'Nerparithanam - New Telugu Story Written By Vemuri radharani
'నేర్పరితనం' తెలుగు కథ
రచన: వేమూరి రాధారాణి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
నేను సంపాదించగలననే నమ్మకం నాకు వుంది అని భర్తతో ధీమాగా చెప్పింది గానీ ఎలా అనే సంశయం పట్టుకుంది వాసుకి కి.
వాసుకి, వరుణ్ లది ప్రేమ వివాహం. వాసుకి తల్లిదండ్రులకు పెద్దగా అభ్యంతరం లేదు గానీ వరుణ్ తల్లికి పట్టుదల ఎక్కువ, తను చూసిన పిల్లనే చేసుకోవాలి అని. వరుణ్ తండ్రి కి అభ్యంతరం ఏమీ అనిపించలేదు వాసుకి వరుణ్ లకి పెళ్లి చేయడానికి. వాసుకి అందంగా ఉండడమే కాదు మంచి చదువు, సంస్కారం అన్నీ వున్నాయి. వరుణ్ వాసుకి ని తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోనాని చేసుకోనని పట్టుబట్టాడు.
ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది వరుణ్ తల్లి సువర్ణ. పెళ్లి కోసం వాసుకి నెల రోజులు సెలవు పెట్టింది. అత్తగారి ఇంట్లో పరిస్థితి చూస్తే అత్తగారికి కోడలు బయటకు పోవడం ఇష్టం లేదని అర్థం అయ్యింది. కొడుకు ఆమె కి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని తనంటే కోపం అత్తగారికి.
ఉద్యోగం అంటే ఇంకేమైనా వుందా అనుకుని, “ఏమండీ! మీరే అత్తయ్య ను ఒప్పించండి. మంచి జీతం, ఇంకో ఆరు నెలల్లో ప్రమోషన్ కూడా వుంది. ఉద్యోగం వదులుకోవడం ఇష్టం లేదు” అంది వరుణ్ తో.
“నేను చేస్తున్నాగా వసు, నువ్వు చేయడం అవసరమా.. అయినా నువ్వు చేయాలి అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ అమ్మ నీ మీద కోపంగా వుంది. ముందు ఆమె అభిమానాన్ని సంపాదించు. తర్వాత ఉద్యోగానికి ఒప్పించు. నేను ఏమీ చేయలేను ఈ విషయంలో” అంటూ చేతులెత్తేసాడు వరుణ్.
ఇక చేసేది ఏమీ లేక తానే ఏదో ఒకటి ఆలోచించాలి. ఎలా అయినా అత్తగారిని ఒప్పించాలి అనుకుంది. వాసుకి కి ఇంకో పదిహేను రోజుల సమయం వుంది. అత్తగారి దినచర్యని పరిశీలనగా చూసింది. ఇష్టాలను కనుక్కుంది. తన ప్లాన్ అమలులోకి తేవడానికి ప్రయత్నాలు మొదలెట్టింది.
అత్తగారి కంటే ముందే లేచి వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టింది. రెండు రోజులు చూసిన అత్తగారు మనసులో సంబర పడినా, అత్తగారి దర్పం చూపించాలిగా.. అందుకే “ఆ పిచ్చి గీతలేంటో, దాన్ని ముగ్గనంటారా” అంటూ సాగదీసింది.
పొద్దున్నే కోడలు వేడి వేడి కాఫీ ఇస్తుంటే పాపాయమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. ‘దేనికైనా అదృష్టం ఉండాలి వదినా.. కోడలు వచ్చింది అన్న సంతోషం లేదు. పొద్దున్నే కాఫీ కప్పుతో వస్తుందేమో అనుకున్నాను గానీ నేను కాఫీ కప్పు ఇస్తాననుకోలేదు’ అంటూ వాపోతుంది అప్పుడప్పుడు పక్కింటి పాపాయమ్మ. వాసుకి కాఫీ ఇచ్చేసరికి నేను అదృష్టవంతురాలినే అనుకుంది సువర్ణ.
“అత్తయ్యా! ఈ బాదం పప్పులు తింటే మీ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి” అంటూ నానబెట్టిన బాదం గింజలు ఇచ్చింది వాసుకి. మోకాళ్ళ నొప్పులతో ఎప్పటి నుండో బాధ పడుతోంది సువర్ణ. కోడలికి తన పైన వున్న శ్రద్ధ ని చూసి కోపం కాస్త తగ్గించుకుంది కానీ పైకి మాత్రం నటిస్తుంది.
భోజనాలు చేసేటప్పుడు మామగారు “కూరలు బాగున్నాయి” అనగానే “ఆ.. ఇన్ని రోజులు నేను వండినవి బాగలేవా? అయినా ఉప్పు, కారం లేని కూరలు తిన్నా, తినక పోయినా ఒకటే” అంటూ సాగదీసింది అత్తగారు.
“మామయ్య గారూ! మా మేనమామ ఇలానే మా అత్తని కోప్పడి రోజూ కారం, ఉప్పు ఇంత వేయించుకునే వారు. అసలే బి పీ అయ్యే! హార్ట్ అట్టాక్ వచ్చి మనమడు, మనమరాల్ని చూసుకోకుండానే చనిపోయారు పాపం. అసలే అత్తయ్యకి బి పీ. అందుకే కాస్త ఉప్పు, కారం తగ్గించాను” అంది వాసుకి.
కాస్త భయం అనిపించింది సువర్ణకి, ఇన్ని రోజులు ఈ విషయం తెలియకుండా ఎక్కువ తిన్నానే అని. భోజనాలు అయ్యి వరండాలో కూర్చున్నారు వాసుకి, అత్త గారు మామగారు. ఇంతలో పక్కింటి పాపాయమ్మ వచ్చింది తీర్థయాత్రల విశేషాలు చెప్పడానికి. ఆవిడ చెబుతూ ఉంటే అత్తగారు అలా నోరు తెరచి వింటుంది.
“పిన్ని గారూ బాగున్నారా” అంటూ పలకరించి కాఫీ కప్ ఇచ్చింది వాసుకి.
“యే యే స్థలాలు చూసారు పిన్నిగారు?” అని అడిగింది వాసుకి.
ఆవిడ చెప్పాక “అయ్యో! నేను ఉద్యోగం చేస్తే అత్తయ్యని మామయ్యని కూడా అలా పంపించాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది” అంటూ కాఫీ కప్ తీసుకుని లోపలికి వెళ్ళింది వాసుకి.
“వదినా! నీ కోడలు ఉద్యోగానికి వెళ్తే ఎంచక్కా మీరు ఇద్దరూ ఫ్రీగా తీర్థయాత్రలకి వెళ్లొచ్చు. ఉద్యోగానికి పంపరాదు?” అంది పాపాయమ్మ మెల్లగా.
“ఆ.. నేనేమన్నా వద్దన్నానా వెళ్తానంటే” అంది సువర్ణ.
వీళ్ళ మాటలు వింటున్న వాసుకి, ‘మంచి పని చేసింది పాపాయమ్మ’ అనుకుంది.
రాత్రికి భర్తతో “ఏమండీ! మీ వెనక సీటు రెడీ చేసుకోండి” అంది.
“అదేంటి.. మా అమ్మ ఇంత త్వరగా ఒప్పుకుందా?” అన్నాడు వరుణ్.
“లేదు కానీ రేపు మీరే చూద్దురు” అంది.
మరుసటి రోజు పొద్దున్నే వంట చేసి బాక్స్ సర్ది భర్తకు ఇస్తూ, “ఏమండీ! నాకు ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది ఉద్యోగంలో చేరమని. నేనే వద్దన్నాను. ‘మా అత్తగారికి మోకాళ్ళ నొప్పులు, బీపీ కూడా వుంది, నేను వస్తే చూసుకునే వాళ్ళు లేరు, నేనే దగ్గరుండి సేవలు చేస్తాను’ అన్నాను. అయినా వాళ్ళు పట్టుబడుతున్నారు. నేను ‘మా అత్తగారికి చెప్పకుండా మీకు మాట ఇవ్వలేను, రేపు చెబుతాను యే విషయం’ అన్నాను అంది అత్తగారికి వినపడేట్టు.
సువర్ణ గబగబా వచ్చి “కాళ్ళు నొప్పులు లేవు ఏమీ లేవు నాకు. నేను బాగానే వున్నాను. వాసుకి.. నువ్వు రేపటి నుండే జాయిన్ అవుతానని చెప్పమ్మా! ఇంట్లో పని నేను చూస్కుంటాలే. అయినా ఇంత చదువు చదివి ఇంట్లో కూర్చోడం దేనికీ.. నువ్వు వెళ్ళమ్మా” అంటున్న అమ్మని, వాసుకి నీ మార్చి, మార్చి ఆశ్చర్యంగా చూసాడు వరుణ్.
‘ఫర్లేదు అత్తగారిని బాగానే బుట్టలో వేసుకుంది’ అనుకున్నాడు వరుణ్.
నేను గెలిచాను అన్నట్టు గర్వంగా నవ్వింది వాసుకి.
***
వేమూరి రాధారాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
రాధా రాణి. వేమూరి
స్కూల్ ప్రిన్సిపాల్
కవితలు, కథలు వ్రాస్తాను. ఇంతకు ముందు వేరే మాధ్యమాలలో వ్రాసాను.
Comments