బాబూరావూ - బాల్డ్ హెడ్డూ!
- Pamarthi Vira Venkata Sathyanarayana
- Jul 25
- 7 min read
#Thirumalasri, #తిరుమలశ్రీ, #BaburaoBaldHead, #బాబూరావూబాల్డ్హెడ్డూ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

Baburao Bald Head - New Telugu Story Written By Thirumalasri
Published In manatelugukathalu.com On 25/07/2025
బాబూరావూ - బాల్డ్ హెడ్డూ! - తెలుగు కథ
రచన: తిరుమలశ్రీ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
ఉరమకుండా పడ్డ పిడుగులా భార్య నోటినుండి హఠాత్తుగా వెలువడ్డ పలుకులు ఆలకించి అదిరిపడ్డాడు బాబూరావు. అయోమయంగా ఆమె ముఖంలోకి చూసాడు.
“మీరు సరిగానే విన్నారు. మీకు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను నేను” అంది కామాక్షి- ‘నేను షాపింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాను’ అన్నంత తేలికగా.
“వి…విడాకులా! ఎందుకు?” బిత్తరపోతూ అడిగాడు.
“మీరు నా దగ్గర నిజాలు దాచినందుకు. పెళ్ళికి ముందు నాతో అబద్ధాలు చెప్పినందుకు!” అందామె కూల్ గా.
“నీ దగ్గర నేను ఏం నిజాలు దాచాను, కాముడూ? ఏమి అబద్ధాలు చెప్పాను?” తెల్లబోతూ అడిగాడు.
“మీ బట్టతల గురించి!” విసురుగా అందామె.
అప్రయత్నంగా తల తడుముకున్నాడు బాబూరావు. నున్నటి బట్టతల చేతికి చల్లగా తగిలింది.
“పెళ్ళిచూపుల్లో మనిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఓసారి గుర్తుకు తెచ్చుకోండి,” అందామె.
అర్జెంటుగా పదేళ్ళ వెనక్కి- ఫ్లాష్ బ్యాక్ లోకి- వెళ్ళిపోయాడు బాబూరావు…
పెళ్ళిచూపులలో పెద్దలు మాట్లాడుకుంటుంటే, ‘నేను అబ్బాయితో మాట్లాడాలి’ అంది కామాక్షి. బాబూరావుకు కొంచెం సిగ్గు ఎక్కువ. అయినా, ఆమెతో పెరట్లోకి వెళ్ళాడు.
ఆమాటా ఈమాటా మాట్లాడుతూ, హఠాత్తుగా అడిగింది కామాక్షి నవ్వుతూ- ‘మీ ఫ్యామిలీలో బట్టతలలు ఉన్నాయా?’
ఆశ్చర్యపోతూ, ‘బట్టతలలంటే నీకు కిట్టదా?’ అని అడగబోయి మానుకున్నాడు. తల అడ్డుగా త్రిప్పి, ‘లేవు’ అన్నాడు.
‘ఎందుకలా అడిగావు?’ అనడిగితే, ‘బట్టతలను చూస్తే మొట్టబుద్ధేస్తుంది నాకు’ అనబోయి, తమాయించుకుని, ‘ఊరకే’ అని నవ్వేసింది…
“బట్టతల వంశపారంపర్యంగా వస్తుందంటారు. నాకు బట్టతలవాళ్ళంటే బొత్తిగా కిట్టదు. అందుకే పెళ్ళికి ముందే అడిగాను మిమ్మల్ని” నిష్ఠూరాలుపోతూ అందామె. “ఇప్పుడు మీకు బట్టతల వచ్చింది. అంటే అది మీ ఫ్యామిలీలోనే ఉందన్నమాట!”
వాస్తవానికి ఆరోజు బాబూరావు నిజమూ దాచలేదు, అబద్ధమూ చెప్పలేదు. వాళ్ళ వంశంలో బట్టతలల ఆనవాయితీ తరం విడిచి తరం వస్తున్నాయని వాళ్ళ నాన్న ఎప్పుడో మాటల్లో చెప్పిన గుర్తు. బాబూరావు తాతకు బట్టతల వుండేది. తండ్రికి లేదు. అంటే, తనకు రావచ్చునన్నమాట! ఆ విషయం అతను కామాక్షికి చెప్పలేదు.
ఎందుకంటే, ‘మీ ఫ్యామిలీలో’ అని అడిగిందామె. ఫ్యామిలీ అంటే తండ్రి, తానూను. అప్పట్లో ఇద్దరికీ బట్టతల లేదు. ఆ విధంగా చూస్తే, తాను అబద్ధం చెప్పలేదు… అదే విషయం చెప్పాడు బాబూరావు.
అతని లాజిక్ కి మండిపడింది కామాక్షి. “దాన్నే మోసం అంటారు. మీ మ్యాజిక్ తో నన్ను మోసం చేసారు మీరు. అందుకే విడాకులు!” అంది.
బాబూరావుకు ఒళ్ళు మండిపోయింది. అవమానంతో ఉన్న కొద్ది జుట్టూ పీక్కోబోయి ఆగిపోయాడు.
“ఇది నేను కోరి తెచ్చుకున్నది కాదు. ఇప్పుడు వద్దంటే పోయేదీ కాదు. నువ్విలా విడాకులంటూ అవాకులు పలకడం బాలేదు!” అన్నాడు కోపంగా.
“ఇకమీదట ఈ బట్టతలను వెంటబెట్టుకుని బయటకు ఎలా వెళ్ళను!? సినిమాలు, షికార్లూ బందేనా? షాపింగ్ మాల్స్ లోని లైట్ల కాంతులు మీ బట్టతలమీద పడి రిఫ్లెక్ట్ అవుతూంటే… అది చూసి అంతా ముసిముసిగా నవ్వుకుంటూంటే… ఆ హుమిలియేషన్ ని నేనెలా తట్టుకునేది!?” తల మోచేతిలో దాచుకుని వాపోయింది కామాక్షి డ్రమెటిక్ గా.
అవాక్కయ్యాడు బాబూరావు. తేరుకుని గబగబా నిలువుటద్దం వద్దకు వెళ్ళి తల వంక పరీక్షగా చూసుకున్నాడు. తల పైన స్టీల్ పాత్రను బోర్లించినట్టు నిగనిగలాడుతోంది. క్రింద చుట్టూరా నెలవంకలా పల్చటి జుట్టు!
బాబూరావుకు ముప్పయ్ అయిదేళ్ళుంటాయి. మనిషి పొడగరి. హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఓ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ లో జూనియర్ అఫీసర్ గా పనిచేస్తున్నాడు.
అసలు పెళ్ళినాటికి బాబూరావుకు ఒత్తైన నల్లటి జుత్తు వుండేది. బ్రిల్ క్రీమ్ రాస్తూ రోజుకో రకపు వంకీతో తల దువ్వుకునేవాడు. తన క్రాపును చూసి- పల్చటిజుట్టు పాపారావులు, బాల్డ్ హెడ్ బ్రహ్మానందాలూ- ఈర్ష్యతో ఉడుక్కుంటున్నట్టు ఊహించుకుని తెగ మురిసిపోయేవాడు.
అటువంటిది- ఏడాదిక్రితం నుండి తన జుట్టు నోటీస్ ఇవ్వకుండా క్రమంగా పలచబడిపోయి… కరవుకాటకాలకు గురైన నేలలా… యాభయ్ ఏళ్ళయినా రాకుండానే- ముప్పయ్ లలోనే- బట్టబుర్రగా రూపొందడం- హారర్ సినిమా చూస్తున్నంతగా భయపెట్టింది అతన్ని. దానికి తోడు, ఇప్పుడు భార్య ప్రేల్చిన ‘విడాకుల డ్రోన్’ ఒకటి!
టెర్రరిస్ట్ ల బాంబ్ కంటే మరీ ఘోరంగా గుండెల్ని చీల్చేసింది!
ఆయుర్వేద తైలాలు, సువాసన నూనెలు వగైరాలు తెచ్చుకుని భార్యకు తెలియకుండా తలకు మర్దనా కార్యక్రమం కొనసాగించాడు. ఫలితం కనిపించలేదు. ఆ బాల్డ్ హెడ్ తో బోల్డ్ గా తిరగాలో… లేక, జుట్టు మొలిపించుకునే మార్గాలను ముమ్మరం చేయాలో తెలియలేదు.
ఆ మధ్య ఓసారి బార్బర్ షాప్ కు వెళ్ళాడు బాబూరావు. అసలు చార్జీ పైన ఇరవయ్ రూపాయలు అదనంగా తీసుకున్నాడు మంగలి. అదేమని అడిగితే, ‘సెర్చ్ ఫీ’ అన్నాడు! తల మీద వెంట్రుకలు ఎక్కడ వున్నాయో వెదికిపట్టుకోవాడానికి అది ‘సర్వీస్ చార్జ్’ అట!!
తనకు తల కొట్టేసినట్టు- కాదు, కాదు- తలంతా బోడిగుండు అయిపోయినంత సిగ్గుగా అనిపించింది…
బాబూరావు ఇంటి దగ్గరి వీధిలో సాయంత్రపు వేళల్లో పిల్లలు ఆడుకుంటూవుంటారు. తోకలు ఒకటే తక్కువ వాళ్ళకు. మంకీ బ్రాండ్!
బాబూరావు వీధిలో కనపడితే చాలు, ‘షైనింగ్ డోమ్’ అంటూ అరుస్తారు వాళ్ళు. అతనికి ఒళ్ళు ఉడికిపోతుంటుంది. బట్టతల చిమచిమలాడుతుంటుంది. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయత! ఒకవేళ తెగించి తిడదామంటే, ఆ తరువాత ఏ ‘లంకాదహనకాండ’ కు పూనుకుంటారోనన్న భయం!
వీలయినంతమటుకు ఆ పిల్లకోతులు వున్నంతవరకు బైటకు వెళ్ళడం మానుకున్నాడు.
తన గోడును కొలీగ్ కొండలరావుతో చెప్పుకుంటే ముందు నవ్వాడు అతను. తరువాత ఓ కథ చెప్పాడు- ‘పూర్వం ఎలిషా అనే ఓ మతగురువు వుండేవాడు. అతనికి బట్టతల వుండేది. ఎలిషా చాలా తెలివైనవాడే కాక, ధార్మికత అతనికి కొన్ని అపూర్వశక్తులను ఇచ్చిందని వినికిడి. వీధిపిల్లలు కొందరు అతని బట్టతలను చూస్తూ ఘోరంగా అవమానించసాగారు. వారి క్రూరత్వం భరింపశక్యం కాకపోయేసరికి, ఎలీషా తన శక్తులను ఉపయోగించి ఎలుగుబంట్లను సృష్టించాడు. అవి ఆ ఆకతాయిలను తినేసాయి…’
“ఇది ఓ బైబ్లికల్ స్టోరీ. ఓ మతగురువు పిల్లల్ని ఎలుగుబంట్లకు ఆహారం చేస్తాడంటే సందేహమే! అందుకే అందులోని నిజానిజాలు మనకొద్దు... బట్టతల విజ్ఞానానికి చిహ్నం అంటారు. విజ్డమ్ నీకు కొంచెం త్వరగా వచ్చేసింది. విచారించకు. ‘ఎవ్విరి డాగ్ హేజ్ ఇట్స్ డే’ అన్నట్టు, ‘ఎవ్విరి బాల్డ్ హెడ్ విల్ హేవ్ ఇట్స్ డే’…” అంటూ ఓదార్చాడు కొండలరావు.
ఇంకో కొలీగ్ కోదండం కలుగజేసుకుని, “బట్టతల విరిలిటీకి చిహ్నం అని కూడా అంటారు. అంటే, సెక్స్ సామర్థ్యానికి అన్నమాట! ఆ విషయం యు. ఎస్. లో జరిపిన పరిశోధనలలో తేలింది. కావలిస్తే మీ ఆవిణ్ణి అడిగిచూడు” అన్నాడు.
ఆ రాత్రి అదే విషయం భార్య దగ్గర ఎత్తాడు బాబూరావు. ఆమె అదోలా చూసి, “మీ బుద్ధి బూరెలు తిన్నట్టే వుంది! మీ బట్టతల చూస్తే ఉన్న మూడ్ కాస్తా పోతుంది నాకు” అంది పెడసరంగా. హతాశుడయ్యాడు అతను.
ఓసారి ‘బాట్రాస్ క్లినిక్’ ప్రకటనను బిల్ బోర్డ్స్ లో చూసిన బాబూరావుకు, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కి వెళితే ఎలా వుంటుందా అన్న ఆలోచన కలిగింది. క్లినిక్ కి వెళ్ళి విచారించాడు.
కొన్ని వీడియోలు, ఫొటోలూ చూపించారు వాళ్ళు అతనికి. పర్రనేల పైన పంట పండించలేకపోవచ్చునేమో కానీ, తమ ట్రీట్మెంటుతో బట్టతల పైన ఖచ్చితంగా జుట్టు మొలిపించగలమన్నారు. ట్రీట్మెంట్ కు ‘ముందు’, ‘వెనుక’ అంటూ… తమ వద్ద హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ‘చేయించుకున్న’ కొందరు వ్యక్తుల ఫొటోలు చూపించారు. వారిలో కొందరు సెలబ్రైటీల్ కూడా వుండడం విశేషం. వాటిని చూడగానే బాబూరావులో జోష్ పెరిగింది. ‘శభాష్’ అనుకున్నాడు.
అయితే, అందుకు అయ్యే కాస్ట్ ఫేక్టర్ గురించి తెలియగానే, పట్టపగలే స్టార్స్ కనిపించాయి! అంతేకాదు, ఆ ట్రీట్మెంట్ ఎంత పెయిన్ ఫులో కూడా ఎవరి ద్వారానో తెలిసింది. ఆ ప్రయత్నం విరమించుకోక తప్పలేదు…
ఇటీవలి కాలంలో టీవీలలో అస్తమానూ వస్తూన్న అడ్వర్ టైజ్మెంట్ ఒకటి బాబూరావును ఆకట్టుకుంది. ఆ యాడ్ లో- నడివయసు కూడా లేని ఓ అందమైన యువతి ప్రత్యక్షం అవుతుంది. ‘తనకు పుట్టుకతో నల్లటి ఒత్తైన జుత్తు ఉండేదట. అనుకోకుండా ఎందుకో తలంతా బోడి అయిపోయిందట. అందరూ నవ్వుతున్నారని బయటకు వెళ్ళేటప్పుడు నెత్తిమీద చున్నీ కప్పుకునేదట.
కొన్నాళ్ళకు ఎవరో చెప్పారట, హిమాలయాల నుండి వచ్చిన స్వామిజీ ఒకరు- ఆడ, మగ పిన్న వయసులోనే హెయిర్ లాస్ తో బాధపడడం చూసి జాలిపడి, ఏవో మూలికలతో ప్రత్యేకమైన తైలం (పోషన్) ఒకటి తయారుచేసినట్లు. దాన్ని వెంటనే తెప్పించుకుని రోజూ తలకు మర్దనా చేసుకుంటే మూణ్ణెళ్ళకే నెత్తిమీద జుట్టు సహజంగా మొలవడం మొదలుపెట్టిందట. ఆరునెలల్లో ఒరిజినల్ జుట్టు వచ్చేసిందట.
బాల్డ్ హెడ్ అయినా, బోడిగుండు అయినా ఆ తైలంలో వాడిన మూలికల మహాత్మ్యంతో జుట్టు మొలిచి తీరవలసిందేనట. ఇప్పటివరకు ఎందరో దాన్ని వాడి ఫలితం పొందారట. దాని వెల కూడా చాలా చవకట’…
ఆమె జుట్టు ఒత్తుగా వున్నప్పటి టీనేజ్ ఫొటో, గుండు అయినప్పటి ఫొటో, ఆ తైలం వాడాక మళ్ళీ జుట్టు మొలచి యథావిధిగా తయారయినప్పటి ‘లేటెస్ట్’ ఫోటో చూపించబడ్డాయి తెరమీద. బట్టతల వచ్చిందని బాధపడవలదనీ, ఆ తైలం కొని వాడమనీ ఎంతో నమ్మకంగా సిఫారసు చేస్తోంది ఆ యువతి.
మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో బాబూరావుకు తెలియదు. అలాగే, ఆ తైలానికి నిజంగా జుట్టు మొలుస్తుందా అన్న సందేహమూ కలిగింది. కానీ, ఓ అందమైన ఆడపిల్ల తెరమీదకు వచ్చి నమ్మబలుకుతూంటే కొట్టిపారేయలేకపోయాడు. ‘ఏ పుట్టలో ఏ పాముందో’ అన్న సామెతను తలచుకుని, ‘ఏ పోషన్ లో ఏ పోషకాలు ఉన్నాయో! ఆ హెర్బల్ పోషన్ ని వాడిచూస్తే పోలే?’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, వెంటనే టీవీ యాడ్ లో ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్ కి కాల్ చేసి, ఆన్-లైన్ లో పేమెంట్ చేసి దాన్ని తెప్పించుకున్నాడు.
నెల రోజుల పాటు పెళ్ళానికి తెలియకుండా దాన్ని తలకు దట్టించుకోసాగాడు. యాడ్ లోని పిల్ల చెప్పినట్టు మూడు నెలలకు జుట్టు రాలేదు కానీ… కొత్తగా కొన్న డోర్ మ్యాట్ పీచు (ఫైబర్) లాగ అతిసన్నటి మొలకలు బాబూరావు చేతికి తగిలాయి, బట్టతల నిమురుకుంటూంటే. ఉత్సాహంతో ఇంకో మూడు నెలలపాటు వాడి చూసాడు. కానీ, అంతకు మించి పెరగలేదు అవి. డీలాపడిపోయాడు…
వీలయినంతమటుకు భార్య ఎదుటపడకుండా తప్పించుకు తిరగసాగాడు బాబూరావు. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నదంటూ ఓ గంట ముందే ఇల్లు విడిచి పెడుతున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయాకగానీ ఇల్లు చేరడంలేదు. తన బట్టతలను చూసినపుడల్లా ‘విడాకుల’ ఆలోచన భార్య మదిలో గింగిర్లు తిరుగుతుందేమోనన్న భయమే అందుక్కారణం!
అదిగో, అప్పుడే కనిపించింది ఆ నిలువెత్తు ప్రకటన న్యూస్ పేపర్ ఫ్రంట్ పీజీలో- బాబూరావు బట్టతల మీద పాలు పోస్తూ!
సిటీలోని ‘హైటెక్స్’ లో ‘నేషనల్ బాల్డ్ హెడ్స్ కన్వెన్షన్’ జరుగబోతోంది. అలాంటిది దేశంలో అదే ప్రథమం అట. విదేశీ సంస్థ ఒకటి దాన్ని ఆర్గనైజ్ చేస్తోంది. దేశ-విదేశీ నిపుణులు ఆ కన్వెన్షన్ ని అడ్రెస్ చేయబోతున్నారు.
సభ్యులకు తగు సలహాలూ, సూచనలూ చేయబోతున్నారు. మరో ప్రత్యేకత ఏమిటంటే- ఆ సమావేశానికి హాజరైన సభ్యులు ఎవరూ బాల్డ్ హెడ్ తో తిరిగివెళ్ళరు!... మూడు రోజులపాటు జరుగుతుంది ఆ కన్వెన్షన్. సభ్యత్వ రుసుము- నామినల్. ఔత్సాహికులు వెంటనే ఆ ప్రకటనలో ఇచ్చిన సెల్ నంబర్స్ కి ఫోన్ చేసి తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి…’
దాన్ని చదివిన బాబూరావు సంతోషం పట్టలేక ‘హుర్రే!” అని లోపల అనుకోబోయి పైకే అరిచేసాడు.
అప్పుడే స్టవ్ మీంచి కాఫీగిన్నెను పట్టకారుతో దించుతూన్న భార్య త్రుళ్ళిపడి వేడివేడి కాఫీని చేతిమీద ఒలకబోసేసుకుంది.
దాంతో ఒళ్ళు ఉడికిపోయి, “ఏమిటా గావుకేక… నెత్తి మీద జుత్తు మొలిచినట్టు!?” అంటూ కసరింది కోపంగా.
‘మొలుస్తుందే, మొలుస్తుంది… నాలుగు రోజులు ఆగు’ అని మనసులోనే అనుకుంటూ, ఆ కన్వెన్షన్ కి రిజిస్టర్ చేసుకోవడానికి సెల్ ఫోన్ తీసాడు బాబూరావు…
కన్వెన్షన్ కి మొదటి రోజునే వెళ్ళాడు బాబూరావు. హాల్లో అడుగుపెడుతూనే డంగయిపోయాడు. ‘బట్టతలసముద్రం’ లా ఉంది లోపల! సీలింగ్ పైన ఉన్న లైట్స్ కాంతిలో నక్షత్రాలలా మెరుస్తున్నాయి బాల్డ్ హెడ్స్ అన్నీ.
సభ ఆరంభమయింది. ముందుగా ఆర్గనైజర్స్ ఆ కన్వెన్షన్ ని నిర్వహించడంలోగల ఉద్దేశ్యం గురించి వివరించారు. తరువాత ‘బాల్డ్ హెడ్స్’ ఎక్ష్పర్ట్ ఒకరు- అసలు బట్టతలలు ఎందుకు వస్తాయో, వాటి పూర్వాపరాలను గూర్చి ప్రసంగించారు. మరొకరు- ప్రపంచంలోని బట్టతలల స్టాటిస్టిక్స్ ని ప్రస్తావించారు.
ప్రపంచంలోని ఏయే అధినేతలకు, ప్రముఖులకు బట్టతలలు వచ్చాయో నుడివారు. అసలు బట్టతలల మూలంగానే వారంతా ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు. ఇంకొకరు ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో చెప్పారు. సభ చప్పెట్లతో మార్మ్రోగిపోయింది.
ఫోర్ నూన్ సెషన్ అంతా ప్రసంగాలతో, చర్చలతో సాగిపోయింది. అనంతరం లంచ్ ఏర్పాటుచేయబడింది. ఆఫ్టర్ నూన్ సెషన్ లో సభ్యులు ఒక్కొక్కరే కౌన్సెలింగ్ కోసం లోపలి గదులలోకి ఆహ్వానింపబడుతున్నారు. కాసేపటికి తలనిండా జుట్టుతో బైటకు రాసాగారు. ఏం జరుగుతోందా అని విస్తుపోతూండగా, బాబూరావు వంతు కూడా వచ్చింది.
ఓ గదిలో కుర్చీలో ఆసీనుణ్ణి చేసారు అతన్ని. ఓ నిపుణుడు బాబూరావును ఇంటర్ వ్యూ చేసి అతని యొక్క బట్టతలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాడు. అనంతరం అతని అసిస్టెంట్ ఒకమ్మాయి తల కొలతలు తీసుకుంటే, ఇంకో అమ్మాయి వచ్చి వివిధ కోణాలలోంచి బాబురావు యొక్క ముఖాకృతిని సైంటిఫిక్ గా స్టడీ చేసింది. అదంతా వింతగా అనిపించింది బాబూరావుకు.
తరువాత వివిధ హెయిర్ స్టైల్స్ ఫొటోగ్రాఫ్స్ ఉన్న ఆల్బమ్ ని తీసుకువచ్చి చూపించారు అతనికి. ఎక్స్ పర్ట్ సహాయంతో తనకు నచ్చినదాన్ని, నప్పేదాన్నీ ఎంచుకున్నాడు బాబూరావు. అయిదునిముషాల తరువాత నేచురల్ హెయిర్ లా అత్యంత సహజంగా ఉన్న ‘విగ్’ ఒకటి తెచ్చి అతని తలకు అమర్చారు వాళ్ళు. అది సరిగా సరిపోయింది.
అద్దంలో చూసుకున్న బాబూరావు స్టన్నయిపోయాడు. తన షైనింగ్ డోమ్ మాయమయిపోయి, చక్కటి స్టైల్ తో కూడిన నేచురల్ హెయిర్ నల్లగా నిగనిగలాడుతోంది! అది విగ్ అన్న నిజం కనిపెట్టడం- చెబితే తప్ప సాధ్యం కాదు!
దాన్ని మెయింటెయిన్ చేసే విధానం వగైరాలు ఉన్న బుక్ లెట్ ని తీసుకుని, మూల్యం చెల్లించి, జాలీగా బయటకు నడచాడు బాబూరావు- ‘ఒసే కామాక్షీ! ఈసారి నువ్వు విడాకుల వూసెత్తావంటే చెడామడా చెడుగుడు ఆడేసుకుంటాను నీతో!’ అనుకుంటూ.
ఇంటికి వచ్చి హుషారుగా డోర్ బెల్ మ్రోగించాడు. తలుపు తెరచిన కామాక్షి అతని వంక ఓసారి ఎగాదిగా చూసి, “ఎవరు కావాలండీ?” అనడిగింది.
బాబూరావు ఖంగుతిని, “అదేమిటి, కాముడూ! నేను… నీ ఏమండీని…” అన్నాడు. భర్తను ‘ఏమండీ’ అని పిలుస్తుందామె.
మరోసారి పరీక్షగా చూసింది కామాక్షి- “మా ఆయనది తళతళలాడే చక్కటి షైనింగ్ డోమ్. మీలా గొర్రెవెంట్రుకల క్రాపు కాదు. ఏ ఇంటికి వెళ్లబోయి ఇక్కడికి వచ్చారో… చూసుకుని వెళ్లండి” అనేసి ముఖమ్మీదే ధడేలున తలుపు మూసేసుకుంది.
షాక్ తిన్న బాబూరావు, “ఆఁ…!?” అంటూ నోరు వెళ్లబెట్టి గుమ్మంలోనే చతికిలబడిపోయాడు.
************
తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.
''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."
Comments