top of page

పాచిక

#KiranJammalamadaka, #జమ్మలమడకకిరణ్, #Pachika, #పాచిక, #TeluguCrimeStory, #మానసికసంఘర్షణ


Pachika - New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka

Published In manatelugukathalu.com On 14/05/2025

పాచిక - తెలుగు కథ

రచన: డా: కిరణ్ జమ్మలమడక 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



11 ఏళ్ళ ఇషా "అమ్మా కాటన్ ఇవ్వు "అని అడిగింది వాళ్ళ అమ్మ సుభద్రని. 


వద్దన్నా తన భర్త అశోక్ ఈ బంగ్లా కొని తాను మాత్రం ఢిల్లీ లో కూర్చున్నాడు అని, చిరాకుతో వుంది సుభద్ర. 

"కాటనా? ఎందుకు దెబ్బ తగిలిందా? " అని అడిగింది ఆ చిరాకుతోనే. 


"లేదు, చెవుల్లో ఏవేవో విష్పర్స్ లాగ సౌండ్స్ వొస్తున్నాయి "


అప్పుడు సుభద్ర అంతగా పట్టించుకోలేదు, "సరే బాత్రూం లో అల్మారాలో వుంది చూడు, అలానే ఆ గీజర్ కూడా ఆఫ్ చెయ్యి " అంది. 


ఇది జరిగిన రెండు రోజులకి, సుభద్రకి కూడా లీలగా యేవో గుసగుసలు వినపడటం మొదలుపెట్టాయి, మొదట తన భ్రమ అని కొట్టిపారేసింది కానీ రోజులు గడిచేకొద్దీ, గుసగుసలు సంభాషణల వలె పెద్దవిగా మారాయి. అప్పడప్పుడు ఇషా కూడా అదే కంప్లైంట్ చేయటంతో ఒకేసారి ఇద్దరికీ ఎందుకు ఒకేలాంటి భ్రమ కలుగుతుందని కొంత సందేహపడినా పెద్దగా పట్టించుకోలేదు సుభద్ర. 


ఒక సాయంత్రం, సుభద్ర చదువుకుంటున్నప్పుడు, ఆమె తన కంటి మూలలో నుండి నీడలను చూసింది. తల తిప్పి చూస్తే ఫర్నీచర్ మరియు షెల్ఫ్‌లు తప్ప మరేమీ కనిపించలేదు. అయినప్పటికీ, ఆ నీడలు కొనసాగుతూనే ఉన్నాయి, ఆమె దృష్టి అంచున నృత్యం చేస్తూ, అనిర్దిష్ఠమైన అశాంతి భావాన్ని పెంపొందిస్తున్నాయి. 


ఆ మర్నాడు, ఇషా కి, విపరీతమైన తలనొప్పి రావటం మొదలు పెట్టింది. అది తగ్గక పోయేసరికి ఆమె పని మనిషి సాయంతో డాక్టర్ ని కలవడానికి వెళ్ళింది. ఆ డాక్టర్ కొన్ని కంటి పరీక్షలు చేసి, టీవీ తగ్గించమని, ఎక్కువ వెలుగులో ఉండమని సలహా ఇచ్చి, కొన్ని విటమిన్ మాత్రలు, బలం టానిక్కు ఇచ్చాడు.


ఇంటికి తిరిగి ఒస్తుండగా ఆ పనిమనిషి  "నా మాట విని దిష్టి తియ్యండమ్మా! " అని చెప్పింది. 


ఆ మాట కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా, మనిషి, భయపడినప్పుడు శారీరకంగా, మానసికంగా బలహీనపడతాడు, తనకి పెద్దగా నమ్మకం లేకపోయినా, తప్పు ఐతే కాదు కదా ప్రయత్నిద్దామని తన సాయంతో ఆ దిష్టి కార్యక్రమం కూడా పూర్తి చేసింది. మర్నాడు తాను మామూలుగానే స్కూల్ కి వెళ్ళటం తో సుభద్ర ఊపిరి తీసుకుంది, తనకి కూడా ఆ తలనొప్పి రావటం గమనించింది కానీ పెద్దగా పట్టించుకోలేదు. 


ఆ రోజు రాత్రి అవే ఆలోచనలతో సుభద్ర, ఆమె కూతురు, ఇషా పడుకున్నారు.

సుభద్రకు, ఆ గుసగుసలు మరింత గట్టిగా వినపడసాగాయి. మరలా ఆ నీడలు తనకు కనపడుతున్నాయి. తనకు ఏమి చెయ్యాలో అర్థంకావటంలేదు. ఇంక తప్పక, పనిమనిషికి ఫోన్ చేసి రమ్మని అడిగింది ధైర్యం కోసం.  పనిమనిషి వెంటనే వొచ్చింది. అందరూ కలిసి హల్లో పడుకున్నారు. ఇందాకటంత తీవ్రంగా లేకపోయినా ఇంకా ఆ అలోచనలు, ఆ గుసగుసలు వీడిపోలేదు సుభద్రను. 


రోజులు వారాలుగా మారేకొద్దీ సుభద్ర ఆలోచనలు విచ్చలవిడిగా మారాయి. ఆమె చూపు మందగించింది. సుభద్ర చాలా చిన్న పనిని కూడా గుర్తుంచుకోవడానికి కష్టపడుతోంది. మనస్సు అంతా, గందరగోళంతో నిండిపోయింది. ఒకప్పుడు కేవలం భ్రమలుగా ఉన్న నీడలు ఇప్పుడు తన చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంక తప్పేటట్టులేదని, తన తమ్ముడు, అతీత్ కి ఫోన్ చేసి విషయాలు ఏమి చెప్పకుండా ఊరికే ఒంటరిగా బోర్ కొడుతోందని, ఇషా అడుగుతోంది అనే మిషతో రమ్మనిచెప్పింది. 

***

"హాయ్ అక్కా !" అని అంటూనే, అతీత్ ఇషా ని ఎత్తుకున్నాడు. 


ఒక చిన్న నవ్వు నవ్వింది సుభద్ర.

"అదేంటి అక్కా! ఇలా అయిపోయావు, అన్నం తినటంలేదా ? మొహం అంతా అలా నల్లగా అయిపోయింది " అన్నాడు కంగారుగా.. 


"ఏంలేదు చెపుతా పద" అని ముందు ఇంటికి పద భోజనం చేద్దువుగాని అని తొందరపెట్టింది. 


అందరూ కార్ లో బయలుదేరారు. 

"కుశల ప్రశ్నలు అయ్యాక, చెప్పు అక్కా ఏమైంది " అని అడిగాడు అతీత్. 


దానికి ఇషా "మా ఇంటిలో దెయ్యం వుంది, అది మాతో మాట్లాడుతుంది కూడా.. ఇంకా అమ్మకి అప్పుడప్పుడు కనపడుతుంది " అని ఇషా అనగానే, సుభద్ర ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది. 

"ఇషా ! " అని గట్టిగా అరిచింది, ఎవరు చెప్పారు నీకివన్నీ అని అడిగింది.


దానికి అతీత్ "ఇషా జోక్ చేస్తోంది, మనల్ని భయపెట్టటానికి అవునా ఇషా ?" అని అన్నాడు.


ఇషా, “లేదు అతీత్ మామ!, నిజంగానే, నాకు రోజు మాటలు వినపడతాయి. అమ్మకి, కనపడతాయని, మా పనిమనిషి చెప్పింది " అనగానే ఇషా కి ఈ విషయాలు ఎలా తెలిసియో తెలిసింది సుభద్రకు. అతీత్ కి, విషయం పూర్తిగా అర్థం కాలేదు, ఇంకా ఏవోవో ప్రశ్నలు అడగబోయాడు అతీత్ ఇషా ని, ఇంటికెళ్లి మాట్లాడుకుందాం అని సుభద్ర టాపిక్ డైవర్ట్ చేసింది. 

***

"అక్కా చెప్పు ఏం జరిగింది ?” అడిగాడు అతీత్. 


"ఏమో రా, నాకూ ఏమి అర్థం కావటం లేదు, ఇషా చెప్పింది నిజం, నాకు రోజు చిన్న గా గుసగుసలు వినపడుతున్నాయి, రోజంతా, ఏవేవో ఆకారాలు కనపడుతున్నాయి, మొదట బెడ్ రూమ్ లో వున్న పెద్ద పెయింటింగ్ నల్లగా భయంకరంగా అయిపోయింది, దాన్ని స్టోర్ రూమ్ లో పెట్టాము. 


మా పనిమనిషేమో, ఎవరో మంత్రగాడు వున్నాడు వాడు చిటికెలో వెళ్లగొడతాడు, బాగుచేస్తాడు అని అంటోంది. వాళ్ళ ఊరిలో చాలా మందికి బాగుచేసాడంట. అతడిని తీసుకొస్తాను అని అంటోంది. ” 


 దానికి అతీత్ ఫక్కున నవ్వి "అక్కా, నువ్వు మొదటగా చూడవల్సినది ఒక సైకియాట్రిస్ట్ ని, అంతే గాని యిలా దెయ్యాలు భూతాలు అని నమ్మటం కాదు " అన్నాడు.


వెంటనే, సుభద్ర "నాకు ఆ విషయం తెలియదంటావా, నేను సైక్రాయిస్టుని కలవలేదు అనుకుంటున్నావా, ఆ ప్రయత్నం కూడా అయ్యింది " అంది.


"మరి ఏమన్నాడు సైక్రాయిస్టుని కలిసినప్పుడు "


"అవన్నీ భ్రమలే అని, ముందు కొంత కౌన్సెలింగ్ ఇచ్చాడు. కానీ తరువాత ఇంకా రిపీట్ అవ్వటం, మరలా ఇంకా ఎక్కువ అవ్వటం వలన, స్కిజోఫ్రెనియా అని కొన్ని మందులు ఇచ్చాడు "


"మరి ఏమి ప్రయోజనం కనపడలేదా ?"


"లేదు, రోజు రోజుకూ, మరింత దిగజారుతూ వొచింది నా పరిస్థితి "


"మరి బావ అశోక్ కి చెప్పలేదా ?"


"అశోక్ ఎక్కడో వున్నాడు, పైగా డాక్టరుకే ఇంకా నా పరిస్థితి అర్థం కావటంలేదు, ఇంకా అశోక్ ఏమిచెయ్యగలడు, వెంటనే రావటం తప్ప.. సరే నిన్ను ఒక సారి కలిసి నీతో ఒక మాట చెప్పి అశోక్ కి చెపుదామని " అని చెప్పింది సుభద్ర తలదించుకుని, కళ్ళలో ఉబికివొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ. ఆ రాత్రి, అతీత్, సుభద్రతో పాటే అదే గదిలో పడుకున్నారు. 


అర్థరాత్రి, సుమారు మూడు గంటలకు, అతీత్ కి ఎందుకో మెలుకువవొచ్చి చూసే సరికి సుభద్ర బిగుసుకుకుపోయీ.. తల అడ్డంగా ఊపుతోంది, ఊపిరి అందుతున్నట్టులేదు. కళ్ళు తెరిచే వున్నాయి కానీ నోటమాట రావటం లేదు. ఆందోళనకరంగా వుంది. సుభద్రని నిద్రనుండి లేపే ప్రయత్నం చేసాడు కానీ సుభద్ర ఈ లోకంలోలేదు. ఊపిరి అందడంలేదని అర్థమయ్యింది. అతీత్, వెంటనే పక్కన వున్న ఇషా ని నిద్రలేపి, సుభద్రని ఇంటి బయటకు తీసుకువొచ్చాడు.


వెంటనే అక్కడ వున్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థిని గమనించిన ఎమర్జెన్సీ డాక్టర్లు, వెంటనే ఆక్సిజన్ పెట్టారు.కావలిసిన పరీక్షలు చేశారు.  ప్రత్యేకంగా ఏది కారణం అని ఎవరు చెప్పలేకపోయారు. అసలే నీరసముగా వుంది. బాగా బలహీనపడటం వలన ఇలా ఫిట్స్ లాగ వొచ్చాయేమో అని చెప్పారు. కొన్ని పరీక్షలు కూడా చేయించమని చెప్పారు. ఇంక లాభంలేదని, హాస్పిటల్ కి దగ్గరలో ఒక హోటల్ లో రూమ్ తీసుకొని, ఇషాని  అక్కడ ఉండమని చెప్పి, కొంతసేపటికి అతీత్ మరలా సుభద్ర దగ్గరకు వొచ్చాడు. తాను మెల్లిగా ఒక రెండు గంటలకు తేరుకుంది. పక్కనే వున్న అతీత్ ని చూసి, చిన్నగా నవ్వింది. 


"అక్కా ఏమైంది ?" అడిగాడు అతీత్. 


"ఏమో రా ఇలా ఎప్పుడూ జరగలేదు. ఎవరో గుండెలపైనా కూర్చొని ఉన్నట్టు అనిపించింది. ఊపిరి సరిగా ఆడటంలేదు. నోరు పెగలలేదు ఎవరో గొంతు నొక్కేస్తున్నట్టు అనిపించింది "


ఇంతలో డాక్టర్ వొచ్చి, వైటల్స్ బాగానే వున్నాయి, స్ట్రెస్ అవచ్చు, కొన్ని పరీక్షలు చేద్దాం, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లిపోండి అని డాక్టర్ చెప్పగానే, అతీత్ మనసు కుదుటపడింది. కానీ సుభద్ర మోహంలో చిన్న అలజడి కనిపించింది.

 

అది గమనించిన అతీత్  "అక్కా, పక్కనే వున్న హోటెల్లోనే ఇంకొన్ని రోజులు ఉందాం. నేను వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా.. నువ్వు వర్రీ అవ్వకు " అని చెప్పి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి హోటల్ రూమ్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఇషా ని గట్టిగా కావిలించుకొని, కాసేపు నిద్రపోయింది సుభద్ర. ఇంతలో తెల్లవారటం తో, ఇషా ని, సుభద్ర ని అక్కడే ఉండమని చెప్పి అతీత్, ఇంటికి బయలు దేరాడు. 


మొదట ఆ స్టోర్ రూంలో పెట్టిన పెయింటింగ్ ని పరిశీలించాడు అతీత్. ఆ పెయింటింగ్ తో పాటు మరికొన్ని పైంటింగులు అలా నల్ల రంగులోకి మారి కొంచెం భయంకరంగానే వున్నాయి. ఇల్లంతా,  ప్రతి గది కలియతిరిగాడు. ఏమి అనుమానాస్పదంగా కనపడలేదు. నిజానికి అతీత్ దేనికోసం వెతుకుతున్నాడో తనకే తెలీదు. 


ఇంతలో, అలసిపోయిన అతీత్, నేను వెళ్లి స్నానం చేసి వొస్తాను, వేడినీళ్లు రెడీ చెయ్యమని చెప్పాడు. దానికి పనిమనిషి అవి ఎప్పుడూ రెడీనే అని అంది. 


స్నానం చేసి వోచిన అతీత్, ఆ గది అంతా వెతకడం మొదలుపెట్టాడు. ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని.. కానీ యెంత వెతికినా అతీత్ కి ఎలాంటి క్లూ దొరకలేదు. పైగా తలనొప్పి రావటం మొదలుపెట్టింది. 


అక్క చెప్పిన లక్షణాలను బట్టి ఇది ఒక సైకలాజికల్ డిసార్డర్ అని అనుకున్నాడు. స్చిజోఫ్రీనియా కి సంబంధించిన మందులు కూడా వాడింది అని తెలియగానే, ఇది మానసిక సమస్య కాదని, అర్థం అయ్యింది. తనలో తానె తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాడు అతీత్.


"ఈ ఇంటిలో ముగ్గురు వున్నారు, అందులో పనిమనిషికి పెద్దగా ఏమి ఎఫెక్ట్స్ లేవు/ ఎందుకంటె ఆమె ఇక్కడకు ఎక్కువ రాదు. వొచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది. ఇంకా ఇషా, అక్క సుభద్ర..

ఇషా కూడా ఎక్కువ సేపు ఈ గదిలో ఉండదు, తాను రోజు స్కూల్ కి వెళ్ళిపోతుంది ఎక్కువ సేపు బయటే ఉంటుంది. ఇంకా అక్క సుభద్ర మాత్రం ఇక్కడే ఉంటుంది, ఈ గదిలోనే "


పనిమనిషి ని పిలిచి, ఆ గ్యాస్ గీజర్ ఆఫ్ చెయ్యి, అసలే గ్యాస్ ధర పెరిగిపోయింది అన్నాడు. 


“అశోక్ గారు.. గ్యాస్ గీజర్, అమ్మగారి బాత్రూమ్ లో  పైన పెట్టించారు. ఎప్పుడూ వేడినీళ్లు రావాలని గీజర్ కు స్విచ్ పెట్టించలేదు" అని చెప్పింది. 


అతీత్ కి, అది కొంత ఆశ్చర్యం కలిగించింది. బావ మరీను, యెంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా 24 లు వేడి నీళ్లు రావాలని స్విచ్ లేకుండా చేస్తాడా ? అని ఆలోచిస్తూ వుండగానే అతనికి ఒక విషయం తట్టింది. 

అదే " గ్యాస్, గ్యాస్ లీక్.. "


వెంటనే అక్కకి ఫోన్ చేసాడు, " అక్కా నీకు COHgb టెస్ట్ చేశారా ? " అని అడిగాడు. 


" COHgb ? అదేంటి.. ఇంకా అంతా డిటైల్డ్ గా చూడలేదు, ఇప్పుడే రిపోర్ట్స్ వొచ్చాయి.. చాలా పేజీలు ఉంటే ముఖ్యమైనవి మాత్రమే చూసా "


" ఒకే. చేయక పొతే వెంటనే చెయ్యమని చెప్పు, నేను అన్ని వివరంగా చెపుతా" అన్నాడు.

వెంటనే, తాను, ఇంటి వెనక అమర్చిన ఆ గ్యాస్ గీజర్ వున్న చోటికి వెళ్లి, ఆ పైపులను గమనించసాగాడు. ఆ పైపులను వెంబడించగా, సరిగ్గా బాత్రూం కిటికీ దగ్గర ఒక జాయింట్ చుట్టూ పసుపు మరకలు ఉండటం గమనించాడు. 


వెంటనే పనిమనిషికి ఫోన్ చేసి, గీజర్ బాగు చేసేవాడిని, రమ్మని చెప్పాడు. 

ఇంతలో, సుభద్ర దగ్గరనుండి ఫోన్.. 


" నువ్వు చెప్పాక COHgb టెస్ట్ చేశారురా.. , 12 % అని చూపిస్తోంది "


"నార్మల్ యెంత ?"


“2% కంటే తక్కువ” అంది సుభద్ర షాక్ లోనే. 


"ఇక్కడ గీజర్ లీక్ అవుతోంది, అందులోనుండి కార్బన్ మోనాక్సైడ్ మెల్లిగా లీక్ అవుతోంది. అందువలనే నీకు ఇదంతా . వెళ్లి డాక్టర్ ని కలువు, నేను ఇది బాగుచేయిస్తా " అని ఫోన్ పెట్టేసాడు. 


ప్లంబర్ తో, ఆ పైప్ రిపేర్ చేపించి, కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్ ని అక్కడ ఏర్పాటు చేయించాడు. 

సుభద్ర డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. 


"డాక్టర్, COHgb లెవెల్స్ బాగా ఎక్కువ వున్నాయి.. అరౌండ్ 12 % అని "


ఆ మాట వినగానే డాక్టర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. 

“12 %..  ఇది చాలా ఎక్కువ..” అన్నాడు డాక్టర్ ఆశ్చర్యంగా. 


"ఏమో డాక్టర్.  కొంతకాలంగా మా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతోందట. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, మాకు అస్సలు తెలియలేదు "


"ఓహ్ అవునా.. కార్బన్ మోనాక్సైడ్ కి రంగు వాసన ఏమి ఉండదు, ఇది చాలా కాలంగా మీ ఇంటిలో నుండి లీక్ అవుతోంది. ఎందుకైనా మంచిది ఇషా కు కూడా ఈ టెస్ట్ చేద్దాం. మీరు చాలా అదృష్టవంతులు, తొందరగా తెలుసుకున్నారు. లేకపోతె మరి కొన్ని వారాల్లో మీరు చనిపోయేవారు". 


విషయం తెలుసుకున్న అశోక్, వెంటనే తన పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. అతీత్, దగ్గరుండి సుభద్ర ని, ఇషా ని చూసుకోసాగాడు. 


 అనుకున్నట్టుగానే, ఇషా శరీరంలో కూడా రక్తం లో కూడా కొంత మేర కార్బన్ మోనాక్సయిడ్ ఛాయలు, కనపడటం తో, ఇద్దరినీ కొంతకాలం హాస్పిటల్ లో ఉంచి వారి శరీరం నుంచి ఆ విష వాయువును పూర్తిగా తొలగించారు. ఈ క్రమంలో డాక్టర్, అతీత్ అనుమానాలను ధృవీకరించారు. కార్బన్ మోనాక్సైడ్‌ కు ఎక్సపోజ్ అవటం వలన వల్ల భ్రాంతులు అదే హాలోజినేషన్స్, గందరగోళం ఇంకా ఊపిరి అందకపోవటం లాంటివి జరుగుతాయని చెప్పాడు. 


ఆ రోజు రాత్రి 

అందరు కలిసి కబుర్లు చెప్పుకొని, భోజనం చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళడానికి లేచారు. 

"అశోక్ బావ, అక్క జాగ్రత్తా .., ఓ రాత్రి వేళ లేచి చూస్తే జడుసుకుంటావ్, భయమైతే నన్ను లేపు " అన్నాడు అతీత్ కొంటెగా. 


అశోక్ దానికి చిన్నగా నవ్వేస్తూ "ప్రాబ్లెమ్ ఫిక్స్ చేసేసావుగా.. అలా ఏమి జరగదులే " అని.


అందరూ నవ్వుకుంటూ వారి వారి గదుల్లోకి వెళ్లి పడుకున్నారు. 


అతీత్, ‘గీజర్ కి పవర్ యే కాదు, గ్యాస్ ఆపే ఏవిధమైన స్విచ్ ఎందుకు లేదు ?’ అన్న అనుమానం వెంటాడుతూనే వుంది.. ఎవరిని అనుమానించాలి. పనిమనిషినా ? ప్లంబర్ నా ? వేరే ఎవరినైనా నా? లేక.. బావ నా ? అని ఆలోచిస్తున్నాడు. 


 అశోక్ కి నిద్ర పట్టలేదు, తన దగ్గరవున్న వేరే ఫోన్ లో "మిషన్ నాట్ డన్ " అని ఎవరికో మెసేజ్ పెట్టాడు. నిద్ర పట్టక అటు ఇటూ తిరుగుతూ.. పక్కనే వున్న వాళ్ళ ఫామిలీ ఫోటోని నేలకేసి కొట్టాడు అసహనంగా.., 


చాలా నిరుత్సహాంగా వుంది అశోక్ కు తన పాచిక పారనందుకు. 


*****

కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక

 డా. కిరణ్ జమ్మలమడక , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పట్టా పొందారు.ప్రస్తుతం GE  హైదరాబాద్ లో  సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను  నిర్వహిస్తూవుంటారు. పిల్లలు , పెద్దలు  ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకు సాగాలనే ఉద్దేశం తో  కథలు రాయటం కూడా మొదలుపెట్టారు.  "చినుకు","ఆంధ్రభూమి", "తెలుగు వెలుగు ", "తానా","ఖమ్మం ఈస్థటిక్స్" మొదలైన ప్రముఖ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో ఈయన కథలు బహుమతి సాధించాయి. ఆ కథల్లో మిరప మొక్క , మోహపు మరకలు,ఆమె అతడిని జయించెను,  యాత్ర (పిల్లల బొమ్మల పుస్తకం ) మరియు  అతీతం, అస్తిత్వం అనే సైన్స్ ఫిక్షన్ (నవలలు) ప్రేక్షకాదరణ పొందాయి. మరికొన్ని కథలు అంతర్జాలం మాధ్యమం లో కూడా ప్రచురితమయ్యాయి.


Comments


bottom of page