top of page

అవాక్కయ్యారా

#SudhavishwamAkondi, #Avakkayyara, #అవాక్కయ్యారా, #సుధావిశ్వంఆకొండి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు


Avakkayyara - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 14/05/2025 

అవాక్కయ్యారాతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


రోజూలానే కూకట్ పల్లి బస్టాప్ లో నించున్నాను. నేను మసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ లో పని చేస్తున్నాను. మరో ఆరు నెలల్లో రిటైర్మెంట్ అవ్వబోతున్నాను. 


బస్ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు చాలామంది. ఈ బస్సులు వస్తే వరుసగా వస్తాయి లేదంటే ఒక్కటీ రాదు. ఇంకో ఆరు నెలలు పడాలి అనుకుని స్థిమితపడ్డాను. కానీ అలా ఇంట్లో ఉంటే కూడా బోర్ కదా అనిపిస్తుంటుంది. కానీ ఏదైనా మన ఫీలింగ్ లోనే ఉంటుంది అనుకుంటాను. 


 అటాచ్మెంట్ గా ఉంటూనే డిటాచ్మెంట్ తో ఉండాలి అనేది నా అభిప్రాయం. ఎవరితోనైనా సరే! అప్పుడు మనకూ బాధ ఉండదు, అవతలవారికీ ఉండదు. 


పిల్లలు పెద్దవాళ్ళు అయి, పెళ్లిళ్లు అయి సెటిల్ అయ్యారంటే వారికి అనవసర సలహాలు ఇవ్వకూడదు. పిల్లలు అని ఏంటి, ఎవరికైనా సరే అడిగితే తప్ప సలహాలు ఇవ్వకూడదు. అప్పుడే అందరూ బావుంటారు అనేది నా నమ్మకం! కానీ నా భార్యకు ఎంత చెప్పినా తెలుసుకోవట్లేదు. ఏదో ఒకటి కోడలికో, కూతురుకో సలహా చెప్పడం మీకు తెలియదు అని కోడలూ, అలా కుదరదు అనవసర సలహాలు చెబుతావు అని కూతురూ విసుక్కోవడం తను నా వద్ద ఏడ్చుకోవడం పరిపాటి అయ్యింది. 


నేను బస్ కోసం చూస్తూ నిల్చున్నా! టైంకి రానే రావు కదా బస్సులు! అప్పుడే ఒక అందమైన అమ్మాయి కాలేజీ స్టూడెంట్ లా ఉంది వచ్చి బస్ కోసం నిలుచుంది. ఇంకాసేపటికి అందమైన కుర్రాడు వచ్చి నిల్చున్నాడు. రోజూ ఒకరు ముందు, తర్వాత ఇంకొకరు వస్తారు. రోజూ వీళ్ళిద్దరిని గమనించడం నాకు అలవాటు అయ్యింది. 


ప్రేమికులా అంటే ఆ అమ్మాయి ఏమీ మాట్లాడదు. ఈ అబ్బాయేమో ఆ అమ్మాయి వైపు దొంగచూపులు చూస్తుంటాడు, చిన్నగా కామెంట్స్ విసురుతుంటాడు. సీరియస్ అయినప్పుడు పట్టించుకుందాం అనుకుని ఊరుకున్నా! 


ఆ అబ్బాయి ఎంత ప్రయత్నించినా కానీ ఆ పిల్ల చాలా రోజులూ పట్టించుకోలేదు కానీ ఈ మధ్య ఆ అమ్మాయి కూడా చూస్తోంది. వీళ్ళిద్దరూ రోజూ నా బస్ లోనే వస్తారు. ఈ అమ్మాయేమో అమీర్ పేట్ లో దిగుతుంది. అతను మెహదీపట్నం వెళ్తాడనుకుంటా. 


ఈరోజు ఇంకా బస్ రాలేదు. ఇద్దరూ చూపుల పూలబాణాలు విసురుకుంటూ నిలబడ్డారు. ఆ అమ్మాయి చూస్తోంది అని మరీ రెచ్చిపోయినట్టున్నాడు ఆ కుర్రాడు. 

ఆ అమ్మాయి దగ్గరగా వెళ్లి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నాడు. 


ఆ అమ్మాయి పక్కకు ఓ పెద్దాయన వచ్చి, నిల్చున్నాడు. ఆ కుర్రాడిని గమనించి మందలించాడు.

 

"అలా ఆడపిల్లల్ని ఏడిపించొద్దు. చూస్తే చదువుకున్నవాడిలా వున్నావు. ఇదేం బుద్ధి నీకు?" అని గట్టిగా చీవాట్లు పెట్టాడు


ఇంతలో అప్పుడే వచ్చిన ఓ నలుగురు కుర్రాళ్ళు గమనించి.. 

"ఏంటి నాలుగు తగిలించమా? ఎందుకు టీజింగ్ చేస్తున్నావు ఆ అమ్మాయిని?" అంటూ హీరోల్లా ఫోజు కొడుతూ ఆ అబ్బాయి పైకి వెళ్లబోయారు.


ఇంతలో.. 

ఆ రూట్లో ఎటో వెళుతున్న పోలీస్ వ్యాన్ వచ్చింది. అందులోని ఎస్సై ఏదో గొడవ అవుతుందని అనుకున్నట్టున్నాడు. 


అందులోనుంచి ఆ ఎస్సై దిగి.. 

"ఏంటి గొడవ?" అంటూ ఆ నలుగురు కుర్రాళ్ళ వైపు తిరిగి

"ఈవ్ టీజింగ్ చేస్తున్నారా?" అన్నాడు తీవ్రంగా.


"అమ్మో! మాకేం తెలియదు సార్! ఇతను ఆ అమ్మాయిని టీజింగ్ చేస్తుంటే మేము బుద్ధి చెబుతున్నాం. అంతే!" అన్నారు వాళ్లు.


 "నిజమా!" వాళ్లతో అని,  "అయితే పదా స్టేషన్ కి!" అని ఆ అబ్బాయిని గట్టిగా లాగాడు ఎస్సై


 అప్పుడు ఒక తమాషా జరిగింది. అప్పటివరకు మౌనంగా ఉన్న ఆ అమ్మాయి.. 

"సార్! ఆయన్ని తీసుకెళ్లొద్దు. ప్లీజ్! మమ్మల్ని వదిలేయండి!" అంటూ ప్రాధేయపడింది. ఆమె కళ్లలోనుంచి నీళ్లు కారిపోతున్నాయి. 


"ఏంటి లవ్వా! ఇంట్లో మీ అమ్మానాన్నలు చదువుకొమ్మని పంపిస్తే ప్రేమా, దోమా అంటూ ఇలా పిచ్చి వేషాలు వేస్తారు. మీకు బుద్ధి రావాల్సిందే! ఇద్దరూ పదండి స్టేషన్ కి. మీ అమ్మానాన్నలను పిలిపించి వార్నింగ్ ఇస్తా. పదండి!" అంటూ వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా వినకుండా లాక్కెళ్లారు పోలీసులు 


"చదువుకొమ్మని పంపిస్తే పిల్లలు బరితెగించి పోయారండీ! కనీసం ఆ తల్లిదండ్రులకూ బుద్ధి లేదు! పిల్లలు ఏం చేస్తున్నారు, చక్కగా చదువుకోవడానికే వెళుతున్నారా? ఏమైనా వెధవ వేషాలు వేస్తున్నారా? చూసుకోనక్కర్లేదా? అటు చదువుచెప్పే మాస్టర్లకూ జ్ఞానం లేదు! జీతం చదువు చెప్పి, వెళ్లిపోతుంటారు. మంచి, చెడు చెప్పాలా, వద్దా? పిదపకాలం! పిదప బుద్దులూనూ!" అంటూ అక్కడున్న పెద్దవాళ్ళు తమకు తోచిన విధంగా దేశంలోని యువతనంతా తిట్టిపోశారు. 


 "అయినా ప్రేమించుకుంటే తప్పేంటి? తరతరాలుగా ప్రేమికులను విడదీస్తుంటారు ఈ పెద్దలు. పాపం ఆ జంట పోలీస్ స్టేషన్ లో ఏం కష్టపడుతున్నదో? కొన్నిసార్లు పోలీసులే ప్రేమ పెళ్లిళ్లు చేస్తారుగా! అలానే వాళ్ళ పెళ్లి జరిగితే సూపర్ ఉంటుంది!" అని అక్కడున్న యువత మాట్లాడుకుంటూ నిలబడి వున్నారు. 


 అందరిని గమనిస్తూ నేను మాత్రం ఏమీ మాట్లాడకుండా నిలుచున్నాను. నా ఆలోచనలో నేనున్నాను. ఇంతలో బస్ వచ్చింది. 


@@@@@@


మరునాడు బస్టాప్ కి వచ్చినప్పుడు.. 

"పాపం వాళ్ళ పరిస్థితి ఏమిటో? ఇవాళ్టి నుంచి ఇక వాళ్ళు కనిపించరు కాబోలు!" అనుకుంటున్నాను. 


ఇంతలో.. 

ఆ జంట కలిసి, నవ్వుకుంటూ నడుచుకుంటూ వస్తోంది. ప్రతిరోజూ ఆ అమ్మాయి వచ్చాక కాసేపటికి అబ్బాయి వచ్చేవాడు లేదంటే అబ్బాయి వచ్చాక కాసేపటికి అమ్మాయి వచ్చేది. 

కానీ ఈరోజు కలిసి నడుస్తూ వస్తున్నారు. 


'ఏంటి చెప్మా! ఇలా ఇద్దరూ కలిసి వస్తున్నారు. ఒకవేళ పెద్దలను పిలిపించి, పోలీసులే పెళ్లి చేసారేమో!' అనుకుని, నాతో పాటుగా రోజూ వచ్చేవాళ్ళూ చూస్తున్నారు ఆశ్చర్యంగా ఆ జంట వైపు. 


వాళ్ళు వచ్చి నిలుచున్నాక ఉబలాటం ఆపుకోలేక.. 

"పోలీసులు మీ ఇద్దరికీ పెళ్లి చేశారా? మీ అమ్మానాన్నలను పిలిచి ఒప్పించారా పెళ్లికి?" అని అడిగాను కుతూహలం కొద్దీ.


అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం విని అక్కడున్న వాళ్ళందరూ అవాక్కయ్యారు. 


ఇంతకీ అసలు కొసమెరుపు విషయం ఏమిటంటే.. 

వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళ పెళ్లై నాలుగు నెలలు అయ్యిందట. ఆ అబ్బాయికి ప్రేమించి పెళ్ళిచేసుకోవాలని కోరికట. కానీ వీలు కాలేదు. ఆ అమ్మాయిది కూడా అదే కోరిక. తను కాలేజీ ప్రిన్సిపాల్ కూతురు. అందుకని తనకు ఆ ఛాన్స్ రాలేదుట. 


పెళ్లయ్యాక వీళ్ళిద్దరూ మాట్లాడుకుని, కొన్నాళ్ళు ఇలా ప్రేమించుకుందామని అనుకున్నారట. పోలీసులకు ఈ విషయం చెప్పి, సెల్ ఫోన్ లో ఉన్న పెళ్లి ఫోటోలు చూపించిన తర్వాత నమ్మి, నాలుగుతిట్టి అప్పుడు వదిలారట!" ఈ లవ్ స్టోరీ వినగానే నేనూ అవాక్కయ్యాను. 


అదీ సంగతి.. 


-సుధావిశ్వం





bottom of page