top of page
Writer's pictureA . Annapurna

అత్త అంటే స్నేహితురాలు


'Attha Ante Snehithuralu' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

”శనివారం మా ఇంటికి రావాలి మీరు ఇద్దరు .....” అంటూ నీలిమ ఫ్రెండ్స్ని పిలిచింది ఫోన్ చేసి.

''ఏమిటి విశేషం ? అన్నారు వాళ్ళు.

''సర్ ప్రైస్! చెప్పను. మీరువచ్చాక తెలుసుకోండి ....” అంది నీలిమ వాళ్ళని సస్పెన్స్లో పెట్టి.

''సరే! పిలిచాక రాకుండా ఉంటామా.....అలాగే !” అన్నారు వాళ్ళు .

శనివారం నీలిమ చెప్పిన టైముకి వచ్చారు చిత్ర, రేణు.

కాస్సేపు కబుర్లు అయ్యాక.... నలుగురికీ టీ స్నాక్స్ తీసుకుని వచ్చారు ఒకావిడ.

అందరికి ఇచ్చి తాను కూడా తీసుకుని సోఫాలో కూర్చున్నారు.

''ఈవిడ ఎవరనుకున్నారు? అడిగింది నీలిమ.

''ఇంతకుముందు మీ ఇంట్లో చూడలేదు. మీరు కూడా ఈవూరికి కొత్తగా వచ్చారు.మీ మదర్ని చూసాం

చెల్లిని తమ్ముడిని చూసాం. ఈవిడ నీకు అక్కగారో తోడికోడలో అనుకుంటాను అంది చిత్ర.

''అవును మీ అక్క ..” అంది రేణు.

''సరే కాసేపటికి తెలుసు కుంటారేమో చూద్దాం” అంటూ ఆవిడవైపు చూసి నవ్వింది నీలిమ.

''పోనీ ఆవిడ పేరు చెప్పు ...అంది చిత్ర.

''ఆవిడ పేరు సుజాత,! బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేసారు...ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు”

సుజాతగారి గురించి కొన్ని వివరాలు చెప్పింది.

అమాంతం వాళ్ళు ఆవిడపక్కన చేరి...''సుజాత గారు మీ శారీ చాల బాగుంది. ఎక్కడకొన్నారు? చాలా సింపుల్గా వున్నారు. జ్యూయలరీ వేసుకోలేదు. గోల్డ్ అంటే ఇష్టంలేని ఆడవారిని మిమ్మల్నే చూస్తున్నాం. బ్యాంక్లో గోల్డ్ లోను ఇస్తారుకదా! వంద గ్రాములకు ఎంత ఇస్తారు?” అంటూ ఊదర గొట్టేసారు.

''అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే చాల కష్టం. ఒకదానికి చెబుతాను. ఈ శారీ గుజరాతులో కొన్నాను.''

చెప్పింది సుజాత.

వాళ్ళకి అర్థం ఐనది. ఆవిడ మాటలుకూడా పొదుపుగా వాడుతుందని.

తిరిగి వెళ్లి వాళ్ళ సోఫాలో కూర్చున్నారు.

వాళ్ళు టీలు తాగేక ''నీలిమా! నేను గార్డెన్లో మొక్కలకి నీళ్లు పెడతాను....మీరు మాటాడుతూ వుండండి”

అంటూ కప్పులు, టిఫిన్ ప్లేట్లు తీసుకుని లోపలికి వెళ్ళిపొయిన్ది.

'' నీకు ఇంత సహాయం చేస్తున్నారు అంటే కచ్చితంగా నీకు అక్క లేదా కజిన్ అయి ఉండాలి..... నిజమేనా...?”

'' కాదు .. మీరు చెప్పలేక పోయారు. అయినా టైము ఇస్తాను. తర్వాత చెప్పండి. ..” అంది నీలిమ.

''నీలిమా! లాండ్రీ చేసిన బట్టలు ఎక్కడున్నాయి...ఐరన్ చేస్తాను…” వచ్చి అడిగింది సుజాత.

నీలిమ చెప్పాక '' డిన్నర్కి ఏమి చేద్దాం? రాకెష్కి, నీకు చనా బటూర ఇష్టం కదూ...సిద్ధం చేస్తాను”

అంటూ వెళ్ళిపొయిన్ది.

''అబ్బా నీలిమా ఎంత అదృష్టం నీది! ఒక్క క్షణం కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనేవున్నారు.

ఇలాటి బంధువుల వస్తే సంతోషంగా ఉంటుంది. మనకే పని చెప్పి అలసిపోయేలా చేసేవారు కొందరు వుంటారు. వాళ్ళని భరించలేం'' అన్నారు చిత్ర రేణులు .

''అవును .... సుజాత గారు నాకు అక్క కాదు కజిన్ కాదు .... అంతకంటే ఎక్కువ.... ఇంకా అర్థం కాలేదా?”

అడిగింది నీలిమ.

''చిన్నప్పటి ఫ్రెండ్ కావచ్చును.'' అంది రేణు నమ్మకంగా.

''మీరు ఓడిపోయారు.. … ఆవిడా మా అత్తగారు!” చెప్పింది నీలిమ వాళ్ళిక చెప్పుకోలేరని తెలిసి.

''ఆ …” అంటూ నోరువెళ్ళబెట్టి ఆశర్య పోయారు చిత్ర రేణు.

''అవును. మీరు ఎందుకు ఆశ్చర్య పోతున్నారు?” అడిగింది నీలిమ.

''అత్తగారు అక్కలా ఇంత మమకారంగా వుంటారా? మేం నమ్మలేక పోతున్నాం. ఆ హోదా, దర్పం,

ఓర్వలేనితనం, కోడలంటే పనిమనిషిగా చూడటం, కొడుకుతో చాడీలు చెప్పడం.. ఇలా వుంటారు

మా అత్తగారు. కల నిజామా అర్థం కావడం లేదు.''

''మీ ఇంటికి వచ్చినపుడు చూసాను. కొంత మీలోకూడా లోపం ఉందనిపించింది. అందుకే మిమ్మల్ని

పిలిచాను. '' అంది నీలిమ.

''సుజాతగారు చదువుకున్నారు. పెద్ద ఆఫీసర్గా పనిచేసారు. అందుకే డిగ్నిఫైడ్గ నిన్ను ఒక స్నేహితురాలిగా

చూస్తున్నారు.''

''అదొక్కటేకాదు. ఆవిడవైపు కాదు, మనం అత్తగారితో ఎలా ఉంటున్నాం అనేది కూడా ఆలోచించాలి. నా పెళ్లి అయినప్పటి నుంచి ఆవిడ అలాగేఉన్నారు. మా అమ్మ కూడా అత్తగారికి గౌరవం ఇవ్వాలి. స్నేహితురాలిగానూ భావించాలి… అని చెప్పేది.

మీ భర్త మీ అమ్మగారిని గౌరవించారా? అలాగే మనమూ అనుకోవాలి.

అన్నిటికి ఒకరికొకరం అడ్డు అని ఎందుకు భావించాలి.? వాళ్ళు అసలు చదువు లేనివారు కాదు..

అప్పుడు టెన్త్ చదివారు.

జనరేషన్ గ్యాప్ ఉండచ్చు. అంతమాత్రాన నిరసనగా చూడకూడదు.

కొన్ని అభిప్రాయం బేధాలు ఉండచ్చు. అమ్మతోనూ ఉంటాయి. అమ్మతో సర్దుకు పోతూ ఉంటాం

అదే అత్తగారిని శత్రువుగా ఏందుకు చూడాలి?

కలిసి పనులు చేసుకోడం కలిసి షాపింగ్ చేయడం సలహాలు ఆలోచనలు పంచుకోడం చేస్తే

వాళ్ళకి సంతోషంగా ఉంటుంది.నేను మా అత్తగారూ అలాగే ఉంటాం.మనలను చూసి మన పిల్లలు ఈ

మంచి నేర్చుకోవాలి.''అంటూ మృదువుగా చెప్పింది నీలిమ.

''మా అత్తలు సుజాతగారిలా ఉంటే మేమూ ఉంటాం. మళ్ళీ వస్తాం. నీ దగ్గిర నేర్చు కుంటాం” అంటూ వాళ్ళు లేచారు.

వాళ్ళు వెళ్ళాక సుజాత అడిగింది.. ''ఏమిటి నీలిమ...నీ ఫ్రెండ్స్ ని బెదరగొట్టేవు?

''లేదండీ … చిత్ర రేణు అత్తగారు ఏడాదికి మూడునెలలు వీళ్ళ దగ్గిరకి వస్తారు. పాతకాలం వాళ్ళు.

కొంత చాదస్తం ఉందనుకోండి. మూడు నెలలు ఎలాగో గడిపేసే దానికి ఏదో గొడవ పడుతుంటారు.

అందుకే మీరు వచ్చారని పిలిచాను. కళ్లారా మీరు నేను ఎలా ఉంటామో చూడాలని, వాళ్ళు నేర్చుకోవాలని.!”

అంది నీలిమ.

నెలరోజుల తర్వాత చిత్ర రేణు వచ్చారు మళ్ళీ.

అప్పుడు సుజాతతో ఫ్రీగా మాటాడేరు. ''మా అత్తగార్లు వస్తున్నారండీ మీరు ఇక్కడ ఉండగా మేము

రమ్మని చెప్పాము...... “ అన్నారు.

''అలాగా మీకు నావలన సంతోషం కలుగుతుందేమో ...చూద్దాం'' అంది సుజాత.

ఈసారి రేణు ఇంటికి వెళ్లారు సుజాత నీలిమా .

''రండి. ఇరుగో! మా అత్తగారు గంగాదేవి , చిత్ర అత్తగారు సత్యభామ గారు” అంటూ పరిచయం చేసింది...

రేణు.

''నాపేరు సుజాత. మనం ఇప్పుడు ముగురము ఒక స్టేటస్ .....అదే అత్తగారనే హోదా మనది. సరదాగా అన్నాను. వయసుతో వచ్చే వరుసలు తప్పితే అంతా స్నేహితులుగా ఉండాలి ఏమంటారు?” అంటూ

సరదాగా పరిచయం చేసుకుంది.

''నువ్వు చూస్తే చిన్నపిల్లవి. సిటీలో ఉంటావు. మేము పల్లెటూళ్ళో ఉంటాం. దేవుడు భక్తి...భజనలు

ఇరుగు పొరుగు కబుర్లు , గడిచిపోతుంది. ఇక్కడ మాకు తోచదు. మడి ఆచారం కుదరదు.....అంతా …”

అని ఏదో మాటాడబోయి నోరు అదుపు చేసుకుంది పేరుకి తగ్గట్టున్న సత్యభామగారు.

''గంగమ్మగారు.. మీరు ఏమంటారు? మీ వూళ్ళో మీరు ఏమిచేస్తారు?” సుజాత.

''ఏవరింట్లోనో పెళ్లి , మరో ఇంట శుభకార్యం ....ఊరగాయలు అప్పడాలు వడియాలు పిండివంటలు చేయడం ఆలా గడిచి పోతుంది. ఇక్కడ పిల్లల వంటలు పద్ధతులువేరు. తోచదమ్మ…” అందావిడ.

''అక్కడికి తగినట్టు అక్కడ ఉంటాం. ఇక్కడకి తగినట్టు ఇక్కడ ఉండాలి.. పిల్లలను వదులుకోము కదా !

మనం రావాలి అనుకునేట్టు మనం కోడళ్లతో కలిసిపోవాలి. మీకు ఇక్కడ ఒక పని కల్పిస్తాను

నాతోరండి....” అంది సుజాత.

''అవును అత్తయ్యగారు! వెళ్ళండి. మీకు నచ్చకపోతే మానేద్దురుగాని…” అంది చిత్ర.

''నువ్వు వెడితే నేను వస్తాను గంగా. ..'' అంది సత్యభామ. వాళ్లిద్దరూ అంతకుముందే తెలిసినవాళ్ళు.

''రెండురోజుల్లో మీరు నేను వెడదాం....” అంటూ టైము చెప్పి సిద్ధంగా ఉండమంది సుజాత.

నీలిమ సుజాత ఇంటికి వెళ్లిపోయాక .......

''ఇదేమిటీ ఎక్కడికో తీసుకెడతా అంటుంది? అక్కడ ఎవరు ఏలాటివారు వుంటారో....”

అన్నారు కోడళ్లతో గంగమ్మ సత్యభామ.

''మాకూ తెలియదు.వెళ్లి చూడండి....” అన్నారు వాళ్ళు.

సరిగ్గా రెండురోజుల తర్వాత సుజాత వచ్చి తీసుకెళ్లింది. అది చిన్నపిల్లల ఆసుపత్రి.

ఎవరూ లేని పసిపిల్లలను జాగ్రత్తగా చూస్తారు. ఎవరైనా దత్తత తీసుకోవచ్చు.

ముద్దులొలికే ఆ పిల్లలను చూడగానే మురిసిపోయారు సతభామ గంగా, సహజంగా వుండే మమతానురాగాలతో.

ఒకసారి ఆ పిల్లలు వుండే నాలుగు గదులను చూసారు. రోజులనుంచి ఏడాది వయసున్న పిల్లలువాళ్ళు.

ఏ తల్లి మనసు రాయి చేసుకుని వదిలేసిందో.... ఆతల్లికి తెలియకుండా వేరెవరైనా వదిలి వెళ్ళారోకాని.,

హృదయం కరిగిపోతుంది ఏ అమ్మకైనా.

''మనం ఏమిచేస్తాం ఇక్కడ?”అయోమయంగా అడిగింది గంగమ్మ

''మీఇష్టం. ఇక్కడ ఉదయంనుంచి సాయంత్రం వరకూ వీరి ఆలనా పాలనా చూడవచ్చు

లేదా కొన్ని గంటలు చూడవచ్చు. ఇక్కడే భోజనం చేయచ్చు కావాలంటే!”

చెప్పింది సుజాత.

''మరి...మా అబ్బాయి కోడలు ఏమంటారో …” సందేహంగా అడిగింది సత్యభామ.

''వాళ్ళకి చెప్పే తీసుకువచ్చాను. మీ ఇష్టం. ఇంటిదగ్గిర తోచడం లేదు అన్నారుకదా.... ఇక్కడకువస్తే ఎలావుంటుందో రెండురోజులు చూడండి.

ఇక్కడేవున్న వారు మీలాగా వచ్చిన ''నానీలు'' . నేను రెండేళ్లుగా వస్తున్నాను.''

చెప్పింది సుజాత.

''సరే చూద్దాం ! పాపం పసిపిల్లలలో లోనే దేవుడు వున్నాడంటారు.'' అంది గంగమ్మ.

నాలుగురోజులు కొత్తగా అనిపించినా మెల్లిగా అలవాటు అయి నాలుగు గంటలతో మొదలై ఎనిమిది గంటలు హాస్పటల్లో పిల్లలను చూసుకోడానికి సిద్ధపడ్డారు. డబ్బుకీ చేయచ్చు, ఫ్రీగానూ చేయచ్చు.

వాళ్ళకి డబ్బుకి లోటులేదు ....కనుక సేవ భావంతోనే మానవత్వంతోనే నానీలుగా చేరేరు.

సుజాత వలన వారిలోను చిత్ర రేణులలోను మార్పువచ్చింది. ఇప్పడు అత్తా కోడళ్ల మధ్య ఎలాటి గొడవలు లేవు. ఇంట్లో ప్రశాంతంగా ఉందని చిత్ర రేణూల భర్తలు సుజాతకి ఎన్నో కృతఙతలు చెప్పేరు.

పనిలేకపోతే ఏదో ఒక లోపం కనబడుతుంది . అదే పని కల్పించుకున్నవారికి అంతా బాగున్నట్టే ఉంటుంది.

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఏ పని అయినా చేయగలుగుతున్నారు చాలామంది.

కనుక వూరికే కాలం వృధా చేయకుండా చేత నైన సహాయం మనసుకి తృప్తి, శరీరానికి వ్యాయామం.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని ,చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....''ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.






.
















117 views0 comments

Comentarios


bottom of page