బద్దకమే శత్రువు
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #BaddakameSathruvu, #బద్దకమేశత్రువు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 72
Baddakame Sathruvu - Somanna Gari Kavithalu Part 72 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 07/05/2025
బద్దకమే శత్రువు - సోమన్న గారి కవితలు పార్ట్ 72 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
బద్దకమే శత్రువు
----------------------------------------
కనిపించని శత్రువు
పతనానికి హేతువు
బ్రతుకులో బద్దకం
కలుగుజేయు నష్టం
ప్రగతికి అవరోధం
మితిలేని బద్దకం
తగ్గించుకున్న చాలు
దూరముంటే మేలు
బద్ధకానికి వశం
అయితే నాశనం
తెలుసుకో ఈ నిజం
జాగ్రత్త అనుదినం
రవి కాంతి చురుకుదనం
విలువైన బహుమానం
కల్గియుంటే గనుక
బాగుపడును జీవితం

కోకిలమ్మ సందేశం
----------------------------------------
కొమ్మపై కోయిలమ్మ
కమ్మగా పాడింది
గొంతులోని మధురిమతో
వీనులవిందు చేసింది
తనువంతా నలుపైన
ఒక్కింత చిందించిక
తనలోని ప్రతిభతో
అందరిని అలరించింది
అంతర్గత ప్రతిభను
వెలికి తీయమన్నది
అది లేని మనుషులకు
విలువ ఎక్కడన్నది!
అందరిలోనూ ఉన్నవి
ప్రతిభాపాటవాలు
బహిర్గతం అయితేనే
గౌరవ మర్యాదలు
ప్రతిభ ఘనతకు కారణం
నిలుపుతుంది ఘనకీర్తి
ఆచంద్రతారార్కం
పంచుతుంది ఇల స్ఫూర్తి
కోయిలమ్మ సందేశం
విన్పించెను మన కోసం
ప్రయత్నం మొదలెడితే
ఏదైనా దాసోహం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి!
----------------------------------------
కాశ్మీర్ అందాలపై
మానవ బంధాలపై
కరుడుగట్టిన నేరగాళ్ల,
రక్తం రుచి మరిగిన
మానవ మృగాల
ఉన్మాద ఉగ్రవాదుల
కన్నుకుట్టిందేమో!
పిచ్చి ముదిరిందేమో!
పహల్గమ్ దర్శించేందుకు
ఆహ్లాదం పొందేందుకు
వచ్చిన పర్యాటకులపై
విచక్షణా రహితంగా
కాల్పులు జరుపుతూ
అసువులు బలి తీసుకున్నారు
మారణహోమం సృష్టించారు
పర్యాటకుల కుటుంబాల్లో
ముష్కరుల దాడిలో
క్షతగాత్రుల అక్రందన
పసి పిల్లల హాహాకారాలు
అంబరాన్ని తాకాయి
ప్రపంచ దేశాలు ఏకం కావాలి
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి
కూకటి వేళ్ళతో పెరికివేయాలి
సమూలంగా తుడిచిపెట్టాలి
చేయి చేయి కలపాలి!
ఉగ్రవాదం అంతం చేయాలి!

అక్షర హితోక్తులు
----------------------------------------
రూపాన్ని చూసి మురిసిపోకు
రూపాయి ఉందని మిడిచి పడకు
రెండూ కూడా అశాశ్వతం
మంచితనం కదా! శాశ్వతం
అతి చనువు ముప్పు పెంచకోకు
అహమే హాని కల్గియుండకు
అతి ముమ్మాటికీ ప్రమాదం
వీడితే బ్రతుకున ప్రమోదం
బ్రతుకు చిన్నది వృధా చేయకు
ఏ పని వాయిదా వేయకు
ఫాయిదా ఉండనే ఉండదు
కాలయాపన ఫలితమివ్వదు
అక్షర హితోక్తులు వినవోయ్!
అందులోని మంచిని కనవోయ్!
నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి
ప్రగతి బాట కొనసాగవోయ్!

నిజమే గెలుస్తుంది!
----------------------------------------
అపాయం!అపాయం!
బ్రతుకులో నాటకం
బట్టబయలు అయితే
పోతుంది గౌరవం
అబద్ధమే దాగదు
ఒక్క చోట ఆగదు
ఏదో ఒక రోజు
బయట పడక మానదు
నిప్పులాంటిది నిజం
ఎవ్వరూ దాచలేరు
సూర్య కిరణం రీతి
వెలుగులీను జ్యోతి
నిజం వైపు ఉండుము
అటు వైపే దైవము
కల్ల ముల్లులాంటిది
మిక్కిలి హానికరము
ఆలస్యమైననూ
నిజమే గెలుస్తుంది!
అందరికి అనుభవం
పాఠాలు నేర్పుతుంది
-గద్వాల సోమన్న





Comments