పై డే కథ
- Vangeepuram Padmaja

- Mar 15
- 3 min read
#VangeepuramPadmaja, #వంగీపురంపద్మజ, #పైడేకథ, #PaiDayKatha #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Pai Day Katha - Telugu Inspirational Story | Vangeepuram Padmaja
పై డే కథ - తెలుగు కథ | వంగీపురం పద్మజ
Publishes in manatelugukathalu.com on 15/03/2026
మార్చి 14. స్కూల్‌లో ఉదయం అసెంబ్లీ అయిపోయాక, మ్యాథ్స్ టీచర్ శ్రీవాణి మేడం క్లాస్‌లోకి వచ్చారు.
“స్టూడెంట్స్! ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు – π (పై) డే!” అని చెప్పారు.
నిఖిల్ వెంటనే లేచి అడిగాడు.
“మేడం… పై అంటే ఏమిటి? తినే పైనా?”
మేడం నవ్వేశారు.
“ఇది తినే పై కాదు నిఖిల్… ఇది మ్యాథ్స్‌లో ఉండే సంఖ్య. దీని విలువ 3.14…”
నిఖిల్ మళ్లీ అడిగాడు.
“మేడం, అంతేనా? 3.14 మాత్రమేనా?”
మేడం చెప్పారు.
“కాదు… దీని తర్వాత ఇంకా ఎన్నో అంకెలు ఉంటాయి. అవి ఎప్పటికీ ఆగవు.”
నిఖిల్ ఆశ్చర్యపోయి అన్నాడు.
“అంటే… ఇది మా మ్యాథ్స్ హోంవర్క్ లాగే ఎప్పటికీ అయిపోదా?”
అందరూ క్లాస్‌లో గట్టిగా నవ్వారు.
స్కూల్ అయిపోయాక నిఖిల్ ఇంటికి వెళ్లాడు.
“అమ్మా! ఈరోజు స్కూల్‌లో పై డే అంటున్నారు. పై ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగాడు.
అమ్మ నవ్వుతూ చెప్పింది.
“పై అంటే తినే పై కాదు నాన్నా… అది మ్యాథ్స్‌లో ఉండే సంఖ్య.”
నిఖిల్ కొంచెం నిరాశగా అన్నాడు.
“అయ్యో! నేను అయితే ఆపిల్ పై లేదా చాక్లెట్ పై అనుకున్నాను!”
అంతలో నాన్న వచ్చారు.
నిఖిల్ వెంటనే అడిగాడు.
“నాన్నా… π (పై) ఎప్పటికీ అయిపోదట. నిజమేనా?”
నాన్న నవ్వుతూ చెప్పారు.
“అవును. π (పై) కి అంతం లేదు.”
నిఖిల్ వెంటనే అన్నాడు.
“అంటే నా మార్కులు కూడా π (పై) లాగా అంతం లేకుండా పెరిగితే బాగుంటుంది!”
అమ్మ నాన్న ఇద్దరూ నవ్వేశారు.
కానీ నిఖిల్ మాత్రం కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
అతనికి పూర్తిగా అర్థం కాలేదు. “ఎందుకు 3.14 అవుతుంది?” అనే ప్రశ్న అతని మనసులోనే ఉంది.
“క్లాసులో అందరికీ అర్థం అయింది. మరి నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను?” అని కొంచెం బాధగా కూడా అనిపించింది.
ఒకసారి అమ్మని అడుగుదాం అని కిచెన్ దగ్గరికి వెళ్లాడు.
అమ్మ పెనం మీద దోశ పోస్తోంది.
“ఏమైంది నిఖిల్? అంత మౌనంగా ఉన్నావు?” అని అమ్మ అడిగింది.
నిఖిల్ కొంచెం సంకోచంగా అన్నాడు,
“అమ్మా… స్కూల్‌లో మేడం π (పై) గురించి చెప్పారు. అందరూ అర్థం చేసుకున్నారు. కానీ నాకు ఎందుకు 3.14 అవుతుందో అర్థం కాలేదు.”
అమ్మ అతని ముఖం చూసి మృదువుగా నవ్వింది.
“అది ఏమంత పెద్ద విషయం కాదు నాన్నా. చాలాసార్లు అర్థం కాని విషయాలు జీవితంలో చిన్న ఉదాహరణలతోనే అర్థమవుతాయి. చూడు, ఈ దోశతోనే చెబుతాను,” అంటూ…
అమ్మ పెనం మీద గుండ్రంగా ఒక పెద్ద దోశ వేసింది.
“నిఖిల్, ఈ దోశ ఎలా ఉంది?” అని అడిగింది.
“గుండ్రంగా ఉంది,” అని నిఖిల్ చెప్పాడు.
“అదే వృత్తం. ఇప్పుడు రెండు విషయాలు చూద్దాం,” అని అమ్మ చెప్పింది.
ముందుగా స్పూన్‌తో దోశ మధ్య నుంచి అంచు వరకు చూపించింది.
“ఇది మధ్య నుంచి అంచు వరకు దూరం. దీనిని వ్యాసార్థం (radius) అంటారు.”
తర్వాత ఒక చిన్న దారం తీసుకుని దోశ అంచు చుట్టూ నెమ్మదిగా చుట్టింది.
“ఇది మొత్తం దోశ చుట్టూ ఉన్న పొడవు. దీనిని చుట్టుకొలత (circumference) అంటారు.”
నిఖిల్ ఆసక్తిగా చూస్తున్నాడు.
“ఇప్పుడు ఇలా ఊహించు,” అని అమ్మ చెప్పింది.
“మధ్య నుంచి అంచు వరకు 5 సెంటీమీటర్లు అనుకుందాం. అంటే వ్యాసం (diameter) 10 సెంటీమీటర్లు అవుతుంది.”
“సరే,” అని నిఖిల్ అన్నాడు.
“ఇప్పుడు ఈ దారం పొడవు కొలిస్తే దాదాపు 31.4 సెంటీమీటర్లు వస్తుంది,” అని అమ్మ చెప్పింది.
నిఖిల్ కాసేపు ఆలోచించాడు.
“అంటే 31.4 ని 10తో భాగిస్తే… 3.14 వస్తుంది!” అని ఆశ్చర్యంగా అన్నాడు.
అమ్మ తల ఊపింది.
“అదే π (పై). ఏ వృత్తం అయినా… చిన్న దోశ అయినా, పెద్ద చక్రం అయినా… దాని చుట్టూ ఉన్న పొడవును వ్యాసంతో భాగిస్తే దాదాపు 3.14 వస్తుంది.”
నిఖిల్ ముఖంలో మళ్లీ ఆనందం కనిపించింది.
“అమ్మ… నేను స్కూల్‌లో అర్థం కాలేదని బాధపడ్డాను. కానీ ఇప్పుడు చాలా సులభంగా అర్థమైంది.”
అమ్మ నవ్వుతూ చెప్పింది,
“అర్థం కాని ప్రశ్నలు ఉండటం తప్పు కాదు. వాటిని అడగడం, తెలుసుకోవడం ముఖ్యం.”
నిఖిల్ దోశ తింటూ…
కొన్నిసార్లు ఒక పెద్ద సందేహం ఒక చిన్న ఉదాహరణతో చిటికెలో అర్థమవుతుంది అని అమ్మవైపు గర్వంగా చూస్తూ అనుకున్నాడు.
సమాప్తం
వంగీపురం పద్మజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: వంగీపురం పద్మజ
నా పేరు పద్మజ వంగీపురం. నేను మేనేజ్‌మెంట్ విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. చిన్న కథలు, ఆలోచనాత్మక రచనలు మరియు విద్యార్థులకు ఉపయోగపడే విషయాలను సులభమైన భాషలో రాయడం నాకు చాలా ఇష్టం. రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలు, అనుభవాలు మరియు మనుషుల భావోద్వేగాలు నా రచనలకు ప్రేరణగా ఉంటాయి. నా రచనల ద్వారా పాఠకులతో విలువలు మరియు సానుకూల ఆలోచనలు పంచుకోవాలని నా ఆశ.




Very interesting story.. new way of teaching . Myself and my wife Vangeepuram Sasirekha liked the concept.
Super 😍 👍