'Badhyatha - Part 2/2' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 10/04/2024
'బాధ్యత - పార్ట్ 2/2' తెలుగు పెద్ద కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ :
ఉష తన అమ్మా, నాన్న తో కలిసి ఉంటుంది. తెలివైన అమ్మాయి అవడం చేత పెద్ద చదువులు చదవడానికి ఒప్పుకున్నాడు తండ్రి. అమ్మాయి కోసం అప్పు చేసి మరీ చదివిస్తున్నాడు. తన స్థాయికి మించినప్పటికీ కూతురి ఆనందం కోసం అప్పు చేసాడు తండ్రి కృష్ణారావు. ఒక మంచి కాలేజీ లో కూతురి ఇష్టం మేరకు గొప్పగా చదివిస్తున్నాడు.
ఉష నీరజను కలుస్తుంది. తనకి బిడ్డని కని ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఇక్కడ ఉష తల్లి కి ఉష పొట్ట పెరగడం చూసి అనుమానం వస్తుంది. ఉష ఏదో మేనేజ్ చేసి చెప్పినా, ఒక రోజు నిజం బయట పడుతుంది.
ఇక బాధ్యత పెద్దకథ చివరి భాగం చదవండి..
విషయం తెలిసిన తల్లి.. తిట్టిన తిట్టు తిట్టకుండా.. తిట్టింది. "నీకు అంత తొందరగా ఉంటే, మంచి సంబంధం చూసి పెళ్ళి చేసే వాళ్ళము కదా.. ! ఇలాంటి పనులు చేస్తావా.. ? ఇంక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు. ఎవరైనా అడిగితే, మా అమ్మాయి హాస్టల్ లో ఉందని చెప్పుకుంటాము. ఇంట్లోంచి వెళ్ళిపో.. " అని తల్లి గట్టిగా చెప్పింది. పెళ్ళాన్ని ఏమీ అనలేని కృష్ణారావు.. దీనంగా కూతురి వంక చూసాడు..
"నేనేమి తప్పు చెయ్యలేదు. కానీ, వెళ్ళిపోమంటున్నావు కాబట్టి.. అలాగే వెళ్ళిపోతాను అమ్మా.. !" అని ఉష ఇంట్లోంచి వెళ్లిపోయింది..
ఇంట్లోంచి బయటకు వచ్చిన ఉష.. తన ఫ్రెండ్ కి కాల్ చేసి.. తన రూమ్ కు వెళ్ళింది.
"భయపడకే ఉషా.. ! నా రూమ్ లోనే ఉండు. ఎవరైనా అడిగితే, నా సిస్టర్ అని చెబుతాను. నువ్వూ అలాగే చెప్పు.. "
"థాంక్స్ రాణి.. "
"నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్.. ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా.. ? నువ్వు నాకు చేసిన సహాయంతో పోలిస్తే నేను చేసేది ఎంత చెప్పు ఉష.. ? నాకు నువ్వు ఎన్నో సార్లు చాలా హెల్ప్ చేసావు. కాలేజీ లో ఫీజు కట్టలేని పరిస్థితిలో, నువ్వు మీ ఇంట్లో కూడా చెప్పకుండా నాకు ఎన్నో సార్లు ఫీజు కట్టావు. మా ఇంట్లో అమ్మ, నాన్న కు వొంట్లో బాగోలేనప్పుడు నువ్వు స్వయంగా వచ్చి వారిని డాక్టర్ కి చూపించావు. అప్పుడు కూడా నువ్వు చాలా హెల్ప్ చేసావు. ఇలా చెప్పుకుంటూ పొతే, చాలానే ఉన్నాయి. అన్నీ నీకు తెలుసు. నీకు నేను ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా చెప్పు.. ? నా సొంత సిస్టర్ లాగ నా కోసం అన్నీ చేస్తావు.. "అంది రాణి
"మళ్ళీ థాంక్స్.. ! నా గురించి ఇంత బాగా అర్ధం చేసుకున్నందుకు.. " అంది ఉష
"అవునే.. ఆ నీరజ ఇంట్లోనే ఉండొచ్చు కదే.. ! పుట్టింట్లో ఉన్నట్టు అన్ని మర్యాదలు చేస్తారు అక్కడ.. "
"నువ్వు చెప్పింది నిజమే అనుకో.. కానీ.. ఆ నీరజ భర్త చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు.. అందుకే అక్కడకు వెళ్ళలేదు.. "
"ఓకే లే.. ఇక్కడే ఉండు.. హ్యాపీ గా ఉండు.. "
"అలాగే.. నాకు కొన్ని కథల పుస్తకాలు తెచ్చి పడేయి.. చదువుకుంటాను.. !" అంది ఉష
రోజులు గడుస్తున్నాయి.. డెలివరీ టైం దగ్గరపడింది.. ఉషని ఫ్రెండ్ హాస్పిటల్ లో జాయిన్ చేసింది. వెంటనే, నీరజ అక్కడకు వచ్చింది. డాక్టర్ చెప్పే మంచి వార్త కోసం చూస్తోంది నీరజ. ఈలోపు తన గతం గుర్తు చేసుకుంది..
******
అది నీరజకు కొత్తగా పెళ్ళైన రోజులు. ఎన్నో ఆశలతో కొత్త పెళ్ళికుతురిగా మెట్టింట అడుగుపెట్టింది. నీరజ అందం చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు భర్త నరేష్. పెళ్ళైన కొత్తలో ఇద్దరూ చాలా హ్యాపీ గా ఉన్నారు. అన్ని చోట్లకి తిరిగారు. ఇలా ఒక సంవత్సరం గడచిపోయింది. అత్తగారికి ఏమీ ఊసు పోవట్లేదు. పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చిన్న కొడుకు దగ్గరకు వచ్చింది.
"నీరజ.. ! పెళ్ళయి సంవత్సరం దాటుతుంది కదా.. ! మా అబ్బాయి తో నువ్వు సంతోషంగా ఉంటున్నావా.. ?"
"నేను చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్యా.. !"
"మరి పిల్లల కోసం ఏమీ అనుకోవట్లేదా.. ? ఒక మనవడిని ఇస్తే, వాడిని ఆడిస్తూ.. ఉంటే.. నాకూ చాలా బాగుంటుంది.. "
"త్వరలో మంచి వార్త చెప్పడానికి చూస్తాను అత్తయ్యా.. !"
"మా రోజులలో అయితే.. పెళ్ళైన కొత్తలోనే, నెల తప్పడం, సంవత్సరం తిరిగే లోపే పిల్లల్ని కనడం అయిపోయేది. ఏమిటో ఇప్పుడు.. పెళ్ళైన చాలా సంవత్సారాల వరకు.. పిల్లలు కనరు. ఏమైనా అంటే, ఎంజాయ్ చేస్తున్నాం అనో.. టైం లేదనో అంటారు.. "
"అలాంటిదేమీ లేదు అత్తయా.. !"
ఒక రెండు సంవత్సరాలు గడిచాయి.. అయినా నీరజకు పిల్లలు పుట్టలేదు. డాక్టర్ నీరజకు పిల్లలు పుడితే.. తనకే రిస్క్ అని చెప్పారు.
"నేను మా పెద్ద అబ్బాయి దగ్గరకు వెళ్తున్నాను.. మళ్ళీ వచ్చేసరికి నాకు మనవడు కావాలి.. "అని చెప్పి అత్తగారు విమానం ఎక్కేసింది
******
ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చిన డాక్టర్.. కంగ్రాట్స్ మీకు మగ పిల్లాడు పుట్టాడని నీరజకు చెప్పింది. నీరజ ఆనందానికి అవధులు లేవు. ఎప్పటికీ తల్లిని కలేనని అనుకున్న తనకి.. ఇది దేవుడిచ్చిన వరమే. ఎక్కడ అత్తగారి చేతిలో మళ్లీ తిట్లు తినాల్సి వస్తుందో అనే బాధ ఇప్పుడు ఇక లేదు.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత.. బిడ్డని తీసుకుని.. అన్న ప్రకారం డబ్బుని ఇచ్చి.. విదేశాలకు వెళ్లిపోయింది నీరజ.. అత్తగారి దగ్గరికి..
ఉష.. నీరజకు థాంక్స్ చెప్పింది. వెంటనే తండ్రికి ఫోన్ చేసింది..
"నాన్నా.. ! మిమల్ని చూడాలని ఉంది.. మా ఫ్రెండ్ రూమ్ కి వస్తారా.. ?"
"వస్తాను తల్లీ.. అమ్మ కు తెలియకుండా వస్తానులే.. "
"అలాగే నాన్న.. !"
మర్నాడు ఇంటికి వచ్చిన తండ్రిని చూసిన ఉష చాలా ఆనందించింది. చాలా రోజుల తర్వాత తన తండ్రిని చూసింది ఉష..
"ఎలా ఉన్నావు తల్లీ.. ?"
"బాగానే ఉన్నాను నాన్న.. "
"నన్ను క్షమిస్తావా తల్లీ.. నా కోసం నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు.. "
"అదేంటి నాన్నా.. నా తండ్రి కోసం ఆ మాత్రం చెయ్యకూడదా.. ? అది నా బాధ్యత. ఒంట్లో బాగోలేక రిటైర్ అయిన మీకు.. ఇంటి అప్పు, నా చదువుకోసం చేసిన అప్పు తీర్చడం కోసం, నేను చేసిన పని తప్పు కాదు నాన్న.. "
"మీ అమ్మ పోయాక.. మళ్ళీ పెళ్ళి చేసుకుని నీకు స్వేఛ్చ లేకుండా చేశాను. పిన్నిని 'అమ్మ' అనడం నీ సంస్కారం కావొచ్చు కానీ.. మీ పిన్ని నిన్ను అమ్మలాగా ఎప్పుడూ చూడలేదు. "
"పోనీ లెండి నాన్న.. టైం చూసుకుని ఎప్పుడైనా అమ్మ తో ఈ విషయం చెప్పండి.. "
"అలాగే ఉష.. "
"ఇంతకి నీ ఆరోగ్యం ఎలా ఉంది.. ఏమీ ఇబ్బంది పడలేదు గా.. ?"
"అంతా ఓకే.. నేను సూపర్ గా ఉన్నాను నాన్న.. "
"నాకు కొడుకు ఉన్నా.. నీ అంత గొప్పగా నా కోసం ఆలోచించేవాడు కాదేమో. నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు.. ? ఒకరి కోసం గొప్ప సాయం చేసావు. తల్లి కాలేని ఒక స్త్రీ కి నువ్వు ఒక వరం ఇచ్చావు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది తల్లీ.. !"
"ఇదిగోండి నాన్న.. ! ఇరవై లక్షలు.. కొడుకు పుట్టినందుకు ఇంకో ఐదు లక్షలు కూడా ఎక్కువ ఇచ్చింది నీరజ మేడం. ఇవి తీసుకుని, మీ అప్పులన్నీ తీర్చేయండి. నా గురించి ఏమీ ఆలోచించకండి.. " అంది ఉష
"నాన్నా.. ! మీకు ఒక విషయం చెప్పలేదు. నా కాలేజీ లో ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు. రెండు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నా గురించి తెలిసి కూడా.. నన్ను ఇష్టపడుతున్నాడు. త్వరలోనే మీకు తనని పరిచయం చేస్తాను.
"అలాగే తల్లీ.. నువ్వు ఎక్కడ ఉన్నా.. సంతోషంగా ఉండడమే నాకూ కావాలి.. " అన్నాడు తండ్రి
=================================================================
సమాప్తం
=================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments