమంటుందో, మన దగ్గరకు వస్తే ఆమెకు వచ్చే డబ్బులన్ని పోతాయి. ఆమె ఖర్చులకు ఎవరిస్తారు.. రేపేదైనా రోగమో నొప్పో వస్తే ఎలాగా” అంది అర్చన.


“అర్చనా.. ఏం మాట్లాడుతున్నావు నువ్వు .. ఆమె నీకన్నతల్లి. మరిచిపోయావా? ఆమెకు ఉన్నది నువ్వొక్కదానివే. మంచైనా చెడైనా చూడావలసిన బాధ్యత నీదికాదా? ఆమెకు

ఇప్పటినుండి మనమీద పడి ఉండడం ఇష్టంలేదంటే సరేలే అనుకున్నా, ” అన్నాడు అర్చన వైపు ఆశ్చర్యంగా చూస్తూ.


“ఆ.. ఆ అది ఇప్పుడు నేనేమన్నానని, ఆమెకు నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంది అన్నాను అంతేగాని, మా అమ్మ వస్తానంటే నేనెందుకు వద్దంటాను, రేపే అమ్మకు ఫోన్ చేసి రమ్మంటాను సరేనా, కాస్తా కాఫీ పెట్టండి తలనొప్పిగా ఉంది, ” అంటూ ఆ ముచ్చటను అక్కడితో ఆపేసింది. అర్చన మనసులో రకరకాల ఆలోచనలు జోరీగల్లాగ తిరుతున్నాయి.


తల్లిని పిలిపించుకోవడంలో ఆమె ఉద్దేశం అంతా వేరుగా ఊహించుకోసాగింది. మనోజ్ కు సంతోషంగా ఉంది. ఆమెకు అర్చన తప్పా ఎవరులేరు. కష్టమో సుఖమో మాతోపాటుగా

ఉండిపోతుంది అనుకున్నాడు.


“అమ్మా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా” అడిగింది అర్చన తల్లిని. అర్చన వాళ్ళమ్మ వంటచేసే వాళ్ళింట్లో ఫోన్ ఉంటుంది. ఆ నెంబర్ అడిగి తీసుకుంది ఎప్పుడన్నా తల్లితో మాట్లాడొచ్చని.


“ఆ బాగున్నానే తల్లి.. అల్లుడు పిల్లలు అందరు కులాసాగా ఉన్నారా, ఏమిటో రోజు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను, నాకేమో వాళ్ళ ఫోన్ నుండి చెయ్యరాదు రోజు వాళ్ళను అడుగుతుంటాను నువ్వేమైనా ఫోన్ చేసావా అని, ” అంది అర్చన తల్లి సుందరమ్మ.


“అయ్యో అమ్మా.. నేను కూడా రోజు అనుకుంటాను నీకు ఫోన్ చెయ్యాలని, ఏది ఒక్క క్షణం కూడా తీరిక దొరకడంలేదు, ఆఫీసు పని ఇల్లు పని చెయ్యలేక చస్తున్నాననుకో, ఏమిటో సంపాదన కోసం తిండికూడా సరిగా తినలేకపోతున్నానంటే నమ్ము,” అంది అర్చన.


“అయ్యో అలాగైతే ఎలాగే తల్లి, ఎవరైనా వంటావిడను పెట్టుకోకపోయావా? నేను చెబుతూనే ఉన్నాను, నువ్వు ఉద్యోగం చెయ్యకే పిల్లలను చూసుకో చాలు అన్నాను, అల్లుడు ఉద్యోగం చేస్తున్నాడు సరిపోతుంది ఎంతలో ఉంటే అంతలోనే సర్ధుకుంటే సరిపోతుంది” అంది సుందరమ్మ.


“నేనింత చదువు చదివి ఇంట్లో గిన్నెలు కడుగుతూ ఉండమంటావా? అమ్మా .. నీకు తెలియదు ఈరోజుల్లో పిల్లలను చదివించాలన్నా ఇల్లు కొనాలన్నా మా ఇద్దరి జీతాలు ఏ మూలకు సరిపోవు తెలుసామ్మా? ఖర్చులు చాలా పెరిగిపోయాయి ఇంకా వంటావిడనేం పెట్టుకుంటాము, అసలు పనిమనిషులే దొరుకుతులేరు నాకు, అన్ని పనులు నేనే చేసుకోవాలి” అంది బాధపడుతూ అర్చన.


“అదేమిటి అంత పెద్ద పట్నంలో పనివాళ్ళు దొరకరా” ఆశ్చర్యపోతూ అడిగింది.


“దొరకక కాదు.. మేము ఉదయం ఏడుకల్లా పిల్లలను వాళ్ళ ట్యూషన్ టీచర్ దగ్గర దింపి మేము ఆఫీసుకు వెళ్ళేసరికి టైం సరిపోతుంది, మళ్ళి వచ్చేసరికి ఏడయిపోతుంది అప్పుడు రమ్మంటే ఏ పనివాళ్ళు రామంటున్నారు” చెప్పింది అర్చన.


“అమ్మా నిన్నొకమాట అడగమన్నాడు మీ అల్లుడు, నువ్వెలాగు ఒక్కదానివే ఉంటున్నావు కదా! మందికి ఎవరికో వంటచేస్తూ కష్టపడుతున్నావు, మా దగ్గర ఉండి మాకు నీ చేతితో చేసి పెట్టొచ్చు కదా మీ అమ్మను అడుగు అన్నారు” అంది అర్చన.


“అర్చనా .. అల్లుడిగారు అడిగారా? ఎంతమాట ఆయన అడిగిన తరువాత నేను రాకుండా ఉంటానా చెప్పు? అయినా నువ్వు ఇబ్బంది పడుతుంటే నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు” నిష్టూరంగా అంది సుందరమ్మ.


“నీకు చెపుదామనే అనుకున్నా! నువ్వు బాధపడతావేమోనని చెప్పలేదు, ఆ నువ్వు ఎప్పుడు వస్తావు? ఆ ఇల్లు కూడా అమ్మేసి వచ్చావంటే మాతోపాటుగా ఇక్కడే ఉండిపోవచ్చన్నారు ఈయన, మేము రేపాదివారం వస్తాము అన్ని పనులు చేసుకొని వచ్చేద్దాము సరేనా అమ్మా” అడిగింది ప్రేమగా.


“అలాగేలే నాకు మాత్రం ఎవరున్నారు మీరు కాకపోతే ఎప్పటికైనా నీకు చెందవలసిందే” అంది సుందరమ్మ. అలా అన్నదే కానీ అర్చన దుడుకు స్వభావం తనకు తెలియనిది కాదు. నోటికి హద్దు పద్దు ఉండదు. తీరా అక్కడకు వెళ్ళాక ఇబ్బంది పడతానేమోనని ఆలోచించసాగింది సుందరమ్మ.


“అర్చనా.. మీ అమ్మతో మాట్లాడావా ఏమన్నది” అడిగాడు మనోజ్.


“అవును మీకు చెప్పలేదు కదూ! నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, తినడానికి కూడా టైం ఉండడంలేదు, కాస్త నువ్వు వస్తేనన్న నాకు చేదోడు వాదోడుగా ఉంటావు

కదా! మాకు మాత్రం ఎవరున్నారమ్మ నువ్వు కాకపోతే, అక్కడ ఒంటరిగా ఉంటూ మందికెవరికో చాకిరి చేసే బదులు, నీచేత్తో పిడికెడు ముద్ద మాకు పెడితే మేము సంతోషంగా ఉంటాము, నువ్వు మాతోనే ఉండాలి అన్నాను. తప్పకుండా వస్తాను అందండి” చెప్పింది అర్చన. తల్లితో మాట్లాడిన మాటలకంటే వేరుగా చెప్పింది.


“మరింకేం.. వచ్చే ఆదివారం వెళ్ళి తీసుకవద్దాము అర్చనా” అన్నాడు.


“అలాకాదు .. మనం వెళ్ళి రెండురోజులు అక్కడ ఉండి, ఇంటివిషయాలు అన్ని చక్కబరుచుకోని వద్దాము, మా అమ్మను మళ్ళీ ఆ పల్లెటూరుకు పంపిచేది లేదు” అంది.


“సరే మంచి ఆలోచననే కానీ! మీ అమ్మ ఉంటుందంటావా ఇక్కడ” అడిగాడు నమ్మకంలేక.


“మీకెందుకవన్ని నేను మా అమ్మను ఒప్పిస్తాను కదా!” అంది ధీమాగా.


అనుకున్నట్టుగానే సుందరమ్మ దగ్గరకు వెళ్ళి. ఆ మాటలు ఈ మాటలు చెప్పి మొత్తానికి ఇల్లు బేరానికి పెట్టింది అర్చన. ఇల్లంతా సర్ధేసి అవసరంలేని సామానంతా తీసివేసింది.

సుందరమ్మ ప్రాణం ఉసూరుమనసాగింది ఎన్నో ఏళ్ళనుండి తనను అంటిపెట్టుకున్న ఇల్లు సామాను పోతుంటే మనసంతా విలవిలలాడింది. అంతలోనే మనసు రాయిచేసుకుని ఎప్పటికైనా దాని దగ్గరకు పోవలసినదానినే. ఎప్పుడైతే ఏముందిలే అనుకుంది.


అర్చనకు తల్లి వచ్చినప్పటినుండి వంటఇంటి జోలికి పోవడం మానేసింది. “అర్చనా! మీ అమ్మ పెద్దావిడ కదా! పాపం పనంతా ఆవిడమీదనే వేస్తున్నావు, పోని పనిమనిషిని అయినా పెడదామంటే నువ్వు ససేమిరా అంటున్నావు, అక్కడ హాయిగా ఉన్నదాన్ని తీసుకవచ్చి పనంతా చేయిస్తున్నావు” నిష్టూరంగా అన్నాడు మనోజ్.


“అబ్బ మీకేం తెలియదు మీరూరుకోండి, మా అమ్మకు ఈ పనంతా అలవాటే, ఒంట్లో బాగాలేనప్పుడు ఎలాగు ఆమెకోసం మనిషిని పెట్టాలి, ఇప్పటినుండి ఖర్చు ఎందుకు

అయినా మా అమ్మేమి పరాయివాళ్ళకు చెయ్యడంలేదు, ఇలాంటి విషయాలన్ని మీరు పట్టించుకోకపోవడం మంచిది” గట్టిగా చెప్పింది భర్తతో.


ఛీ ఛీ ఏం మనిషో నోట్లో తలపెట్టడం పాపం. పెద్దావిడ అక్కడ ఒక్కర్తే ఉంటుందని ఎలాగైనా కూతురు దగ్గరకు వస్తుంది అనుకుంటే. ఆమెను బాగా ఉపయోగించుకుంటుంది అర్చన.

ఇలా చేస్తుందనుకుంటే ఆమెను రమ్మని అనకనేపోదును అనుకుంటూ తనలో తానే బాధపడసాగాడు మనోజ్.


సుందరమ్మకు గడియ తీరికలేదు గవ్వెడు ఆదాయం లేదన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. మనవడు మనవరాలు బాగా మచ్చికైనారు. అర్చనకు ఆఫీసు పనితోనే సరిపోతుంది ఇంటికి వస్తూనే తలనొప్పని లేకపోతే అలసిపోయానని కాఫీ తాగి కాసేపు పడుకుండిపోతుంది. మనోజ్ వచ్చాక సాయంకాలం ఏదైనా టిఫిన్ తింటాడని తయారుగా చేసి పెడుతుంది సుందరమ్మ.


అందరికి అన్ని విధాల చేసిపెడుతుండడంతో కాస్త ఒళ్ళుచేసారు ప్రశాంతంగా ఉంటున్నారు. ఎటొచ్చి సుందరమ్మకే తీరికలేకుండా పోయింది తిన్నవా ఆరోగ్యం బాగుందా అనే అడిగే నాథుడేలేడు. పొరబాటున మనోజ్ అడుగుదామని నోరు తెరిస్తే. మా అమ్మకేంటండి ఉక్కు శరీరం. వాళ్ళమ్మ వాళ్ళు అలా పెంచారు మా అమ్మను. అంటూ మాట దాటవేస్తుంది అర్చన. నోరెత్తలేక గమ్మున ఉండిపోతాడు మనోజ్.


“అర్చనా.. నాకు ఒంట్లో బాగుండడంలేదు, ఏమిటో కళ్ళు తిరుగుతున్నాయి ఎక్కడైనా పడిపోతానేమొనని భయంగా ఉంది, దగ్గరలో ఎవరైన డాక్టర్ ఉంటే తీసుకెళ్ళమ్మ” ఒకరోజు అడిగింది అర్చనను. వచ్చిన నాలుగేళ్ళనుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగానే ఉంది. వయసు మీదపడుతుంది విశ్రాంతి అనేదే లేకుండాపోయింది.


“ఏమైందమ్మా.. కళ్ళు తిరుగుతున్నాయా, పైత్యం అయిందేమో ఇదిగో ఈ అల్లం ముక్కలు చప్పరించు తగ్గిపోతుంది, నాకు ఆఫీసుకు సెలవులు లేవు తగ్గకపోతే అప్పుడు చూద్దాంలే” అంటూ గబగబా తల్లి చేసిన టిఫిన్ తిని వెళ్ళిపోయింది.


సుందరమ్మకు మనసు ఉసూరుమనిపించింది. ఒంట్లో ఓపికలేకపోయినా పిల్లలను తయారుచేసి స్కూల్ కు పంపింది. వాళ్ళు వెళ్ళగానే కళ్ళుమూసుకుని పడుకుందంటే

సాయంకాలం అర్చన వచ్చి లేపితేగాని లేవలేదు పాపం అంతగా అలసిపోయింది. మగతగా కళ్ళుతెరిచి చూసి. “అయ్యో .. నువ్వు ఆఫీసునుండి వచ్చేసావా అర్చనా?” అడిగింది కంగారుగా లేవబోతూ.


“అబ్బా అమ్మా.. నాకు తల పగిలిపోతుంది నీకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదుగాని, నాకు కాస్తా కాఫీఇవ్వు అయినా ఈవేళప్పుడు పడుకున్నావేంటి? ఇల్లంతా చిందరవందరగా

ఉంది సర్దాలి కదా? ఇంటికి ఎవరన్నా వస్తే ఏమనుకుంటారు” అంది రుసరుసలాడుతూ.


ఒక్కమాట మాట్లాడకుండా మౌనమే సమాధానం అన్నట్టుగా కళ్ళుమూసుకుని పడుకుంది మనసులో బాధపడుతూ.


“ఏంటి నాకు తలపగిలిపోతుందని చెప్పినా కూడా లేవడం లేదేంటమ్మా? ఈ రోజేంటి కొత్తగా చేస్తున్నావు, నీకు మీ ఊరిమీద మనసు పడిందా ఏంటి కావాలంటే నిన్ను మీ ఊరికి పంపిస్తాలే, ఈ మధ్యలో చాలా చూస్తున్నా నువ్వు ఏపని సరిగా చెయ్యడంలేదు, అయినా నీకు మాకంటే ఆ ఊరివాళ్ళే ఎక్కువయ్యారు, సరె సరె కానీ! పడుకున్నది చాలు లేచి నాకు కాఫీ పెట్టివ్వు” అంది రుసరుసలాడుతూ.


“అయ్యో తల్లి. అంత మాటలెందుకే.. నాకు లేచే ఓపికలేకనే ఇలా పడుకున్నాను, ఇప్పుడే నీకు కాఫీ పెట్టి తెస్తాను కోపానికి రాకు, ” అంటూ బలవంతంగా లేచి తూలుకుంటూ వెళ్ళి కాఫీ

తెచ్చి ఇచ్చింది. ఓరకంట తల్లిని గమనిస్తూనే ఉంది తప్పా కొంచెమైనా జాలిపడలేదు. పైగా తన ఆలోచనా సరళిలో వేగంగా ఆలోచించింది. భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా తననుకున్న విషయం వెంటనే అమలు చెయ్యాలని ఎదిరిచూసింది.


జవసత్వాలుడిగిపోయిన కన్నతల్లి లేవలేకా వంటచేస్తుంటే టీవి చూడడంలో మునిగిపోయిన అర్చన. భర్త రాగానే కమ్మగా పుల్లగా అమ్మచేసిన వంట తింటూ అమ్మ అనారోగ్యం గురించి ఆలోచించే మనసులేని కన్న కూతురిని చూస్తుంటే

కడుపు తరుక్కుపోయింది సుందరమ్మకు.


మర్నాడు ఉదయం సుందరమ్మను లేపి త్వరగా తయారవ్వు అని చెబితే ఎంతో సంతోషపడింది ఆ పిచ్చి తల్లి. తనంటే తన కూతురికి ప్రేమ ఉంది అందుకే తనను ఇంత పొద్దుటే హాస్పిటల్ కు తీసుకవెళతా అంటుంది. పాపం తనే కన్న కూతురి మనసు అర్ధం చేసుకోలేకపోయింది. మనసులో అనుకుంటూ నిస్సత్తువగా ఉన్నా లేచి గబగబా తయారయ్యి టిఫిన్ కాఫీ చేసిపెట్టింది. మనోజ్ తల్లితో మాట్లాడితే ఏం విషయం చెబుతాడోనని అతని వెంటే ఉండసాగింది అర్చన. పిల్లలను స్కూల్‌కు పంపించి తల్లిని తీసుకొని బయలుదేరారు.


“పిల్లలు మీరు వచ్చేవరకు అమ్మమ్మ ఉండదు కదా! అందుకని అమ్మమ్మకు దగ్గరగా రండి ఒకసారి, ” చెప్పింది అర్చన పిల్లలతో. పిల్లలు వచ్చి “ అమ్మమ్మ నువ్వు తొందరగా వచ్చెయ్యి” అంటూ ఇద్దరు గట్టిగా కౌగిలించుకుని వెళ్ళిపోయారు.


ఇదేమి అర్ధంకానీ సుందరమ్మ “అదేమిటే పిల్లలతో అలా చెప్పావు? వాళ్ళు చూడు ముఖాలు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయారు, నేను మళ్ళిరానేమోనని బాధపడుతూ వెళ్ళారు. పాపం వాళ్ళకు అలా ఎందుకు చెప్పావే” అడిగింది సుందరమ్మ.


“ఆ ..అది మనం వచ్చేవరకు సాయంకాలం అవుతుందనుకో వాళ్ళు ట్యూషన్‌కు వెళ్ళిపోతారు కదా! అందుకని అలా చెప్పాను పద పద టైం అవుతుంది” అంది తల్లి ముఖంలోకి చూడలేక.


హాస్పిటల్‌ కు వెళ్ళి డాక్టర్ కు చూపించాక అటునుండి అటే ఓల్టేజి హోమ్ కు తీసుకవెళ్ళారు. అక్కడున్నవాళ్ళందరిని కలుసుకుని తల్లిని పరిచయం చేసి తన కోసం ఇచ్చిన గదిలో తల్లిసంచి పెడుతూ. “అమ్మా .. ఇక నుండి నువ్వు ఇక్కడనే ఉంటున్నావు. నువ్వు పని చెయ్యలేకపోతున్నావు. మేము ఆఫీసుల వెళితే ఒక్కదానివే ఇంట్లో ఉండాల్సి వస్తుంది.

పొరపాటున మేము ఇంట్లో లేని సమయంలో నీకేమన్నా అయితే ఎంత కష్టం చెప్పు? అందుకే నీ అల్లుడు నేను ఆలోచించి ఇక్కడకు తీసుకవచ్చాము. వీళ్ళు చాలా బాగా

చూసుకుంటారమ్మా నిన్ను. మేము వారం వారం వస్తుంటాము. ఇదిగో నీ సంచిలో నాలుగు కొత్త చీరలు కొని పెట్టాను. పాతవి కూడా తెచ్చాననుకో. నీకు ఏ అవసరం వచ్చినా వాళ్ళను అడుగు సరేనా” అంటూ తల్లిని గట్టిగా కౌగిలించుకుని “మా అమ్మా బంగారం“ అంది వెళుతూ.


మనోజ్ తలెత్తి అత్తగారి ముఖంలోకి చూడలేక తలదించుకొని నిలుచున్నాడు.


“అర్చనా.. చాలా మంచిపని చేశావమ్మా, జవసత్వాలుడిగిన తల్లిని అక్కరలేదని చెప్పకనే చెబుతూ, అవతల విసిరి పడెయ్యకుండా మంచి చోటు చూపావు, నీకు చేసిన మేలు వృధాపోలేదు మంచి ఆలోచన చేశావు. కాకపోతే నువ్వు నాతో ఒక్కమాట చెబితే నేను నీకోసం దాచిన బంగారం డబ్బులు అన్ని నా మనవరాలికి, మనవడికి ఇచ్చి తృప్తిగా వచ్చేదాన్ని. చూడమ్మా.. నువ్వు భయపడిపోయావు కదూ! ఈ ముసలిది మంచాన పడితే డబ్బులు ఎవరు పెట్టుకుంటారు.. చాకిరి ఎవరు చేస్తారని భయపడిపోయావు కదూ! నీకా

భయమవసరం లేదు, ఎందుకంటే నీకు తెలియదు నేను చాలా డబ్బు కూడబెట్టుకున్నాను.

నీ గురించి నాకు బాగా తెలుసు కదా! నువ్వు చిన్నప్పటి నుండి అవసరపూర్తి మనిషివని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు కాదన్నానాడు నన్ను చూసుకోవడానికి మనిషి అవసరం. ఆ మనిషికి డబ్బులిస్తేనే కదా నన్ను చూసుకుంటారు? అందుకని, నేను మన ఊరిలో మన ఇంట్లో పని చేసే రత్తాలు చనిపోతే, దాని కొడుకు శీనును దత్తత తీసుకున్నాను. వాడు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాటిచ్చాడు.


నా డబ్బులన్ని వాడి దగ్గరనే ఉన్నాయి. నువ్వు ఇంట్లోలేని సమయంలో వాడు వచ్చి నన్ను కలిసి వెళుతుంటాడు. నాతో నీ అవసరం తీరిపోయింది కదా! కడుపున పుట్టిన నీకు నా ఉనికి భారమైంది, అనాథగా మారిపోతున్న శీనును నా కొడుకుగా తీసుకున్నందుకు దేవుడు నా మీద దయతలచాడు. ఈ పని నువ్వేప్పుడో చేస్తావని నాకు తెలుసు.

చాలా సంతోషం నువ్విక వెళ్ళొచ్చు.


బాబు మనోజ్! నీకు నామీద ప్రేమ ఉన్నా నా బిడ్డకు భయపడి నువ్వేమి చెయ్యలేని పరిస్థితని నాకు తెలుసు. నా బిడ్డ చేసినపనికి నువ్వెందుకు తలదించుకుంటావు నాయన.. నేనెక్కడున్నా బాగానే ఉంటాను. క్షేమంగా వెళ్ళండి” అంటూ గొంతు దుఃఖంతో పూడుకపోగా తలుపువైపు వేలు చూపెడుతూ అంది.


నోటమాట రాక తల్లివైపు చూస్తూ చేసిన చెడ్డపనికి సిగ్గుతో చితికిపోయింది అర్చన. తనెంత మూర్ఖంగా ఆలోచించిందో అర్ధమైంది. కన్నతల్లిని ఆనాథగా చేసినందుకు కుమిలి పోయింది. చదువు సంధ్యలు లేకపోయినా గొప్ప మనసుతో తల్లి చేసిన మంచిపనికి, అహర్నిశలు తన కోసం కష్టపడి చదువులు సంధ్యలు నేర్పిస్తే తనేం చేసింది. సంస్కారం మరిచిపోయి తలెత్తుకోలేని పని చేసింది. కన్నీళ్ళతో తల్లి పాదాలు కడిగిన అమ్మ మనసు మారదు నేను చేసిన పనికి.


“అమ్మా.. నన్ను క్షమించమని అడిగా అర్హత కూడా నాకులేదు, మళ్ళీ జన్మంటూ ఉంటే మంచి మనసుతో నీకు సేవచేసి ఋణం తీర్చుకుంటాను, ” అంది బోరుమని ఏడుస్తూ.


సుందరమ్మ కూతురిని దగ్గరకు తీసుకుని ఓదార్చలేదు. చూపుడువేలు ఇంకా తలుపువైపే పెట్టి ఉంచింది వెళ్ళిపోండి అన్నట్టుగా.


మారు మాటాడకుండా వెళ్ళిపోయారు అర్చనవాళ్ళు.

ప్రశాంతంగా మంచంమీద కూర్చొని సేదతీరిన మనసుతో ఆత్మీయతను పంచే కొడుకుగాని కొడుకు రాక కోసం ఎదురు చూస్తోంది.


॥॥ శుభం॥॥


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

105 views3 comments

3 Comments


@venkateshetukapally1976 • 20 minutes ago

nice

Like

@swapnaj8931 • 2 hours ago

Katha bagundi

Like

@ramyasree4789 • 7 hours ago

Nice story

Like
bottom of page