'Baboy Phone' New Telugu Story
Written By Kolla Pushpa
రచన: కొల్లా పుష్ప
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"నాన్నా! దీన్ని సెల్ఫోన్ అంటారు. మనము ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. ఇందులో స్పీడు డయల్ కూడా ఉన్నది. ఒకటి నొక్కితే నా ఫోన్ రింగ్ అవుతుంది. రెండు నెంబర్ నొక్కితే అక్కకు వెళుతుంది. మీరు ఎప్పుడు ఎవరితో మాట్లాడాలని ఉన్నా మాట్లాడొచ్చు. నెంబర్లు నోట్ చేసి పుస్తకంలో రాశాను చూసి చేసుకోండి" అని సెల్ ఫోన్ ఎలా వాడాలో తండ్రి కి చెప్పి కొడుకు మూర్తి సూట్ కేస్ పట్టుకొని బయటికి నడిచాడు.
రెండు నొక్కేడు. కూతురు వాసంతి పలికింది.
"తల్లీ! నాకు అన్నయ్య ఫోన్ కొనిచ్చాడు" అన్నాడు సంబరంగా కుటుంబరావు.
"చాలా మంచిది నాన్నా! నీతో ఎప్పుడూ మాట్లాడాలన్నా నేను ఫోన్ చేస్తాను. ఇంట్లో ఒక్కడివే ఉంటావు కదా! కరెంటు పోయినా కూడా కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేయొచ్చు. ఇతరత్రా ఎవరు ఫోన్ చేసి ఏ వివరాలడిగినా చెప్పకండి" అని ఫోన్ పెట్టేసింది.
అసలే పిరికివాడు.. కూతురు అలా చెప్పేసరికి మరి కొంచెం భయమేసింది.
ఫోన్ మోగింది. "ఎవరు" అన్నాడు.
"నేనండి మీ పక్కింటి బాబ్జిని. మా ఆవిడకు ఒకసారి ఫోన్ ఇస్తారా?"
"ఉండు నాయన ఇస్తాను" అని వెళ్లి ఆమెకు ఇచ్చాడు. ఒక గంట పోయాక "ఫోను ఇట్టే చార్జింగ్ అయిపోయింది బాబాయ్ గారు.. మంచి ఫోన్ కొనుక్కోవచ్చు కదా!" అన్నది ఫోన్ చేతిలో పెడుతూ.
చార్జింగ్ పెట్టాడు కుటుంబరావు. మళ్లీ ఫోన్ మోగింది.
"సార్ మీకు ఇన్సూరెన్స్ ఉన్నదా? ఉన్నది అంటే ఒకటి నొక్కండి, లేదు అంటే రెండు నొక్కండి" అన్నాడు అవతలివాడు.
"నాకే ఇన్సూరెన్స్ వద్దు బాబు" అన్నాడు కుటుంబరావు.
"ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి ఉండాలి సార్"అంటూ ఒక అరగంట బుర్ర తిన్నాడు.
ప్రశాంతంగా చదువుకుందామని పుస్తకం తీశాడు. ఇంతలో మళ్ళీ ఫోన్
"బాబు కుటుంబరావు ! నేను పరంధామయ్యను. నేను ఆఫీసులో ఉన్నాను, రాత్రి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. అందుకని ఒకసారి మా ఆవిడకి చెప్పి రా బాబు" అన్నాడు.
"సరేనండి" అని ఆ వీధి చివరనున్న వాళ్ళింటికి వెళ్ళాడు. ఆవిడ పేరు ఏమిటో తెలియదు. అందుకని "అమ్మా" అని పిలిచాడు.
"వేళపాళ లేదా అడుక్కోవడానికి" అంటూ ధడాలని తలుపుతీసి చూసి "అయ్యో మీరా" అని నాలుక కరుచుకుంది. విషయం చెప్పి బతుకు జీవుడా అనుకొని బయటపడ్డాడు.
అసలే ఎండాకాలం! సాయంత్రం ఆరు అయినా ఎండ తగ్గలేదు. మంచినీళ్లు తాగుదామని లేవబోయాడు. మళ్లీ ఫోన్ మోగింది. 'దీని దుంప తెగ.. తెగ మోగుతుంది ఫోను' అనుకొని ఫోన్ తీశాడు.
"నాన్నా! ఫోను వాడటం తెలిసిందా" అడిగాడు కొడుకు.
"నేను వాడటం ఏమోగానీ వీధిలో అందరికీ ఉపయోగపడుతుంది. ఉదయం నుంచి ఒక్క ఘడియ కూడా రెస్ట్ లేదు. నాకు వద్దురా ఈ ఫోను" అన్నాడు కుటుంబరావు కొడుకుతో.
"ఉంచండి నాన్నా! అవసరానికి పనికొస్తుంది" అని కొడుకు ఫోన్ పెట్టేసాడు. మంచినీళ్లు గుర్తొచ్చి లేవబోయాడు ఇంతలో మళ్ళీ ఫోన్ ఇంటి ఓనర్ "కుటుంబరావు రాత్రి మా ఇంటికి అతిధులు వస్తున్నారు, ఏమేమి వంటలు చేయాలో చెప్తాను రాసుకుని మా ఆవిడకి ఇవ్వు" అన్నాడు.
' కాదు' అనలేకపోయాడు కుటుంబరావు.
ఎందుకంటే ఇంటి ఓనర్ కదా! లిస్టు రాసి పెట్టాడు. మంచినీళ్ల మాట మళ్లీ గుర్తొచ్చి లేచాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది.
'అమ్మ బాబోయ్ ఫోన్ మోగింది' అని పరిగెత్తాడు లోనికి మంచినీళ్లు తాగడానికి.
కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప
Comments